Site icon Sanchika

ప్రేమ పరిమళం-10

[dropcap]”హ[/dropcap]లో, నాన్నా! బాగున్నారా?”

“అంతా బాగే. ప్రస్తుతం అరుణాచలం వచ్చాం అనితా! గిరి ప్రదక్షణం చేసుకున్నాం. గిరి చుట్టుతా ఎన్నో శివుని గుళ్ళు వున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి కుబేరుని లింగం. ఈ లింగంపై డబ్బులు అభిషేకం చేసి అవి తెచ్చి యింట్లో పెట్టుకుంటే, బోలడన్నీ డబ్బులు మన దగ్గర వుంటాయట. అక్కడివారి నమ్మకం. ఆ తర్వాత మోక్షద్వారంలో ఒక వైపునుంచి లోనికి ప్రవేశించి బయటికి రావాలి. ఇలాంటివి ఆ అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షణ చేస్తుంటే ఎన్నెన్నో గుళ్ళు కనిపిస్తాయి. అరుణాచలేశ్వరిడిని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం.”

“మరి రమణమహర్షి ఆశ్రమం చూశారా?”

“ఈ రోజు అక్కడికే వెళ్ళాం. ఇక్కడే వుండి పోతే బాగుండ్ను అనుపించింది. ఉండాలనుకునేవారికీ ఎలాంటి యిబ్బందీ లేదు. ఉదయం, సాయంత్రం ధ్యానమందిరంలో కూర్చొని మెరిటేషన్ చేసుకోవచ్చు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం, అటు ఇటు తిరగడంలో మాకు టైమే తెలియలేదు. ఇక్కడ గ్రంథాలయం కూడా వుంది. ఇక్కడి విషయాలన్నీ నేను సరిగ్గా వర్ణించి చెప్పలేనుగానీ, నీకోసం కొన్ని బుక్స్ కొని తెస్తాను. నీవు పుస్తకాలు చదువుతావు కదా?”

“అవును నాన్నా! తీసుక రండి. రమణమహర్షి జీవిత చరిత్ర కూడా కొని పట్రాండి”

“తప్పకుండా తెస్తాను. ఈ గిరిని ఎంతో మంది ఋషులు… మహాత్ములు సేవించినప్పటికి భగవాన్ రమణ మహర్షులవారు 1896 సెప్టంబర్ నెలలో ఇక్కడికీ మంగళ ప్రదంగా కాలుపెట్టినప్పటినుంచి ఈ గిరి వైభవం, విభూతులు, విశ్వవిఖ్యాతి చెందసాగాయట. మనిషికి వెన్నెముక ఎలాగో ఈ విశ్వానికి ఈగిరి అలాగని ఉదహరించారు. ఎన్నెన్నో విధాలుగా ఈ అరుణాచల తత్వాన్ని వర్ణించారు రమణులు. వారిక్కడ జీవించిన యాభై సంవత్సరాలకి పైగా అయినప్పటికి ఎన్నడూ ఎప్పుడూ ఈ క్షేత్రాన్ని దాటి వెళ్ళలేదట. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ముఖ్య పట్టణానికి కూడా కొండగా దర్శనమిచ్చే అరుణాచలం శివుడే కేంద్రబిందు వంటారు. చుట్టుపక్కల ఏ ప్రాంతం నుంచి దీన్ని చేరుకునే వారికై ఇరువై ముప్ఫై మీటర్ల దూరం నుంచే తన దివ్య దర్శనంతో కన్నుల పండుగ చేసి ఆకర్షిస్తుంది. ఇంచు మించు రెండు వేలపైగానే అడుగుల ఎత్తులో చుట్టుపక్కల వున్న కొండలను మించి ఉంటుందీ గిరి. అరుణాచలంలో పవిత్రమైన భాగం కానిదంటూ లేదు. ప్రతీ అణువూ పవిత్రమే, అంతా శివమయమే… అంటారు రమణులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో వుంది అనిందితా!”

