ప్రేమ పరిమళం-11

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఉ[/dropcap]దయం ఒకే కూర చేసింది. కాబట్టి యాత్రల నుంచి రాబోయే అమ్మనాన్నల కోసం టమాట పప్పుచేసి, బెండకాయ ముక్కలేసి మజ్జిగ చారుచేసింది. వేడి వేడిగా వుంటుందని రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టింది. టీచర్స్‌కు మీటింగ్ వుందని దీపుకు ఆఫ్ డే సెలవిచ్చారు. వాడూ ఇంట్లోనే వున్నాడు. అమ్మ నాన్న వస్తున్నారని చాలా సంబరంగా వున్నాడు.

“దీపూ! బయటేదో కారాగిన శబ్దమైంది. అమ్మవాళ్ళేమో ఓమారు వెళ్ళి చూడు” ఏదో పనిలో వున్న అనిందిత అంది తమ్ముడితో.

వెళ్ళి చూసొచ్చి “కాదక్కా! మన పక్క వాళ్ళింటికి ఎవరో బోల్డు మంది చుట్టాలొచ్చారు. అవునక్కా! నాకో డౌట్! మనకెవ్వరూ చుట్టాలులేరా? వున్నా రారా!? మనింటికి ఎప్పుడు ఎవరూ రారేందుకు?” తన సందేహాన్ని బయట పెట్టాడు.

తమ్ముడి మాటలతో గతుక్కుమందీమారు అనిందిత. ఓ క్షణం మౌనంగా వుండిపోయింది.

“మాట్లాడవేం అక్కా? మనకి అమ్మమ్మ, తాతయ్య, అత్తలు, మామలు లేరా? అస్సలు మనకెవ్వరూ చుట్టాలు లేనే లేరా?” మళ్ళీ గట్టిగా ప్రశ్నించాడు.

“లేకేం… వున్నారు చుట్టాలు. అమ్మమ్మ, తాతయ్య ఐతే లేరు. నా చిన్నతనంలోనే పోయారట. మనం ఎక్కడినుంచో నాన్న ఉద్యోగరీత్య ఇక్కడికి దూరంగా వచ్చేశాం. అందరూ ఎక్కడో దూరదూర ప్రాంతాలలో వున్నారంతాను. అందుకని రారు…”అనిందిత అప్పటికేదో అలా సర్ది చెప్పి తప్పించుకుంది.

అంతట్లోనే యాత్రలకెళ్ళిన వారు క్యాబ్‌లో వచ్చేశారు.

పాండురంగం, సుశీల తమ సామాను తీసుకొని కిందికి దిగారు. కార్లో వున్న సర్పంచ్ గార్ల దంపతులను సత్యవతిని ఇంట్లోకి ఆహ్వానించింది అనిందిత, వాళ్ళని టీ తాగి వెళ్ళండంది. కాని వాళ్ళు ఒప్పుకోలేదు. కారు వెళ్ళి పోయింది.

“అమ్మా!…” అంటూ బయటికొచ్చిన దీపు తల్లిని ప్రేమగా వాటేసుకున్నాడు.

“నిన్ను చూసి ఎన్నాళ్ళో అయిందన్నట్లుగా అనిపిస్తుందిరా దీపూ” అంటూ సుశీల వాడి నుదుటిపై ముద్దు పెట్టుకొని తలనిమురుతూ తన ప్రేమనంతా వ్యక్తపరిచింది. ఆ తర్వాత “నాన్నా!” అంటూ తండ్రి కాళ్ళని వాటేసుకున్నాడు గారంగా.

“ముందు వాళ్ళని ఇంట్లోకీ వచ్చీ ప్రెష్ అవ్వనీ… ఆ తర్వాత నీకు నాకు యాత్రల విశేషాలు మొదులుకొని బోలడన్నీ కబుర్లు చెప్పుతారు.” అంటూ దీపుని వారిస్తూ తల్లీ చేతీలోని ఓ బ్యాగ్, సూట్ కేస్ అందుకొని రెండు చేతులతో పట్టుకొని ఇంట్లోకి నడిచింది అనిందిత. మిగితా ముగ్గురూ ఆమెను అనుసరించారు.

***

ఆ మరుసటి రోజు సుశీల స్నానం చేసి తాము యాత్రల నుంచి తెచ్చిన ప్రసాదాలన్నింటినీ పూజాగదిలో వుంచి, పూజయ్యాక యింటి చుట్టుపక్కల వారికందరికీ పంచింది దీపు చేతికిచ్చి. అనిందితకి కూడా కొన్ని ప్రసాదాల్ని తీసిచ్చి “మీవాళ్ళకివ్వవే” అంది.

