ప్రయాణం

20
2

[dropcap]డై[/dropcap]నింగ్ టేబిల్ దగ్గర కూర్చుని భోంచేయడానికి ఉపక్రమించాము నేను, నా శ్రీమతి సత్యవతి. ఇంతలో టీపాయ్ మీదున్న నా మొబైల్ రింగయింది. ఫోన్ చేస్తుంది ఎవరో చూద్దామని లేవబోయాను.

“ఆగండాగండి… ఆ పోన్‌లు ఎప్పుడూ ఉండేవే కదా… తరువాత చూసుకోవచ్చు. ముందు మీరు ప్రశాంతంగా భోంచేయండి” అంటూ హితవు పలికింది సత్యవతి. మారు మాట్లాడకుండా కూర్చుండిపోయాను.

భోంచేస్తున్నాననే కాని, నా ఆలోచనలు మాత్రం ఆ ఫోన్ మీదే…. ఎవరయ్యుంటారు? విషయం ఏమయ్యుంటుంది….. భోజనం ముగించుకుని మొబైల్‌లో మిస్డ్ కాల్ చూశాను. అరే…. నా ప్రాణమిత్రుడు, బాల్యస్నేహితుడు రంగనాథ్ చేశాడు. వెంటనే ఫోన్ చేశాను.

“హాల్లో రంగనాథ్. ఎలా వున్నావురా? ఏంటి ఫోన్ చేశావ్?”

“నేను బాగానే వున్నాన్లే కాని… విషయం ఏమిటంటే ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి శ్రావణమాసంలో గృహప్రవేశం చేద్దామనుకున్నాం కదా!… కాని పనులు అనుకున్నట్లుగా పూర్తయ్యేట్లు లేవు. అందుకే మా సమీప బంధువులను మాత్రమే పిలుచుకుని, ఎల్లుండి గృహప్రవేశం చేసి…. ఆ తరువాత నెలకో రెండు నెలలకో…. ఇల్లు పూర్తిగా తయారైన తరువాత అందర్నీ పిలుచుకొని కొత్త ఇంట్లో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం జరుపుకుని విందు భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము.

తక్కువ టైంలో ప్రయాణం అంటే కష్టమే కదా. అందుకే వీలైతేనే ఇద్దరూ రండి. వీలు కాకపోతే నువ్వైనా రారా. నీకూ కుదరకపోతే… ఏం పరవాలేదు. సత్యనారాయణస్వామి వారి వ్రతానికి ఎటూ ఇద్దరూ వస్తారు కదా… మరి ఇక వుంటాన్రా… అవతల నాకు బోలెడు పనులున్నాయ్…” అంటూ నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే ఫోన్ కట్ చేశాడు రంగనాథ్.

“ఏంటండీ విషయం… ఏవంటున్నాడు మీ బాల్యస్నేహితుడు?” అని వెటకారంగా అడిగింది సత్యవతి, విషయాన్ని వివరించాను.

“ఇప్పుడు మీరు వెళ్లకపోయినా పరవాలేదు… ఎటూ సత్యనారాయణ స్వామివారి వ్రతానికి వెళ్లాలి కదా. అప్పుడు ఇద్దరం వెళ్దాం… ఇప్పుడు మీరొక్కరే వెళ్లాలన్నా ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరుకుతాయా. పోనీ బస్సుల్లో ప్రయాణం చేస్తారనుకుంటే…. మీకు బస్సు ప్రయాణం పడదాయే… పైగా అవతలెల్లుండి పది గంటలకల్లా మనం దిల్‌సుక్‌నగర్ ఆశ్రమానికి తప్పని సరిగా వెళ్లాలి. కాబట్టి ఎల్లుండి ప్రయాణం విషయం మరిచిపోండి” అని తేల్చి చెప్పింది సత్యవతి.

“అది కాదు సత్యవతి… వాడు నా ప్రాణస్నేహితుడు. నీకూ తెలుసు కదా… వెళ్లకపోతే బాగోదు… సరే… ఒక పని చేస్తా… ట్రైన్ టిక్కెట్లు దొరికితేనే వెళ్తాలే…” అంటూ కంప్యూటర్ ముందు కూర్చుని చూడ్డం మొదలెట్టాను.

సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎ.సి. టూటైర్లో వెయిటింగ్ లిస్టు మూడు…. తిరిగి అదే రోజు రాత్రి గుంటూరు నుండి సికింద్రాబాద్ రావడానికి నర్సపూర్ ఎక్స్‌ప్రెస్ ఎ.సి. టూటైర్లో వెయిటింగ్ లిస్టు రెండు. కన్‌ఫర్మ్ కాకపోతాయా అనే ధైర్యంతో వెయిట్‌లిస్టెడ్ టిక్కెట్లు బుక్ చేశాను.

ప్రయాణం రోజు ఉదయం ఎనిమిది గంటలకు శబరి ఎక్స్‌ప్రస్‌లో టికెట్ కన్‌ఫర్మ్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అదే రోజు రాత్రి నర్సపూర్ ఎక్స్‌ప్రెస్‌లో స్టేటస్ చూస్తే… మార్పు లేదు. వెయిటింగ్ లిస్టు రెండే. కాకపోతే చార్ట్ ఇంకా తయారవలేదు. చార్ట్ తయారవుతే కన్‌ఫర్మ్ అవచ్చనే నమ్మకంతో సత్యవతితో టిక్కెట్లు కన్‌ఫర్మ్ అయినట్లే అని ఒక చిన్న అబద్దం చెప్పి ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నాను.

లక్కీగా ట్రైన్ గుంటూరుకి రైట్ టైమ్‌కే చేరుకుంది. రైల్వే స్టేషన్‌కి సమీపంలోనే రంగనాథ్ ఇల్లు. నన్ను చూసిన రంగనాథ్ పట్టలేని ఆనందంతో నన్ను కౌగిలించుకున్నాడు. రాత్రి ఎనిమిది గంటలకు గృహప్రవేశ ముహుర్తం. కార్యక్రమం అయిపోగానే భోంచేసి పదకొండు గంటలకల్లా రైల్వేష్టేషన్ కెళ్లి నర్సపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి.

అక్కడ నలుగురి మద్యలో ఉన్నాననే కాని గంట గంటకు రిజర్వేషన్ స్టేటస్ చూస్తూనే ఉన్నాను. మార్పులేదు. వెయిట్ లిస్టు రెండే వుంది. రాత్రి ఎనిమిదింపావుకు మెసేజ్ వచ్చింది. ఛార్ట్ తయారయిందనీ, స్టేటస్ వెయిటింగ్ లిస్టు ఒకటి అని, రిజర్వేషన్ క్యాన్సిల్ అయిందని తెలియజేశారు.

ఏం చేయాలో పాలుపోలేదు. రేపు తొమ్మిది గంటలకల్లా సత్యవతిని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్లాలి. కార్యక్రమం అంతా పూర్తయిన తరువాత రంగనాథ్‌తో విషయం చెప్పాను.

వెంటనే రంగనాథ్ తనకు బాగా తెలిసిన బస్సు టిక్కెట్లు రిజర్వేషన్ కౌంటర్ ఇన్‌చార్జికి ఫోన్ చేసి హైద్రాబాద్‌కు టికెట్ అరెంజ్ చేశాడు. పదకొండు గంటల ఎ.సి బస్సులో చిట్టచివరి వరసలో ఒకే ఒక సీటుందని, అదైతే ఇబ్బందిగా వుటుందని పది గంటల నాన్ ఎ.సి బస్సులో తీసుకున్నాడు. బయలుదేరడానికి టైం తక్కువగా వుందని రంగనాథ్… నా ఒక్కడికి ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేసి, తదనంతరం తన తమ్ముడితో బస్ డిపో దగ్గర డ్రాప్ చేయించాడు.

బస్సు బయలుదేరింది. నా సీటు దగ్గరికి వెళ్లి చూస్తే, ప్రక్క సీట్లో నడి వయసులో ఉన్న ఒక మహిళ కూర్చుని వుంది. నాకయితే ఆవిడ ప్రక్కన కూర్చోడానికి ఇబ్బందనిపించింది. కాని తప్పలేదు. బస్సులో ఎదురుగా ఉన్న చిన్న టి.విలో ఓ తెలుగు సినిమా మొదలైంది. అందరి కళ్లు ఆ సినిమా వైపు మళ్లాయి. రద్దీగా వున్న ప్రాంతాలు దాటుకెళ్లి ఊరు పొలిమేర దాటింది బస్సు.

