ప్రేమ పరీక్షలు

30
2

[dropcap]“నా[/dropcap]కు తనంటే ప్రాణం. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీ ఆస్తి నాకవసరం లేదు. మీ అమ్మాయంటే నాకు గౌరవం, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నాది నిజమైన ప్రేమ. మా పెళ్ళికి మీరు రండి.” అని లేచి నిలబడి రెండు చేతులతో నమస్కారం చేసాడు.

చప్పట్లు కొడుతూ “నైస్.. ఎక్సెలెంట్, నాక్కావాలింది ఇదే” అన్న మాటలు విని అటు వేపు చూసిన రాజు ఆశ్చర్యంలో మునిగి పోయాడు.

***

దాదాపుగా ఒక సంవత్సరం కింద రాజు జీవితం ఏ మాత్రం ఊహించని మలుపు తిరిగింది..

చదువు పూర్తి కాగానే బాగా తెలివైన వాడు కావటంతో రాజుకి ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో ఇంజనీర్‍గా ఉద్యోగం దొరికింది. తన కిష్టమైన పని దొరకటంతో అందులో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ రెండు సంవత్సరాలలో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఎన్నో ప్రాజెక్టులను ఒకేసారిగా రాత్రనక పగలనకా పనిచేస్తూ యాజమాన్యం దృష్టి నాకర్షించాడు.

ఇంట్లో పెళ్లి సంబంధాలను చూడసాగారు. సరిగ్గా అదే సమయంలో రాజు ఎదురు చూడని సంఘటన జరిగింది.

ఆ రోజు ఎప్పటిలా తన కారులో ఆఫీసుకి వెళ్ళాడు రాజు. సాయంత్రం వరకూ ఊరికి దూరంగా వున్న సైటు మీద పని చూసుకుని, ఇంటికి బయలుదేరాడు. కొద్దీ దూరం ప్రయాణించాక సిటీలో రోడ్డు పక్కగా, ఒక కారు చుట్టూ చాలా మంది పోగయి నిలబడి ఉండటం గమనించి, తన కారుని ఆపి చూసాడు. ఒక ఆటోను గుద్దుకుని ఆగి వున్న కారు కనపడింది. కారు దిగి వెళ్లి చూసాడు. కారులో డ్రైవింగ్ సీట్‌లో ఒక యువతి స్టీరింగ్ మీదకు వాలిపోయి ఉంది. ఆమె తలనుండీ రక్తం కారుతూ వుంది. కొందరు భయంగా చూస్తున్నారు, మరికొందరు మొబైల్‌లో వీడియో తీస్తున్నారు.

“వెంటనే ఏదైనా హాస్పిటల్‍కి తీసుకెళ్ళాలి” అంటూ అరిచారెవరో, కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. లోన కనిపించే అమ్మాయిని చూసి, “జరగండి” అని చుట్టూ వున్న జనాలను తోసుకుని ముందుకెళ్లి కారు తలుపు లాగి, అమ్మాయిని చేతులతో పట్టుకుని బయటకు తెచ్చి, ఇంకొక వ్యక్తి సహాయంతో తన కారు వెనక సీటులో పడుకోబెట్టాడు. అంతలో ఎవరో ఒకావిడ చిన్న టవల్ రాజు చేతికిచ్చింది. అది తీసుకుని ఆ అమ్మాయి తలకు బలంగా కట్టి, వెంట మరో వ్యక్తిని కూర్చోపెట్టుకుని, కారుని వేగంగా తీసుకెళ్లి ఓ మల్టీస్పెషలిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం ముందు ఆపాడు.

వెంటనే స్ట్రెచర్ మీద అమ్మాయిని లోనికి తీసుకెళ్లారు అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది. తలకు తగిలిన గాయానికి కట్లు కట్టి, చికిత్స మొదలుపెట్టారు. ఒక నర్స్ హడావిడిగా వచ్చి ఓ చీటీ రాజు చేతిలో పెట్టి “ఈ మందులు తీసుకుని, కౌంటర్ లో ఫీజు కట్టండి” అని చెప్పి వెళ్లిపోయింది.

“తలకు దెబ్బ తగలటంతో షాక్‍లో వున్నారు. ప్రస్తుతం ఐ.సి.యు.లో ఉంచి, తలకు స్కానింగ్ అవీ చేయించాలి.” అని చెప్పాడు డాక్టర్.

అతని జీవితం సరిగ్గా అక్కడే మలుపు తిరగబోతుందని రాజు ఊహించలేదు.

ఆ రాత్రంతా కుర్చీలో కూర్చుని నిద్ర పోయాడు రాజు. అర్ధరాత్రి లేచి నిద్రపోతున్న అమ్మాయిని అద్దంలో నుండీ చూసి, వెళ్లి కారులో నిద్ర కొనసాగించాడు.

***

అదొక పెద్ద భవంతి, కె.యెన్.ఆర్. బిల్డర్స్ అధిపతి రఘురామ్, అతని భార్య సుజాత, ఇద్దరూ చెరొక ఫోన్ పట్టుకుని కూతురు స్నేహితులందరికీ ఫోన్లు చేస్తూ వున్నారు.

“అర్ధరాత్రి దాటింది. ఎటెళ్ళింది? ఫోన్ కూడా ఆన్సర్ చేయటం లేదు. స్నేహితులెవరి వద్దకు వెళ్లలేదు” అంది సుజాత విసుగ్గా.

“ఎటు వెళ్తోంది, ఎక్కడ్నించి వస్తోంది లాంటి విషయాలలో తల్లిగా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి” అన్నాడు రఘురామ్ కాస్త కోపంగా చిర్రు బుర్రులాడుతూ.

ఇంతలో రఘురామ్ ఫోనే మ్రోగింది. “చెప్పండి ఇన్‌స్పెక్టర్, నేనే” అన్నాడు రఘురామ్ కంగారుగా.

అటువేపునుండీ ఇన్‌స్పెక్టర్ చెప్పసాగాడు. అన్నీ విన్న రఘురామ్ “సరే, నేనొస్తున్నాను” అని పెట్టేసాడు.

“ఏమైందిట?” అడిగింది సుజాత.

“కారు ఆక్సిడెంట్ అయ్యి, రోడ్ పక్కన వుంది. అమ్మాయిని ఎవరో తీసుకుని వెళ్లారట. హాస్పిటల్స్ అన్నింటినీ కనుక్కుంటున్నారు. నే వెళ్ళొస్తా” అని లేచి బయటకు అడుగులు వేసాడు రఘురామ్.

