ప్రపంచీకరణ అనర్థాలపై కలాల గర్జన-4

0
2

[box type=’note’ fontsize=’16’] జీవితాన్ని ప్రతిబింబించడం కవిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. వర్తమాన ప్రపంచ ధోరణిని కవిత్వీకరించాల్సిన బాధ్యత కవికి ఉంది. కనుకనే ప్రపంచీకరణ ప్రభావం సమాజం మీద, ప్రజా జీవనం మీద ఎలా వుందో ఆధునిక కవులు విశ్లేషిస్తున్నారు. అలాంటి కవిత్వాన్ని పరిశీలించి విశ్లేషిస్తున్నారు,  ప్రఖ్యాత విమర్శకులు  డా.సిహెచ్.సుశీల. [/box]

స్త్రీని మార్కెట్ వస్తువుగా పరిగణించడం

[dropcap]ప్ర[/dropcap]పంచీకరణ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ జోరు ఎక్కువైంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార సాధనంగా అందుబాటులో వుంది. టి.వి.లు ఛానళ్ళ వేయి నోళ్ళతో వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వానిలో సింహభాగం చిలుక పలుకుల్లాగా ‘పలకమన్న పలుకుల వరకే’ పలికే అందమైన అమ్మాయిలను చూస్తూనే ఉన్నాం. సినీతారల కందాన్నిచ్చే ‘లక్స్’ వెరైటీ సోపుల నుండి అంట్లు తోముకునే ‘విమ్’ పౌడర్ల వరకు స్త్రీలే. ‘నెస్’ కాఫీ ఘుమఘుమల్లో, ‘త్రీ రోజెస్’ తేయాకు తోటల దృశ్యాల్లో స్త్రీలే. స్త్రీల సౌందర్య సాధనాలలో స్త్రీలు కనిపించడం సబబేనేమో కానీ, మగవారికి సంబంధించిన ‘అడ్వర్టయిజ్‌మెంట్ల’లో వ్యాపార వస్తువుగా స్త్రీని చూపడం – అభివృద్ధి పోకడ అనాలా, లేక దిగజారుడు తత్వానికి ఉదాహరణ అనాలా?

సినీ తారల అంగాంగ సౌష్ఠవ కొలతల్ని
బేరీజు వేసే టేపుల్ని
తుమ్మల దేవదాస్ తన “బుల్లితెర” కవితలో ఈసడించుకొన్నాడు.

గ్లోబలైజేషన్ క్రీనీడల్లో….
…..అశ్లీలం అంచులు దాటిపోయే ప్రపంచీకరణంలో ‘స్త్రీ’ ఒక ఆటవస్తువు. వినోదవస్తువు.

సైబర్ సర్పాల పరిష్వంగంలో లవ్వాటలా
గ్లోబల్ కసాయి కపట ముద్దాటలా… సాగే ప్రపంచ వ్యాపార ప్రచార సరణిలో సమిధలు స్త్రీలే అని ‘మిలీనియం ముద్దు’ కవితలో, స్త్రీని సాధనంగా చేసికొని సాగే వ్యాపార ప్రకటల్ని అనిశెట్టి రజిత గర్హించింది.

ప్రపంచీకరణ ఫలాల్లో ‘అందాలపోటీలు’ ఒకటి. దీనిలో పాల్గొనే స్త్రీలకు చెక్కిలిగింతలు పెట్టినా సహజంగా వచ్చే నవ్వు రానేరాదని, ఎన్నో వడపోతలతో మెట్లు దాటేకొద్దీ చర్మం మొద్దు బారిపోయివుంటుందని –

చక్కిలిగింతలను సహితం మొద్దు బార్చిన
ఈ మసాజ్‌లు
మానవ సహజమైన స్పర్శాసౌఖ్యాల మూల సూత్రం
మట్టిగొట్టుకు పోయాయి

అని నల్లూరి రుక్మిణి వారిపై జాలిపడుతూనే ఛీత్కరించుకుంది. ఖరీదైన సౌందర్యసాధనాల ఉత్పత్తి అంతా విదేశాలలోనే. మేడ్ ఇన్ … సో సో ( ఇండియా కాకుండా) అంటే ఎంత ధర అయినా వెనుకాడే పనే లేదు.