ఇక అక్కడ నుండి విజృంభించాడు బస్సు డ్రైవరు. చక్రాలు భూమి పైనే తిరుగుతున్నాయా… అనే అనుమానం కలిగింది. మేఘాల్లో దూసుకెళ్తుందనిపించింది. ఆ కట్టింగులు, ఓవర్ టేకులు, బాబోయ్… ఒక వేళ ఏమైనా జరిగితే… ఇంకేమైనా ఉందా… గుండె వేగంగా కొట్టుకొంటోంది.. ‘గాల్లో తేలినట్టుందే….గుండె జారినట్టుందే’ అనే పాట గుర్తు కొచ్చింది.

ఇక్కడ నా పరిస్థితి మరో రకంగా వుంది. బస్సు ఎడమ వైపుకి తిరిగినప్పుడు ఆవిడ భుజం నా భుజాన్ని తాకింది. కుడివైపుకి తిరిగినప్పుడు నా భుజం ఆవిడ భుజాన్ని తాకింది. నాకు వెన్నులోపల వణుకు మొదలైంది. తను నన్ను అపార్థం చేసుకొని లేనిపోని రాద్ధాంతం చేస్తుందమో. అమ్మో… ఇంకైమైనా వుందా… రెండు రోజుల క్రితమే ‘గీతగోవిందం’ సినిమా చూశాను. అందులో హీరో చేసిన తప్పిదం ఎన్ని అనర్థాలకు దారి తీసిందో… తలుచుకంటే నాకు భవిష్యత్తు భయంకరంగా గోచరించింది.

వెంటనే ఒక్కసారి సర్దుకుని సీటులో బాగా ఎడంగా జరిగి, ముందు సీటును గట్టిగా పట్టుకుని ఏ మాత్రం కదలకుండా కూర్చున్నాను. ఆవిడ కూడా సీటు చివరి వరకు జరగి ఒదిగి కూర్చున్నది.

అయినా ఏమౌతుందో… ఏమో… అనే భయం నన్ను వీడలేదు. హ్రైదరాబాద్ చేరేదాకా… ఇక… నా పరిస్థితి ఇంతేనా… అయినా తప్పదు.

ఎందుకంటే మహిళాలను గౌరవించడం మన సాంప్రదాయం అనే సూక్తిని మనస్ఫూర్తిగా నమ్మి, నిజాయితీగా ఆచరణలో పెట్టే వ్యక్తిని నేను. ఆ విధంగా చూసినప్పుడు నా వల్ల ఆవిడ కెలాంటి ఇబ్బంది కాని, ఏ విధమైన అసౌకర్యం కాని కలగకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఎంత కష్టమైనాసరే… ఇష్టంగానే భరించాలనుకున్నాను.

నా దీన స్థితిని గమనించిన ఆవిడ, “సార్… నేను వచ్చే స్టాప్‌లో దిగిపోతాను” అని నెమ్మదిగా చెప్పింది.

ఆ మాటలతో నాకు కొంత ఉపశమనం కలిగింది. ఒక అర్ధగంట తరువాత వచ్చిన స్టాప్‌లో ఆవిడ దిగిపోయింది హమ్మయ్య… అనుకుంటూ సీటు మొత్తం ఆక్రమించుకుని దర్జాగా కూర్చున్నాను. ఇంతలో ఆ స్టాప్‌లో ఎక్కాల్సిన ప్రయాణీకులు ఒక్కరొక్కరుగా బస్సులోకి వచ్చి తమ తమ సీట్ల నెంబర్లు వెతుక్కుని కూర్చుంటున్నారు. నాలో మరలా మొదలైంది టెన్షన్. ఏ లేడీయో వచ్చి కూర్చోదు కదా. వచ్చే వారందర్నీ నిశితంగా గమనిస్తూ ఎవరోస్తారో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, నా ప్రక్క సీటు నెంబరు చూసుకుని అందులో చటుక్కున కూలబడ్డాడు. ఇక ఏ ఇబ్బంది ఉండదనుకుని ఊపిరి పీల్చుకున్నాను.