***

ఉదయం అయిదు గంటలకు నిద్ర మెలకువ వచ్చి కారులో వెనక సీటుకయిన రక్తపు మరకలను తుడుస్తుండగా లేడీస్ బ్యాగ్ కనపడింది. ‘అరెరే ఇది ఆ అమ్మాయిది లాగుంది’ అనుకుని తీసి చూసాడు. కొన్ని డబ్బులు, బ్యాంకు కార్డ్స్, కొన్ని విజిటింగ్ కార్డ్స్ కనపడ్డాయి. ఒక ఖరీదైన మొబైల్ ఫోన్ కూడా వుంది. ఆ బ్యాగ్‍ని అలాగే తీసుకుని హాస్పిటల్ లోకి వెళ్ళాడు.

“పేషెంట్‌కి ఇంకా మెలకువ రాలేదు. మంచి నిద్రలో వుంది. అంతా బావుంది.” అని చెప్పింది సిస్టర్.

ఇంతలో బ్యాగులో వున్న ఫోన్ మ్రోగింది. వెంటనే ఫోన్ తీసి “హలో” అన్నాడు రాజు.

అవతలి నుండీ కంగారుగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి ఫోన్ తిరిగి బ్యాగులో పెట్టేసాడు.

కాసేపటిలో కంగారుగా లోనికి అడుగెడుతున్న తన కంపెనీ యజమానిని చూసి లేచి నిలబడి నమస్కారం చేసాడు రాజు.

“మీరేనా? ఇంకా ఎవరో అనుకున్నాను. రూప ఎక్కడ?” అన్నాడతను.

“ఐ.సి.యు.లో ఉన్నారు. రండి” అంటూ అటువేపు దారి తీసాడు రాజు.

అక్కడ రూపను చూసి, డాక్టర్‍తో మాట్లాడిన తర్వాత రాజు వేపు తిరిగి “థ్యాంక్ యు మిస్టర్ రాజు, మీరిక వెళ్లొచ్చు. మీకు ఖర్చయిన మొత్తం ఆఫీసులో తీసుకోండి” అని చెప్పి, పక్కనున్న ఇంకో వ్యక్తి వేపు చూపు మరల్చి “శర్మ గారు.. ఇతని ఖర్చులు చూసి ఇప్పించండి” అని చెప్పి డాక్టర్ గదిలోకి వెళ్ళాడు.

“ఓకే. థ్యాంక్ యూ. రేపు ఆఫీసులో కలవండి” అన్నాడు శర్మ, తన చేయి సాచి రాజు చేయి కలుపుతూ.

ఒక క్షణం విస్తుపోయిన రాజు తేరుకుని ‘‘సరే సర్’’ అని హాస్పిటల్ బయటకు వెళ్లిపోయాడు.

***

హాస్పిటల్ బెడ్ పైన పడుకున్న రూప దగ్గరకు వెళ్లి పక్కన నిలబడి కూతురి తల నిమిరి “నథింగ్ టు వర్రీ, అమ్మా, డాక్టర్‌తో మాట్లాడాను. రేపు డిశ్చార్జ్ చేస్తారుట. ఎలా వుంది ఇప్పుడు?” అన్నాడు రఘురామ్.

“తలంతా నొప్పిగా వుంది డాడీ” అని కళ్ళు మూసుకుంది రూప.

ఇంతలో సుజాత కూడా లోనికి అడుగు పెట్టి “అందుకే నీతో కూడా డ్రైవర్‍ను తీసుకెళ్లమని చెప్పాను” అంది కూతురి పక్కన కూర్చుని.

“నా బ్యాగ్ ఏదీ?” మెల్లిగా అడిగింది రూప.

“ఇదుగో ఇక్కడే వుంది” అంది సుజాత పక్కనున్న బ్యాగ్‌ను చూపించి.

“బ్యాంకు నుండీ డ్రా చేసిన పది లక్షలు వున్నాయి చూడమ్మా” అంది రూప.

బ్యాగ్ తీసుకుని లోపల వెదకి చూసి “లేవు కదా” అంది సుజాత.

“అదేంటి, కార్లో ఎక్కే ముందు నేనే పెట్టాను” అంది రూప.

“నిన్ను తీసుకొచ్చి ఇక్కడ చేర్పించినతను తీసి జాగ్రత్త చేసాడేమో” అంది సుజాత.

“సరే, అది నేను కనుక్కుంటాను” అన్నాడు రఘురామ్.

“ఎవరతను?” అంది రూప.

“మన కంపెనీ లోనే పని చేస్తున్నాడు సీనియర్ ఇంజనీర్, రాజు అని” సమాధానం చెప్పాడు రఘురామ్.

“నా తరఫున థాంక్స్ చెప్పండి డాడీ” అంది రూప.

***

మరుసటి రోజు రాజు ఉదయం ఆఫీసుకి వెళ్లి కూర్చోగానే అసిస్టెంట్ మేనేజర్ వచ్చి “చైర్మన్ గారు కలవమన్నారు” అని చెప్పి వెళ్ళాడు.

కేబిన్ తలుపు కాస్త నెట్టి “సర్ గుడ్ మార్నింగ్” అన్నాడు రాజు.

“వెరీ గుడ్ మార్నింగ్.. రండి.. కూర్చోండి” అన్నాడు రఘురామ్.

రాజు కూర్చున్న తర్వాత “ఓకే. రాజు అమ్మాయి బ్యాగులో డబ్బులు తీసి పెట్టారా?” అన్నాడు రఘురామ్

“చూసానండి. అందులోనే వున్నాయి. తీయలేదు. బ్యాగ్ మీతో వచ్చిన వారి చేతికిచ్చాను” అన్నాడు రాజు.

అది విని కాస్త ఇబ్బందిగా మొహం పెట్టాడు రఘురామ్.

“ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో లేవు” అన్నాడు రఘురామ్.

“లేదండి, నేను అందులోనే ఉంచేసాను” అన్నాడు రాజు. అతని కళ్ళలోకి సూటిగా కాసేపు చూసి “సరే మీరు వెళ్ళండి” అని చేతుల్లోకి పేపర్లు తీసుకుని చూడసాగాడు రఘురామ్.

రాజు బయటకు వెళ్ళగానే ఇంటర్‍కం నొక్కి “ఒకసారి రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రఘురామ్.

