[అజో-విభొ-కందాళం ఫౌండేషన్ వారు శ్రీ ముకుంద రామారావు గారికి 2024 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందించి, వెలువరించిన ‘ప్రతిభా వైజయంతి’ సమ్మానోత్సవ విశేష సంచిక సమీక్షని అందిస్తున్నాము.]
‘2024 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం’ గ్రహీత యల్లపు ముకుంద రామారావు సమ్మానోత్సవ విశేష సంచిన ఇది.
ఎనభై ఏళ్ల వయసులో ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని కవి, ముకుంద రామారావు గారికి ఇవ్వటం సముచితం. ‘వాదాలు సరదాలు అంటని కవి ముకుంద రామారావు అని కొందరంటారు’ అన్న సంపాదకుల వ్యాఖ్య నూటికి నూరు పాళ్ళు నిజం.
అసలు సిసలైన అచ్చమైన కవి ముకుంద రామారావు. ఆవేశాలు ద్వేషాలు కంచుకాగడా పెట్టి వెతికినా కనపడవు ఈయన కవిత్వంలో. అనుభూతులు, ఆలోచనలు, ఎదను మురిపించి, కదిలించే సున్నితమైన, సుందరమైన వెన్నెల లాంటి భావనలు ఈయన కవిత్వంలో పూదోట లోని సుందరమైన విభిన్నమైన పూలలా అడుగడుగునా కనిపిస్తాయి. ఆనంద పరవశులను చేస్తాయి. అందుకే సమకాలీన తెలుగు సాహిత్య ప్రపంచంలో కవులెందరో ఉండవచ్చు, అవార్డులందుకుని ఉపన్యాసాలు దంచేవారుండవచ్చు.. కానీ అరుదైన అచ్చమైన అసలు సిసలు కవి ముకుంద రామారావు. ‘హైఁ ఔర్ భీ దునియా మే సుఖన్-వర్ బహుత్ అచ్ఛే/కహతే హైఁ కి గాలిబ్ కా హై అందాజ్-ఎ-బయాన్ ఔర్’ అన్నట్లు ఎందరో గొప్ప కవులున్నా ముకుంద రామారావు కవిత ప్రత్యేకం.
ఈ సమ్మానోత్సవ సంచికలో మొత్తం 88 మంది లబ్ధప్రతిష్ఠులు ముకుంద రామారావు గారి కవిత్వంతో వారి అనుబంధాన్ని, అభిమానాన్ని, అనురాగాన్ని, అనుభూతులను పాఠకులతో పంచుకున్నారు. కవిత్వ విశ్లేషణ, విమర్శతో పాటు ముకుంద రామారావు వ్యక్తిత్వాన్ని కూడా పలువురు స్పృశించారు. కొందరు ఒక కవిత్వ సంపుటి గురించి విశ్లేషిస్తే, మరికొందరు పలు కవితా సంపుటాలను పోల్చి విశ్లేషిస్తున్న రచనలనందించారు.
ముఖ్యంగా, ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’, ‘అదే నేల’, ‘అదే కాంతి’, ‘అదే నీరు’ వంటి పుస్తకాల గురించిన విశ్లేషణాత్మక వ్యాసాలు చక్కగా ఉన్నాయి. ముకుంద రామారావు లోని మరో కోణాన్ని ఈ రచనలు ప్రతిఫలిస్తాయి. ఇలా ఒక్కో పుస్తకం గురించి విశ్లేషించిన రచనలు ఉండటం వల్ల కవిగా, వ్యక్తిగా, ఆలోచనాపరుడిగా ముకుంద రామారావు కవితలలో, ఆలోచనలలో, భావ వ్యక్తీకరణలో, దృష్టిపథం వంటి విషయాలలో కాలక్రమేణా సంభవిస్తున్న పరిణామక్రమాన్ని, పరిణతిని, శైలీ విన్యాసాలలో మార్పులను గమనించే వీలు ఈ విశ్లేషణాత్మక వ్యాసాల ద్వారా కలుగుతుంది.
ఎబికె ప్రసాద్, చేరా, ఎన్. గోపి, కోవెల సంపత్కుమాచార్య, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, యు.ఎ. నరసింహ మూర్తి, కాళిదాసు పురుషోత్తం వంటి లబ్ధప్రతిష్ఠులయిన వారి వ్యాసాలు ఈ పుస్తకం విలువను పెంచాయి.
ఈ సమ్మానోత్సవ సంచికను చక్కగా, నాణ్యతాపరంగా ఉత్తమ స్థాయిలో రూపొందించిన సంపాదకులు అభినందనీయులు. ఈ సమ్మానోత్సవ సంచిక ముకుంద రామారావు వ్యక్తిత్వం, కవిత్వ వ్యక్తిత్వాల గురించి సమగ్రమైన రీతిలో అందిస్తుంది. అలాగే కవిత, కవిత్వం గురించి ఒక విమర్శ పుస్తకాన్ని చదివిన భావనను కలిగిస్తుంది. ఒక కవికి ఎన్ని పురస్కారాలు అయినా రావచ్చు, ఎన్ని సన్మానాలయినా జరగవచ్చు. అవన్నీ వ్యక్తికి. కానీ ఇలా అతని సృజన గురించి లోతుగా, సమగ్రమైన రీతిలో విశ్లేషించి, సమీక్షించి అందించటం అసలైన సన్మానం. అందుకు ముకుంద రామారావుకు అభినందనలు.
***
ప్రతిభా వైజయంతి (యల్లపు ముకుంద రామారావు సమ్మానోత్సవ విశేష సంచిక)
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
సంపాదకులు: ఎ.కె. ప్రభాకర్, కె.పి. అశోక్ కుమార్
పేజీలు: 424
వెల: ₹ 400
ప్రతులకు:
అజో-విభొ-కందాళం ఫౌండేషన్
హైదరాబాద్-27
ఫోన్ 040-40179673
~
కవి, అనువాదకులు శ్రీ వై. ముకుంద రామారావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mr-y-mukunda-ramarao/