బస్సు బయలుదేరింది. మరలా మామూలే… మన డ్రైవర్ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముందుగా వెళ్తున్న బస్సులను, లారీలను ఒక్కొక్క దాన్ని ఓవర్ టేక్ చేస్తూ డ్రైవింగ్‌లో తన కెవరూ సాటిరారని నిరూపించుకుంటున్నాడు. రాత్రి పన్నెండు గంటలయింది. టి.వీలో సినిమా నిలిపివేశారు. డ్రైవర్ లైట్లన్నింటినీ ఆపేశాడు. కిటికీల్లోంచి లోపలికి రావడానికి పోటీ పడుతున్న చల్లగాలులు, ప్రయాణీకులకు నాన్ ఎ.సి బస్సులో అదనపు చార్జీలు లేకుండా ఎ.సిని రుచి చూపిస్తున్నాయి. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. కొందరైతే పెద్దగా గురకలు కొడుతున్నారు. అంతలా ఎలా నిద్రపోతారో ఏమో అదృష్టవంతులు… మరి.

నాకైతే నిద్ర పట్టినట్టే పట్టి, సడన్ బ్రేకులతో, కుదుపులతో నిద్రాభంగం అవుతూనే వుంది. తరువాత ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో గుర్తు లేదు. ఉదయం నుండి బాగా అలసిపోవడం వలన ఒళ్లు తెలియకుండా నిద్రపోయాను. ఉన్నట్టుండి బస్సులో లైట్లు వెలిగాయి. టైం చూస్తే తెల్లవారు ఝామున మూడయింది. యల్.బి.నగర్, యల్.బి.నగర్ అని బిగ్గరగా అరుస్తున్నాడు డ్రైవరు. బస్సు ఆగగానే అక్కడ కొంతమంది దిగిపోయారు. అలా మరి కొన్ని స్టాపులు ఆగుతూ, ఆగుతూ యస్.ఆర్.నగర్ స్టాప్ చేరుకుంది బస్సు. నేను దిగాల్సిన స్టాప్ అదే. క్రిందకి దిగి చూస్తే అయిదారు ఆటోలు ప్రయాణీకులను వాళ్ల వాళ్ల ఇళ్లకు చేర్చడానికి సిద్ధంగా వున్నాయి.

ఇంటికి వెళ్లడానికి ఆటో మాట్లాడదామనుకున్నాను. టైం చూస్తే మూడు ముప్పావు అయింది. అక్కడికి మా ఇల్లు రెండు కిలోమీటర్ల దూరంలోవుంది. ఎటూ ఆ రోజు మార్నింగ్ వాక్ వుండదు కాబట్టి, ఇంటి దాకా నడిచి వెళ్తే బాగుంటుదనిపించింది. మెయిన్ రోడ్ వైపు చూస్తే వీధి లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అక్కడక్కడా కొంచెం జన సంచారం కూడా వుంది. ఇక నేను నా రెండు కాళ్లకు పని చెప్పాను.

మెయిన రోడ్డు దాటి మా ఇంటికెళ్లేందుకు కుడి వైపుకు తిరిగి ఒక చిన్న రోడ్డు వద్దకు చేరుకున్నాను. ఆ చిన్న రోడ్డు కిరువైపులా ఏపుగా పెరిగివున్న పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాల పైన వెలిగే విద్యుద్దాపాల కాంతిని భూమి పైన ప్రసరించకుండా అడ్డతగులుతున్నాయి. రోడ్డంతా చీకటి మయంగా వుంది. పైగా నిర్మానుష్యంగా వుంది. అక్కడక్కడా వీధి కుక్కలు సొమ్మసిల్లి నిద్రపోతున్నాయి. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం తాండవిస్తుంది. నెమ్మదిగా నడుస్తున్నాను. ఎందుకో కొంచెం భయం వేసింది. ఏదైనా జరిగితే, పిలిస్తే పలికే వారుండరు. అందునా నా చేతి వ్రేళ్లకు బంగారు ఉంగరాలు, మెడలో బంగారు గొలుసు, జేబులో కొంత నగదు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్నాయి. వాటి కోసం ఎవరైనా ఎటాక్ చేస్తే… అమ్మో… తలచుకుంటే భయం వేసింది. పొరపాటు చేశానా… ఆటోలోనే రావల్సిందేమో… అలా వచ్చుంటే ఆటో డ్రైవర్ కూడా అదను చూసి అటాక్ చేయిచ్చుకదా? అలా చేయడనే గ్యారంటీ ఏముంది? కొంతమంది అలాంటి డ్రైవర్లను కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా. మరిప్పుడేం చేయాలి. వెనక్కి తిరిగి వెళ్లడమా… ఒక్కక్షణం ఆగి ఆలోచించాను. వడివడిగా నడిచి ఇంటికి చేరుకోవడమే ఉత్తమం అనిపించింది. వెంటనే ధైర్యే సాహసే లక్ష్మీ అనుకుని నడక వేగాన్ని పెంచాను.