కాసేపటిలో లోనికి అడుగు పెట్టిన మేనేజర్ వేపు చూసి “ఈ రాజు, సీనియర్ ఇంజనీర్ ఎలాంటివాడు? ఏమీ లేదు.. నిన్న జరిగిన ప్రమాదంలో అమ్మాయి బ్యాగులో వుండే డబ్బులు కనపడటం లేదు. ఆ సమయంలో అతని చేతుల్లోనే బ్యాగ్ వుంది. అతడేమో నాకు తెలీదంటున్నాడు. ఏం చేద్దాం?” అడిగాడు.

“నేను ఒకసారి మాట్లాడతానండి. ఇచ్చాడా సరేసరి. లేదంటే పోలీస్ కేసు చేసి, ఉద్యోగం తీసేస్తే సరి” అన్నాడు మేనేజర్.

“నో నో.. నా ఉద్దేశం అది కాదు” అన్నాడు రఘురామ్ ఇబ్బందిగా మొహం పెట్టి.

ఇది జరిగిన కాసేపటికి ఓ బంట్రోతు రాజు దగ్గరకొచ్చి మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పింది విని కేబిన్ లోకి వెళ్ళాడు రాజు.

రాజుని చూసి నవ్వుతూ “కూర్చోండి రాజు గారు” అన్నాడు మేనేజర్.

“చెప్పండి సర్” అన్నాడు రాజు.

“రూప గారి బ్యాగులో కొన్ని డబ్బులున్నాయని చెప్పారు. మీరే కదా మేడంను జాయిన్ చేసింది. అందులో డబ్బులు తీసి జాగ్రత్త చేశారా?” అన్నాడు లేని నవ్వు తెచ్చుకుని.

విషయం అర్థం చేసుకున్న రాజు “చెప్పాను కదండి. అందులోనే వున్నాయి, నే చూసాను” అన్నాడు.

సూటిగా రాజు కళ్ల లోకి చూసిన మేనేజర్ “మిస్టర్ రాజు, మీరు జెంటిల్మెన్, మాకు తెలుసు. ఈ కంపెనీలో మంచి భవిష్యత్తు వుంది. ఆలోచించుకోండి” అని లేచి నుంచున్నాడు.

“నాకు అంతకంటే తెలీదండి. నే చూసినప్పుడున్నాయి” అన్నాడు రాజు కదలకుండా.

“మర్చిపోయుంటారు రాజు. ఎందుకీ గొడవలు అనవసరంగా. పోలీసులు అదీ..” అని ఆగాడు మేనేజర్

అది విన్న రాజు ఏమీ మాట్లాడ లేక బయటకు వెళ్ళిపోయాడు.

రఘురామ్ ఈ విషయం అంతా విని “ఆక్సిడెంట్ కేసు వగైరా లన్నీకాకుండా పోలీసులను మేనేజ్ చేసారుగా, డబ్బుల విషయం అదీ ఎలా చేద్దాం” అడిగాడు మేనేజర్ వంక చూసి సాలోచనగా.

“ఏమీ చేయలేం సార్. పోలీసుల దగ్గరకి వెళ్లి మళ్ళీ ఆక్సిడెంట్ కేసుని తిరగదోటం అవుతుంది. అతనితో రెసిగ్నేషన్ చేయించడమే” అన్నాడు మేనేజర్.

“అవును. మంచి వర్కర్ కావొచ్చు కానీ మనకు నిజాయితీ ముఖ్యం. చూడండి.. మీరేం చేస్తారో, చేయండి. సమయానికి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లాడు దానికి ప్రతిఫలం ఆ డబ్బులు అనుకుందాం మరి’’ అని నిట్టూర్చాడు రఘురామ్.

మధ్యాహ్నం సమయంలో రాజుని పిలిచి కూర్చోపెట్టుకున్నాడు మేనేజర్. “మీ సేవలు మాకు అవసరం అయినప్పుడు పిలుస్తాం. రేపటి నుండీ మీరు నోటీసు పీరియడ్‍లో వుంటారు. వేరే ఉద్యోగం మీకు దొరుకుతుంది లెండి.. మీకు రావలిసింది బకాయిలు అన్నీ సెటిల్ అవుతాయి. మీరిక వెళ్లొచ్చు, బెస్ట్ అఫ్ లక్.” అని చెప్తున్న మేనేజర్ వంక విస్మయంగా చూసి, బాధతో లేచి నిలబడి నమస్కారం పెట్టి వెళ్లి పోయాడు రాజు.

మరుసటి రోజు రఘురామ్ టిఫిన్ చేస్తుండగా మ్రోగుతున్న సెల్ తీసుకుని “హలో చెప్పండి శర్మ గారు” అన్నాడు.

అటువైపు నుండీ శర్మ చెప్పిన విషయం విని అవాక్కయ్యాడు రఘురామ్.

పొలమారిన గొంతు లోకి నీరు మింగి.”సరే సరే, నే చెప్తాను” అని ఫోన్ కట్ చేసి ఎదురుగా కూర్చున్న రూపను చూసి

“నీ పర్సు లోని డబ్బులు మన మూర్తి ఆ రోజు తీసి జాగ్రత్త చేసాడట. ఆ అబ్బాయిని అనుమానించి ఉద్యోగం లోనుండీ తీసేసాను” అన్నాడు విసుగ్గా.

“అయ్యో పాపం.. మళ్ళీ తీసుకోండి” అంది రూప జాలిగా.

“సరే ఆఫీసులో మేనేజర్‌కి చెప్తాను” అని లేచాడు రఘురామ్.

రఘురామ్ ఆఫీసుకు వెళ్ళగానే మొదట మేనేజర్‌ని పిలిచి టూకీగా విషయం చెప్పి “జరిగిన పొరపాటు సరిదిద్దండి” అన్నాడు.

అది విన్న మేనేజర్ ఇబ్బందిగా మొహం పెట్టి నిలబడ్డాడు. తండ్రితో పాటు ఆఫీసుకొచ్చిన రూప “అతని ఫోన్ నెంబర్ నాకివ్వండి” అంది.

కాసేపటికి నంబర్ రాసిచ్చిన పేపర్ తీసుకుని డయల్ చేయసాగింది రూప.

రెండవసారి రింగ్ కాగానే లేపి “హలో ఎవరూ?” అన్న రాజు గొంతు విన్న రూప “నేను రూప.. మీరు మీ ఆఫీసుకి రావొచ్చు. అన్నీ మర్చిపోయి మీరు ఇంతకు ముందులా పని చేయాలి రాజు గారు. ముందుగా నన్నొక సారి కలవండి” అంది.

