ప్రశ్నార్థకం

0
2

[dropcap]పొ[/dropcap]ద్దు పొడిచింది. అది పట్టణం. వీధులెంట రద్దీ ప్రారంభమైంది. కాలం నడుస్తున్న కొద్దీ జనారణ్యం కదా… వాహనాలు, జీవాల కదలికలు కూడా వేగాన్ని పుంజుకున్నాయి. పొద్దుటే నా స్నేహితురాల్ని కలిసేందుకు తయారై నేనూ నా గడప దాటి వీధిలోకి వచ్చాను. దానితో ఆ సాయంత్రం, కాలం గడుపుదామని చెప్పి, నేనూ నా నౌకరీ చేసే దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకో ద్విచక్రవాహనం ఉంది, కానీ, దానికి చిన్నపాటి జబ్బు చేసినందువల్ల గ్యారేజీలో ఇవ్వాల్సివచ్చింది. మా బస్ స్టాప్ వైపు నడుస్తున్నాను. రోడ్డున కాదు. పేవ్‌మెంటున నడిస్తే బాగనిపించి, ఎదురొస్తున్న వాహనాలకి చికాకుగా తోచి, ప్రక్కకి తొలగి, కాలిబాటకు వచ్చాను. బస్ స్టాండ్‌కి దగ్గరలోకి వచ్చినక నడక వేగం పెంచాను, ఎదురొస్తున్న వారిని తప్పుకుంటూ.

ఇంతలో పెరిగెత్తుకుంటూ వచ్చిన శాల్తీ నన్ను దాటేసి బస్టాప్ దగ్గరికి చేరుకున్నాడు. అతని తీరు చూస్తుంటే చాలా అడ్డదిడ్డంగా పరిగెత్తాడనిపిస్తుంది. ప్రక్కకు తొలగుదామని ఓ క్షణం ఆగాను. పరుగెత్తుకుంటూ వచ్చిన మరో శాల్తీ గస పెట్టుకుంటూ వచ్చి, బస్సు చెంతన ఉన్న సీటు బల్లపై చతికిలబడి, లగెత్తుకుని వచ్చిన ఆయాసాన్ని తీర్చుకుంటున్నాడు. అతని ముఖమంతా చెమటలు కారుతున్నాయి. ఒంటిపైనున్న రంగు చొక్కా తడిసి ముద్దై నల్లగా కన్పిస్తున్నది.

“అదిగో వాడే, పట్టుకోండి, పట్టుకోండి” అని అరుస్తూ నా వెనకాల్నించి ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చి, కూర్చున్నతన్ని చుట్టుముట్టారు. “వీడే, వీడే” అనుకొంటూ కూర్చున్నతని గట్టిగా పట్టుకుని, అతని వీపున భుజాలకున్న సంచీ వేలాడుతుండగా దానిని లాక్కొన్నారు. వచ్చిన ఇద్దరూ అతనిని చెరొక భుజాన ఎత్తుకొని నిలబెట్టారు. మిగిలిన వాడు ఆ సంచీకున్న జిప్పు లాగి క్రింద బోర్లించాడు. పట్టుకొన్న ఇద్దరిలో ఒకడు వీపున చరుపు చరిచి అతనిని పట్టుకొనే, సంచీని బోర్లించటం మూలానా చిందరవందరగా పడి వున్న వస్తువులను వెదకసాగాడు.

“ఏమిటీ దౌర్జన్యం?” అని నేల వైపు క్రింద పడి ఉన్న వస్తువులను చూసి సంచీలో వేసుకొనే ప్రయత్నం చేశాడతను. అయినా ఆ సంచీలో ఐదారు పుస్తకాలు, తెల్ల కాగితాలు, పెన్ను, ఓ పెన్సిలు, రబ్బరు, జేబురుమాల, ఐదారు రూపాయల చిల్లర, ఏవో రోగికి సంబంధించిన మందుబిళ్ళలు మాత్రమే కనిపించినయి.

“ఏదిరా నా సర్టిఫికెట్ల ఫైలు? నువ్వు తప్ప మాదాంట్లో ఎవరు లేరు కదా? నువ్వే ఎత్తుకొచ్చావు. అది నీకేం ఉపయోగం రా, డబ్బు కాదు కదా?” అన్నాడొకడు మెడపై చేయేసి ఏడుపు మొహంతో.

మొదట గస పెడుతూ వచ్చి కూర్చున్న శాల్తి బిక్కమొహం వేసి, “అసలేంటీ, ఏం ఫైలూ? నేనెందుకు తీశాను? మీరు నా వెంటపడి వచ్చి నా సంచీ లాక్కొని నేలపై బోర్లించారు?” అంటూ వచ్చి ఆగిన బస్సు వైపు చూసి, “అయ్యా నేను ఈ నెంబరు బస్సులోనే వెళ్ళాలి. నన్ను వదిలేయండి” అని ప్రాధేయపూర్వకంగా బ్రతిమిలాడుతూ నేలపై పడిన అతడి వస్తువులను సంచీలో వేసుకొన్నాడు.

ఇంతలో బస్సు కదిలింది. సంచీ సర్దుకొంటునే “స్టాప్ ప్లీజ్, నేనూ వస్తాను” అంటు కేకలు వేసాడు. బస్సు మాత్రం ఆగలేదు. మళ్ళా ఆ ముగ్గురూ కలిసి ఆ మనిషిని నిలేసి ప్యాంటూ, చొక్కా సంపూర్ణంగా శోధించారు.

