Site icon Sanchika

ప్రేమ ఎంత మధురం

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ప్రేమ ఎంత మధురం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]బం[/dropcap]గారు వర్ణంలో పరిసరాలన్నీ మిలమిలాడుతున్నాయి. ఎటు చూసినా అందమే! వర్ణించలేని అందం! రోజూ అతి మాములుగా కనిపించే భవనాలు కూడా స్వర్ణవర్ణాన్ని అద్దుకొని ఏదో ఉత్సవానికి బయలుదేరినట్లున్నాయి. ఆకాశం అద్దంలో భూమి అలకరించుకుంటోంది. సిందూరం తనను బొట్టుగా దిద్దుకోమని కొబ్బరి చెట్ల చాటు నుంచీ తొంగి తొంగి చూస్తూ అడుగుతోంది. అంతా స్వర్ణమయం.

పసిడి రంగుతో పోటీపడుతూ పరుగు లెత్తుతూ పోతున్న మనసును, ప్రకృతి అందాలను చూడటానికి ఈ కళ్లు చాలవేమో నన్నంత తపనలో లీనమైపోయిన ‘స్వర్ణ’ను పట్టికుదిపింది చెల్లి శ్యామల.

“ఏమిటక్కా! ఎంత పిలిచినా పలకవు? వంటింట్లోంచి ఎన్ని సార్లు అరిచానో తెలుసా అసలు! ఇక్కడకు వచ్చి ఎన్నిసార్లు నీ నామ జపం చేసానో చెబితే ఆశ్చర్యపోతావు!”

“ఏమీ ఆశ్చర్యపోను. ఈ రోజు నా మనసు మనసులో లేదు. ఎక్కడో గాలిలో తేలిపోతోంది. అలా చూడు నింగి, నేల ఎంత ముద్దు వస్తున్నాయో! తూనీగలా పరుగులెత్తి వాటినన్నింటినీ పరామర్శించాలనిపిస్తోంది.”

“అంతేనా! ఇంకేమైనా ఉందా!” బుగ్గన చెయ్యి చేర్చింది అక్కను ఉడికించాలని.

అదేమీ గమనించే స్థితిలో లేదు.

“అంతేనా! అంటే ఇంకా ఎంతో! చెప్పలేనంత. వాతావరణం ఈ నిమిషాన ఇలా ఉంది. ఇంకాసేపటిలో ఎలా మారుతుందో..”

ఆమె మాట పూర్తి కానే లేదు.

దట్టమైన మబ్బులు ఆకాశంలో ఆడుకోవటం ప్రారంభించాయి.

“ఏ క్షణంలోనయినా వర్షం ప్రారంభమవ్వచ్చు.”

“వర్షం వచ్చేట్లుందే అక్కా.”

“పిచ్చి శ్యామూ! వచ్చేట్లుండటమేమిటి వచ్చేస్తుంది. నా మనసులో వర్షం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక ఇక్కడే..”

చినుకు చినుకుగా.. ప్రారంభమో.. అంతమో.. తెలీనంతగా ఒక్కసారే భోరున వర్షం.

అంత చలిలో ముఖం కుడుక్కుంటున్న అక్కను వింతగా చూస్తూ.. “ఏమిటక్కా! ఎక్కడికయినా ప్రయాణమా!” అడిగింది.

“మెల్లగా.. అడుగుతావేం! ప్రొద్దున నుంచీ ఆటపట్టిస్తావని దాయలేక ఛస్తున్నా! దళితకవి ‘మధుకర్’ ఈ రోజు మన ‘పల్లవి’ ఆడిటోరియంకి వస్తున్నారు” అంది ముసి ముసిగా నవ్వుతూ!

“అయితే ఇంత వర్షంలో వెళతావా?” మానమన్నా మానదని తెలుసు.

అక్కకి అతని కవిత్వమంటే పిచ్చి. అమ్మానాన్నలు చెప్పినా వినదు. ఈ రోజు తమింట్లో యుద్ధమే!

“ప్లీజ్ శ్యామూ! అందర్నీ ఎలా మానేజ్ చేస్తావో నాకు తెలియదు. నేను వెళ్ళాల్సిందే! గొడుగు వేసుకొని వెళతాను.”

“ఈ గాలికి గొడుగు కూడా ఆగదక్కా!”

