[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
ప్రతిభా లహరి
[dropcap]కా[/dropcap]వ్య లహరితో ప్రారంభమై, చైతన్య లహరితో కొత్త చైతన్యాన్ని పుంజుకుని, వికాస లహరితో వికసించిన యువభారతిని ప్రభావితం చేసిన నాల్గవ లహరీ కార్యక్రమం ‘ప్రతిభా లహరి’.
సంస్కృతములోని ప్రౌఢ కవులనందరినీ జీర్ణించుకుని, నన్నయ భట్టారకుని ‘ఉభయ వాక్ప్రౌడి’ని స్వాధీనపరచుకుని, తిక్కన ‘రసాభ్యుచిత బంధమును’ పసిగట్టి, ప్రబంధ పరమేశ్వరుని ‘సూక్తి వైచిత్రి’ని దక్కించుకుని, బాల్యంలోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢకవి శ్రీనాథుని గురించి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు;
పాండురంగ మహాత్యం, ఘటికాచల మహత్యం, ఉద్భరాటారాధ్య చరిత్ర వంటి కావ్యరచన చేయడమే కాక, శ్రీకృష్ణ దేవరాయల వారి అష్ట దిగ్గజములలో ఒకనిగా అలరారుతూ, భువనవిజయపు శోభను ఇనుమడింపజేసిన తెనాలి రామకృష్ణుని గురించి దాశరధి రంగాచార్య గారు;
ఆంధ్ర వచన రచనలో క్రొత్త పుంతలు తొక్కి, ‘సాక్షి’ ఉపన్యాసాల రచయితగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి, ‘కవిశేఖరుడ’నీ, ‘అభినవ కాళిదాసు’ అనీ, ‘ఆంధ్ర అడిసన్’ అనీ, ‘ఆంధ్ర షేక్ స్పియర్’ అనీ బిరుదులతో సత్కరించబడిన సాహితీ వేత్త, శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు;
ఆధునికాంధ్ర జగత్తులో ఒక విరాణ్మూర్తి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. వచన కవిత్వం తప్ప, ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు;
చేసిన ఉపన్యాసాల సమాహారమే – ఈ ప్రతిభా లహరి. అలా శృంగార నైషధం నుండి మరో ప్రపంచం వరకు ప్రసరించిన ప్రతిభా, ప్రభావ, భావప్రభా లహరి – ఈ ప్రతిభా లహరి.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://drive.google.com/file/d/1EDNX8gAXSjiy-wym4CGB6I6xRSMkLvNE/view
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.