నైతికమో భౌతికమో
ఇప్పుడందరి రక్తనాళాలు వ్యాపారాన్నేస్పందిస్తాయి

అని తన ‘చుట్టు కుదురు’ కవితాసంపుటిలోని ‘క్యాంపస్’ కవితలో స్పందించారు ప్రొ. ఎన్. గోపి. ప్రపంచీకరణలో ఒక భాగమైన ‘అంతర్జాతీయ విపణి’ అంతర్లీనంగా ఈ అందాలపోటీల్లో కోట్ల కొద్దీ ధనం ఏరులై పారుతుంది. ఈ విపణిలో డబ్బుకు అమ్ముడు పోయే వస్తువుగా హీనంగా మారిన స్త్రీ – ఒకానొక నిరుద్యోగమో, డబ్బు అవసరమో కావచ్చు. కానీ పూర్తిగా ఇదే నిజమనుకోనవసరం లేదు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన బాలీవుడ్ హీరోల కూతుర్లకి డబ్బు అవసరం అంటే నమ్మలేం కదా!

కాబట్టి ఇదొక వేలంవెర్రి. అంధానుకరణ.

ప్రపంచీకరణ పంచి యిచ్చిన ఈ విషపు చేదు గుళిక ‘స్త్రీ’ జాతికి వారి వ్యక్తిత్వానికి, వారి అపూర్వ గౌరవానికి మాయనిమచ్చ. గతంలో ‘అందం’ అంటే – తెలుగు ఆడపడుచు వడ్డాది పాపయ్య గారి బొమ్మలా, భారతిలో రామారావు గారి అమాయకపు కొమ్మలా, బాపు గీసిన రెమ్మలా వుండేది. తరుక్కుపోయిన, కరువొచ్చిన వస్త్రంతో, ‘యూనీ సెక్స్’ డ్రెస్ లలో ఆటో మగో గుర్తించలేని పరిస్థితికి ‘పురుషుల’ మీద అభాంఢం వేయనవసరం లేదు. విదేశీ ‘కల్చర్’ మీద ‘ప్రొడక్టు’ మీద మనసు పారేసుకొని, అందాల్ని ఆరబోసుకుని, ఆడతనాన్ని ఉరేసుకొనేంత వ్యామోహంలో పడేయటం వెనుక ‘మల్టీ నేషనల్ కంపెనీల’ వ్యాపార కుట్ర ప్రస్ఫుటంగా వుంది. ఇక్కడ ధనార్జనకు ఆ ప్రోడక్ట్ ఎలా ‘వస్తువు’గా వుందో స్త్రీ కూడ ‘వస్తువు’ కావడమే విషాదం.

ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యత పెరిగేకొద్దీ మానవసంబంధాలు బెడిని కొట్టాయి. మనిషికి మనిషికి మధ్య ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సంబంధాలు, కుటుంబజీవనం అనేవి సంఘజీవనానికి ప్రధానం. స్త్రీకి అత్యంత ప్రాధాన్యత నిచ్చిన పుణ్యభూమి లోకి ఏ భూతం ప్రవేశించింది! విషం కక్కే పక్కా వ్యాపారధోరణి ఎందుకు స్త్రీని మార్కెట్ వస్తువుగా మార్చింది!

ప్రపంచీకరణ నేపధ్యంలో
ప్రవేశించిన వ్యాపార సంస్కృతి
ఈ మనుషుల మధ్య ప్రేమ రాహిత్యాన్ని
పెంచి పోషిస్తుంది

అని రాధేయఎడారి వసంతం’ కవితలో మానవ సంబంధాలలో అనురాగం, ఆప్యాయత, తద్వారా వచ్చిన ఆనందం, తృప్తి కన్ను పొడుచుకున్నా కనిపించకుండా పోయిందని దుఃఖపడ్డారు.

పట్టణం లోని సంస్కృతి అశ్లీలం అంచులు దాటి ప్రవహిస్తుంటే… “వినోదం విజ్ఞానాన్ని పంచాల్సిన ఛానళ్ళన్నీ మార్కెట్ వస్తువుల విలాస క్రీడల్ని ప్రచారం చేస్తూ చాపకింద నీరై సాంస్కృతిక దాడి సాగిస్తుంటే” మానవ సంబంధాలు మైనపుముద్దలా కరిగిపోయాయి. అమావాస్య నాటి వెన్నెల్లా అదృశ్యమయ్యాయి. ధనార్జన కొరకు విదేశీ వ్యాపార సంస్థలు విసిరిన వలలో చేపలా చిక్కుకుంది స్త్రీ.

