Site icon Sanchika

ఇది గౌరీలక్ష్మి కవిత్వోత్సవం

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘ప్రవాహోత్సవం’ అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు డా. కొండపల్లి నీహారిణి.]

[dropcap]క[/dropcap]విత్వం హృదయ గతం. కవిత్వం సమాజ గతం. కవి సర్వకాల సర్వావస్థల్లోనూ సంఘ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఉండాలి. “గత కాలం మేలు వచ్చు కాలము కంటెన్” అనే మాటలకు వత్తాసుగా చెప్పినా, “భావి జీవితం బంగరుమయం” అనే మాటలకు వత్తాసుగా చెప్పినా సమకాలీనతకే పెద్ద పీట వేస్తూ కవిత్వం రాయాలి.

అల్లూరి గౌరీలక్ష్మి సీనియర్ రచయిత్రి, కవయిత్రి. కథలు, నవలలు రాసినా కాలమ్స్ రాసినా ఒక నిబద్ధత గల రచయిత్రిగా పేరు తెచ్చుకున్న రచయిత్రి. అదిగో ఆనాడు ‘నిలువుటద్దం’ కవిత్వంగా రాసినా, ‘నీరెండ దీపాలు’ కవిత్వంలో తన కవి హృదయాన్ని చూపించినా సానుకూలతను, సమతుల్యతను జోడెద్దులు గానే చూస్తాం. ఈ బండి పరుగులలో ఎన్నో మైలు రాళ్ళు దాటడం చూస్తాం. ఈ కవిత్వం చెక్కటానికి భాషా నైపుణ్యంతో పాటు విస్తృత పరిశీలనా శక్తి కూడా ఉన్నట్టు గమనిస్తాం.

ఇప్పుడు ‘ప్రవాహోత్సవం’ పేరుతో మనల్ని తన కవిత్వంలో భాగం చేయడానికి గౌరీ మళ్లీ మన ముందుకు వచ్చింది.

కవిత్వంలో

1. వస్త్వాశ్రయ రీతి కవిత్వం

2. ఆత్మాశ్రయ రీతి కవిత్వం

అంటూ ముఖ్యంగా ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ అంటే వస్త్వాశ్రయంగా మరోటి సబ్జెక్టివ్ అంటే ఆత్మాశ్రయంగా, వ్యక్తిగతంగా ఉండే పోయెట్రీలు అని మనము నవ్య కవిత్వాన్ని చెప్తుంటాం. ఈ రెండింటిలోనూ వస్తువు భావనవ్యత, శైలి నవ్యతతో ఉన్న కవిత్వం పది కాలాల పాటు నిలుస్తుంది. వస్తువు, శిల్పం, శైలి అన్నీ కవిత్వావసరాలు. “అబద్ధాలు అల్లడం అంత సులభం అవదు సుమా! కవిత అల్లడం!” అని చెప్పిన దాశరధి కృష్ణమాచార్య మాటలను గుర్తు చేసుకుంటూ, ప్రత్యక్ష అనుభవాలలో సంవేదనలు, సంక్షోభాలు కవితా వస్తువులుగా మారిన కాలంలో మనం ఉన్నామని చెప్పక తప్పదు. ఏ సంకోచాలు లేని భావవ్యక్తీకరణ మాత్రమే పాఠకులకు చేరుతుంది, కవిత్వ ప్రయోజనం నెరవేరుతుంది.

“ఎంతో సరళంగా సూటిగా..
కొన్నిఅరుదైన సమయాల్లో
కాసిని సుమధుర క్షణాలు
సాక్షాత్కరిస్తాయ్!
సుగంధాలు విరజిమ్మి
మైమరపించి
అదృశ్యమవుతాయ్!
తీయందనాల ఆనవాళ్లు
ఎదపందిరంతా అల్లుకుని
తలచిన వేళల్లో
మల్లెలై గుబాళిస్తాయ్!
జ్ఞాపకాల వీచికలు
ఏకాంత సంధ్యల్లో
మదిని వినువీధిలో విహరింపచేస్తాయ్!!”