“నాన్నా! అక్కడి విషయాలు ఏవీ వర్ణించి చెప్పలేనన్న మీరే ఇందాక అన్నారు. కాని చాలా బాగా చక్కగా చెప్పారు” తండ్రిని మెచ్చుకుంది అనిందిత.

“అవునా తల్లీ!” చిన్నగా నవ్వాడాయన.

“మర్చిపోకుండా కొన్ని బుక్స్ తెండి నాన్నా!”

“తెస్తాను. చాలా టైమ్ అయిందికదా! పండుకో తల్లీ… గుడ్ నైట్!”

“మరి మీరిక్కడినుంచి ఎటు వెళ్ళుతారు నాన్నా?”

“వేలూరు వెళ్ళుతాం. అక్కడ బంగారు దేవాలయాన్ని చూసి, ఆ మహాలక్ష్మి మాతను దర్శించుకొని, అక్కడి నుంచి కాంచీపురం వస్తాం”

“సరే నాన్నా! గుడ్ నైట్” ఫోన్ పెట్టేసి చదువులో పడిందామె.

***

విశాలమైన అనాథ బాలల ఆశ్రమ ఆవరణంలో ఆగగానే ఆయమ్మలిద్దరూ గబగబా బయటికొచ్చి చూశారు.

కార్లో నుంచి హుందాగా దిగుతున్న అతన్ని చూసీ చూడగానే, వాళ్ళ ముఖాలు ఆనందంతో వికసించాయి. మళ్ళీ వాళ్ళు లోపలికి ఆఫీస్ రూమ్‌లో కూర్చున్న శారదాదేవిగారి దగ్గరికెళ్ళి “మేడమ్! మన బాబుగారు వస్తున్నారు” అంటూ సంతోషంతో చెప్పారు.

“అవునా? కనీసం ఫోన్ కూడా చేయలేదే వస్తున్నట్లుగా…” తనలో తాను అనుకున్నట్లుగా అంటూ నవ్వు ముఖంతో కుర్చీలో నుంచి లేచిన ఆవిడ రెండు మూడు అడుగులేసింది.

అంతలోనే అతను లోపలికి రానే వచ్చాడు. వస్తూనే శారదాదేవికి పాదాభివందనం చేసి “అమ్మా! మీరెలా వున్నారు?” ఆప్యాయంగా పలుకరించి చెయ్యిపట్టుకొని తీసికెళ్ళి మళ్ళీ ఆవిడ్ని తన కుర్చీలో ఆసీనురాలిని చేశాడు.

“నేను బాగానే వున్నాను. నీవెలా వున్నావ్ ప్రేమ్? జిల్లా అధికారివైనావ్?”

“అదంతా మీ చలవే అమ్మా! ఈ అనాథ ఆశ్రమమే నా స్వంతిల్లు. మా అమ్మే మీరు. మీ ఆశీర్వాదం… మీ అండ దండలు, మీ ప్రేమానురాగాలు లేకుంటే నేనింతటి వాడ్ని ఎలా అయ్యే వాడినమ్మా?”

“నీవెప్పుడూ అనే మాటే అది. నీ యొక్క వినయవిధేతలు, సేవా తత్పరత, తెలివితేటలు, అకుంఠిత దీక్ష మున్నగునవి అపారంగా వున్నాయి కాబట్టి, నీవీనాడు ఇంతటి వున్నతస్థాయిలో వుండగలిగినావు. యిందులో నా గొప్పతనమేమీ లేదుగానీ, నీవేమిటి ఈమధ్య ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు..” కొంచెం నిష్ఠూరంగా అందావిడ.

“కార్యాలయంలో పనుల ఒత్తిడిల్లో చాలా బిజీగా వున్నానమ్మా. ఈరోజు ఎలాగో కాస్త తీరిక చేసుకొని రాగలిగాను.”

