Site icon Sanchika

ప్రసాదం

[dropcap]వా[/dropcap]ట్సప్ పుణ్యమాని
ఎత్తిపోతల పథకం ద్వారా
కొందరు డాక్టర్లయిపోతారు
మరికొందరు ప్రవచనకర్తలవుతారు
ఇంకొందరు జ్ఞాన వితరణ మూర్తులవుతారు
‘ఇష్టం’ మార్కు కోసం
బహు కష్ట పడతారు
వాళ్ళు పాటిస్తారో లేదో తెలియదు
పోటీ పడి సూక్తి ముక్తావళి
నిరంతరం వినిపిస్తుంటారు
మూల రచయితల పేర్లు పీకి పారేసి
తామే రచయితలుగా చెలామణి అవుతుంటారు
తాము పంచే సందేశాలపై నియంత్రణ ఉండదు
విశ్లేషణ విచక్షణ అస్సలు ఉండదు
పరస్పర విరుద్ధ భావాల్ని పంచుతూ
వీక్షకులను అయోమయానికి గురిచేస్తుంటారు
విసిగి వేసారి బ్లాక్ చేస్తే
అలిగి మాట్లాడ్డం మానేస్తారు
ఉదయం లేచింది మొదలు
కాలకృత్యాలు తీర్చుకోడం ఆలస్యమైనా
ఎత్తిపోతల పథకం ద్వారా
తమ వంతు విత్తులు వేయాల్సిందే
ఎదుటివారిని ఉక్కిరి బిక్కిరి చెయ్యాల్సిందే
అప్పుడే కడుపు భారం తీరేది
తుత్తి గుండె నిండా హత్తుకునేది !

Exit mobile version