అంటూ ‘అద్భుతం’ అనే ఒక కవితలో అల్లూరి గౌరీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భావ కవిత్వ ఛాయలతో ఉన్నది. ఇది ‘మనశ్చిత్రం’! ఇందులో ఇంటలెక్చువల్ స్థితి, ఎమోషనల్ స్థితి ఉన్నాయి. ఇలా ఆత్మాశ్రయ కవిత్వంలో కూడా కవయిత్రి చెప్పదలుచుకున్న సందేశం ఏంటి? అంటే ప్రేమపూరిత వాతావరణం, స్నేహమయ జీవితం, శాంతి కలిగిన బ్రతుకులు చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి అలాంటి చక్కని ఆలోచన ఉండాలంటే మనం చేసే పని మనని చూపిస్తుంది అంటారు. మంచి మంచి జ్ఞాపకాలను తెచ్చుకోవాలి అంటే ఏకాంత సమయంలో మదిని వినువీధిలో విహరింప చేయాలి అంటే ‘అరుదైన సమయాలు’ ఉండాలి జీవితంలో అంటూ ఇలాంటి ఆలోచనలు కలిగేలా ‘అద్భుతాన్ని’ చూపింది. ఇందులోని కవిత్వం శిల్పసౌందర్యంతో అలరారుతున్నది.

ఇక, ‘ప్రవాహోత్సవం’ అనే శీర్షికతో రాసిన కవితని తన కవితా సంపుటికి పేరు పెట్టుకుంది. ఒక ఆశావాహ దృక్పథంతో సాగుతున్నటువంటి ఈ కవితలో..

“ఆత్మీయ మిత్రులు ఒకరిలోకి మరొకరు ప్రవహిస్తారు
ఇతరులను కూడా ప్రేమగా అనుమతిస్తారు
ప్రతి ఒక్కరూ అందరిలోకి వెల్లువైపొంగి
అందరూ ప్రతివారిలోకి ప్రవహిస్తారు అదొక వేడుక!
అప్పుడిక అనుమానపు పొరలు లేవు
అసూయా ద్వేషాలు రమ్మన్నా రావు
ఆధిపత్యాలు, అవమానాలు ఉండవు
అంతా క్లాసులో పిల్లల్లా ఉంటారు”

ఇక్కడ వేసిన ఉపమానంతో “క్లాసుల్లో పిల్లల్లా ఉంటారు” అంటూ మనిషి ఆలోచనా తరంగాల విహారాలెలాంటివో తెలుపుతుంది. మనుషుల్లో ఇంకా ద్వేషం, పగ, అసూయ వంటి అరిషడ్వర్గాలు చేరనటువంటి అమాయక జీవితం ఏదైనా ఉందా అంటే అది విద్యార్థి దశ బాల్యదశనే. అందుకే స్కూల్లో పిల్లల్లా ఉంటారు అప్పుడు అని చెప్పడం కవయిత్రి చక్కని ఊహకు అద్దం పడుతుంది.

సాధారణంగా కవిత్వంలో మానవతావాదం అంటే హ్యూమనిజమ్ లేకుంటే, సంప్రదాయవాదమో అంటే, క్లాసికల్ పోయెట్రీ స్టైల్‌లో వచ్చే కవిత్వమో మనం చూస్తూ ఉంటాం. వాటిల్లో కూడా గౌరీ రాసినటువంటి దాంట్లో సంక్రాంతి కవితలో, పల్లెల్లో సంభవిస్తున్నటువంటి మార్పులను కూడా ఆమె ఒక పాజిటివ్ థింకింగ్ తోనే ఓన్ చేసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. ‘సంకురాత్రి శక్తి టానిక్’ కవితా శీర్షికలోనే ఆధునీకరణ ప్రభావంతో తను చెప్పదలుచుకున్నది చెప్పేస్తుంది.