“శ్యామూ! టైమ్ వేస్ట్ చేయ్యకు. తుఫానుగా మారినా తప్పక వెళతాను. వేడివేడిగా కాస్త కాఫీ నా గొంతులో పోస్తే  ‘బంగారు చెల్లి’ వని బిరుదిస్తా!”

పేరంటానికి వెళ్ళిన తల్లి వచ్చే లోపే జారుకోవాలి అని పది నిముషాలలో చకచకా తయారయింది.

“కాస్త టిఫిన్ తినక్కా! వేడి వేడిగా ఉప్మా చేసాను” అంది శ్యామల బ్రతిమాలుతూ.

“లేదు చెల్లీ! నాకేమీ తినాలని లేదు. మధుకర్ చేసే ప్రసంగం, అతను చదివే ఒక్క కవితతో సంవత్సరం అంతా తిండి తినకుండా బ్రతికెయ్యచ్చు. అతని కవిత్వంతో నీకు టచ్ లేక నన్నిలా ఇబ్బంది పెడుతున్నావ్! అదే తెలిస్తే వెంటనే నన్ను పంపేస్తావ్!”

“సరే తల్లీ వెళ్ళు! నా తిప్పలు నేను పడతాను. ఆ కవిత్వంలో పడి ఇంటి సంగతి మరచిపోకు. తొమ్మిది కల్లా వచ్చేసేయ్. అది దాటితే అమ్మని ఊరుకోబెట్టడం నా వల్ల కాదు.”

చెల్లి మాటలు గాలిలో వెనుక వస్తూనే ఉన్నాయ్. గొడుగులోంచి తల బయటపెట్టి టాటా చెప్పేసింది.

గాలిలో తేలుతున్నట్లే నడక. ఎంత సేపు ఎదురు చూసినా బస్సు రాదే! ఎప్పుడూ పిచ్చి కుక్కల్లా ఎడా పెడా తిరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఒక్కటి రాదేం?

తన ఆత్రంలో పడి తనని గమ్యం చేర్చే వాహానాన్ని ఒక పిచ్చి కుక్కతో పోలుస్తోందని ఆమె పిచ్చి మనసుకు ఇప్పుడు తెలియదు. ఆమె అణువణువు కవిత్వం. కవిత్వం కోసం అందరూ చెవులు కోసుకుంటారు. కానీ ఈమె ప్రాణాలిమ్మని అడగకపోయినా ఇచ్చేస్తుంది. అందుకే వాళ్ళింట్లో ఆమెకు ‘కవిత్వం పిచ్చి’ అని బిరుదిచ్చారు.

ఒక పక్క వర్షం. ఇంటి దగ్గర నుంచీ నాలుగుడుగులు వెయ్యగానే గొడుగు పది అడుగుల దూరం పరుగులు. ఎలాగైతేనేం దానిని అందుకొని మడిచింది. హస్త భూషణంగా చేతులో ఉంది కానీ ప్రయోజనం శూన్యం. శుభ్రంగా తడిసిపోయింది. చలి. విపరీతమైన చలి..

వెచ్చటి ఊహగా మధుకర్ ఆలోచన.

“ఎలా ఉంటాడు? తెలుగు లెక్చరర్‌లా ఎర్రగా ఉంటాడా? అందంగా ఉంటాడా? అయినా అతను ఎలా ఉంటే ఏం? అందమైన కవిత్వం మాత్రం అతని సొంతం. అదే కదా తనకు కావల్సింది!”

తనను తనే మందలించుకుంది.

సర్వీస్ ఆటో వస్తోంది.

ఆగీ ఆగగానే బేరం ఆడకుండా ఎక్కి కూర్చుంది ‘సెంటర్’ అంటూ!

మామూలుగా అయితే ఆటో వాళ్ళు లొంగుతారు కానీ ఇలాంటప్పుడు వాళ్ళదే పై చెయ్యి. అయినా ఆమె మనసుకిప్పుడు ఇలాంటి ఆలోచనలు పట్టవు. ఎందుకంటే మనసంతా అతని గురించే ఆలోచిస్తోందిగా!

మధుకర్..

పేరులోనే మధువు.

కవిత్వమూ అంతే!

ఏ టాపిక్ తీసుకున్నా మథించి వదలి పెట్టనిది అతని నైజం.