అది విన్న రాజు ఆశ్చర్యంగా “సరే మేడం. అలాగే” అని అనగానే ఫోన్ కట్ అయ్యింది.

ఫోన్ వేపు ఒక సారి చూసి ఆనందంగా కళ్ళెగరేసాడు రాజు. ఆఫీసులోకి అడుగుపెట్టిన రాజుని చూసి అందరూ నవ్వుతూ పలకరించటం చూసి అయోమయానికి గురవుతూ రూప కేబిన్ తలుపు తట్టి లోనికి ప్రవేశించాడు.

తలెత్తి రాజుని చూసింది రూప. మంచి స్ఫురద్రూపం, ఆత్మవిశ్వాసం నిండిన చూపులు, గంభీరమైన స్వరంతో “గుడ్ మార్నింగ్ మేడం” అన్న అతడిని చూసి “ఎస్.. మీరు?” అంది.

“రాజు.. సీనియర్ ఇంజనీర్.. మీరు రమ్మన్నారుగా మేడం” అన్నాడు రాజు.

మెరుస్తున్న అతని కళ్ళను, ఆకర్షణీయమైన చూపులకు కాసేపు మాటలు రాక తడబడి “ఒకే.. ఒకే.. రండి. ప్లీజ్ కూర్చోండి” అంది ఎదురువేపున్న కుర్చీ వైపు సైగ చేసి.

“చెప్పండి మేడం. ఆ రోజు డబ్బులు మీ బ్యాగులోనే వున్నాయి. అవెలా పోయాయో నాకు తెలీదు. థిస్ ఈజ్ ట్రూత్” అన్నాడు రాజు.

“ఇట్స్ ఒకే. చిన్న పొరబాటు జరిగింది. మీరు ఆ విషయం మర్చిపోండి. అందులో మీ తప్పేమీ లేదు. మీరు మా సంస్థలో గౌరవనీయులైన ఉద్యోగి అని మాకు తెలుసు” అంది మాటల్లో సంజాయిషీ ధ్వనిస్తుండగా.

“నేనెంత చెప్పినా వినకుండా, నన్ను అవమానించి పంపించారండి. పైగా పోలీసులు వగైరా అంటూ..” అని చిరునవ్వుతో చెప్తున్న రాజు స్థితప్రజ్ఞతను చూసి అలాగే ఉండిపోయింది రూప.

“చెప్పానుగా, మీకు నేను సారీ చెప్తున్నాను’’ అంది సూటిగా.

ఆ మాటతో తేరుకున్న రాజు “పర్వాలేదండి’’ అని నవ్వాడు.

“ఒకే.. మీ టేబుల్ మీకై ఎదురు చూస్తూ వుంది, వెళ్తారుగా” అని నవ్వింది రూప.

“మీరు చెప్పారుగా. తప్పకుండా” అంటూ లేచి కేబిన్ నుండీ బయటకు వెళ్ళబోతుండగా రూప “వన్ మినిట్ రాజు గారు.. ఈ రోజు మీరు ఫ్రీ గా ఉన్నారా?” అని అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా “రాత్రికి మనం కలిసి డిన్నర్ చేద్దాం” అంది.

వెనక్కి తిరిగి చూసిన రాజు “అలాగే సంతోషంగా” అని చెప్పి బయటకు అడుగులు వేసాడు.

వెళ్తున్న అతడిని చూసి ‘గ్రేట్ పర్సనాలిటీ.. పాపం అనవసరంగా ఇతడిని అనుమానించి అవమానం చేశారు’ అనుకుంది మేనేజింగ్ డైరెక్టర్ రూప.

ఆ రోజు రాత్రి ఐటిసి హోటల్‍లో రూపతో కలిసి డిన్నర్ చేసాడు రాజు. అక్కడున్నంత సేపూ పెద్ద కంపెనీ యజమాని అన్నట్లుగా మాట్లాడలేదు రూప. ఏ మాత్రం దాపరికం లేకుండా మాట్లాడుతున్న రాజు వ్యక్తిత్వాన్ని గమనించిన రూప బేషజాలు వదిలేసి హాయిగా మాట్లాడుతూ కూర్చుండిపోయింది చాలా సేపు.

చాలా రోజుల తర్వాత తన అంతస్తుని పట్టించుకోకుండా ప్రశాంతంగా ఏ మాత్రం నాటకీయత లేకుండా స్నేహంగా వ్యవహరిస్తున్న రాజు మనసు రూపను బాగా ఆకట్టుకుంది. చాలా త్వరగా వారిద్దరి మధ్యా రోజు రోజుకి స్నేహం పెరిగి అది ప్రేమగా రూపు దిద్దుకోసాగింది. ఆఫీసులో అతనికి ప్రమోషన్ వచ్చి జనరల్ మేనేజర్‍గా మంచి అంతస్తుకి చేరుకున్నాడు.

అన్నీ తాను అనుకున్నట్లుగానే జరుగుతూ ఉండటం చూసి రాజు చాలా ఆనందంగా కలల్లో తేలిపోసాగాడు.

మొత్తానికి రాజు అంచనా వేసుకున్నట్లే ఒక రోజు సాయంకాలం రూప ఇంటి రూఫ్ గార్డెన్‍లో కూర్చొని ఇద్దరూ కాఫీ త్రాగుతుండగా వున్నట్లుండి అంది రూప “రాజూ.. నన్ను ప్రేమిస్తున్నావా?”

అది వినగానే రాజు త్రాగుతున్న కాఫీ గొంతులో పొరపొయి, దగ్గుతూ ఆశ్చర్యంతో రూపను చూసాడు. కళ్ళు ఆర్పకుండా రాజుని గమనించసాగింది. అలాగే రూప కళ్ళలో కనపడుతున్న ఆలోచనలను చదువుతూ తన చూపులతోనే అవునన్నట్లుగా సందేశాన్ని ఇచ్చాడు.

లేచి ముందుకు వంగి, రాజు చెంపలకు తన రెండు అరచేతులు తాకించి “నిజమా?” అని కళ్ళతోనే ప్రశ్నించింది రూప. చిరునవ్వే సమాధానంగా బదులిచ్చాడు రాజు.

“మరి.. పెళ్లి?” అంది గుసగుసగా అతని చెవుల్లో.

