ప్రేమ పరిమళం-1

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”అ[/dropcap]నిందితా! ఓ అమ్మాయ్, ఓమారిలారా!…” తల్లి వేస్తున్న కేకలేవీ గదిలో కిటికీ దగ్గర కుర్చీలో కూర్చున్నామెకు ఏ పిలుపులు వినిపించడం లేదు. ఏవేవో ఆలోచనలతో తదేకంగా బయటికి చూస్తుంది.

స్నానం చేయడానికి భుజంపై టవలేసుకొని బాత్ రూమ్ లోకెళ్ళుతున్న పాండురంగం ఓ క్షణం ఆగి గుమ్మంలో నుంచి కూతుర్ని ఓమారు తొంగి చూసి నెమ్మదిగా లోపలకి వచ్చాడు.

“అమ్మాయ్! అనితా, మీ అమ్మ వంటింట్లో నుంచి నిన్నెందుకో పిలుస్తుంది. నీవేమో పలుకడమే లేదు ఏమైందీ వేళ? ఇంకా రెడీ కాలేదు. డ్యూటీకెళ్ళవా తల్లీ?…”

కూతురు భుజంపై చెయ్యేసి, తండ్రి ఎంతో ఆప్యాయంగా పలుకరించడంతో అనిందిత ఒక్కమారుగా వులిక్కి పడింది.

దిగ్గున లేచిందామె. “అమ్మ పిలిచిందా? నాకస్సలు వినబడనే లేదునాన్నా!” కంగారుగా తత్తరపాటుతో అంది.

“నీవస్సలు ఈలోకంలో వుంటేగా తల్లీ! నీమనస్సు ఎక్కడో వుంది.”

“అవును నాన్నా! నాకస్సలు ఈరోజు మనస్సేం బాగలేదు.”

“నాకు తెలుసు తల్లీ నీబాధ. అందుకు కారణం ఈరోజు జూన్ 8వ తేదీయని కూడా నిన్ను చూశాకనే నాకు గుర్తుచ్చింది.”

“మనస్సంతా ఎంతో కలవరంగా, భయాందోళనలతో వుంది నాన్నా!” బేలగా అంటున్న ఆమె కంఠం ఓ క్షణం జీరబోయింది; కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.

“బాధపడకు; భయపడకు. గతాన్ని ఓ పీడకల లాగా మర్చిపోతే మంచిదని నేనెప్పుడూ చెప్పే మాటనే మళ్ళీ చెప్తున్నానిప్పుడు కూడా. ఆ ఆలోచనల్ని చెరిపేయ్. మనసు చెప్పిందల్లా మనం వినడం కాదు. మనం చెప్పినట్లుగానే మనస్సు వినేలా చేసుకోవాలి.”

“హు, అది మనలాంటి సామాన్యులకు సాధ్యమా నాన్నా? మహామహులైన ఋషులే కోపోద్రేకాలను జయించి మనస్సును తమ చెప్పు చేతుల్లో వుంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మనకు… ముఖ్యంగా మనలాంటి సామాన్యులకు అది చాలా అసాధ్యం నాన్నా!…”

“ఆ అసాధ్యాన్నే సుసాధ్యం చేసి చూపగలిగితే మన మెంతో ఉన్నతమైన భావాలతో ఓ మహాశక్తిగా ఎదుగుతాం

తల్లీ! నేనెప్పుడూ నిన్నో కోరిక తీర్చమని నేనడుగుతుంటాను కదా! నీకిప్పుడిది చాలా మంచి సమయం. ఖాళీగా కూర్చొని గతాన్ని తవ్వుకొని బాధ పడ్డంకన్నా… దొరికిన సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకో …. సివిల్స్‌కి మళ్ళీ ఓమారు ప్రిపేర్ అవ్వు తల్లీ! చదువులో పడితే నీకేవీ గుర్తుండదు.”

“మళ్ళీనా!?… ఇప్పటికే ఓమారు రాసి ఓడి పోయాను.”