ఘంటసాల నిర్మల తన ‘రంగుల చీకటి’ కవితలో టి.వి.ఛానళ్ళ స్వార్ధపూరిత ఆకర్షణ ఎంత బలంగా, దుర్మార్గంగా మారుతోందో వర్ణించారు –
బుల్లి తెర బుల్లివాతెర అయినప్పుడు
మధ్య తరగతి మనసంతా, మనమంతా
జిగట వీడిరాలేని ఈగలమే – రోగులమే.

వర్ధమాన దేశాలలో పాగా వేసిన ప్రపంచీకరణ కుట్ర ఫలితంగా ప్రజల జీవన శైలిలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ‘తనదైన శైలి’ లో అంతర్లీనమైంది. ఈ తతంగాన్ని పసిగట్టిన కవులు దానివల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసారు. పైపై మెరుగుల కన్నా లోలోపల తరుగుతున్న జాతీయతను, జాతితత్వాన్ని గమనించి, సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదాన్ని గుర్తించారు. సభ్యత స్థానంలో అసభ్యత ఎలా నిలదొక్కుకుంటుందో గమనించారు. పట్టనట్టు వుండలేక, బాధ్యతాయుతంగా కన్నెర్ర చేసి కలం పట్టారు, కడిగిపారేశారు.

వ్యాపారప్రకటనలు, టి.వి.లు, సినిమాలు, అందాలపోటీలు, ఆకర్షణలు వీటన్నిటి మాయలో పడి తానొక ‘మార్కెట్ ప్రచార వస్తువు’గా మార్చబడుతున్నట్టు గుర్తించలేని స్త్రీ కుటుంబజీవనంలోని తన నేపథ్యాన్ని, జీవన మాధుర్యంలోని ప్రాతినిధ్యాన్ని చేజేతులా కోల్పోతోంది. వెర్రిమొర్రి డ్రస్సులు తయారుచేసే ‘పర్వెర్టెర్ టైలర్స్’ అలాంటి దుస్తుల్ని తమ భార్య, కూతుళ్ళకు వెయ్యరు. లోకులు కన్న బిడ్డలకు ఆ అరకొర కురచ దుస్తుల్ని వేసి వ్యాపారవస్తువులుగా మార్కెట్ చేసుకుంటారు.

ఒక కుటుంబంలో భార్యాభర్తల అనురాగసంబంధాలు, అమ్మానాన్నల ఆత్మీయ సంబంధాలు, బిడ్డల మధ్య ఉండే ‘పంచుకునే’ త్యాగాలు, అత్తాకోడళ్ళ మధ్య, నానా అల్లుళ్ళ మధ్య అల్లుకోవాల్సిన మమతల మకరందాలు, ఇరుగింటి పొరుగింటి సామాజిక సత్సంబంధాలు – తద్వారా గ్రామీణ సంబంధాలు, ఆపై పట్టణాల సంబంధాలు, దేశదేశాల మధ్య విస్తరించాల్సిన సహవాస సంబంధాలు, ప్రపంచ దేశాల మధ్య పర్యాప్తం కావలసిన బంధాలు – అన్నీ మానవసంబంధాలు గానే పరిగణించవచ్చు.

కానీ పైన చెప్పిన ప్రతి బంధానికి మధ్య ‘డబ్బు, ఆస్తి, హోదా’ చేరి అంతరాల్ని సృస్టిస్తున్నాయి. భారతీయ మూలాలు చెదిరిపోయే ప్రమాదమూ ప్రపంచీకరణ వల్ల కలిగే పరిస్థితి వస్తుంది. కవులు క్రాంతదర్శులు కనుక ప్రపంచీకరణ అనర్ధాల వల్ల ఏఏ అంశాల్లో జాగ్రత్త పడాలో సున్నితంగా, కాదు కాదు కాసింత కఠినంగానే హెచ్చరించారు. వారి ఆవేశపూరిత కలాల గర్జనల్ని వివరించడం జరిగింది ఈ వ్యాసాలలో. ఏ ప్రలోభాలకూ లొంగక తన ఉనికి కాపాడుకుంటూ వస్తున్న భారతీయత నిత్యమై, సత్యమై వెలగాలి భవిష్యత్తులో కూడ.

*శుభం*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here