[dropcap]మృ[/dropcap]త్యువు విశ్వరూపం దాల్చి
నీ చుట్టూ పరిభ్రమిస్తోందని తెల్సినా
నీ పక్కనే నిలబడి
పులిలా పంజా విసురుతోందని తెల్సినా
వైరస్ ఒక విలయమై
విధ్వంసం సృష్టిస్తోందని తెల్సినా
ఎంత నిబద్ధత, ఎంత బాధ్యత
ఎంత సేవాతత్పరత నీది !
ఎంత గుండె ధైర్యం నీకు–
చావుకెదురేగి సవాల్ విసురుతున్నావు !
చూపులను చూరుకు వేలాడదీసి
కుటుంబమంతా నీకోసం ఎదురు చూస్తున్నా
మృత్యు కుహరంలో
ప్రాణవాయువై పరిమళిస్తున్నావు.
ఊహించని ఉపద్రవం ఉసురులు తీస్తూ
మానవాళికి సవాల్ విసురుతోంటే
శ్వేత కపోతమై, స్వేద సింధువై
శౌర్య జవానువై శత్రు సంహారానికి సన్నద్ధమయ్యావు.
ప్రాణదీపం ఆరిపోతుందేమోనని
కళ్ళతోనే అర్థించే రోగులు దైన్యం చూస్తూ
కర్తవ్య పాలనలో కఠోరంగా శ్రమిస్తూ
ఆశాజ్యోతివై, కరుణామయుడివై
వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నావు.
ఓ సేవా సైనికుడా !
ఇప్పుడు–
బతకడానికి ఏం కావాలో తెలిసింది!
ప్రపంచానికి ఎవరు అవసరమో అర్థమయ్యింది !!