“గెలుపు ఓటములు దైవాధీనాలు అనితా! పరాజయం గెలుపుకి మొదటి మెట్టుగా స్వీకరించి మరింత తీవ్ర కృషితో ప్రయత్నించి చూడు. ఈమారు తప్పకుండా విజయం నిన్ను వరించి తీరుతుంది. ఈ విషయాన్ని మనం మళ్ళీ ఓమారు తీరుబడిగా చర్చించుకుందాం. నాకిప్పుడు ఆఫీసుకి టైమ్ అవుతుంది. మీ అమ్మేందుకో పిలుస్తుందెళ్ళు” అంటూ ఆయన గబగబా బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.

అనిందిత మెల్లిగా లేచి వంటింటి వైపు వెళ్ళింది. తల్లి సుశీల వంట పనుల్లో చాలా హడావుడి పడుతున్న వైనం గ్రహించి “అమ్మా! సారీ, ఈ రోజు నీకు వంట పనుల్లో ఏం సాయం చేయలేకపోయాను…” సిగ్గు పడుతున్నట్లుగా అంది.

“అదేం లేదు తల్లీ! దీపుకి స్కూల్‌కి టైమ్ అవుతుంది కదా! ఇడ్లీలకీ కొబ్బరి పచ్చడి రుబ్బుతావని పిల్చానంతే… వంట ఎంతలో అవుతుంది? మీ నాన్న స్నానం చేసి, సంధ్య వార్చుకొనే లోపల అయిపోతుంది. రాత్రే నీవు వంటకి కావల్సిన కాయకూరలన్నీ తరిగి రెడీగా పెడ్తావుగా” అంటూ చట్నీకి పోపు చేయడానికి చిన్న గరిటెపొయ్యి మీదుంచి నూనె వేసింది.

అనిందిత పచ్చడి రుబ్బడానికి జారు పెట్టి మిక్సీ ఆన్ చేసింది.

“అక్కా ఓమారిలా రావా!” దీపు పిలుపుకి వంటింట్లో వున్న అనిందిత… రుబ్బిన పచ్చడి ఓ గిన్నెలోకి తీసి “అమ్మా, ఇక పోపేసేయ్ యిందులో. తమ్ముడెందుకో పిలుస్తున్నాడు నేనెళ్ళుతున్నాను…” అంటూ తల్లితో చెప్పేసి గదిలోకెళ్ళింది.

“ఏంటిరా దీపూ పిల్చావ్?”

“మరే అక్కా! ఇదిగో ఈ షర్ట్‌కి గుండి వూడి పోయింది. కాస్తా కుట్టిపెడుతావని పిల్చాను” నిక్కర్ బనియన్ వేసుకున్న దీపు అని పిలువబడే దీపక్ షర్ట్‌ను ఆమెకందించాడు.

“సరే, ఇలాతే కుడ్తాను” అంటూ అలమార తెరచి ఓ డబ్బా బయటికి తీసిందామె. అందులో నుంచి సూదీ, తెల్ల దారం తీసుకొని సరిపడ్డ తెల్ల బటన్ తీసుకొని గబగబా కుట్టేసింది. తమ్ముడికి తానే షర్ట్ తొడిగి… టక్ చేసి టై, బెల్ట్ పెట్టింది.

“అక్కా! ఆ చేత్తోనే నా ముఖానికి కాస్తా పౌడర్ రుద్ది తలదువ్వవా?” అని అడుగుతున్న దీపు వంక చిన్నగా నవ్వుతూ చూసింది.

“నీవే తెల్లటిరంగులో మల్లె పూవులా వున్నావ్! ఇక నీకు పౌడరెందుకురా?”

“అక్కా! ప్లీజ్, పౌడర్ వేయక్కా! అయినా, నీకంటే కూడా నేనేం తెల్లటి తెలుపు కాదుకదా?”

“మరే… నీవిక వదలవుగా” అంటూ వాడడిగిన ఆ రెండు పనులు చేసి “వెళ్ళు… ముందు స్కూల్ బ్యాగ్ సర్దుకో. అమ్మ టిఫిన్ బాక్స్ యిస్తుంది” అంటూ తాను స్నానానికెళ్ళడానికి అలమరా తెరిచి బట్టలు తీసుకోసాగిందామె.