“నీవు ఆకాశం, నేను దిగంతం, సాధ్యమా?” అన్నాడు. అతని గొంతులో చప్పుడు లేదు, నిట్టూర్పు మాత్రమే బయటకు వచ్చింది.

“అది నేను చూసుకుంటానుగా” అంది మళ్ళీ. అతని చెవుల్లో ఆమె ఊపిరి తగులుతూ వుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. భూమీ ఆకాశం స్తంభించిపోయాయి.

బయట కారు గేటు నుండీ లోకొస్తున్న చప్పుడుతో ఇద్దరూ ఈ లోకం లోకి వచ్చారు.

“బాస్ వచ్చారు, నేనిక వెళ్తాను” అన్నాడు రాజు.

గేట్ బయటకెళ్ళి కాస్త దూరంలో కార్ ఆపి రూప బంగాళాను చూసి ‘ఇది త్వరలో నాది కాబోతుందన్న మాట’ అని అనుకుని మళ్ళీ కార్‌ను స్టార్ట్ చేసి ముందుకురికించాడు.

రాజు బంగాళా మెట్లు దిగి బయట కారెక్కి వెళ్తుండటం తన గది కిటికీ నుండీ చూసాడు రఘురామ్.

మరుసటి ఉదయం టిఫిన్ చేస్తుండగా “నాన్నా.. మీతో ఒక విషయం చెప్పాలి” అంది రూప.

“అదేమిటో నాకు తెలుసమ్మా.. కానీ మళ్ళీ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో” అని గంభీరంగా తింటున్న రఘురామ్‌ను చూసి “సరే నాన్నా” అంది. తండ్రి కూతుళ్ళ మధ్య చాల సేపు సంభాషణ కొనసాగింది.

***

ఒక నాటి సాయంకాలం ఎప్పటిలాగే రాజు ఐటీసీ హోటల్‍లో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చుని చేతికున్న వాచీని అసహనంగా చూసాడు. దాదాపుగా గంటనుండీ రూప కొరకు ఎదురు చూస్తున్నాడు. చాల సార్లు మొబైల్ తీసుకుని రూప నెంబర్ నొక్కాడు. అటునుండి స్విచ్ ఆఫ్ అని వస్తూ వుంది.

ఏమైందసలు? ఎందుకు రాలేదు? ఏం జరిగి ఉండొచ్చు? లాంటి ప్రశ్నలతో బుర్ర వేడెక్కి కళ్ళు మూసుకుని కణతలు నొక్కుకున్నాడు. అలా ఆలోచిస్తుండగా “ఎక్స్‌క్యూజ్ మీ” అన్న మధురమైన స్వరం విని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నాజూకుగా మెరుపు లాంటి అమ్మాయి బంగారు రంగులో మెరిసి పోతూ కనపడింది. అమ్మాయి అందం చూసి సంభ్రమానికి గురయ్యి కళ్ళార్పకుండా వుండిపోయాడు.

ఇంతలో తన చేతుల్లో వున్న మొబైల్ మ్రోగసాగింది. “హలో రూప, ఎక్కడున్నావసలు” అన్నాడు.

“సారీ రాజు. చాలా పనిలో వున్నా. మళ్ళీ చెప్తాను. రేపు కలుద్దాం. ఓకే?” అని ఫోన్ కట్ చేసింది.

“ఎక్స్‌క్యూజ్ మీ మిమ్మల్నే” అన్న ఆ అమ్మాయిని చూసి “చెప్పండి” అన్నాడు రాజు.

“టేబుల్స్ అన్నీ మొత్తంగా రిజర్వు అయిపోయాయి. మీరు ఒక్కరే వున్నారు కదా. మీతో టేబుల్ షేర్ చేసుకువచ్చా?” సౌమ్యంగా అడిగింది.

“దానిదేముందండి, నో ప్రాబ్లెమ్. నేనూ ఒక్కడినే” అన్నాడు ఆమె అందానికి ముగ్ధుడౌతూ.

“థ్యాంక్యూ, నా పేరు ప్రవల్లిక” అని కూర్చుంది అమ్మాయి.

“మీరు ఒక్కరేనా?” చిన్నగా చిరునవ్వుతో అడిగాడు రాజు.

“అవునండీ” అంది గమ్మత్తుగా చూసి.

“కాదు.. మీరెవరికొరకో ఎదురు చూస్తున్నారు” అన్నాడు.

“మరి మీరు?” అంది.

“ఈ రోజు పనులు త్వరగా అయిపోయాయి. ఇంటికెల్లితే ఏమీ తోచదు. అలా సరదాగా వచ్చాను” అన్నాడు చాలా జాగ్రత్తగా.

“ఏం బిజినెస్ చేస్తున్నారు?’’ అంది ప్రవల్లిక అతని కళ్ళలోకి సూటిగా చూసి.

“బిజినెస్ కాదు.. కంపెనీ.. జిఎం.” అని చెప్పి “మీరు?” అడిగాడు రాజు.

“నేను ఎంబీఏ పూర్తి చేసాను. మా నాన్నగారు చెప్తున్నారు కానీ నేనే ఇంకా బిజినెస్ చూడటం లేదు” అని నవ్వింది మళ్ళీ.

“మీ నాన్నగారు?” అని ఆగిపోయాడు

ప్రవల్లిక చెప్పింది విని ఉలిక్కిపడ్డాడు రాజు “ఓహ్ మై గాడ్.. గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కూతురా మీరు!”

వెనక్కి ఒరిగి కూర్చుని “ఎస్.. అవును” అంది.

“అయితే.. అందం మాత్రమే పుష్కలంగా ఉందనుకున్నాను” అని నవ్వాడు.

నవ్వులో అతని ఆకర్షణను గమనించి “థ్యాంక్యూ ఫర్ కాంప్లిమెంట్స్” అంది.

ఈ అమ్మాయి అంతస్తు, ఆస్తి ముందు రూప దిగదుడుపే అనుకున్నాడు.

“ఎలాగూ వచ్చారుగా.. డిన్నర్ చేద్దామా కలిసి” అన్నాడు రాజు మళ్ళీ తనదైన శైలిలో నవ్వి. ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటూ, మధ్యలో వ్యాపార విషయాలు మాట్లాడుకుంటూ రెండు గంటలు గడిపేశారు. వెళ్లే ముందు తన విజిటింగ్ కార్డు ప్రవల్లిక చేతిలో పెట్టి “మళ్ళీ ఎప్పుడు కలుస్తారు” అన్నాడు ప్రవల్లికకి షేక్‍హ్యాండ్ ఇస్తూ.