“ఒద్దు, నాకిప్పుడు వాటిని పంచే తీరిక ఓపికా లేదిప్పుడు. మా వూరికి రేపు కలెక్టర్ గారొస్తున్నారు. నేను ఆ పనులలో చాలా బిజీగా వుంటానమ్మా! అయినా సర్పంచ్ గారు, ఉపసర్పంచ్ గారి అమ్మ వాళ్ళ కూడా ప్రసాదాలు తెస్తారుగా! అక్కడకవి చాలులే…”

“సరే నీ ఇష్టం” ముక్తసరిగా అంది సుశీల.

ఆరోజు టిఫిన్ బాక్స్ పట్టుకొని రోజుకంటే ఓ అరగంట ముందుగానే బయలుదేరింది అనిందిత.

పాండురంగం ,యాత్రల బడలిక తీరేందుకు రెస్ట్‌గా యింట్లోనే వుండిపోయాడు. “సుశీలా! నేను రేపటి నుంచి ఆఫీస్ కెళ్ళుతాను. నాకేమీ ఈ రోజు బాక్స్ కట్టకు” అని ముందుగానే ఆయన భార్యకు చెప్పడం వలన అందుకనే ఆమె నింపాదిగా యాత్రనుంచి తెచ్చిన సామానులను సూట్ కేస్‌లనుంచి తీసి సర్దుతూ వుండి పోయింది.

ఆ రోజు దీపు కూడా స్కూల్‍కి వెళ్ళకుండా యింట్లోనే వుండిపోయాడు కాబట్టి, తల్లితో సరదగా కబుర్లు చెప్పుతూ పనిలో ఆవిడకు సాయం చేయసాగాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ముగ్గురూ ఓ రెండుగంటలు హాయిగా నిద్రపోయారు.

***

ఆరోజు ఊళ్ళోని పనులన్నీ సక్రమంగా నిర్వర్తించుకొని సాయంత్రం నాల్గింటికల్లా ఇంటికీ చేరింది అనిందిత.

“ఈరోజింత తొందరగా వచ్చేశావేం అనితా? కలెక్టర్ గారు రాబోతున్నారు చాలా పనులు వున్నాయని అన్నావ్, బిజీ అన్నావ్…”అని నవ్వుతూ అడిగింది సుశీల.

“హమ్మయ్య! పనులన్నీ నేటితో పూర్తైనాయి. కలెక్టర్ గారు రాబోయేదిక రేపే. ఇవాళలాగా నేను రేపు కూడా పెందరాళే లేచి తయారుకావాలి…” అంటూ బాత్ రూమ్ లోకెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది.

అప్పటికే అందరికీ టీ పెట్టింది సుశీల. గ్లాసుల్లోకి వడగడుతూంది. మధ్యాహ్నం పండుకోవడం వలన బాత్ రూమ్ లోకెళ్ళి ముఖం కడుకొని వచ్చి పాండురంగం కూడా హాల్లోకొచ్చి కూతురి పక్కగా మరోకుర్చీలో కూర్చున్నాడు.

దీపేమో యాత్రల నుంచి వాళ్ళనాన్న తెచ్చిన కారుబొమ్మతో ఆడుకుంటున్నాడు.

“యాత్రల ప్రయాణం బాగా జరిగిందా నాన్నా?”

“ఆ, బాగానే అన్నీ సవ్యంగా జరిగాయి. ఆ దొరస్వామి బావమరి రాజు వున్నాడే… అతడు అన్ని విషయాలలో కూడా చాలా సమర్థుడమ్మా! తన ఫ్రెండ్‌తో కల్సి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చక్కగా చూసుకున్నారు.”

టీ గ్లాసులు భర్తకు, కూతురికి అందిస్తూ “నిజం అనితా! మీ నాన్న అన్నట్లుగా వాళ్ళంతా బాగా చూసుకున్నారు. యాత్రలలో అన్ని చోట్ల దర్శనాలు చక్కగా జరిగాయి. నీ పుణ్యాన అలా హాయిగా వెళ్ళాం; ఇలా క్షేమంగా తిరిగొచ్చాం” అంది సుశీల.

“నాదేముందమ్మా… నీవెప్పటినుంచో అంటూ వుంటివి. దానికీ తోడు సర్పంచమ్మ నాతో ఈ విషయం చెప్పగానే నేను మీతో చెప్పాను. మీరొప్పుకున్నారు. హాయిగా వెళ్ళి తిరిగొచ్చారు” అంది టీ తాగుతున్న అనందిత.

“ఈమారు యాత్రలకి నీవు, నేనే వెళ్ళుదామక్కా. అమ్మా నాన్న కూడా ఏం వద్దు. ఎందుకంటే, వాళ్ళిద్దరూ వెళ్ళి వచ్చారుగా. మనమిద్దరమే వెళ్ళుదాం…” ఆడుకుంటున్న దీపు సీరియస్‌గా అన్నాడు.