అర్ధగంట గడిచేక ముగ్గురూ ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. ముందుగా అనిందిత స్కూటీ స్టాట్  చేసి నాన్నకు, తమ్ముడికి బై చెప్పి రయ్యిన ముందుకు కదిలింది.

పాండురంగం స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నకొడుకును బైక్‌పై వెనుక ఎక్కించుకొని స్టార్ట్ చేశాడు.

గుమ్మంలో నిల్చున్నతల్లికి దీపు బై చెప్పుతూనే వున్నాడు.

తమ యింటినుంచి అనిందిత ఉద్యోగం నిమిత్తం వెళ్ళే ఊరు ‘పుష్పాల గూడం’, ఆరు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. తాను ఊరి గ్రామ కార్యదర్శిగా సంవత్సరం నుంచి పని చేస్తుంది. గవర్నమెంట్ జాబాయె! అనిందిత ఆ ఊరెళ్ళాకక్కడి ఊరి వారందరితో మంచి పేరు తెచ్చుకుంది. ఉత్తమ మండలి సెక్రటరీగా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డ్ కూడా అందుకుంది. ఆ ఊరి సర్పంచ్ లలితాంబ, ఉప సర్పంచ్ రాయప్ప వాళ్ళకి కూడా అనిందిత అంటే అంతులేని ఆత్మీయత, ప్రేమాభిమానాలు మెండు. ఆ ఊరిలోని సకల జనులంతా ఒకటై కలిసికట్టుగా మధ్యమధ్య గ్రామసభలు నిర్వహించుకుంటూ ఎన్నెన్నో అంశాలతో కూడుకున్న పల్లె ప్రగతి సాధించారు. ముఖ్యంగా సెక్రటరీ మాటలంటే అక్కడి ఎమ్.పి.ఓ. జగన్నాథం గారికి కూడా మంచి అభిప్రాయముంది.

***

దొరస్వామి పొలానికెళ్ళడానికి తయారయి బయటి కొచ్చి వాకిట్లోవున్న చెప్పులేసుకోబోతున్నవాడల్లా చటుక్కున ఏదో గుర్తుకొచ్చి మళ్ళీ గిరుక్కున వెనుదిరిగి లోపలికి వచ్చి “ఏమేవ్…” అంటూ భార్యని కేకేసి పిలుస్తూ వంటింటివైపు వెళ్ళాడు.

“ఏంటయ్యా?… ” అంటూ లలితాంబ భర్తకు ఎదురొచ్చింది.

“మన ఊరి డంపింగ్ యార్డ్‌లో ఈ మధ్య ఎరువు బాగానే తయారవుతుంది కదా! మన పండ్ల తోటకి పనికొస్తుంది యిస్తారా?” భార్యవైపు ఎగాదిగా చూస్తూ అడిగాడాయన.

“అలా మనం తీసుకోవడానికి ఎలా వీలవుతుంది?

“ఏం, ఎందుకు వీలు కాదు? మనమేం ఊరికే తీసుకోవడం లేదుగా… గ్రామ పంచాయితీకి డబ్బులిద్దాం.”

“ఆ ఎరువు మాకే కావాలండీ, నాటిన మొక్కలకేయడానికి.”

“పోయిన నెల్లోనే కదా, మీరు చెట్లకి ఎరువేసింది. మళ్ళీ  ఈ నెల్లో కూడా వేస్తారా? మరీ అంతలా నెల నెలా ఎరువేయగూడదే పిచ్చి మొద్దూ! ముందుగా ఈ విషయాన్ని మీ చిన్నమేడాన్ని అడుగు. మనం ఆ ఎరువుకిచ్చే డబ్బు గ్రామ పంచాయితీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాను…” అంటూ మరో మాటకైనా ఎదురు చూడకుండా వెళ్ళి పోతున్నాయనకు  వాకిట్లోనే ఎదురైంది సత్యవతి.