“ప్రజలకు బాగా సేవ చేస్తున్నట్లున్నావ్. ఈ అనతికాలంలోనే నీ గురించి పత్రికల్లో చాలా గొప్పగా రాస్తున్నారు, ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.”

“అంతా మీ దయ. మీ కరుణాకటాక్షల వల్లె…”అంటూ నవ్వి

“మన పిల్లలంతా ఎలా వున్నారు? మీ ఆరోగ్యం బాగుందా?” అంటూ కుశల ప్రశ్నలు వేయసాగాడు.

“ముందు నీవీలా కూర్చో ప్రేమ్!” ఆవిడ ఆప్యాయంగా ఆదేశించింది. అప్పుడు కూర్చున్నాడతను.

ఇంతలో డ్రైవర్ కార్లోనుంచి పళ్ళ బుట్టలు, స్వీట్స్ పాకెట్స్ అన్నీ పట్టుకొచ్చి ఒక్కొక్కటి ఆఫీస్ రూమ్‌లో ఓపక్క గోడవారగా పొందికగా పెట్టసాగాడు.

“ఇన్ని తెచ్చావేమిటి ప్రేమ్?” అంటూ ఆవిడ ఆశ్చర్యంగా చూడసాగింది.

“ఏం ఫర్వాలేదమ్మా. ఎక్కువేం కాదు, పిల్లలు తింటారు. ఆయమ్మలతో పాటు అందరికీ పంచండి.”

“ప్రభుత్వం వారిచ్చిన నీ బంగళాలో ఒంటరిగా ఎలా వుంటున్నావో! తొందరగా నీకు నచ్చిన అమ్మాయిని ఎక్కడన్నా చూసి పెళ్ళి చేసుకో. లేకపోతే మంచి సంబంధం నన్ను చూడమంటావా? వచ్చే మన ఆశ్రమ వార్షికోత్సవానికి నీవు ఒంటరిగా కాక జంటగా రావాలి చూడు, గుర్తుంచుకో ప్రేమ్!”

“ఆజ్ఞాపిస్తున్నారా అమ్మా?” చిన్నగా నవ్వి “మీ ఆశీర్వాద బలముంటే అలాగే జరుగుతుంది లెండి. ప్రస్తుతం నాకు మా డ్రైవర్ వాళ్ళమ్మగారు వంట చేస్తుంది శుచిగా రుచిగా. పదండమ్మా, ఓమారు పిల్లలనందర్నీ పలుకరించి హాయ్ చెప్పి వద్దాం” అంటున్న ప్రేమ్ వంక అదే పనిగా చూస్తూ శారదాదేవి కూడా కుర్చీలోనుంచి లేచి నిల్చుంది.

“ఊహా తెలియని పసివయస్సులో అనాథనైన నన్ను తెచ్చి ఈ అనాథ ఆశ్రమంలో వున్న మీచేతిలో పెట్టిన ఆ దయామయుడు ఎవరో గాని ముందుగా నేనతనికి కృతజ్ఞతలు తెల్పుకోవాలమ్మా. మీ చల్లని నీడలో పెరిగి చక్కగా వున్నతమైన చదువు నేర్చుకొని పెద్దయ్యాక మంచి భావాలతో ఉత్తమమైన ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకొన్న మనిషిలా, ఈనాడిలా సమాజానికి సేవచేసే అవకాశం, ఆనందం నాకు దక్కాయి. అందుకుగాను మీకు జన్మదా ఋణపడి వుంటానమ్మా… ఇంద ఇది స్వీకరించండి” అంటూ తన షర్టు జేబులో నుంచి సంతకం చేసి వున్న చెక్క్ తీసి ఆవిడ చేతిలో పెట్టాడు.

ఆ చెక్ పై వేసి వున్న సంఖ్యను ఆవిడ ఆశ్చర్యంగా చూసి తలెత్తి ప్రేమ్ సాగర్ వంక చూసింది.

