[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా ఛత్తీస్‌ఘర్ సినిమా ‘ఘర్ ద్వార్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘ఘర్ ద్వార్’
[dropcap]కొ[/dropcap]న్ని ఆదిలో వచ్చిన ప్రాంతీయ సినిమాలు ఉనికిలో వుండవు. వాటి ప్రింట్లు పరిరక్షించక పోవడమే కారణం. కొన్నిటి శిథిలమైన ప్రింట్లయినా లభ్యమవుతాయి. ముడిఫిలిం అంతరించి సినిమాల్ని డిజిటల్‌లో తీస్తున్నాక, లాబ్స్ కూడా మూతబడుతున్నాక, అక్కడ భద్రపరచిన సినిమా ప్రింట్లని ఆయా స్టూడియోలు నోటీసులిచ్చి వదిలించుకున్నాయి. శ్రద్ధ వున్న నిర్మాతలు ఆ ప్రింట్‌లని డిజిటల్‌లోకి మార్చుకున్నారు. శ్రద్ధ లేని నిర్మాతలు, వాళ్ళ వారసులు పట్టించుకోలేదు. పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో 1500 సినిమా ప్రింట్లని గోనె సంచుల్లో మూట కట్టి పై అంతస్తులో పారేస్తే అవి సర్వనాశనమయ్యాయి. ఇలా ఎన్నో సినిమాల ఆచూకి లేకుండా పోయింది. అలాంటిదే ఒకటి ఛత్తీస్‌ఘరీ సినిమా ‘ఘర్ ద్వార్’. 1971లో నిర్మించిన ఈ సినిమాకి ఒక చారిత్రక ప్రాధాన్యముంది. ఛత్తీస్‌ఘరీ భాషలో ఇది రెండో సినిమా. మొదటి సినిమాగా కులాంతర వివాహాల మీద 1965లో ‘కహీ దేబే సందేశ్’ తీశారు. దీని జాడ కూడా లేదు. ఈ తొలి ఛత్తీస్‌ఘరీ చలనచిత్రాన్ని బ్రాహ్మణ – దళిత జంట వివాహ కథగా తీస్తే తీవ్ర వివాదాస్పదమైంది. స్వర్గీయ ఇందిరాగాంధీ జోక్యంతో సద్దు మణిగింది. అంటే తొలి ఛత్తీస్‌ఘరీ సినిమానే ముందుకు వెళ్లి అభ్యుదయవాదంతో తీశారు. అలాగే ఆరేళ్ళ తర్వాత 1971లో మలి ఛత్తీస్‌ఘరీ ‘ఘర్ ద్వార్’ని అస్తిత్వవాదంతో తీశారు. ఛత్తీస్‌ఘరీ భాష గుర్తింపు పొందాలనీ, ఛత్తీస్‌ఘర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనీ కోరుతూ దీన్ని నిర్మించారు.
ముప్పై ఏళ్ల తర్వాత 2000లో ఛత్తీస్‌ఘర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ‘ఘర్ ద్వార్’ తర్వాత ఈ ముప్పై ఏళ్ళూ మూడో సినిమా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ప్రాంతీయంగా తమభాషలో సినిమా లాభసాటి కాదని మొదటి రెండు సినిమాలు తెచ్చి పెట్టిన నష్టాల్ని చూసి వెనుకంజ వేశారు. ఛత్తీస్ ఘరీ భాషకీ హిందీకీ పెద్ద తేడా వుండదు. మద్యప్రదేశ్‌లో అంతర్భాగంగా వున్న పది జిల్లాల ఛత్తీస్‌ఘర్‌ని, ఆరు గోండు జిల్లాలతో కలిపి ఛత్తీస్‌ఘర్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. కనుక హిందీ సినిమాలే ఇక్కడ ప్రధానంగా ఆడతాయి. ప్రజలూ వీటినే చూస్తారు. ఛత్తీస్‌ఘర్ అంటే 36 కోటలు అని అర్ధం.
‘ఘర్ ద్వార్’ (గృహ ద్వారం)ని విజయకుమార్ పాండే నిర్మించారు. నిరంజన్ తివారీ దర్శకత్వం వహించారు. ఇదొక విడిపోయిన కుటుంబపు కథ. 1965 నుంచే దీన్ని నిర్మించే ప్రయత్నాల్లో వున్నారు. ఛత్తీస్‌ఘర్ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలు ఇందులో చిత్రించారు. తమకంటూ గొప్ప నేపథ్యమున్న జాతిని మిగతా దేశం గుర్తించాలనే తపన ఇందులో ఎక్కువ కనిపిస్తుంది. తెలుపు నలుపులో తీసిన ఈ ద్వితీయ ఛత్తీస్‌ఘరీ వాస్తవిక చలన చిత్రం నిజానికి హిందీ సినిమా చూస్తున్నట్టే వుంటుంది. హిందీ నటుల్నీ, మహమ్మద్ రఫీ. సుమన్ కళ్యాణ్‌పూర్ వంటి హిందీ గాయకుల్నీ ఈ సినిమాకి వినియోగించుకున్నారు. తమ అస్తిత్వాన్ని కోరుకుంటున్న ఈ సినిమాకి ప్రాంతీయ కళాకారులని వాడుకోకపోవడం ఒక లోపంగా కన్పిస్తుంది. ఇందులో ప్రధాన పాత్రల్ని హిందీ అప్పటి నటులు కానన్ మోహన్, రంజీతా ఠాకూర్, దులారీలు నటిస్తే, ఇతర పాత్రల్లో జాఫర్ అలీ, బాలూ రిజ్వీ, బసంత్ దివాన్, నీలూ మేఘ్ మొదలైన వారు నటించారు. సంగీతాన్ని హిందీ సినిమాల సంగీతదర్శకుడు జమాల్ సేన్ నిర్వహిస్తే ఛత్తీస్‌ఘర్ కవి హరి ఠాకూర్ పాటలు రాశారు.
దీనికి అవార్డులేవీ రాలేదు. హిందీ కమర్షియల్ సినిమాలకి అలవాటైన ప్రేక్షకులు దీన్ని అంతగా పట్టించుకోలేదు. నిర్మాతకి నష్టమే మిగిలింది. ఈ సినిమాకంటూ మిగిలింది కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే. అక్కడక్కడా కొన్ని దృశ్యాలు, సగం సగం పాటలూ శిథిలమైన ప్రింట్ల నుంచి లభ్యమైన మచ్చు తునకలు.