‘మరి నా పైలేమైందిరా? ఓరి దేవుడో గంటలో ఇంటర్వ్యూ ఉంది, దానిని దొంగిలించింది వీడే అనుకున్నాను. మరి ఏమైంది?’ అని సణుగుతూ తల బాదుకొన్నాడు. మొదట పరుగెత్తుకొచ్చిన వాణ్ణి చూసి, “మరెందుకురా, పిచ్చి కుక్క వెంటపడుతున్నట్టు పరిగెత్తావు? వస్తూ వస్తూ ఎక్కడైనా విసిరేశావా? బాబ్బాబూ, నీకో దండం. ఎక్కడ విసిరావో చెప్పు” అన్నాడు. ప్రక్కనున్న వాడిలో ఒకడు మాత్రం అతని గల్లా వదల్లేదు.

“వామ్మో నా బస్సు వెళ్ళిపోయింది. ఈ నెంబరు బస్సు మళ్ళా వచ్చేసరికి మరో గంట పడతది. నేనెంత ముందు బయల్దేరినా, ఇదేం గ్రహచారం రా బాబూ! లేవగానే ఎవరి ముఖం చూశాను?” అని అతను లబలబలాడిపోతున్నాడు.

నేను ఈ తంతు ఆసాంతం చూస్తూ ఆగిపోయాను.

“బస్సు పోయింది సార్, ఆస్పత్రిన నా తమ్ముడున్నాడు. పది దాటితే నన్ను లోపలికి రానీయరు సార్! అందుకే అలా లగెత్తుకొచ్చాను” అని సర్దుకొంటూ, “అసలు నా వెంట ఎందుకు పడ్డార్సార్? నేను దొంగను కాను. ఆ నెంబరు బస్సు దూరంగా కనబడుతుంటే చూసి వేగం పెంచాను. ఆ బస్సూ పోయె. ఇప్పుడు నా గతేంటి సార్?” అని బెంచిపై చతికిలబడటంతో – తెల్లబోయిన ముగ్గురు “మరి ఏమైందిరా, నువ్వే ఎక్కడైనా మర్చిపోయావా?” అంటూ వారిలో వారు మాట్లాడుకోసాగారు రహస్యంగా.

నాకు వారి పరిస్థితి, ప్రవర్తించిన పద్ధతి బాధగా అనిపించి, “మీ ఫైల్ అతని సంచీలో దొరకలేదు కదా!” అన్నాను దగ్గరకెళ్ళి.

నా వైపి చిత్రంగా చూసి, ‘లేదు’ అన్నట్టు దిగాలుగా చూశారు.

“అనవసరంగా అనుమానించి అతని మెడ పట్టుకుని వీపున చరిచి, అతను ఎక్కాల్సిన బస్సు వెళ్ళిపోయేలా చేయడమే గాక, అరే! అతని బస్సు గంటకి గానీ రాదు. ఒకవేళ దానిలో వెళ్ళినా ఆ దవాఖానాలో అతనిని లోనకి రానివ్వరు. అంటే సాయంత్రం నాల్గింటిదాకా ఉండాలి. మీరు చేసిందేం బాగాలేదు. కనీసం ‘సారీ’ చెప్పి ఏ ఆటోలోనైనా అతనిని పంపండి. అది కనీస ధర్మం” అన్నాను.

“నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి మేడం. నా సర్టిఫికెట్ల ఫైల్ పోయింది. అసలు నేనేం చేయాల్నో నాకే తోచడం లేదు. దాన్ని దొరికించుకుని వెళ్ళేసరికి వెళ్ళేసరికి నా పరిస్థితేంటో నాకే తెలియదు” అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళబోయారు.

“ఇదిగో ఆగండి” అన్నాను. వారు ఆగలేదు. బెదురు బెదురుగా చుస్తూ పరిగెడుతూనే వున్నారు. వారినే చూస్తూ, “వీళ్ళసలు మనుషులేనా? కనీసం ‘సారీ’ చెప్పక, రౌడీల్లా ప్రవర్తించి వెళుతున్నారు” అన్నాను. కనీసం అతనిని ఆటోనైనా ఎక్కించి పంపి ఉంటే అదోలా ఉండేది. అసలతను ఎక్కడికి వెళ్ళాలని అడిగిన జాడే లేదు. వారి అక్కర వారికుండచ్చు. కానీ ఇలా ప్రవర్తించడం తప్పు కదా!

“వీళ్ళెప్పుడు మనుషులు కావాల్నమ్మా, కారు” అని కళ్ళు, మొహం తుడుచుకొని అతను నడకన పడ్డాడు.

ఇంతలో మా ఆఫీసతను అటుగా స్కూటరుపై వచ్చాడు. అతడిని ఆపి, ఎటువెళ్తారో కనుక్కుని, బ్రతిమాలి, ఇతగాడిని అసుపత్రి దగ్గర దింపమని, ఎక్కించి పంపాను. అతనెళ్ళాక టైమ్ చూసుకుంటే తొమ్మిది యాభై అయింది.

‘అమ్మో, ఆఫీసుకెళ్ళాలి. టైమైంది. బాసు అసలే చండశాసనుడు’ అనుకొంటూనే బస్‌స్టాండ్ నుంచి గ్యారేజ్ వైపు నడిచి బాగైన స్కూటర్‌ని తీసుకొని వేగంగా పరిగెత్తించాను.

***

ఎవరి పరుగు వారిది. ఎవడికీ ఎవడూ ఏమీ కాడు. ఎందాకో తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here