అందుకే అతనంటే అంత ఇష్టం. అంత ఇష్టం. ఎన్ని సార్లు ఇలా అనుకున్నా తృప్తి తీరడం లేదు. ఇంకా.. ఇంకా ఏదో  పొగడాలనే మనసు తపన పడుతోంది.

ఆలోచనల్లో పడి గమనించనే లేదు.

“అమ్మా! దిగండి!” అంటున్నాడు డ్రైవర్.

‘అప్పుడే వచ్చేసిందే! ఇంకా రాలేదేం అని వంద సార్లు అనుకుంటున్నా!’ అని మనసులో అనుకుంటూనే పర్సు తీసి డబ్బు అతని చేతిలో పెట్టింది.

ప్రక్క వీధిలోనే ఆడిటోరియమ్!

బయటే ఆహ్వానిస్తున్నట్లు బేనర్!

వర్షం వలన ఆలస్యమయింది. సభ ప్రారంభమైందో ఏమో!

స్పీడుగా నడవబోయింది.

తడిసిన చీర ఆమెను ఆపింది.

ఒక్కసారి విదిల్చి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది.

అప్పుడే మధుకర్‌ని సభకు పరిచయం చేస్తున్నారు.

ఆత్రంగా అటు చూసిన ఆమె మనసు అతని రూపాన్ని చూసి విస్తుపోయింది.

ఇలా ఉన్నాడేమిటి?

ఇలా ఉన్నాడేమిటి?

వంచిన తల ఎత్తకుండానే ప్రశ్నలు!

తను ఇష్టపడింది అతని కవిత్వాన్ని.. అతన్ని కాదు..

అలాంటప్పుడు ఇలా.. ఎందుకు ఫీల్ అవటం..

ఏమో.. తనకే తెలియదు.

చూడాలనిపించటం లేదు.

ఎటో చూస్తూ కూర్చుంది.

‘మధుకర్’ వంతు వచ్చింది

క్లుప్తంగా రెండే రెండు నిముషాలు మాట్లాడాడు.

అదీ తన కులం గురించి.. అది అన్యాయమవుతున్న తీరు గురించి..

అది విన్న స్వర్ణ మనసు కరిగిపోయింది. అప్పటి దాకా ఉన్న ‘నూన్యత’ ఎటో వెళ్ళిపోయింది. ఆ స్థానాన్ని ‘జాలి’ భర్తీ చేసింది.

కొత్తగా రాసిన కవిత చదివాడు.

అందరి మనసులూ ఆర్ద్రతతో నిండిపోయాయి.

ఏదో లోకాలలోకి వారంతా వెళ్ళిపోయారు.

తప్పట్లు తట్టడం కూడా మరిచిపోయారు.

వేదిక మీదవారే తప్పట్లు ప్రారంభించడంతో ఆనందం నిండిన కళ్ళతో లయగా తామూ తప్పట్లు అందించారు అందరూ!

అందరూ ఆపేసినా ‘స్వర్ణ’ ఇంకా కొడుతూనే ఉంది.

‘ఎవరా’ అని అందరూ వెనక్కి తిరిగి చూసారు!

అప్పుడు ఆపేసింది తెలివి తెచ్చుకొని.

సిగ్గుగా ఏమీ అనిపించలేదు.

తన మనసిప్పుడు మంచు తడిసిన పుష్పంలా ఉంది మరి.

సభ అవగానే ‘ఆటోగ్రాఫ్’ అంటూ అతన్ని చుట్టుముట్టారు.

స్వర్ణ మాత్రం దూరంగా నిలబడి ఉంది.

‘ఇక వెళదాం’ అనుకుంటున్న అతని దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంది.

“మీరిలా మీ కులం గురించి తక్కువగా మట్లాడటం నాకు నచ్చలేదు.” అంది నిర్మొహమాటంగా.

నవ్వాడు అతను.

“ఎవరు ఎలా చూసినా మీరు కించపడకూడదు. అలా మాట్లాడకూడదని నేను చెబుతుంటే నవ్వుతారేం?” అంది దబాయిస్తూ.

ఎవరయినా వింటారేమో అని భయం కూడా లేదు.