“నీవు ప్రతి నెలా పేమెంట్ అంతా ఇలా నాకే యిస్తే ఎలా ప్రేమ్? నీకంటూ ఏమీ వుంచుకోవా? రెండు నెలలక్రితం కూడా ఓ చెక్ ఇచ్చావ్! మళ్ళీ ఇప్పుడు కూడానా? వద్దు, ప్రేమ్ ఇలా… నీవు సంపాదించేదంతా మాకే యిస్తే ఎలా? నాకు అవసరం వచ్చీనప్పుడు నేనే నిన్ను అడుగుతాను. ఈమారుకి మాత్రం తీసుకుంటున్నాను. సరేనా?” అంటూ ఆ చెక్‌ని టేబుల్ సొరుగులో వుంచి, అతనితో పాటూ కారిడార్‌లో నడవసాగింది.

ఎదురొస్తున్న ఆయమ్మలతో కలివిడిగా మాటలు కలుపుతూ శారదాదేవితో పాటు ముందుకు సాగాడు ప్రేమ్ సాగర్.

***

“హలో, నాన్నా! కాంచీపురం వచ్చేశారా?”

“రాత్రే వచ్చేశాం. లాడ్జింగ్‌లో దిగాం. మన దక్షిణ భారతదేశంలో దర్శించుకోవల్సిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రఖ్యాత దేవాలయం ఏకాంబరేశ్వరస్వామి వారిది. మరియు కామాక్షీదేవి ఆలయం ముఖ్యంగా ప్రస్ధి చెందినది. ఇంకా తివిక్రమస్వామి, వామనమూర్తి, విష్ణు ఆలయం, శ్రీఖచ్చపేశ్వరస్వామి శివాలయం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం, శ్రీకైలాసనాథుని ఆలయం, శ్రీవైకుంటనాథుని ఆలయం ముఖ్యమైన స్ధలాలు. ఇవి కాక ఇంకా ఎన్నెన్నో గుళ్ళున్నాయి. వాటిలో మేము కొన్ని మాత్రమే దర్శించుకున్నాం.”

“అక్కడ దేవాలయంలో వుండే బంగారు బల్లిని ముట్టుకున్నారా, లేదా నాన్నా?”

“ముట్టుకున్నాం తల్లీ!”

“నాన్నా, మరక్కడ ఏదో మామిడి చెట్టు ఎన్నో ఏళ్ళ నుంచి వుందని చూసిన వాళ్ళు చెప్తారుకదా! ఆ మామిడి చెట్టు విశేషమేమిటి నాన్నా?”

“ఆ స్థల పురాణ కథేమిటంటే పరమేశ్వరునికి ఒకానొక సమయంలో పార్వతీదేవి కైలాసంలో తన రెండు చేతులతో కళ్ళు మూయుట జరిగిందట. దాని వలన ప్రపంచమంతా గాడాంధకారమైన చీకటిలో చిక్కుకొని ప్రాణి కోటి క్షణకాలం గిలగిలాడ్డం జరిగిందట. అప్పుడు తినేత్రుడైన శివుడు తన మూడవ కన్ను తెరచి లోకాన్ని కాపాడినాడట. తాను చేసిన తప్పును గ్రహించిన పార్వతీదేవి కరుణించి తనను రక్షించమని భర్తను ప్రార్థించిందట. అందుకు ప్రాయశ్చితంగా భూమిపై తపస్సు చేయమని పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆదేశించడంతో, అప్పుడు త్రిలోక పావని పార్వతీదేవి తపస్సుకై ఈ లోకానికొచ్చిందట.”

“ఊ, చెప్పు నాన్నా! ఇంటరెస్టింగ్‌గా వుంది. ఆ తర్వాత ఏం జరిగింది నాన్నా?”