“ఏంటన్నా, పొలానికేనా పోతా?”

“ఆ, అవునమ్మా. మీ వదినుందింట్లో వెళ్ళు”

“అది కాదన్నా! నీవు కూడా వుండి విషయం వింటే బాగుండ్ను. మీయిద్దరి ముందే మాట్లాడానికే వచ్చాను”

“ఏం ఫర్వాలేదమ్మా. మాపటేళ్ళకు పొలం కాడి నుంచి యింటికొచ్చాక, మీ వదిన నాకు చెప్తుందిలే…”అంటూ దొరస్వామి ఆదరా బాదరగా వెళ్ళిపోయాడు.

“వదినె! ఓ లలితమ్మోదినె”అని గట్టిగా పిలుస్త సత్యవతి వసారాలోకి అడుగెట్టింది.

“రా, రా సత్యవతీ! ఉదయాన్నే ఇలా వచ్చావేం?”

“నీతో అన్నతో మాట్లాడుదామనే వచ్చాను.”

“ఏ విషయం సత్యవతీ?”

“అదే మా అబ్బాయ్ సంగతి.”

“ఏం, మీ అబ్బాయ్‌కి ఏమైంది? బాగానేవున్నాడుగా”

“అదికాదొదినె! వాడికేం బాగానే నిక్షేపంలా వున్నాడమ్మా, నన్ను కాల్చుక తింటూ…” చికాకుగా అందామె.

“అంతలా కొడుకు మీద నీకెందుకు కోపం వచ్చిందమ్మా?” నవ్వుతూ అడుగుతూ టేబులుపై జల్లెడలో వున్న గోకరకాయలు ముందేసుకొని కింద కూర్చొని, వాటి నార తీసి ముక్కలు చేయసాగిందామె.

“ఇంకా వంట కాలేదా వదినె?” అంటూ తాను కూడా కింద చతికిలబడి చేతిలోకి కొన్ని గోకరకాయల్ని తీసుకొని వలవసాగింది సత్యవతి.

“ఈరోజు కొంచెం పొద్దుపోయి లేచాను. దానికి తోడు శంకరి పనిలోకి రాలేదు. మీ అన్నకేమో రాగి సంకటి చేసి యిచ్చాను. మామిడికాయ తొక్కుతో నంజుకొని తిని పొలానికెళ్ళాడు. ఇక యిప్పుడు చెప్పు విషయమేమిటో?”

“మావాడికి నాల్గు ఐదు సంబంధాలు వచ్చిన విషయం నీకెరుకేకదా వదినె! ఏదీ కుదరడం లేదు. నాకు వీడి లగ్గం  సంగతి తల్చుకునే సరికి బయంతో బుగులవుతుందొదినె!”

“నీ పిచ్చిగానీ ఎందుకంత దిగులు సత్యవతీ? కల్యాణ ఘడియలు తోసుకొస్తే, ఏదీ ఆగదు.”

“అదికాదొదినె! మొన్నీమధ్య మేడారం నుంచి ఓ సంబంధం వచ్చిందని నీకెరుకేకదా! పిల్లని చూడనికే రమ్మని వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. పెళ్ళిచూపులకు వెళ్ళుదాం అంటే వీడు రానంటున్నాడు. పెళ్ళివాళ్ళకి ఏం జవాబు చెప్పాలో  నాకు తోచడం లేదు. మీ మొగుడు పెళ్ళాలు ఏమన్నవాడికి నచ్చజెప్పుతారేమోనని నా ఆశ వదినెమ్మా !….అందుకనే ఇలా వచ్చాను.”

“మరి పెళ్ళిచూపులకు ఎందుకు రానంటున్నాడు?

“ఏముంది? పాతపాటే.. ‘నాకందం లేదు. నేను కారునలుపు. నన్నే పిల్లా మెచ్చదు. నాకు పెళ్ళే వద్దు. నన్నిలా వుండనీ. నేనిక ఏ పిల్లను చూడను’ అంటూ భీష్మించుకొని కూకున్నాడు” కొడుకన్న మాటలు చెప్తూ సత్యవతి కళ్ళనీరు తుడుచుకొంది.