అప్పుడు సీరియస్‌గా మారుతూ “మిస్ స్వర్ణా! ఇనుపతీగెను వంచటానికి ఎన్నో సమ్మెట దెబ్బలు కొడతారు. అలా జీవితంలో ఎన్నో అనుభవాల సమ్మెట దెబ్బలు తిన్నాను. అందుకే అలా మాట్లాడటం. అందరూ పైకి బాగా మాట్లాడేవాళ్ళే! కానీ ఆ తరువాతే.. అంతా.. మా ప్రక్కన కూర్చోవాలంటే ఆలోచిస్తారు. మాతో కలిసి భోంచెయ్యాలంటే ఆలోచిస్తారు! అవసరమయితే తినడమైనా మానేస్తారు కానీ సహపంక్తికి ఒప్పుకోరు. ఇదొక మచ్చుతునక. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో.. ఒకటా.. రెండా.. వందలు.. వేలు.”

అతన్ని ఆ ఊహల్లోంచి దారి మళ్ళించాలని తన అడ్రస్ ఒక పేపరు మీద వ్రాసిచ్చింది. “మీ అడ్రస్ ఇవ్వండి. అభ్యంతరం లేకపోతే ఉత్తరాలు రాస్తాను.”

“తప్పకుండా! ఇంత వరకూ మీలా మనసు విప్పి మాట్లాడిన వాళ్ళని నా జీవితంలో చూడలేదు. ఇక మీరు కలం స్నేహం చేస్తానంటే కాదంటానా?” అంటూనే జేబులో పెన్ను తీసుకొని పేపరు మీద అడ్రస్ రాసిచ్చాడు.

“మధుకర్.. వెళ్దామా..” చనువుగా అతని భుజం మీద చేతిని వేసి అడుగుతున్నాడు మిత్రుడు రహీమ్.

“నమస్కారమండీ!” అంది రెండు చేతులు జోడిస్తూ.

“స్వర్ణ.. నా అభిమాని అట” అని పరిచయం చేసాడు మధుకర్.

“అట కాదు అభిమానినే! ఇప్పటి దాకా మీరు రాసిన పుస్తకాలన్నీ మీ దగ్గిర ఉన్నాయో లేదో తెలియదు కానీ నా దగ్గర వున్నాయి. అదే సాక్ష్యం.”

“వాడొప్పుకోకపోయినా నేనొప్పుకుంటాను స్వర్ణ గారూ!” అన్నాడు రహీమ్.

 “థాంక్సండీ.. మీరయినా నన్నర్థం చేసుకున్నారు..” అంది.

మధుకర్‌ని ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు అన్నట్లు ఒక వీరలుక్ వేసాడు..

అప్పుడు టైమ్ చూసుకోంది.

తొమ్మిదిన్నర.. కొంప మునిగిపోయినట్లే.. బస్సు అంది ఇంటికెళ్ళేటప్పటికి పది. ఇంతే సంగతులు. ఆదరా బాదరాగా “వస్తానండీ.. ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు” అని హడావిడి వీడ్కోలు ఇస్తూనే పరుగు లాంటి నడకతో రోడ్డు నాశ్రయించింది.

గుమ్మం మెట్లమీదే ‘అక్షింతల ఆహ్వానం’.

“పెళ్ళి కావల్సిన పిల్ల. పదింటిదాకా ఇంటికి చేరలేదంటే ఎవరు ఏమనుకుంటారో అన్న ధ్యాసే లేదు. ఛ! ఛ! బొత్తిగా ఇంగిత జ్ఞానం లేకుండా పోతోంది. వయసు వస్తోంది కాని బుద్ధి మాత్రం పెరగడం లేదు. రానీ చెబుతాను. ఈ సారి బయటకు వెళతానంటే కాళ్ళు విరగ్గొడతాను” తల్లి ‘రత్నమాల’ అరుపులకు –

వెయ్యబోయిన అడుగు వెనక్కు తీసుకుంది.

“ఇప్పుడిలాగే అంటావ్. అది రాంగానే ‘అయ్యో తడిసిపోయావా తల్లీ’  అంటూ అన్నీ మరిచిపోతావ్!” తండ్రి ‘మాణిక్యాలరావు’.

“రానీయండి దాన్ని. ఈ రోజు అదో.. నేనో తెలాల్సిందే!”

కిటికీ లోంచి అక్క రావటం చూసిన శ్యామల గబగబా హాలులోకి వచ్చింది. “అమ్మా! ఆకలేస్తోంది. అన్నం పెట్టవే. అక్కను వచ్చాక తిడుదువుగానీ!” అంటూ వంటింట్లోకి లాక్కువెళ్ళింది.