“కాశీ క్షేత్రమున అన్నపూర్ణ, విశాలాక్షి వెలిసి యుండుటచే కాంచీ క్షేత్రమునకు వచ్చి పంపానది ప్రాంతములో ఆమ్రవృక్షము అనగా మామిడి చెట్టుక్రింద ఇయిక శివలింగం చేసుకొని పూజించుకో సాగింది. అమ్మవారి దీక్షను పరీక్షించదలిచిన పరమేశ్వరుడు తన జటాఝాటం నుండి గంగను ప్రవాహాంగా వెడులునట్లు చేసేనట పంపానదిలోకి. ఇసుక శివలింగంపై తన రెండు చేతులతో కప్పినట్లు ఆలింగనం చేసుకొని అమ్మవారు శివలింగాన్ని నీటిలో కొట్టుకొని పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందట. అమ్మవారి ఆలింగనం స్పర్శ చేత పులకాంకితుడైన పరమశివుడు పార్వతీదేవికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లుగా స్థలపురాణ కథనం. ఈ మామిడి చెట్టుక్రింద వెలసివుండుట వలన ఏకాంబరేశ్వరుడు అన్నన పేరు కలిగిందట. ఈ క్షేత్రంలో ఆ మామిడి చెట్టుక్రింద అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్లుగా ప్రతిష్ఠించబడిన యిసుక శివలింగాన్ని ఈనాటికీ భక్తులు చూసి తరించగల్గుున్నారు. ఈ మామిడి చెట్టు కొన్ని వేల సంవత్సరముల ముందటిదని వృక్ష శాస్త్రజ్ఞుల అభిప్రాయం పడుతున్నారట. ఇక్కడి నుంచి మేం చైన్నై వెళ్ళుతున్నాం. అక్కడ రాత్రికి టైన్ ఎక్కి రేపు హైదరాబాద్‌కి రాగలము. కంచి పట్టుచీరలకు ప్రసిద్ధి కదా! మీ అమ్మతో పాటూ నీకు కూడా ఓ చీర కొన్నాను అనితా! నీకు నచ్చుతుందో లేదో మరి. మీ సర్పంచమ్మగారు, ఉపసర్పంచ్ అమ్మగారైన సత్యవతి కూడా తన కాబోయే కోడలి నిమిత్తం పెళ్ళికై కొన్ని పట్టు చీరలు కొన్నారు. అందరూ కొంటుంటే నేనూ కొన్నాను.”

“అమ్మకైతే ఓకె గానీ, నాకెందుకు పట్టుచీర నాన్నా? ఇప్పటికే బోలడన్ని చీరలున్నాయి బీరువాలో. ఎప్పుడు వాటిని కట్టేదే లేదు కదా! అయిన మీ ఎంపిక నాకు నచ్చుతుంది లెండి నాన్నా!”

“దీపు ఎలా వున్నాడు? నీ చదువెలా సాగుతుంది?”

“ఫర్వాలేదు. బాగానే చదువుకుంటున్నాడు.”

“మీ అమ్మ వస్తే నీకిక ఏమీ పని వుండదు తల్లీ! చదువుకి ఇంకా ఎక్కువ సమయం కేటాయించవచ్చు. కసిగా పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించి తీరాలి తల్లీ! నీవు కలెక్టరివి కావాలి. అదే నా కోరిక.”

“సరే, నాన్నా! హ్యాపీ జర్నీ!” అని చెప్పి ఫోన్ పెట్టేసిన అనిందిత బుక్ చేతిలోకి తీసుకొంది.

***

హరితహారంలో భాగంగా ఊళ్ళో చెట్లు నాటే కార్యక్రమము జోరుగా సాగుతుంది. అనిందిత ఉప సర్పంచ్ ఇంకా ఊళ్ళో కొందరు ప్రముఖులు వైకుంఠధామంతో పాటు ఇతర చోట్ల, రోడ్ల ప్రక్కగా మొక్కలు విస్తారంగా నాటుతున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ మొక్కలు పెడుతున్నారు. ఇంటింటికి ఐదారు మొక్కలు నాటమని పంపిణీ కూడా చేశారు… జామ, దానిమ్మ, వేప, ఉసిరి మున్నగుని. మూడేళ్ళ నుంచి నాటిన మొక్కలిప్పుడిప్పుడే కాస్త పెద్దగై చక్కని చిక్కని నీడ నిస్తూ ప్రజలకు సేద తీరుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం… ఈ ఏడాది ఇంకా పెద్ద పెట్టున హరితహారం కార్యక్రమం మొదలైంది.