వాడి మాటలకు నవ్వింది అనిందిత. “సరే, అలాగేరా వెళ్ళుదాం.”

“ఏరా, దీపూ! మీ అక్కా తమ్ముడితో పాటు నేను మీ నాన్న రావద్దా?!”

తల్లీ అన్నమాటలకు ఓమారు తలెత్తి అక్క వంక చూసి ఏమనుకున్నాడో ఏమో “సరే, అందరం ఈమారు కల్సే వెళ్ళుదాం. అప్పటి వరకూ అక్కకు పెళ్ళి అయితే ఎంచక్కా బావగార్ని కూడా మనతో పాటు తీసికెళ్ళొచ్చు…” తాపీగా అంటూ మళ్ళీ తన ఆటలో మునిగి పోయాడు. వాడన్న ఆ మాటతో వాళ్ళు ముగ్గురూ ఓక్షణం నిశ్శబ్దంగా వుండిపోయారు.

ముందుగా తేరుకున్న పాండురంగం టీ తాగడం ముగించి “రేపు ఊరికీ కలెక్టర్ వస్తున్నారని అన్నావు కదా! మీ అమ్మంది నాతో ఉదయం. మీఊళ్ళో ఏదైన ప్రారంభోత్సనానికి వస్తున్నారా అనితా?” మామూలుగా అడిగాడు.

“అబ్బే, అలాంటి ప్రారంభోత్సవలాంటి వేవీ ఊళ్ళో లేవు నాన్నా! పల్లెప్రగతి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడడానికి బయలుదేరిన వారు హరితహారం భాగంగా మొక్కలు నాటుతారు. వారి పర్యటన మా ఊరితోనే మొదలు పెడుతున్నారట. వచ్చినందుకు మా పంచాయితీ ఆవరణంలో కూడ వారు మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశాం.”

“ఓహో, అలాగా. నీవాఊర్ని నీ శాయశక్తుల పనిచేసి అంత అభివృద్ధి పథంలోకి తీసుక వచ్చినందుకు నీ పనితీరు ఆ వార్తలవీ పేపర్లో చదివారు కాబోలు అందుకని మీ ఊరితోనే మొదలు పెట్టాలని అనుకున్నారేమో!”

“అవును నాన్నా! మా ఎమ్.పి.ఓ. గారితో ఈమాటే అన్నారట”నవ్వింది అనిందిత.

“యువకుడైన ఆ కొత్త కలెక్టర్ గార్ని గురించి కూడా బాగా రాస్తున్నారు ఈమధ్య పత్రిక వాళ్ళు. అతనిలో సుగుణాలు ఎంత అందమైనవో నిజానికి అతనూ చాలా అందంగా వుంటాడమ్మా, నిన్ననే పేపర్లో చూశాను. పాపం అతనికెవ్వరూ లేరట. అనాథ ఆశ్రమంలో పెరిగి పెద్దై స్వశక్తితో ఎదిగి ఇంతటి వాడయ్యాడట…” అంటూ చెప్పుకొస్తున్నాడు ఆయన.

“అవును నాన్నా! నేనూ చదివాను ఆ విషయాల్నీ. చాలా గొప్ప విషయం కదా!” అంటుండగానే తనకు ఎవరి నుంచో ఫోన్ రావడంతో లేచి వెళ్ళింది అనిందిత గదిలోకి.

***

“రేపు మన అమ్మాయ్ పుట్టినరోజండీ. అది మర్చి పోయేలా వుంది” లో-గొంతుకతో కూతురికీ వినబడకుండా కాస్త ముందుకు వంగి అంది భర్తతో.

“ఆ, అవునుకదా! నేను కూడా మర్చిపోయాను సుమా!” అంటున్న భర్తను చేత్తో తడ్తూ మాట్లాడ వద్దని సైగ చేసింది.

అక్కడే వున్న దీపు ఆమాట విననే విన్నాడు.

“ఒరేయ్, అక్కయ్యను రేపు మనం సర్ర్పెజ్ చేద్దాం. ఇప్పుడు చెప్పొద్దు, సరేనా?”అంటూ తల్లి మెల్లిగా రహస్యంగా అంది కొడుకుతో.

“ఓకె అమ్మా! సరే చెప్పను. రేపే చెప్పుదాం…”

కూతురి పుట్టిన రోజు పండుగకి రేపు ఏం స్వీట్ చేయాలని ఆలోచిస్తుంది సుశీల.