అతని స్నేహపూర్వకమైన స్పర్శతో ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. వెంటనే తేరుకుని “ఫోన్ చేస్తాను” అని తన ఫోర్బ్స్ కారెక్కి చేయి ఊపుతూ వెళ్లిపోయింది. ప్రవల్లిక వెళ్లిన కారు వేపే చూస్తూ నిలబడి ‘గ్రేట్ లేడీ’ అనుకుని సన్నగా ఈలవేసుకుంటూ కారు వేపు అడుగులు వేసాడు.

ఇంటికి వెళ్లి చాలా సంతోషంగా పడుకుని టీవీ చూస్తుండగా మ్రోగిన మొబైల్ తీసుకుని, కాలర్ ఎవరో చూడకుండానే, “హలో” అనగానే అటునుండి “హలో పడుకున్నారా?” అన్న తీయని గొంతు వినపడి “ఎవరూ రూపా?” అన్నాడు.

“అబ్బో అయితే మీ గర్ల్ ఫ్రెండ్ పేరు రూప అన్నమాట” అని కిలకిలా నవ్వింది ప్రవల్లిక.

“ఓహ్ మీరా.. అబ్బెబ్బే గర్ల్ ఫ్రెండ్ కాదండి. పర్సనల్ అసిస్టెంట్” అన్నాడు, అనవసరంగా రూప పేరు అడిగాను అనుకుని తల బాదుకుంటూ.

“నమ్మమంటారా?” అంది కిలకిలా మళ్ళీ ఒకసారి నవ్వి.

“నాకెవరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరండి” స్థిరంగా అన్నాడు ఈ సారి జాగ్రత్తగా.

“ఓకే ఓకే. మీరిచ్చిన డిన్నర్‌కి థ్యాంక్యూ, మీ కంపెనీకి కూడా” అంది ప్రవల్లిక.

“మీరు ఈ రోజు కలవటం నా అదృష్టం” అన్నాడు.

అలా మాట్లాడుతో ఉండిపోయారు, ఆ రాత్రి చాలా సేపు ఇద్దరూ నిద్ర పోలేదు.

మధ్యలో రెండు సార్లు రూప కాల్ చేయటం వెయిటింగ్‌లో ఉండటం గమనించాడు రాజు, కానీ పట్టించుకోకుండా ప్రవల్లికతో అలాగే కబుర్లు కొనసాగించాడు.

***

ఆ రోజు ఆదివారం ఆప్తమిత్రుడు చారి ఇంటిలో కూర్చుని టీ త్రాగుతూ రూప సంగతులు చెప్పసాగాడు రాజు.

అన్నీ విన్న చారి ఒక సారి విసుగ్గా రాజు కేసి చూసి “రూప నిన్ను ఇష్టపడింది, నిన్ను ప్రేమించింది, నీకు మొదటగా నచ్చింది. అంత డబ్బులున్న అమ్మాయి నిన్ను వివాహం చేసుకోవాలని అనుకోవటం నీ అదృష్టం. అది వదిలేసి మధ్యలో ఈ ప్రవల్లిక కథేంటో నాకర్థం కావటం లేదు. అసలు రూపను అంత త్వరగా ఎలా ఇంప్రెస్ చేసావో అర్థం కావటం లేదు” అన్నాడు.

“దానికి నేనొక తెలివైన పని చేసానులే. ప్రమాదం జరిగినప్పుడు నేనెక్కడికి వెళ్ళటం యాదృచ్ఛికమే అనుకో. కానీ అక్కడ రూపను గుర్తుపట్టాను. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి ప్రాణాపాయం లేకుండా చేసాను” అని చెప్పటం ఆపాడు.

“అదెవరైనా చేస్తారు. అందులో మీ బాస్ కూతురు కదా. దాంట్లో కిటుకు ఎక్కడ ఏడిచింది?” అన్నాడు చారి మరింత విసుగ్గా.

“తొందరపడకు. విను. మా బాస్‌కు ఫోన్ చేయకుండా వీలు అయినంత ఎక్కువ నేను రూప బాగోగులు చూసుకుని, ఎక్కువ గుడ్ విల్ కొట్టేద్దాం మా బాస్ దగ్గర అనే ఆలోచన వచ్చిందోయ్. అదే చేసాను. కానీ మా బాస్ అసలు నే చేసిన సహాయం పట్టించుకోలేదు. అయితే నా అదృష్టం నా వెంటే ఉంటుంది కదా. అక్కడే ఇంకో గమ్మత్తు జరిగింది. రూప బ్యాగులో బాగా డబ్బులు చూసాను. ఆ బ్యాగునలాగే శర్మ గారి మనిషి చేతికిచ్చాను. ఆ మనిషి ఆ డబ్బులను వేరేగా భద్రపరిచాడు. మా బాసుకి, రూపకు ఈ విషయం తెలీక నేనేదో తీసేశాననుకుని, నన్ను బెదిరించడం, నా ఉద్యోగం తీసేడం జరిగింది” అని ఆగి నవ్వటం మొదలెట్టాడు రాజు.

“నవ్వటం ఆపి తర్వాత ఏం జరిగిందో చెప్పి ఏడు” అన్నాడు చారి.

“ఏముంది, వారి డబ్బులు నేను తీయ లేదని తెలిసి, నన్ను మళ్ళీ పిలిచి ఉద్యోగం ఇవ్వడం, నేను విపరీతంగా కష్టపడి నా తెలివితేటలతో వారికి ఆరు నెలల్లో లాభాలు చూపించడం, ఈ మధ్యలో రూప నాతో సన్నిహితంగా మెలిగి, ప్రేమలో పడటం జరిగిపోయింది” అని నిట్టూర్చాడు రాజు.

“అంతా నీ అదృష్టం. మధ్యలో మళ్ళీ ఈ ప్రవల్లిక నీ వెంట పడటం ఏంటి. ఇదేమీ బాగాలేదు” అన్నాడు చారి.

“అది కూడా నా అదృష్టమే. రూప కంటే ప్రవల్లిక చాల రెట్లు ధనవంతురాలు. పైగా ఏకైక కుమార్తె. ఆస్తికి మొత్తం వారసురాలు” అని చారి కేసి భుజాలెగరేసి చూసాడు.