ఇంకా కదలని తండ్రిని “మీరు కూడా రండి నాన్నగారూ!” అంది, అక్కడ ఉంటే యుద్ధం అనివార్యం అని అర్థమయినట్లు.

“పదమ్మా! వస్తున్నాను” అంటూ భుజం మీద కండువాని మరొకసారి దులిపి వేసుకొన్నారు. వస్తున్నాను అనటానికి గుర్తుగా!

వాళ్ళటు వెళ్ళగానే పిల్లిలా ఇంట్లో దూరింది స్వర్ణ.

భోజనం ప్రారంభించబోతూ ఆగిపోయి “ఒకసారి బయటకు వెళ్ళి వస్తాను” అని కదలబోతున్న తండ్రిని ఆపుతూ..

“అక్క కోసమేగా.. నేను చూసి వస్తాను. మీరు భోంచెయ్యిండి. బస్సు దిగే ఉంటుంది. నేనేం వెళ్ళను లేండి. గుమ్మంలోంచే చూస్తాను. మీరు కానివ్వండి” అనటంతో ఆయన భోజనానికుపక్రమించారు.

‘అమ్మయ్య’ అని గుండెల మీద చేతులేసుకొని బయటపడింది శ్యామల అక్క దగ్గరకు.

“అక్కా! అమ్మానాన్న చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడేం చేద్దాం?” అంది అక్క ప్రక్కనే కూర్చుంటూ.

“ఏం చెయ్యద్దు! అక్కకు బాగా జ్వరంగా ఉంది. ముసుగుతన్ని పడుకుంది. డిస్ట్రబ్ చెయ్యద్దంది అని చెప్పు చాలు” హింట్ ఇచ్చింది.

“అలా చెప్పేస్తే నమ్మేస్తారేమిటి? అమ్మ వచ్చి నీకెలా ఉందో చూస్తే కానీ ఊరుకోదే!”

“నువ్వెళ్ళవే మహాతల్లీ! అలా చెప్పు. ఏం జరుగదు. నాకు తెలుసుగా.”

“ఏమిటో..” అనుకుంటూ బయటకు వెళ్ళింది శ్యామల.

ఏ మూడ్‍లో ఉన్నారో పిల్లకు బాగోలేదు కదా అని ఊరుకున్నారా దంపతులు.

‘అమ్మయ్య’ అనుకున్నారు ఆ అక్కాచెల్లెళ్ళు.

వాళ్ళనుకున్నట్లు అది అంతం కాదు, ఆరంభం.

***

ఆ రోజు నుంచీ ఉత్తరాల కార్యక్రమం ప్రారంభమయింది. దానికి ఇంట్లో మరో సంగ్రామం జరిగింది. వీల్లేదు పొమ్మన్నారు. స్నేహితురాలి అడ్రస్ ఇచ్చి అక్కడకు ఉత్తరాలు వచ్చే ఏర్పాటు చేసుకుంది స్వర్ణ. శ్యామలకు మాత్రమే చెప్పింది. ఇంట్లో కాస్తంత సపోర్ట్ వచ్చేది ఆమె దగ్గరి నుంచే కాబట్టి.

అసలే భావుకుడు. అందులో ఉత్తరాలు రాయటంలో నేర్పరి. మధుకర్ తన లెటర్స్‌లో మధువుని నింపుతున్నాడేమో అనే అనుమానం వచ్చేది ఒక్కోసారి స్వర్ణకు. కాలం మారిందిగా, మన్మథుడు భాణాల బదులు ఉత్తరాల నెంచుకున్నాడు. మొదట్లో ‘స్నేహం’గా ఉన్న ఆ పరిచయం అతి కొద్ది రోజుల్లోనే ‘ప్రేమ’గా మారింది. అక్కడి నుంచే ‘మధుకర్’ అనే పదం వింటే చాలు, నాగస్వరం విన్న నాగుబాములా నాట్యామాడేది మనసు. పేపరు తీసినా, రేడియో విన్నా, టి.వి చూసినా ఆ పదం వినిపిస్తే చాలు చెవులు, కళ్ళు అప్పగించేసేది. వాళ్ళకెన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయో అని కుమిలిపోయేది. వాళ్ళూ మన లాంటి మనుషులే కదా! వాళ్ళని మాత్రం ఎందుకు దూరంగా ఉంచుతారు? వాళ్ళని ఎందుకు మన ఇళ్ళలోకి రానివ్వం? గుడిలోకి వెళ్ళకూడదంటారేం? మన చెరువుల్లో నీళ్ళు కూడా తాగనివ్వరేం? వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోరేం? ఎంత మంది అమ్మాయిలు బలి అయిపోతున్నా పట్టించుకోరేం? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఆమెలో ఆలోచనలను నిద్ర లేపేవి. దానికి తోడు మధుకర్ ఉత్తరాలలో, రాసే విషయాలు ఆమెకు కలిచివేసేవి.

