Site icon Sanchika

ప్రయాణం సాగుతూనే వుంది

[dropcap]ఇ[/dropcap]ద్దరమూ నదీ ప్రవాహంలో
కాగితప్పడవల మీద బయలుదేరాం
సముద్రంలో కలుసుకుందామనుకున్నాం

పయనించే ప్రవాహపు అలల్లో పుట్టిన ‘లయ’ను
చేతుల్లోకి తీసుకున్నాం
అది హృదయంలో ప్రతిధ్వనించింది

లయని పిడికిట్లో బంధించాలనుకున్నాం
అది చేజారి ప్రవాహంలో కలిసిపోయింది
నది మంద్రంగా గాంభీర్యాన్ని సంతరించుకుంది
ఆకాశపు నీలి రంగుని
ప్రతిఫలిస్తూ మురిసి పోయింది

ప్రయాణం సాగుతూనే వుంది
సముద్రున్ని చేరతామో లేదో
ఎప్పటికయినా జతగా కలుస్తామో లేదో తెలీదు

కానీ
లక్ష్యం వైపు కలిసి నడుస్తున్నామనే భావనే
ఇద్దరిలో చిందులు వేస్తున్నది
ఆనందం చిగుర్లు తొడుగుతున్నది

Exit mobile version