పాండురంగమేమో “బజారుకెళ్ళి అనితకి ఏదైన కొత్త డ్రెస్ తేనా సుశీలా?” భార్యని సలహా అడిగాడు.

“వద్దండీ! నేను కొన్న ఓ కొత్త చీర వుంది తన దగ్గర. బ్లౌజ్ కూడా కుట్టించి రెడీగా పెట్టానెప్పుడో… ఆ చీరే కట్టుకుంటుంది లెండి” అంటుండంగానే అనిందిత ఇవతలికి రావడంతో వాళ్ళ సంభాషణ చటుక్కున ఆగిపోయింది.

***

ఆమర్రోజు ఉదయం టైమ్ ఐదవుతుంది. ఆ ఉషోదయం వేళ చెట్ల మీదున్న అనేక రకాల పక్షుల కిలకిలరావాలతో ఉషాకన్యకు స్వాగతం పలుకుతున్నాయి.

అప్పటికే రోజుకన్నా ఇంకా పెందరాళే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి నేరుగా వంటింట్లోకెళ్ళి పనిలో పడింది సుశీల.

అనిందిత కూడా నిద్ర లేచి, బాత్ రూమ్ లోకెళ్ళి తలంటు స్నానం చేసింది. పొడగాటి ఒత్తైన జుత్తుకి పొడి టవల్ చుట్టుకొని నేరుగా పూజామందిరం లోకెళ్ళి దేవునికి దండం పెట్టుకొంది.

“జన్మదిన శుభాకాంక్షలు బిడ్డా!”

వెనుదిరిగి చూసిన అనిందితకు పూజగది గుమ్మంలో నిల్చున్న తల్లిదండ్రులు నవ్వుముఖాలతో ఏక కంఠంతో చెప్పేసరికి ఓ క్షణం ఆశ్చర్యచకితే అయిందామె.

“ఈరోజు నా పుట్టిన రోజా?” విస్మయంగా తనలో తానే అనుకోబోతుంటే… వెంటనే తేది,నెల గుర్తొచ్చింది. నాలుక కర్చుకొని “అబ్బ! నేనెలా మర్చిపోయానమ్మా!” అంది.

“నీవంటే మీ ఊరి పనులలో పడి మర్చిపోయి వుంటావు. మేము మాత్రం ఏం మరువలేదే అనితా! నీవు తలంటు స్నానం చేస్తావో లేదోనని కొంచెం సందేహంగా వుండె… కానీ,ఈ రోజు శుక్రవారం కాబట్టి తప్పకుండా తలంటు స్నానం చేస్తావని గమ్మున వున్నాను. ఇలా రా తల్లీ! జుత్తు తుడుస్తాను “అంది సుశీల.

“ఆగమ్మా” అంటూ వెనక్కి తిరిగి పంచపాళిలో పసుపు కుంకుమలతో పాటు వున్న అక్షింతలు కొన్నింటిని చేతిలోకి తీసుకొని, గడప దాటి ఇవతలికొచ్చి వాళ్ళచేతికిచ్చి తల్లిదండ్రులిద్దరికి వంగి పాదాభివందనం చేసింది.

“ఇష్టకామ్యాభిఫలసిద్ధిరస్తూ!” అంటూ తండ్రీ, “శ్రీఘమే కల్యాణ ప్రాప్తిరస్తూ!”అంటూ తల్లీ ఏకకాలంలో సంతోషంగా ఆశీర్వదించారు.

అనిందిత ఇవతలికి రాగానే తలకి చుట్టుకున్న టవల్ విప్పదీసి నింపాదిగా తుడవసాగింది సుశీల.

ఎప్పుడో నిద్రలేచిన దీపు పక్కింటి వాళ్ళింట్లో నుంచి ఆంటీనడిగి… లైట్ పింక్ కలర్లో వున్న ఓపెద్ద గులాబీ పూవు తీసుకొచ్చి వాళ్ళక్క చేతికిచ్చీ “హ్యాపీ బర్త్ డే అక్కా!” అంటూ విష్ చేసి ఆమె కాళ్ళకి వంగి దండం పెట్టాడు.

“ఒరేయ్, ఇవి ఎప్పటి నుంచి, కొత్తగా ఇలా దండాలు పెట్టడం?” అంటూ వాడ్ని పైకి లేపి ప్రేమగా వాడి బుగ్గపై ముద్దు పెట్టింది.

తల్లి జుత్తుని బాగా తుడిచి జారుగా జడ అల్లబోయింది.

“అమ్మా! కాస్తా ఆగు. జుత్తు కొంచెం ఆరినాక జడ వేద్దువు”

“సరే ఐతే. నేనీలోగ వంటింట్లో కొంచెం పని చూసుకొనివస్తా”

“అబ్బా! నీ జుత్తు ఎంత పొడుగక్కా!” అనిందిత వీపంతా పర్చుకొని మోకాళ్ళ దాకా వున్న ఒత్తైన ఆ జుత్తుని అబ్బురంగా చూస్తూ అన్నాడు దీపు.

