ప్రయాణంలో ఒక రోజు

0
3

[dropcap]రా[/dropcap]యచోటి.. రాత్రి 7.30.. కడపకు చివరి బస్.. జనాలు ఎక్కుతున్నారు తోసుకుంటూ.. కొంతమంది ఇది చివరి బస్సు అంటూ ఉరుక్కుంటూ బస్ వైపు వస్తున్నారు. నేను కిటికిలో నుండి బ్యాగ్ సీటు పైకి అలాగ్గా విసిరి వేసాను.. అమ్మయ్య ఇక నా సీట్‌కి డోకా లేదు అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించి.. సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ అటు ఇటు చూస్తున్నా.

“ఏమబ్బా యీ బస్సు యాడి వరకు పోతాంది” అన్న మాట నా పక్క నుంచి వినిపించి అటు చూసా. అరవై ఏండ్ల పెద్దామె నోట్లో పొగాకు నములుతూ నా వైపు చూస్తోంది.

“పెద్దమ్మా ఈ బస్సు కడప పోతాంది” అన్నాను నేను.

“నీదే ఊరబ్బా” అనింది మళ్లీ.

“పెద్దమ్మా మాది చిన్నగొట్టిగల్లు. పని మీద పులివెందుల పోతాండా” అన్నా నేను.

“వక్కాకుకు పది రూపాయలు లెక్క ఉంటే ఈ నాయనా” అంది ముసలమ్మ..

“ఇగో పెద్దమ్మ తీసుకో.. పది రూపాయలు యాడనో పోతాంటాయి.. అదేమన్నా భాగ్యమా!” అంటూ పది రూపాయలు ఇఛ్చినాను..

“నీ అమ్మ కడుపు చల్లగుండా” అని ఆయమ్మ అంటున్నంతలో.. అటు బస్సు వైపు చూస్తే డ్రైవర్ ఎక్కతా ఉండాడు. వెంటనే నేను సిగరెట్ క్రింద పడేసి కాలితో దాన్ని నలిపి గబా గబా బస్ వైపు పోయినా. లోపలికి ఎక్కి నా సీట్ దగ్గర చూడగా కిటికీ వైపు ఒక కుర్రాడు కూర్చొని ఉన్నాడు. నేను కూడా కూర్చొని నా బ్యాగ్ తీసి ఒళ్ళో పెట్టుకొని చూస్తే కండక్టర్ కూడా బస్సు ఎక్కాడు.

కండక్టర్ టికెట్లు కొట్టడం మొదలు పెట్టాడు. “ఏందయ్యో బస్సు ఇప్పుడే బయలుదేరలా” అంటూ వెనక నుండి ఎవరో కేక వేశారు.. “లేదు.. ముందు “టిక్కెట్లు కొట్టాల” అంటూ కండక్టర్ జవాబు ఇచ్చాడు. కండక్టర్ టిక్కెట్లు కొట్టుకుంటూ నా సీటు దగ్గరకు రాగానే నేను ఐదు వందల నోటు ఇచ్చి “వేంపల్లెకు” అన్నాను.

“చిల్లర లేదయ్యా. యాడనించి తెచ్చేది చిల్లర. ఇప్పుడే బస్సు ఎక్కతా ఉండా” అంటూ, “టికెట్ వెనకాల చిల్లర రాస్తాండా మర్చిపోకుండా దిగేటప్పుడు అడిగి తీసుకుని పో..” అన్నాడు.

నా పక్కన ఉన్న కుర్రాడిని టికెట్ అంటూ అడిగాడు. కుర్రోడు జవాబు ఈయక ఆయన తట్టే చూస్తా ఉండాడు. “యాడికి కొట్టేది టిక్కెట్” అని కండక్టర్ కుర్రోడిని అడగతా ఉంటే ఆ అబ్బాయి దిక్కులు చూస్తా “అనంతపురం” అన్నాడు. “ఇది అనంతపురం పోదురా అబ్బి” అని వెనకాల సీటులో కూర్చొని ఉన్న పెద్దయ్య ఆ అబ్బాయి వైపు చూస్తూ చెప్పాడు. ఆ అబ్బాయి నోట్లో ఎంగిలి మింగుతూ “కడపకు” అంటూ యాభై రూపాయల నోటు ఇచ్చాడు. “బాబు చిన్న కడపకు టికెట్ తొంబై ఆరు రూపాయలు” అని కండక్టర్ ఆ అబ్బాయితో అంటుంటే ఆ అబ్బాయి అటు ఇటు చూస్తూ ఏమి చెయ్యాలో తెలియనట్లు ఉంటే నేను కండక్టర్‍తో చెప్పాను..