ఊరి చివర చెరువు ప్రక్కనే మా ఇల్లు.. అదే మా గుడిసె.. దాహం, వేస్తే త్రాగడానికి చుక్క నీరు కూడా ఉండదు మా చెంత.. అదేమిటో పంచభూతాలూ అందరివే అంటారు. కానీ మేము మాత్రం వాటిని అనుభవించటానికి మాత్రం అందరి అనుమతీ తీసుకోవాల్సిందే! కాదంటే కడుపు కాల్చుకోవల్సిందే! దప్పికతో దాహం తీరక ఊపిరి ఆగిపోవల్సిందే! మా బ్రతుకులింతే!

చిన్నప్పుడే స్కూలు కెళ్తానంటే  ‘బాకీ ఉన్నాం రా!’ అంటూ అయ్య తనతో పాటు పనిలోకి తీస్కెళ్ళాడు. బడి అంటే తెలియకుండాపోయింది.

ఏదో సరస్వతి నా మీద చిన్నచూపు చూడకపోబట్టి అయ్యగారి పిల్లలు చదవుకొనేప్పుడు విని వంట బట్టించుకున్న చదువుతో పుస్తకాలని ఎవరూ చూడకుండా దాచుకొని చదివి ఇలా ఇంతచి వాడినయ్యా! ఇష్టమైన పుస్తకాన్ని కూడా మేము పబ్లిక్‌గా చదువుకోగూడదు. కానీ కానీ.. మా అక్కని ఇష్టపడ్డాడని అయ్యగారి కొడుకు అనగానే అప్పచెప్పేసిన మా అయ్యనేమనాలి? అన్యాయానికి అక్క బలి. తట్టుకోలేక ఊరి చివర ఆత్మహత్య చేసుకుంటే ‘కాని పని చేసుంటుంద’ని నింద దాని నెత్తినే రుద్దారు. ఇందులో ఎవరిది తప్పు? అంటూ ఆయన అడిగే ప్రశ్నలు సమంజసంగా అనిపించేవి. ఓదార్చుతూ సమాధానమిచ్చేది. రోజులు మారుతున్నాయి. ఇంకా మారుతాయి. మీరూ మాలో కలిసిపోయే రోజు వస్తుందని కమ్మటి కబుర్లు ఉత్తరాల్లో కుమ్మరిస్తోంది, కానీ నిజంగా అలా జరుగుతుందా?

అప్పుడప్పుడు శ్యామలతో భావాలు పంచుకొనేది.

అక్క మనసు అర్థమవుతున్నా తెలియనట్లే ఖండించేది.

“అక్కా! మనింట్లో అమ్మనే మనం మార్చలేకపోతున్నాం. అన్నయ్య తన పై ఆఫీసరు తప్పదంటే హాలులో భోజనం పెట్టింది. డైనింగ్ టేబుల్ మైలపడిపోయినంత పని చేసింది. ఇప్పటికీ దాని పైన భోజనం చెయ్యటం లేదు. దానిని బట్టి అర్థం చేసుకో!” అని సమాధాన మిచ్చేది.

అయినా స్వర్ణ మనసు ఒప్పుకోనేది కాదు. అసలు ఈ కుల మత బేధాలు, బీద, గొప్పల బేధాలు ఎందుకు? ఇలా ఎవరు సృష్టించారు? ఎందుకు విభజించారు? ఎవరో అలా చేసినా మనం ఎందుకు పాటించాలి? ఇప్పుడు వాటిని మనం మార్చుకోకూడదా? వాటిని తిరగరాయకూడదా?