ఇప్పుడు ఓ వైపు ఎండల భగభగలూ, మరో వైపు ఎలక్షన్ల భుగభుగలూ చూస్తున్న మనం గౌరీలక్ష్మి ఎన్నికల మీద రాసిన ‘ఓటరు బ్రహ్మ’, ‘నేటి నినాదాలు’, ‘ఓటు అజాగ్రత్తగా వేయొద్దు’, ‘పరిగెలేరుకుందాం’ కవిత్వాన్ని చదివి తీరాల్సిందే. తన చుట్టూ ఉన్న సమస్త బ్రతుకు చిత్రాన్ని ఆహ్వానిస్తూ ‘నది, నేను’ అంటూ ప్రవహించినా, ప్రేమను ‘మాయలేడి’ అని చెప్పినా ఏదో కొత్తదనం ఈ కవితలలో కనిపిస్తుంది.

‘యాదోంకి దౌలత్’ కవిత ఒక్కటి చాలు గౌరీలక్ష్మి రచనా శైలి ఎంత ఆకట్టుకుంటుందో చెప్పడానికి! స్నేహం, స్నేహితులు ఒక పూలమాలలా ఊహిస్తుంది. “అమూల్య స్నేహితుల మాల/ఈ హారం నిండా నా మిత్రరత్నాల్ని పొదిగాను/నెయ్యపు నగిషీలు పెట్టి తీర్చిదిద్దుకున్నాను/గుండె లోపలి లాకర్లో పెట్టి అప్పుడప్పుడు చూసి మురిసిపోతుంటాను”

అంటూ విలువైన స్నేహాన్ని తీర్చిదిద్దింది. స్నేహం అనే భావమే దారమైనప్పుడు స్నేహితులు పువ్వులవుతారనీ, ఈ స్వర్ణమయ హారంలో మిత్రులు మణిమాణిక్యాలవుతారనీ ఆమె ఊహ. ఇందులోని వస్తువు పాతదే అయినా చెప్పిన విధానం నూతన పోకడతో చెబుతుంది కవయిత్రి. స్నేహభావం అనేదే ఒక సంపదగా చెప్పడం గమనిస్తాం.

“సినిమా పాట
సీరియల్స్ టైటిల్
గుండె సంద్రంలో ఎగిసిపడే
ఉత్తుంగ తరంగం బస్టాపుల్లో
మెట్రో ట్రైన్స్‌లో ఎదురయ్యే అద్భుతం” (మాయలేడి)

అంటూ కాంటెంపరరీ పోయెట్రీ కూడా రాస్తుంది గౌరీలక్ష్మి. ‘దేవరూపిణి’ కవితలో “ఆమె అంతే లేని ఓ అమృత జలధి” అని రాసినా, “సం’కుల’ గీతం”లో ‘కులదైవం’ మాట పక్కకి పెట్టి ‘కులమే దైవం’ అని నమ్మే వారినే టార్గెట్ చేస్తూ “అస్మదీయుల లాభాలకై అహర్నిశలు శ్రమిస్తారని” చురకలు వేస్తుంది. Stream of consciousness అనేది కవిత్వానికి ఎంతో ముఖ్యం. ఒక చైతన్య స్రవంతి అక్షర రూపమై నిలిచింది ఇక్కడ. దీన్నే కవితా శిల్పం, కవిత్వతత్వం అంటాం.

‘అసభ్య పోస్టర్ వెనుక’ కవితలో దీనావస్థలో అడుక్కుతినే వాళ్ళెవరో చెప్తూ, అంత అవసరం లేని వాళ్లు చేసే యాచనలను తన కవితాపంక్తులతో వెంటాడుతూ,

“అందరిదీ బతుకుతెరువుకై తన్నులాట/సవ్యప్రదంగా బ్రతికే దారులు దొరకక/ఎలాగైనా నాలుగు కాసులు పొందాలన్న/కసి, ఆర్తి జనం దయ కోసం జోలెపడతాయి”అనే గౌరీ కవిత ఆమె పరిశీలనా శక్తికీ, భావవ్యక్తీకరణ శక్తికీ నిదర్శనం.”గాయాలపూలు” కవితలో “జీవనయానంలో తగిలిన ఎదురు దెబ్బలే జీవితంలో మనల్ని మనం నిలబెట్టుకోవడానికి పనికి వచ్చే పాఠాలు అవుతాయి. అవి మనిషి వ్యక్తిత్వాన్ని సానపెట్టే ఆకురాళ్ళు అవుతాయి” అనే సూత్రాన్ని బలంగా ప్రతిపాదించి గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది.