“అలా అనకురా దీపూ! అక్క జుత్తుకి దిష్టి తగులుతుంది” వంటింట్లోనుంచే వారిస్తున్న తల్లి మాటలకు “దిష్టి తగిలితే ఏమవుతుందమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏమవుంతుంది? జుత్తంతా వూడి పోతుంది. “

“అవునా? సారీ అక్కా!”

“పోరా! అలా ఏం జరగదు” అందామె నవ్వుతూ.

చేసిన సేమ్యా పాయసం ఓ గిన్నె నిండా పోసి స్పూన్ వేసి ముందుగా కూతురికిచ్చింది. దగ్గరగా వచ్చిన దీపుకి కూడా రెండు మూడు స్పూన్స్ తినిపించింది అనిందిత.

“ముందు నీవు తిను. నేను వాడికి వేరే గిన్నెలో పెడ్తానులే. నీవు తిని తొందరగా తయారవ్.. బీరువాలో నుంచి కొత్త చీర తీసి నీ గదిలో పెట్టాను చూడు అది కట్టుకో. రా, రా దీపూ! నీకు పాయసం పెడ్తాను” అంటూ సుశీల మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది.

ఓ గంటలోపే అనిందిత కొత్తచీర కట్టుకొని సింపుల్‌గా తయారయింది. తల్లి లూజ్‌గా అల్లిన జడలో ఓ పక్కగా పిన్‌తో దీపుయిచ్చిన గులాబీ పూవు పెట్టుకుంది.

“అక్కా! ఈ రోజు నీవెంత అందంగా వున్నావో తెలుసా?” అబ్బురంగా అన్నాడు దీపు.

“పోరా, ఫో! రోజూలాగే వున్నాను. పుట్టిన రోజు కాబట్టి కొత్త చీర కట్టుకున్నానంతే” అందరికీ బై చెప్పి బండి దగ్గరకెళ్ళింది.

“అక్కా! బాక్స్ తీసికెళ్ళు. మర్చి పోయావ్” అంటూ ఓ చిన్న బ్యాగ్ తెచ్చి యిచ్చాడు దీపు.

“ఆల్ ద బెస్ట్ తల్లీ! జాగ్రత్తగా వెళ్ళు” గుమ్మంలో నిల్చున సుశీలా పాండురంగం దంపతులు నవ్వు ముఖాలతో కూతుర్ని నిండుగా మనసారా చూసుకుంటూ చేతులూపారు.

***

కలెక్టర్ గారి కారు రయ్యిన ఊళ్ళోకి ప్రవేశిస్తుంది.

ఆ వెనకాలా డి.పి.ఓ గారి కారూ, మరో దాంట్లో ఎమ్.పి.ఓ గారూ., మరో ఇద్దరు ముగ్గురు అధికారులున్నారు

కారు అద్దాల్లోనుంచి అటు ఇటు పరీక్షగా చూస్తున్న కలెక్టర్ ప్రేమ్ సాగర్ ఆశ్చర్య చకితుడైపోసాగాడు.

విశాలమైన సిమెంట్ రోడ్‌తో, రోడ్డు కిరువైపులా గుబురుగా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో చూడడాన్కి హరితహారంలా కన్నుల పండుగ్గా వుందా వాతావరణం. ‘నిజంగా ఈ ఊరు పల్లెటూరులా లేదు. పట్నవాసానికి ఏ మాత్రం తీసిపోనట్లుగా ఆధునికతను సంతరించుకున్నట్లుగా వుంది’ తనలో తాను అనుకుంటూ అబ్బురపడి పోయాడు.

పంచాయితీ ఆఫీస్ ఆవరణంలో ఊరు ఊరంతా కల్సి వచ్చినట్లుగా చిన్న పెద్ద, ఆడ మగ జనాలు బారులు తీరి నిల్చుని వున్నారు.

కార్లో నుంచి హుందాగా దిగుతున్న కలెక్టర్ గార్కి స్వాగతం పలుకుతూ ముకుళిత హస్తాలతో అభిమానంగా చూస్తూ నమస్కారాలు చేశారు.

అంతమందిలో లైట్ పింక్ కలర్ చీరలో గులాబీపువ్వులా ముచ్చట గొలిపేలా నిల్చున ఆమె ఫోటోని పేపర్లో చూసి వుండ్డం వలన వెంటనే పోల్చుకున్నాడు. ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకా చాలా అందంగా వికసించిన గులాబీ పువ్వులా వుందనుకున్నాడు. తన మొదటి చూపులోనే ఆమె రూపాన్ని తన హృదయంలో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయిందెందుకో…

డి.పి.ఓ. గారు ముందుకొచ్చి “మిస్ అనిందిత సార్! ఈ గ్రామ కార్యదర్శి…” అంటూ పరిచయం గావించారు.