అల్లంత దూరాన రోడ్డుకి ఎడమవైపున పెద్ద పెద్ద సిమెంటు గొట్టాలు పేర్చి వున్నాయి. వాటికి ప్రక్కనే ఒక వ్యక్తి… లీలగా కనిపించాడు… ఎవరతను. ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఉన్నాడేంటి కొంపదీసి నాపై అటాక్ చేయడు కదా. నిజంగా భయం వేసింది. దానికి తోడు నన్ను చూసిన ఆ వ్యక్తి బాగా నీరసించిన గొంతుతో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ…

“బాబయ్యా ఓ బీడీ ముక్కుంటే ఇయ్యండయ్యా?” అని అడిగాడు.

ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్లున్న ఆ మాటలు విన్న కూడా నేను తల తిప్పకుండా వడివడిగా నడుస్తున్నాను.

అతని స్థితి చూసి, జాలి పడి దగ్గరికెళ్తే, సడన్‌గా లేచి నిల్చుని, ఏదో ఒక ఆయుధంతో అటాక్ చేస్తాడేమో. ఆ సిమెంటు గొట్టాల్లో అతనికి తోడుగా మరింకెవరైనా దాక్కుని ఉన్నారేమో… నో… నో… అగకూడదు. త్వరగా ఇక్కడ నుండి బయటపడాలి. అనుకుంటూ మరి కొంచెం వేగంగా నడుస్తూ ముందుకు సాగాను.

అలా కొంచెం దూరం వెళ్లగానే… నా మనసుకి అనిపించింది – అటాక్ చేసే వాడైతే ఈ పాటికే అటాక్ చేయాలి కదా. అంటే అతనికా ఉద్దేశం లేనట్లే కాదా. అలాంటప్పుడు వెనక్కి వెళ్ళి తనకెంతో కొంత డబ్బు ఇస్తే తెల్లారిం తర్వాత బీడీలు కొనుక్కుంటాడు కదా… పాపం… అతనికి బీడీలు తాగాలని ఎంత కుతిగా వుందో కాదా.

భగవంతుడి పై భారం వేసి గిరుక్కున వెనక్కి తిరిగి ఆ వ్యక్తి వైపు నడవడం మొదలెట్టాను. గుండె దిటవు చేసుకుని అతని దగ్గరగా వెళ్లి నిశితంగా గమనించాను. మాసిపోయిన గడ్డం, చింత నిప్పులాంటి కళ్లు, తైలసంస్కారం లేని చిందరవందరగా వున్న జుట్టు, అతని ముఖాన్ని సగానికి పైగా కప్పేసింది. బాగా నీరసించి, కృశించిన శరీరం. ఒంటి మీద మురికి పట్టి చిరిగిపోయిన బట్టలు ఉండీ లేనట్లుగా వున్నాయి. రెండు కాళ్లూ బార్లా చాపుకుని, చేతులు రెంటిని కాళ్లపై ఆనించుకుని జీవచ్ఛవంలా ముందుకు వంగి కూర్చున్నాడు. ఒక్క సారిగా ఒళ్లు జలదరించింది. నిశ్చేష్టుడిగా నిలబడ్డాను. వెంటనే తేరుకుని ఆ వ్యక్తితో…

“చూడయ్యా నేను సిగరెట్లు బీడీలు తాగను. అందుకే నీకివ్వడానికి అవి నా దగ్గర లేవు. ఇదుగో ఈ డబ్బుతో తెల్లారిం తరువాత వాటిని కొనుక్కో” అంటూ ఒక యాభై రూపాయల నోటును జోడించిన అతని అరచేతుల్లో జారవిడిచాను. నేనెంత డబ్బిచ్చానో ఆ వ్యక్తికి ఆ సమయంలో తెలిసుండదు. కాని, వణుకుతున్న గొంతుతో…

“సల్లగుండయ్యా” అని ఆ వ్యక్తి అన్న మాటలు విన్నంతనే నా కళ్లు చెమ్మగిల్లాయి. భావోద్వేగానికి లోనయ్యాను కూడా.

వెనుదిరిగి కళ్లు తుడుచుకుని నింపాదిగా నడుచుకుంటూ బరువెక్కిన హృదయంతో ఇల్లు చేరుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here