ఇంకా ‘దేవతాపిట్ట’, ‘నా జట్టుంటావా?’, ‘ఊరుంది కదా!’, ‘నవ చంద్రిక’, ‘ఎరుక’, ‘పునర్యానం’, ‘ఇదన్యాయం’, ‘రంగుల గొడుగు’, ‘ఎడారీకరణ’ వంటి కవితలలో స్పష్టంగా చూడగలం గౌరీలక్ష్మిని. ‘కర్దమ కమలాలు’ కవితలో బురదలో ఉన్న కమలాలకు ఆ బురద ఏమాత్రం అంటుకోదు అని చెప్తూ, “మీ చిరునవ్వు వెనక ఖేదాన్ని, విషాదాన్ని ఊహించక/ఎంత పాపం మూట కట్టుకున్నామో/నిష్కృతి కోసం మీ ముంగిట నమస్కరిస్తున్నాం” అంటుంది. కవిత్వం రాసేందుకు ముడి సరుకు ఏంటి? సమాజంలోని దాష్టీకాలు. కానీ, అభివ్యక్తి బావుండాలి, భాష బాగుండాలి, సరైన పద చిత్రాలను సమయస్ఫూర్తితో ప్రయోగించగలగాలి అప్పుడే కవిత బాగుంటుంది. ఇవన్నీ గౌరీలక్ష్మి కవిత్వంలో చూస్తాం. ఈ కవితా సంపుటికి శీలా సుభద్రాదేవి పీఠిక రాశారు.

ఇంకా కవయిత్రి –

“అమ్మ ఇల్లంతా ప్రవహించే వాత్సల్య జలధి
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం
ఎంత వాడుకున్నా తరగని పెన్నిధి
రోజాఖరుననైనా ఆమె చెంగు తాకడం సౌభాగ్యం!” అంటుంది.

ఎందుకు శ్రీశ్రీ “నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను” అని అన్నాడు! కవి క్రాంతదర్శి. ప్రజాపక్షాన గళమెత్తాలి. స్త్రీ జాతి పక్షాన, సమాజం పక్షాన అల్లూరి గౌరీ గొంతెత్తుతుంది. శ్రీశ్రీది మహాప్రస్థానం అయితే గౌరీలక్ష్మి “తమ సున్నితత్వానికీ, లోకపు లోహతత్వానికీ జోడీ కుదరక.. ఆపై తమను తామే చేరుకుని వికసనం చెందుతారు! సాహసయుద్ధానికి సమరశంఖం ఊదుతారు. జనతకై వత్తులుగా మండుతూ వెలుగుబాట చూపుతారు” అంటూ ‘కవులేం చేస్తారంటే?’ కవితలో కవితల ‘పాలవెల్లి’ కావడమూ చూస్తాం! ఇలాగే కనిపించే అన్యాయాలను ఖండించాలనీ, కన్నతల్లుల పక్షాన కలమెత్తాలనీ ఆకాంక్షిస్తూ గౌరీలక్ష్మికి అభినందనలు తెలియజేస్తున్నాను.

***

ప్రవాహోత్సవం (కవిత్వం)
రచన: అల్లూరి గౌరీలక్ష్మి
వెల: ₹ 150/-
ప్రతులకు:
అల్లూరి గౌరీలక్ష్మి
డో.నం.3-6-394/2, ఫ్లాట్ నం.302
శ్రీ తిరుమల ఎవెన్యూస్, స్ట్రీట్ నం. 4
హిమయత్ నగర్, హైదరాబాద్ – 29.
మొబైల్: 9948392357
ఈమెయిల్: aglakshmi4@gmail.com

Exit mobile version