“ఓ, నమస్కారం!”అన్నాడతను సన్నటి మందహాసంతో. ప్రతి నమస్కారం చేస్తూ తన చెంత నిల్చున చిన్నారి పాపలతో కలెక్టర్ గారికి పుష్పగుచ్ఛాన్ని అందింపచేసింది.

“ధ్యాంక్యూ” ఆ పాపల చేతుల్లోనుంచి పుష్పగుచ్ఛాన్ని వంగి ప్రేమగా అందుకుని “ఏం చదువుతున్నారు?” ముచ్చటగా అడిగాడతను.

ఆ పిల్లలు సిగ్గు పడి పోయి ఏం మాట్లాడలేకపోయారు.

“స్కూల్లో చదవడం లేదు సార్! అంగన్ వాడిలో ఆటపాటలతో ఆడుకుంటారు…” అంటూ నవ్వి అనిందిత వినయంగా సమాధానమిచ్చింది. ఆతర్వాత ఆ ఊరి సర్పంచ్‌ని, ఉపసర్పంచ్‌ని, వార్డ్ మెంబర్స్‌ని అందర్నీ ఒకరి తర్వాత ఒకర్ని పేరు పేరునా పరిచయం చేసిందతనికి.

జనాలంతా ఎంతో సంతోషంతో సంబరంగా వున్నట్లుగా కన్పించారు.

“మీ అమృత హస్తాలతో మా పంచాయితీ ఆఫీస్ ఆవరణంలో… మా ఊళ్ళో మీ విజిట్‌కి జ్ఞాపకార్థంగా రెండు మొక్కలు నాటండి సార్” అంటూ అనిందిత కలెక్టర్ గార్ని అభ్యర్థిస్తూ, కొంచెం దూరంలో వున్న యాదగిరికి సైగ చేసింది.

“తప్పకుండా…” అంటూ చిన్నగా నవ్వాడు కలెక్టర్ గారు. అప్పటికే గోతులు తీసి రెడీగా వున్న చోటికి “రండి సార్!” అంటూ తాను ఓపక్కగా ముందుకు నడుస్తూ అతన్ని అక్కడికీ తీసుకెళ్ళింది. యాదగిరి అందించాడు. వాటిని నాటడానికి అనిందతకి కాస్త వెనకగా అడుగులేస్తున్న ప్రేమ్ సాగర్, పొడువుకు తగ్గ లావుతో చక్కటి పర్శనాలిటీ అనిపించేలా… లావుగా పొడుగ్గా వున్నామె బారెడు జడని అబ్బురంగా చూశాడో క్షణం.

చెట్లు నాటడం అయ్యాక చేతులు కడుకున్న అతనికి తెల్లటి కొత్త టవల్ అందించింది అనిందిత.

“థాంక్యూ” అని చిన్నగా నవ్వి చేతులు తుడుచుకోసాగాడు కలెక్టర్ గారు.

“మా అనిందిత మేడమ్ ఈ పల్లెలో పెట్టించిన మొక్కల్లో నూటికి తొంభైశాతం చెట్లు బతికి చక్కగా ఎదిగాయి సార్!” ఎమ్.పి.ఓ. గారు చెప్తూ వుంటే “అవునా! గుడ్, వెరీగుడ్!” అంటూ ఆమెను ప్రశంసించాడు.

జనాలంతా ఆమెకు జేజేలు కొట్టసాగారు. “మా వూరింత అందంగా, మనోహరంగా, పరిశుభ్రంగా వుండడానికి ముఖ్యకారణం మా మేడమే…” అంతా ఒక్కసారిగా చెప్పసాగారు.

అందరు చెప్పిన మాటలు వింటూన్న కలెక్టర్ “నిజమే మీరంటున్న మాటలు. ప్రత్యక్షంగా కళ్ళముందు కనిపిస్తూనే వుందిగా” అన్నాడు చిరునవ్వు ముఖంతో.

“సార్! మీరు వాళ్ళ మాటల్ని వినకండి. ఇందులో పూర్తిగా నా బాధ్యత లేదు. ఇది ఈ వూరి ప్రజలది. అభివృద్ధి అన్నది అంచెలంచెలుగా జరిగి ఈనాడిలా ఉన్నతమైన ఆదర్శ గ్రామముగా రూపుదిద్దుకోవడానికి అతి ముఖ్యులు ఈ వూరి జనాలే. వారందరి సమిష్టి కృషితో చిన్న పెద్ద, ధనిక పేద అన్న వ్యత్యాసం లేకుండా వారు చేసిన శ్రమదానంతోనే ఈ అఖండ విజయాన్ని స్వంతం చేసుకునేలా జరిగింది. ఇది మాత్రం అక్షరాల ముమ్మాటికి నిజం సార్!” అంది.