అంతట్లోనే అనిందిత సెల్ మ్రోగింది. నాటుతున్న చేతిలోని మొక్కల్ని పక్కనున్న ఆవిడ చేతి కిచ్చి వెళ్ళి స్కూటీ పైన పెట్టిన సెల్ ఎత్తింది. ఎమ్ పి.ఓ. గారి నుంచి.

“సార్! నమస్కారం”

“ఏం చేస్తున్నారు.”

“ఈ రోజు ఉదయం నుంచి ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమమే జరుగుతుంది సార్!”

“మీ ఊరికి కలెక్టర్ గారు వస్తామన్నారు కదా ఆ మధ్య. ఆ విషయమే మీతో చెప్పడానికి ఫోన్ చేశానిప్పుడు.”

“అవునా!? ఎప్పుడొస్తామన్నారు సార్?” అనిందిత ఉత్సాహంగా అడిగింది.

“మూడు రోజుల్లో వస్తామన్నారు. ఎల్లుండి గురువారం కాక ఆ మరుసటి రోజు. అంటే శుక్రవారమన్నమాట. ఉదయం తొమ్మిది పది మధ్యలో అక్కడికి రాగలము. కలెక్టర్ గారితో పాటు నేనూ, డి.పి.ఓ గారు కూడా వస్తారు. పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో వారిచే కొన్ని మొక్కలు కూడా నటించాలి. గుంతలు తీసి రెడీగా వుంచండి.”

“తప్పకుండా రండి సార్!” నూతనోత్సాహంతో అందామె.

“కొత్త కలెక్టర్ గారికి స్వాగతం పలుకుతూ ఊరిలో ఏదైనా ప్లెక్సీ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో కదా అని నా అభిప్రాయం. ఏమంటారు?”

“మీరీ విషయంలో అసంతృప్తి పడకండి సార్! ఉపసర్పంచ్ గారే ఆ ఏర్పాట్లు చేస్తారు. మీరు ఆశించినట్లుగానే కలెక్టర్ గారికి ఘనమైన స్వాగతమే లభిస్తుంది మా ఊర్నించి. మీరేం వర్రీ అవ్వకండి సార్!”

“ఇంకో విషయం అనిందితగారూ! ఆ రోజు మీరిచ్చే ఉపన్యాసంలో యింకా మీ గ్రామానికి కావల్సిన అవసరాలను అడగాలి. ట్రాక్టర్ విషయం ప్రస్తావించాలి. మర్చిపోకండి!”

“తప్పకుండా సార్! నాకవన్నీ గుర్తున్నాయి.”

“థాంక్సమ్మా!” అని ఆయన ఫోన్ పెట్టేశాడు.

అనిందిత వెంటనే అక్కడున్న వారందరితో “శుక్రవారం రోజు మన జిల్లాకి కొత్తగా వచ్చిన యువకలెక్టర్ గారు మన ఊరికి వస్తున్నారు. వారికి మనమంతా బ్రహ్మాండంగా స్వాగతం పలకాలి…” అంటూ ఇంకా రెండు రోజుల్లో రేపు, ఎల్లుండి చేయాల్సిన ముఖ్యమైన పనులను గురించి ప్రస్తావించింది.

యాత్రలకు వెళ్ళినవాళ్ళు తిరిగి వచ్చేది ఈరోజే కాబట్టి, మిగతా పనులు ఉపసర్పంచ్‌కి అప్పగించి తాను యింటికి వచ్చేసింది.

(ఇంకా ఉంది)

Exit mobile version