“ఈ పిల్లోడికి కూడా నేనే టికెట్ తీసుకుంటా.. నాకు మిగతా చిల్లర రాయి టికెట్ వెనకాల.. దిగేటప్పుడు నా దుడ్డు నాకు యిద్దువు గానీ” అన్నాను  కండక్టర్‍తో. ఆ పిల్లోనితో “ఎక్కడకు టికెట్ తీసేది నీకు” అని అడిగాను. వాడు జవాబు ఇవ్వక పోయేసరికి నేనే ముందరపడి “మా ఇద్దరికి వేంపల్లి వరకు టికెట్ ఇవ్వు” అన్నాను కండక్టర్‌తో.

ఆ పిల్లాడిని చూస్తా ఉంటే ఏదో కాలేజీలో చదవతా ఉన్నట్టు అనిపిస్తాండాది. నెమ్మదిగా మాటల్లో పెట్టి కనుక్కోవాలి అనుకున్నాను. ఇంతలో కండక్టర్ టికెట్ కొట్టడం అయ్యిండాది.. వచ్చి ఆయన సీట్‌లో ఆయన కూర్చొని రైట్ రైట్ అన్నాడు. బస్సు కదిలింది. వెంటనే గాదర బీదరాగా అరుపులు వెనక సీట్ నుండి. “ఓ రబ్బీ కొంచం ఇట్నే ఆపండి.. మావాడు పిల్లగానికి చిప్స్ తెచ్చేదానికి పోయుండాడు.. కాస్త ఆగు..” ఆంటూ కేకలు.

“ఏడ చచ్ఛేది వీళ్ళతో!” అంటూ కండక్టర్ “హోల్డన్!” అంటూ విజిల్ వేసాడు. ఒక్కసారిగా కుదుపుతో బస్సు ఆగగానే ఎవరిదో గంపలో కోళ్లు ఉన్నట్టుండాయి. ఒకటో కొక్కరకో అరుపులు.. “అబ్బా మనుషులకే బస్సు చాలదంటే కోళ్లు, మేకలు కూడా” అంటా ఉంది పక్క సీట్‌లో కూర్చొని ఉన్న వయసు పిల్ల చీదరించుకొంటా. ఎదురుగా సీట్‌లో ఉన్న చిన్న పిల్లలు ముందుకు తూలి పడబోయి ఒకటే ఏడుపులు. “మేయ్ పిల్లోల్లని ఊరుకో బెట్టు” అంటు పెద్దామె గదమాయింపు పిల్లల తల్లి మీద. అంతలో ఒక సుమారైనా పిల్లోడు చిప్స్ ప్యాకెట్‌తో గబా గబా బస్సు లోకి ఉరికినట్టు ఎక్కాడు. బస్సు మళ్ళీ బయలుదేరింది.

చిన్నగా పక్కనున్న పిల్లగాని వైపు చూసా.. పాలు గారే పసి మొఖం.. ఇంకా మీసాలు కూడా రాలా.. పిల్లగాడు కిటికీలో నుండి పొయ్యే చెట్టు వచ్ఛే చెట్టు చూస్తా కూర్చొని ఉన్నాడు. వానితో “అబ్బయ్య అనంతపురం పోవాలా, కడప పోవాల్నా” అన్నా. వాడు నా తట్టు చూసి.. “నేను అనంతపురం పోవాలి” అన్నాడు.

“ఏం చదవతా ఉండావు” అన్నా వాడి వైపు చూస్తూ. “ఇంటర్” అన్నాడు పిల్లగాడు. “మొదటి యాడాదా లేదా రెండోదా” అన్నాను. చిన్నగా నా వైపు చూసి కళ్ళు క్రిందకు వాల్చి “మొదటి ఏడాది అయ్యింది.. ఇప్పుడు రెండోదానికి పోయుండా” అన్నాడు.