“కలెక్టర్ గారు మన ఊరికి రావడం పల్లె ప్రగతిని పర్యవేక్షించడానికి మొదట మన గ్రామాన్నే ఎంచుకొని, మన ఊరైన ఈ పుష్పాలగూడంతోనే ప్రారంభించినందుకు మేమంతా ఎంతగానో సంతోషపడుతున్నాం. మాకు ఎంతగానో అన్నివిధాలా సహకరించి సహాయాలందించిన డి.పి.ఓ. గారికీ, ఎమ్.పి.ఓ గారికీ, సర్పంచమ్మ లలితాంబగారికీ, ఉప సర్పంచ్ రాయప్పగారికీ, వార్డ్ మెంబర్స్ కందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెల్పుతున్నాను” అంటూ అందర్నీ కలెక్టర్ గారికి పరిచయం గావించింది.

“ఇంకా ఈ ఊరికి సమకూర్చుకోవల్సిన అవసరాలు కూడా కొన్ని వున్నాయి. ట్రాక్టర్ కొనుగోలు విషయం, అంగన్‌వాడి పిల్లలకు ఆడుకోవడానికి ఉయ్యాలలు జారుడుబండ, మున్నగు పరికరాల అవసరమెంతో వుంది…” అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న ఆమె ఓక్షణం ఆగి ఓమారు కలెక్టర్ గారి వంక అప్రయత్నంగా చూసింది. ఆ టైమ్‌లో అతనూ తన వైపే చూడ్డం గమనించి తత్తరపాటుతో తడబడింది.

అయినా ఆ మరుక్షణంలోనే తేరుకొని తన సహజ ధోరణిలో మాట్లాడి ఉపన్యాసాన్ని క్లుప్తంగా ముగించింది.

అందరూ పెద్దపెట్టున కొట్టిన చప్పళ్ళతో ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా మారుమ్రోగింది.

“మీ మేడమ్ గారు చెప్పినవన్నీ నేను ఓమారు డి.పి.ఓ. గారితో మాట్లాడి చర్చించి నా శాయశక్తులా మీ ఊరికి కావల్సిన వన్నీ సమకూర్చే ప్రయత్నం వీలైనంత త్వరలో చేస్తానని మాటిస్తున్నాను. మరి మీకందరికీ ఆమోదమే కదా! ముందుగా మనమంతా ఓమారు ఊరంతా పర్యటించి వద్దాం. ఏమంటారు?” అని అంటుండగానే అందరూ ఉత్సాహంగా లేచారు.

ముందుకు కదిలారు. మిగితా అధికారులంతా వాళ్ళ వెంబడి నడవసాగారు.

అక్కడక్కడ ఊళ్ళోని గోడలకి, వాటర్ ట్యాంక్ మీద పంచాయితీ ఆఫీస్ ముందు వైపున్న విశాలమైన గోడపై, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న సూక్తులను, సున్నితంగా తెలియ చెప్పే విధంగా… చూపరులను ఆకట్టుకునేలా వేసిన చిత్రాలను చూసి మెచ్చుకోలేకుండా వుండలేక పోయాడు కలెక్టరుగారు. ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రతే!

ఎక్కడా అపరిశుభ్రత అన్న మాటే లేదు. అందరి ఇండ్ల ముందు పచ్చగా కళకళలాడుతున్న పూలచెట్లూ, కాయకూరల చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తున్నాయి.

“గుడ్, వెరీగుడ్! మీ ఊరు మరెన్నో ఊళ్ళకి ఆదర్శవంతంగా నిలవాలి అనిందితగారూ “అంటూ అందరి పై ప్రశంసల జల్లులు కురిపించాడు.

తిరిగి వస్తున్నప్పుడు పక్కనున్న కుర్రాళ్ళు “ఈరోజు అనిందిత మేడమ్ పుట్టినరోజుట కూడరా!” అంటూ వాళ్ళలో వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు అప్రయత్నంగా కలెక్టర్ ప్రేమ్ సాగర్ చెవిన బడ్డాయి.

మళ్ళీ అంతా పంచాయితీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు

“మేడమ్! మీరలా ఓక్షణం కూర్చోండి. కలెక్టర్ గారు మీకు శాలువా కప్పి సన్మానం చేస్తారు”డి.పి.ఓ. గారు అనగానే “నో నో, నాదేం లేదు. మీ అందరి సమిష్ఠి సహకారంతోనే ఈ అభివృద్ధి జరిగింది” అంటూ మోహమాటంతో వద్దంది.