ఆ ప్రశ్నలు ఆమె మెదడును తొలచటం ప్రారంభించాయి. వీటన్నింటికీ చరమ గీతం పాడాలనిపించింది. అది తనతోనే ఎందుకు ప్రారంభం కాకూడదని తనని తానే ప్రశ్నించుకుంది. మనసు అనుకూలంగానే సమాధాన మిచ్చింది. వెంటనే తన అభిప్రాయాన్ని ‘మధుకర్’కి తెలిపింది.

అన్నింటా అధికం అయిన ఆడపిల్ల.. అందమైన ఆడపిల్ల.. కలలో కూడా ఉహించని కానుక.. తనకు తానుగా వస్తానన్నా ఆలోచనల్లో పడ్డాడు. వద్దని హెచ్చరించాడు. ఆస్తి, అందం లేని తను ఆమెకు తగనని నచ్చ చెప్పాడు. అయినా స్వర్ణ ఊరుకోలేదు.

“అవన్నీ వద్దు.. నేను నీకు ఇష్టమేనా? మనమిద్దరం పెళ్లి చేసుకుందామా? యస్, ఆర్ నో, అవునా, కాదా రెండే మాటలు. వద్దంటే నా దారి నేను చూసుకుంటాను” అన్నదే ఆమె సమాధానం.

ఎటూ తేల్చుకోలేని పరిస్థితులలో సతమతమయ్యాడు.

కాదంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయం.

అవునంటే ఈ ప్రపంచం తామిద్దరినీ ప్రశాంతంగా బ్రతకనివ్వదని భయం. ఆ రోజు నుంచీ అతనికి నిద్ర కరువయ్యింది.

తనకిష్టం లేదని ఉత్తరం రాసేద్దామని, నిర్ణయించుకొన్న రోజునే ‘స్వర్ణ’ నుంచీ జాబు – నువ్వు కాదంటే కన్యగానే మిగిలిపోతానని. కలిసి మీ జాతి మేలుకి ఉద్యమంగా పాటు పడదామా లేక ఒంటరిగానే జీవనం గడపమంటావా అంటూ..

ఇక అప్పటిదాకా ఆనకట్ట దగ్గిర ఆగిన ఆలోచనలు.. అణిచి ఉంచిన ఊహలు ఉప్పెనలా ఉరికాయి. ‘స్వర్ణ’కు తన సమ్మతి జలసంగీతంలా వినిపించాడు. చిలుక, కోకిల ప్రక్క ప్రక్కన ఉంటే ఎలా ఉంటుంది అని వెక్కిరిస్తున్న మనసును బుజ్జగించాడు. చిలుక అందం మరింత పెరుగుతుందే కానీ కోకిల చిన్నబుచ్చుకొనేది కొత్తగా ఏం ఉండదని.

అగ్రకులంలో పుట్టి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడే ‘నువ్వు చచ్చినట్లు లెక్క’ అని కనిపెంచిన మమకారాన్ని కూడా మరచి ‘స్వర్ణ’ తన పెళ్ళి నిర్ణయాన్ని చెప్పిన మరుక్షణమే బయటకి పొమ్మన్నారు తల్లీ, తండ్రి. ఆమెను తాకితే ఎక్కడ మలిన పడతామో అనే భయం. శ్యామల మూగగా కిటికీ లోంచి చూస్తోంది. అక్కని ఇక తాము పూజించే భగవంతుడే అండగా నిలబడాలని అర్థిస్తూ..

ఇలాంటిది ముందే ఊహించిన మధుకర్ ఆమె చేతిని అందుకున్నాడు అపురూపంగా. ఆమె తలను తన హృదయానికి హత్తుకుంటూ మరి అది మల్లెపూవు కంటే స్వచ్ఛమైనది.. ఆ హృదయపు తోటలో ఆమె మహారాణి. ఆ ఒక్క హృదయానికే కాదు.. తాను చేరువవ్వదలచిన అందరికీ మహారాణి.

***

మధుకర్, స్వర్ణ – తాము అనుకున్నట్టుగా తోటివారి మేలు కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. వారిలో విశ్వాసం కలిగించారు. అందరిని కలుపుకుంటూ, అందరి మేలు కోసం పురోగతి దిశగా అడుగులు వేశారు.  వారి ప్రస్థానం కొనసాగుతునే ఉంది.

Exit mobile version