“ఏ ఊరు నీ కాలేజీ అబ్బయ్యా” అన్నాను. “తిరపతి” అన్నాడు కండ్లు అలా పక్కకు తిప్పుకుంటూ.

“అమ్మా నాన్న యాడ వూరులో ఉండారు. ఉద్యోగమా వ్యవసాయమా” అన్నా.. వాడి కండ్లల్లో నీళ్లు ఊరతావుండాయి.

“అయ్యో బిడ్డా ఏమయిందిరా నాయనా?” అంటూ వాడి భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకొన్నా. వాడు ఏడుపు గొంతుతో “యాడికైనా పోతా నేను.. అమ్మా నాన్న కాడికి పోను.. మా నాన్న నన్ను కొడతాడు” అని అంటూ కళ్ళల్లో నీళ్ళు తుడుచుకున్నాడు.

“ఏమయిందిరా అబ్బి” అన్నా నేను. వాడు నా వైపు చూస్తూ “నాకు ఇంటర్ మొదటి యాడాది పరీక్షలలో మార్కులు తక్కువగా వచ్చాయి. కాలేజీలో టీచర్లు ఒకటే తిడతా ఉండారు మార్కులు తక్కవైనాయని. మా నాన్నకి కోపం ఎక్కువ.. నన్ను కొడ్తాడు.. నేను ఇంటికి వెళ్ళను” అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు.

నేను వాడిని ఊరుకోబెడుతూ.. “నువ్వు అలా చేస్తే మీ అమ్మ బతికుంటుందా.. నువ్వు యాడికి పోయినావో తెలియక మీ నాన్న దిగులుపడిపోతాడు” అన్నాను. “మళ్లీ పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవచ్చు.. జీవితంలో ధైర్యంగా ఉండాలి కానీ భయపడితే ఎలాగా. పిరికితనం మంచిది కాదు. ఇంకా పెద్ద పెద్ద పరీక్షలు ఉంటాయి జీవితంలో.. ఏదైనా ఎదుర్కోవాలి.. నీవు తప్పు ఏమి చేయలేదు. ఈసారి ఇంకా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో.. నిజాయితీగా నీ తప్పు మీ నాన్న దగ్గర ఒప్పుకో.. అమ్మా నాన్న నీ మీద ప్రాణాలు పెట్టుకుని ఉంటారు. పారిపోకూడదు” అన్నాను. ఇంతలో బస్సు వేంపల్లి చేరింది. కండక్టర్ దగ్గర నాకు బాకీ ఉన్న రొక్కము తీసుకుని.. ఆ కుర్రాడిని కూడా వెంట బెట్టుకుని బస్సు దిగాను. అక్కడే బస్ స్టాప్‌లో కూర్చున్నాము ఇద్దరమూ. ఆ పిల్లగాడిని వంటరిగా వదలాలి అనిపించలేదు. ఒకరోజు పని వాయిదా పడితే ఏమైపోతుంది అనుకున్నా. పిల్లోని జీవితం కంటేనా. పులివెందులకు పొయ్యే చివరి బస్సు కూడా పోయింది. వాడితో మాటల్లో పడి చూసుకోలేదు. “ఇంక మనం ఈడ్నే ఉండాలి తెల్లారే వరకు” అన్నాను వానితో.. “ఫస్ట్ బస్ ఇక పొద్దున్నే ఐదు గంటలకి..” అంటూ “ఇప్పుడు చెప్పారా నాయనా నీవు ఏ ఊరు పోవాలి” అన్నాను నేను.

వాడు నా వైపు చూస్తూ “అనంతపురం పక్కన పల్లి మాది. మా నాయన వ్యవసాయం చేస్తాడు. మా బాబాయి అనంతపురంలో లాయర్, నన్ను ఆయనే చదవిస్తా ఉన్నాడు. అమ్మ అంగన్వాడికి పోతుంది. అక్కడ వంట చేస్తుంది. ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు” అన్నాడు.