“ఫర్వాలేదు అనిందితగారూ, ముందుగా మీరిలా ఆసీనులుకండి” కుర్చీవైపు చేయితో చూపుతూ కలెక్టర్ గారనడంతో ఇక విధి లేక కుర్చీలో కూర్చుంది.

డి.పి.ఓ. గారు సైగ చేయగానే డ్రైవర్ చేతిలో వున్న సంచీలో నుంచి శాలువ ఓ బొకె తీసి కలెక్టర్ గారికి అందించాడు. చిన్న చిన్న జరీ పువ్వులున్న ఆ శాలువా మడత విప్పి “మీ ఊరికీ చేసిన సేవకి ఉడతా భక్తిగా ఏదో చిన్న సత్కారం! మీలాంటి వారే ఈనాటి నవ సమాజ నిర్మాణానికి చాలా అవసరం…” అంటూ బొకె అందిస్తుంటే అందరూ పెద్ద పెట్టున చప్పట్లు కొడుతున్నా తరుణంలో “న్మదిన శుభాకాంక్షలు కూడాను మీకు అనిందితగారూ!”ఆమె ఒక్కత్తికే మాత్రమే వినబడేలా యాంత్రికంగా కొంచెం ముందుకు వంగి చెవిదగ్గర గుసగుసగా అన్నాడు.

తల కొంచెం పైకెత్తి ఆశ్చర్యంతో కళ్ళుపెద్దవి చేసి చూస్తూ వుంటే ‘మీకెలా తెల్సిందా’ అన్నట్లుగా వున్నాయి ఆమె చూపులు.

‘తెల్సు నాకు’ అన్నట్లుగా చిరునవ్వు ముఖంతో తల పంకిస్తున్నట్లుగా మందహాసంతోనే సమాధాన మిచ్చినాడు. “ఈ గ్రామ కార్యదర్శి అనిందిత గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్స్‌కీ, గ్రామ ప్రజలందరికీ అభినందనలు. ఈ ఊరింత వందకి వంద శాతం అభివృద్ధి పథంలో పయనిస్తున్నందుకు మనస్ఫూర్తిగా శుభాభినందనాలు. మీ ఊరి మేడమ్ లాంటి కార్యదర్శులు ప్రతి ఊరికీ ఒకరుంటే జిల్లా జిల్లాలే కాక, రాష్ట్రమంతా పచ్చదనంతో పరిశుభ్రతతో కళకళలాడి పోతుంది…”

“అనిందితగారు సివిల్స్‌కి ప్రిపేరవుతున్నారు సార్! తాను కలెక్టరైతే ఇంకెన్ని విధాలైన సమాజ సేవ చేయగలరు.” ఎం.పి.ఓ.గారు నవ్వుతూ చెప్పాడు కలెక్టర్ గారితో.

“రియల్లీ… చాలా సంతోషం. చదువు విషయంలో నానుంచి మీకేమైన సహాయ సహకారాలు కావాలంటే నేను ఆల్వేస్ రెడీ! నేను ప్రిపేరయిన మెటీరియల్ కూడా మీకు చాలా బాగా పనికొస్తుంది. పంపించమంటే మా డ్రైవర్‌తో మీ యింటికే పంపించగలను, మీకు ఉపయోక్తంగా వుంటుంది.”

“థాంక్స్ సార్! పంపించండి నా దగ్గరున్న మెటీరియల్‌తో పాటు అదీ చదువుతాను” అంటూ లేచిందామె. ఆ తర్వాత కలెక్టర్ గారు పంచాయితీ ఆఫీస్ రిజిష్టర్‌లో తాను విజిట్ చేసినట్లుగా రెండు మూడు వాక్యాలు రాసి సంతకం చేశాడు.

ఇంతట్లో దొరస్వామి పనిమనిషి శంకరితో గాజు కప్పులు,టీ బిస్కెట్స్ పట్టించుకొని వచ్చి అందరికీ సర్వ్ చేయించాడు. ఓ అరగంట తర్వాత కలెక్టర్ గారు అందరి నుంచి నమస్కారాలు స్వీకరిస్తూ, ప్రతి నమస్కారం చేస్తూ వెళ్ళి పోతూ, అనిందిత వైపు ఓమారు చూసి మందహాసంతో తల పంకించాడు.

అతను వెళ్ళిపోయాక అనిందిత ‘హమ్మయ్య’ అంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకొంది. మనస్సంతా ఎంతో తేలికగా అన్పించిందామెకు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here