“బాధ పడకు సత్యవతీ! నేను మీ అన్న మాపటేళ్ళకింటికొచ్చి అతనికి నచ్చజెప్పుతాంలే. నీ కొడుక్కి అందం లేకపోతేనేం? బంగారులాంటి  అందమైన గుణము వుంది. ఆ గుణానికి విలువనిచ్చి మెచ్చిన పిల్లే నీకోడలుగా వస్తుందిలే.”

“ఈనాడవి ఎవరు చూస్తారొదినె!  పెళ్ళికొడుకు అందంగా ఎర్రగా బుర్రగా వున్నాడా లేదా? ఉద్యోగం చేస్తున్నాడా లేదా? అంతో ఇంతో ఆస్తిపాస్తులున్నాయా లేవా? కొంపా గోడున్నాయా లేవా? ఇవే కావాలి. అందునా ఆ బగవంతుడు వాడికి నాలా కొంచెం తెల్లతోలిచ్చింటే ఏమైయేది? పూర్తిగా తండ్రిది జీడిగింజ రంగే వీడికొచ్చింది. అంతా  నా ప్రారబ్దం… నాతలరాత” పైటకొంగుతో పదేపదే కళ్ళు తుడుచుకోసాగిందావిడ.

“ఊర్కో, ఏడవకు సత్యవతీ! నీవనుకున్నట్లుగా ఏమీ కాదు. నీవు మీ ఆయన్ని ఎలా మెచ్చి పెళ్ళాడావో అలాగే నీ కొడుకుని కూడా చేసుకోవడానికి యాడనో ఓచోట పిల్ల పుట్టే వుంటుంది. కొంచెం టైమ్ కావాలంతే! నేను మీ అన్న మీ ఇంటికాడికొచ్చి, నీ కొడుక్కి సర్ది చెప్పి పెళ్ళి చూపులకు వెళ్ళేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తాం సరేనా?”

“ఆ పుణ్యం కట్టుకోండి వదినె మీ ఆలుమగలు. వాడి నాన్న చిన్నతనంలోనే చనిపోతే, వీడ్ని పెంచి పెద్ద చేయడానికి నేను ఎన్నెన్ని అష్టకష్టాలు పడ్డానో ఎవరికెరుక? నేను తిన్నా తినకపోయినా వాడి కడుపు నింపి ప్రేమతో పెంచాను. నా శక్తినంతా ధారపోసిన కష్టంతో నాల్గు డబ్బులు సంపాదించి  పెంచి పెద్ద చేసి, చదువు సంధ్యలు చెప్పించాను. ఈనాడు ఏదో కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని  నాల్గురాళ్ళు తెస్తున్నందుకే  కదా… వాడికి పెళ్ళి చేయాలని నేను తాపత్రయం పడ్డంలో తప్పేముంది వదినె!?”

“నీదేం తప్పులేదు. ఉద్యోగంతో పాటు వార్డ్ మెంబర్లల అంగీకారంతో నీ కొడుకీ నాడు ఉపసర్పంచ్‌గా కూడా ఎన్నుకోబడి గ్రామాభివృద్ధికి మా అందరితో పాటు కల్సి  మంచి మంచి పనులు కూడా  చేస్తున్నాడాయె!…”

“ఏమో, అవేం నాకు తెలియదు వదినెమ్మా. మీరు మాత్రం వాడ్ని పెళ్ళిచూపులకి వెళ్ళడానికి మాత్రం తప్పకుండా ఒప్పించి తీరాల్సిందే “అంటూ సత్యవతి వెళ్ళడాన్కి లేచింది.

“నీవే చూస్తావుగా! మా ప్రయత్నంలో లోపం వుండదులే… నీ కొడుకు పెళ్ళిచూపులకువెళ్ళి తీరాల్సిందే” అని నవ్వుతూ గోకరకాయ ఏరిన జల్లెడ తీసుకొని తాను కూడా వంటింటి వైపు వెళ్ళింది లలితాంబ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here