[dropcap]మ[/dropcap]నం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం!
ప్రేమ –
రెండక్షరాల తీయని మాట!
రెండక్షరాల మాయని గాయం!
రెండు హృదయాల ఆత్మీయ స్పందన
రెండు జీవితాల విశ్వాస బంధనం!
బొమ్మల పెళ్ళిలా
గుళ్ళో పెళ్ళయ్యాకా
యాంత్రికంగా పిల్లలను కన్నాం!
ఋణగ్రస్థులుగా
జీవితాన్ని ప్రారంభించాం!
అప్పుల వాళ్ళు యముళ్ళై
మన పరువును బజారు కీడ్చినప్పుడు
ఒకరి ఒళ్ళో ఒకరు బావురుమన్నాం!
నిద్రలేని రాత్రులు గడిపాం!
పది రూపాయల కోసం
ఇల్లంతా వెదికినప్పుడు
చిల్లర పైసలై మిగిలాం!
కాసుల కోసం కన్నీరై కరిగిన కాలం అది!
‘ఆదర్శం అన్నారు, అడుక్కుతుంటున్నారు’ అని
జనం ఆడిపోసుకున్న రోజులవి!
మరిప్పుడో –
సమాజంలో ఉన్నత శిఖరాలమై నిలిచాం!
ఆత్మవిశ్వాసానికి ప్రతీకలమై వెలుగుతున్నాం!
ఇప్పుడా నోళ్ళే –
ఆదర్శానికి ఆనవాళ్ళమంటున్నాయి
విజయానికి నిలువెత్తు సాక్ష్యాల మంటున్నాయి.
ప్రేమ –
కష్టాలనీ, కన్నీళ్ళను జయిస్తుందంటున్నాయి
జీవింపజేస్తుందని భరోసా యిస్తున్నాయి
మన పాదాక్రాంతమవుతున్నాయి.