“అత్యాశ పనికి రాదు. పైగా ప్రేమలో నిజాయితీ అవసరం. ఈ విషయం ప్రవల్లికకు తెలుస్తే?” అన్నాడు చారి అసహనంగా.

“అందుకే ప్రవల్లికతో పెళ్లి విషయం మాట్లాడటానికి వాళ్ళింటికి వెళ్తున్నాను. ప్రవల్లిక నాన్నగారు నన్నొక సారి ఇంటికి రమ్మన్నారట. ఈ విషయం త్వరగా పూర్తి చేసుకోవాలి” అన్నాడు రాజు ఇంకో సిగరెట్ అంటించుకుంటూ.

“ఏమోరా బాబు. నీ ఇష్టం. ఇది సరైన పని కాదు. నువ్ తప్పు చేస్తున్నావు. డబ్బు మీద వ్యామోహం పనికి రాదు. మధ్య తరగతి వారెప్పుడూ నీతిని నిజాయితీని నమ్మాలి. అవే వారి బలం. అదే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇది మనం చూసాం కూడా. రూప నిన్ను నమ్మింది. చెప్పింది అర్థం చేసుకో” అన్నాడు చారి నచ్చచెప్తూ.

“ఒరేయ్.. కాస్త ఓపిక పట్టు. చూడు త్వరలో నేనెంత పెద్ద వ్యాపారవేత్తకు అల్లుడ్ని అయిపోతానో. అప్పుడు నువ్వే నా నిర్ణయాన్ని మెచ్చుకుంటావు” అని లేచి వెళ్లి తన కారులో ఉషారుగా కూర్చుని వేగంగా ఇంటి వేపు కదిలాడు. అలా వెళ్ళిపోతున్న రాజుని బాధగా చూస్తూ నిలబడి పోయాడు.

ఇంటికెళ్ళగానే రూప నుండీ వచ్చిన ఫోన్‌కు సమాధానం చెప్పసాగాడు రాజు. “ఏమీ లేదు రూపా, వేరే పనులతో కాస్త తీరిక లేకుండా వున్నాను. రేపు పనుంది, రేపు కలవలేను” అన్నాడు ప్రవల్లిక ఇంటికి వెళ్ళాల్సింది గుర్తొచ్చి.

సరేనంటూ ఫోన్ పెట్టేసి ఆలోచించుకుంటూ చాలా సేపు వాలు కుర్చీలో కూర్చుంది పోయింది రూప. భోజనం చేస్తూ రఘురామ్‌ని గమనించి ‘నాన్న అనుభవం నాకెప్పుడోస్తుందో?’ అనుకుంది.

“ఏంటమ్మా దీర్ఘాలోచన్లో మునిగిపోయావు?, ఏమైనా ప్రాబ్లెమా?” అన్నాడు రఘురామ్.

“ఏమీ లేదు నాన్నా” అని సర్దుకుని భోజనం కొనసాగించింది.

ఎప్పుడూ లేనంత మౌనంగా వున్నకూతురిని అర్థం చేసుకోవటానికి యత్నించాడు రఘురామ్.

***

ఆ ఉదయం రాజు చాలా సంతోషంగా వున్నాడు. అంతకు ముందే ప్రవల్లిక ఫోన్ చేసి “అన్నీ నాన్నతో చెప్పేసాను రాజు, నువ్వొచ్చి కాస్త జాగ్రత్తగా మాట్లాడితే చాలు. నాన్న కు నువ్వు నచ్చుతావులే” అంది.

ఒక సారి అద్దంలో తనను తాను పరికించి చూసుకున్నాడు రాజు. రూప గుర్తొచ్చి కాసేపు బాధగా అనిపించి ఆలోచించసాగాడు. రూప కంటే ప్రవల్లిక చాలా అందంగా వుంది. పైగా చాలా ఆస్తి, ధనం వున్న అమ్మాయి. రూప కూడా డబ్బులున్న అమ్మాయే, తనకు డబ్బులున్న అబ్బాయే దొరుకుతాడు అని మనసుకి, అంతరాత్మకీ సమాధానం చెప్పుకున్నాడు.

సరిగ్గా ప్రవల్లిక ఇంటికి బయలుదేరే సమయానికి మ్రోగిన ఫోన్ చూసి “హలో రూపా” అని బలవంతంగా నవ్వుతూ మాట్లాడాడు.

“ఒకసారి ఇంటికొస్తావా రాజు.. ఈ మధ్య మనం సరిగా కలవటం కుదరటం లేదు. నాన్నతో మన విషయం చెప్తే.. బావుంటుంది” అంది. ఆమె స్వరంలో ఆతృతగా తెలుస్తోంది.

“ఇప్పుడే వద్దు రూప. మా ఇంటిలో ఒప్పుకుంటారో లేదో నాకు కాస్త అనుమానంగా వుంది. తొందర వద్దు” అన్నాడు.

అది వినగానే రూప మనసు దిగంతాల్లోకి వెళ్లిపోయింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఫోన్ పెట్టేసింది రూప. దూరం నుండీ గమనిస్తున్న తండ్రిని చూసి జీవం లేని నవ్వు ఆమె మొహంలో కదిలింది.

***

ఆఫీసు నుండీ చాలా వేగంగా ప్రవల్లిక బంగాళా లోకి ప్రవేశించాడు రాజు. తలుపు దగ్గరకు రాగానే ఎదురు వచ్చిన ప్రవల్లికను చూడగానే రాజు మనసు సంతోషంతో నిండిపోయింది. చాల ఖరీదైన చీర, మెడలో డైమండ్ నెక్లెస్‍తో మెరిసిపోతూ వుంది ప్రవల్లిక.

‘వద్దు, ఇప్పటికైన వెనక్కి వెళ్ళిపో’ అంటున్న అంతరాత్మను గట్టిగా నొక్కి పట్టి అడుగు ముందుకేసి ప్రవల్లికకు చేయి అందించాడు రాజు.

రూప అమాయకమైన నవ్వు కళ్ళ ముందు కనపడింది. తల విదిలించాడు. కాసేపు అతని కళ్ళు మెరుపును కోల్పోయాయి. ప్రవల్లిక చేయి నుండీ తన చేయి విడిపించుకున్నాడు.

“కూర్చో రాజు” అని ప్రవల్లిక లోనికి వెళ్లి పోయింది. చుట్టూ గోడలకు తగిలించిన ఫోటోలను ఖరీదైన కళాఖండాలను చూస్తూ, పక్కనున్న కిటికీ నుండీ బయటకు చూస్తూ వున్నాడు.