“బాబు నీకో మాట చెప్పాలి” అన్నాను నేను వానితో.. “నాకూ ఒక కొడుకు ఉన్నాడు. ముగ్గురు కూతుర్ల తరువాత పుట్టాడు అని ఆ కుమార స్వామి పేరు కార్తికేయ అని పెట్టుకున్న. నాలుగేండ్ల ముందు ఇట్టాగే వాడు ఇంజినీరింగ్ చదివేటప్పుడు పరీక్షలో తప్పానని యాడికో పోయినాడు. అంతా వెతికాము. పోస్టర్స్ అంటించాను. బంధువుల కాడికి పోయినాడా అంటే లేదు.. నేను, వాడి అమ్మ దిగులు పడిపోయాము. రెండేళ్ల తరువాత తిరిగి వచ్చాడు చిక్కి శల్యమై.. ఇప్పుడు చదువు లేదు.. ఆరోగ్యము అంతంత మాత్రమే.. బెంగుళూరులో టిఫిన్ బండి కాడ కప్పులు, ప్లేట్లు కడగతా ఉన్నాడంటా అన్ని రోజులు.. చలిలో ఎక్కడంటే అక్కడ పడుకుని తిండిలేక.. ఆరోగ్యం క్షీణించింది. ఇప్పుడు ఇంటి కాడ ఉంటే చాలనుకుని అంగడి పెట్టించాను. బాగా చదివేవాడు.. భయపడి.. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు..” అని చెప్తూ పైపంచెతో కన్నీళ్లు తుడుచుకున్నా.

“మీ నాన్నకి ఫోన్ చేస్తాను” అంటే, “వద్దు మా బాబాయికి చెయ్యండి” అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. వెంటనే నేను నా సెల్ నుండి ఫోన్ చేశాను.. ఇది విషయము అని చెప్పగానే.. వాడి బాబాయి.. “నేను వచ్చేవరకు మా వాడిని కనిపెట్టుకుని ఉండండి.. నేను ఇప్పుడే ఏదైనా బండి ఎక్కి తెల్లారే లోపల అక్కడకి చేరుతాను” అన్నాడు. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం రాత్రంతా.. వ్యవసాయము లోని కష్టాలు.. పై ఖర్చులు.. ఆడపిల్లల పెళ్లిళ్లు.. పెద్దోళ్ళకి మందులు మాకులు అంటూ.. నీళ్లు లేని వ్యవసాయము, బీడు పడిన భూములు, విలువ లేని పంట.. చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగమో వృత్తో చేసుకుని కడుపునిండా మీరు తినొచ్చు మాకు పెట్టవచ్చు అని చెప్పాను. ..మధ్య రాత్రిలో వెళ్లి టీ తాగాము.. తెల్లారతా ఉండాది.. ఇంతలో సుమో ఏసుకుని వాడి బాబాయి వఛ్చి.. అక్కడ దిగాడు.. బాబును చూడగానే బాబాయి కంట్లో నీళ్లతో “ఎంత పని చేయబోయావురా.. మేము ఏమైపోవాలి” అంటూ వాడిని దగ్గరకు తీసుకున్నాడు.

“నా వైపు చూస్తూ మీ మేలు మర్చిపోము..” అంటూ నా రెండు చేతులు పట్టుకున్నాడు. పిల్లోడు కూడా “వస్తాను” అంటూ సుమో ఎక్కాడు.

ఆ మరుసటి ఏడాది ఆవులకు తవుడు పెడతా ఉంటే నా సెల్ మోగింది.. ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది.. ఎవురబ్బా అంటే.. “అన్నా ముందు సంవత్సరం మీరు కాలేజీ నుండి పారిపోయి వచ్చిన ఒక పిల్లవాడికి సహయం చేసారు గుర్తుందా.. మార్కులు తక్కువ వచ్చాయి అని.. ఆ పిల్లోడి బాబాయిని నేను.. ఈ సంవత్సరం వాడికి మంచి మార్కులు వచ్చాయి.. మా వాడి జీవితాన్ని నిలబెట్టినందుకు మీకు మేము ఎప్పటికీ రుణపడ్డాం” అన్నారు..

“ఏదో నేను చెయ్యగలిగిన సాయం చేశాను అబ్బాయి.. అంతా ఆ పైవాడి దయ” అన్నాను సంతోషంతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here