ఇంతలో లోపల్నుండీ ప్రవల్లిక నాన్నగారు వస్తూనే “కూర్చోండి రాజు” అని సోఫా చూపించి, ప్రేమగా కూతురిని చూసి “నువ్వు కాసేపు అలా లోపలికి వెళితే బావుంటుంది” అన్నాడు.

తండ్రి అభిమానంగా చూసి “సరే నాన్నా” అని వెళ్లిపోయింది ప్రవల్లిక.

రాజు కుటుంబ విషయాలన్నీ అడిగి మరీ తెలుసుకున్నాడు ప్రవల్లిక తండ్రి. ఆయన ప్రశ్నలన్నిటికీ సంతోషంగా సమాధానం చెప్పడానికి యత్నించాడు రాజు.

“మా అమ్మాయి ఇష్టమే నాకు ముఖ్యం. మరి మీ ఇంట్లో పెద్దవాళ్ళు వస్తే మాట్లాడుతా బాబు” అన్నాడు ప్రవల్లిక తండ్రి.

ఒక వేపు రాజు మనసు ఆనందంతో ఉరకలు వేస్తూ వుంది, మరో వేపు దిగులుగా వుంది.

మౌనంగా కూర్చుని ఆలోచిస్తున్న రాజుని చూసి “ఎనీ ప్రాబ్లెమ్?” అన్నాడు.

“ఏమీ లేదండీ” అని మధ్యలో ఆగిపోయాడు.

“రాజు.. నాకు ప్రవల్లిక ఒకే కూతురు. నాకున్న వేల కోట్ల ఆస్తులు, ఫ్యాక్టరీలు, అన్నీ తనకే. భర్తగా అన్నీ నువ్వే చూసుకోవాలి. పెళ్లి కాగానే అన్నీ నీకే అప్పచెప్తాను” అన్నాడు.

అన్నీ వింటున్న రాజు తల అర్థం కానీ భావాలతో తిరిగి పోసాగింది.

“ఇంకా నీకేం కావాలో చెప్పు” అన్నాడు తిరిగి. లేచి నిలబడి చేతులు జోడించాడు రాజు.

“నాకేమీ అవసరం లేదండి. మీ అమ్మాయి బంగారం. నేనొక అమ్మాయిని ప్రేమించాను. నాకు ఆ అమ్మాయే కావాలి. నాతో కొంత పొరపాటు జరిగింది. మీరు నన్ను క్షమించాలి. ప్రవల్లికకు ఈ విషయం చెప్పలేక పోయాను.” అన్నాడు రాజు.

“అదేంటి.. ఇంత ధనవంతురాలయిన మా అమ్మాయిని ఎలా కాదంటున్నావో నాకు అర్థం కావటం లేదు.” అన్నాడు విస్మయంగా

“నాకు రూప ప్రాణం. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీ ఆస్తి నాకవసరం లేదు. మీ అమ్మాయంటే నాకు గౌరవం, మిమ్మల్నిఇబ్బంది పెట్టాను. ప్రవల్లికకు కూడా నా క్షమార్పణలు. రూపను వదులుకోలేను. మా పెళ్ళికి మీరు రండి” అని లేచి నిలబడి రెండు చేతులతో నమస్కారం చేసాడు.

చప్పట్లు కొడుతూ “నైస్.. ఎక్సెలెంట్, నాక్కావాలింది ఇదే” అన్న మాటలు విని అటు వేపు చూసిన రాజు, అక్కడ నిలబడి చూస్తున్న రూప కనపడటంతో ఆశ్చర్యంలో మునిగి పోయాడు.

“రూపా.. నువ్వా?” అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో.

“అవును రాజు, నేనే.. మా నాన్నకు నీ మీద నమ్మకం కుదరలేదు. అందుకనే మేమే ప్రవల్లికను నీకు పరిచయం అయ్యేలా చూసాము. మొత్తానికి నీవే గెలిచావు. మా నాన్న ఓడిపోయారు” అని వచ్చి రాజు చేయి పట్టుకుని ఇంటి బయటకు నడిచింది రూప.

రాజు పెళ్లి హంగూ ఆర్భాటాల మధ్యన అంగరంగ వైభోగంగా జరిగి పోయింది.

***

నెల రోజుల తర్వాత చారితో కూర్చుని సిగరెట్ తాగుతూ జరిగిందంతా చెప్పసాగాడు రాజు.

“ఏమైతేనేం నువ్వు నీ అంతరాత్మ మాట విని మేల్కొన్నావ్. అదే ముఖ్యం నాకు చాలా సంతోషంగా వుంది. మనసు ముఖ్యం. డబ్బులు కాదు.” అన్నాడు చారి మనస్ఫూర్తిగా రాజుని అభినందిస్తూ.

“నువ్వు చెప్పింది నిజమే కావచ్చు చారి. నేను ఇష్టపడడం కంటే ముందుగా రూప నన్ను ప్రేమించింది. తనను కాదనడానికి నాకు పెద్ద కారణాలు ఏమి కనిపించలేదు. అయితే రూపకంటే అందంగా ఇంకా ఆస్తి అంతస్తు ఎక్కువ ఉన్న ప్రవల్లిక నన్ను ఇష్టపడగానే నేను అటువైపు మొగ్గు చూపడం తప్పే కావచ్చు కానీ అది సహజం. ఏది తప్పు ఏది ఒప్పు అన్న మీమాంసలోనే నేను ప్రవల్లిక ఇంటికి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత నా అంతరాత్మ గోల ఎక్కువైంది.

 ఏం చేయాలో తెలియని డోలాయమానం పరిస్థితిలో పడిపోయాను. ఆ సమయంలో నన్ను ఒక్కడిని అక్కడ హాల్లో కాసేపు వదిలేశారు. ఏమీ తోచక నేను ఆ హాల్లో అటు ఇటు తిరుగుతూ కిటికీలోంచి వెనక వైపు చూసేసరికి అక్కడ రూప కారు కనిపించింది.

దాంతో నాలో ప్రమాద ఘంటికలు మోగడం మొదలైంది. అప్పుడు నా తెలివిని, అంతరాత్మను ఒకటి చేసి జాగ్రత్తగా మాట మార్చాను. ఆ రకంగా వాళ్ళు పెట్టిన పరీక్ష పాసయ్యాను అనుకో. అది అసలు విషయం” అంటూ చారి వైపు చూసి నవ్వాడు రాజు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here