ప్రేమ పరిమళం-14

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]పం[/dropcap]చాయితీ ఆఫీస్ తలుపులు తెరిచే వున్నాయి. యాదగిరి చీపురుతో ముందు ఆవరణాన్ని శుభ్రంగా ఊడుస్తున్నాడు.

అనిందిత బండి రావడం గమనించి చీపురు పక్కకు పెట్టి “నమస్తే, మేడమ్” అన్నాడు వినయంగా.

“నమస్తే యాదగిరీ, నీవూడుస్తున్నావేం?” బండి లాక్ చేసి కీస్ హేండ్ బ్యాగ్‌లో వేసుకుంటూ లోపలికెళ్ళసాగిందామె.

“ఈరోజు ఊడ్చే అవ్వ ఎందుకో రాలేదు. అందుకని నేను ఊడ్చాను.”

ఇంతలో సర్పంచ్ వాళ్ళ పన్నమ్మాయ్ శంకరి వచ్చిందక్కడికి. “మేడమ్ సర్పంచమ్మ మిమ్ముల్ని ఈరోజు భోజనానికి అక్కడికే వాళ్ళింటికి రమ్మని చెప్పమంది.”

“భోజనానికెందుకే?” ఎదురు ప్రశ్న వేసింది.

“ఏమో, నాకేం ఎరుక? అమ్మ కొడుకు అమెరికా నుంచి రాతిరి వచ్చాడు కదా! అందుకే రమ్మందేమో”

అప్పుడు అనిందితకు సడెన్‌గా గుర్తుకొచ్చింది. వారం రోజులనుంచి లలితాంబ ‘నా కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడని పదే పదే చెప్తూనే వుంది. నేనే మర్చి పోయాను’ అనుకుంటూ “ఇప్పుడు కాదే శంకరీ! భోజనానికి రానని చెప్పు… లంచ్ తెచ్చుకున్నాను. నా పనంతా అయిపోయాక సాయంత్రం వెళ్ళేటప్పుడొస్తానని చెప్పు మీ సర్పంచమ్మతో…”

“సరే, ఇగ నేపోత” అంటూ శంకరి వెళ్ళి పోయింది.

యాదగిరి అంతా ఊడ్చేసి కూజా కడిగి ఫ్రెష్ నీళ్ళు పట్టి దానిపై గాజు గ్లాస్ బోర్లించాడు.

“చుక్కమ్మ ఎలా వుంది యాదగిరీ? ఆరోగ్యం బాగుందా? డాక్టర్ చెకఫ్ వెళ్ళిందా? ఇక్కడున్న ఆశా వర్కర్ చూడ్డానికి వస్తుందా? విటమిన్ టాబ్లెట్స్ ఇస్తుందా?” వరసగా అడుగుతుంది అనిందిత.

“అంతా బాగే మేడమ్” అంటూ యాదగిరి ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.

“అంగన్‍వాడికెళ్ళి గుడ్లు తెచ్చుకుంటుందా?.. కొంచెం బలవర్ధకమైన ఆహారం తినమని చెప్పు”

“సరే మేడమ్. మరిక నేను వెళ్ళుతాను” అని చెప్పేసి యాదగిరి వెళ్ళిపోయాడు.

ఇంతలో తన సెల్ మోగింది. ఆన్ చేసి “హలో” అంది.

“అనిందితగారూ, గుడ్ మార్నింగ్! బాగున్నారా?”

క్షణంలో కంఠం గుర్తించింది. “నమస్తే సార్!” అంది తడబాటుగా

“నేను నిన్న మెటీరియల్ పంపానుకదా మా డ్రైవర్‌తో. మీ అమ్మగారు అతన్ని బాగనే రిసీవు చేసుకొని మంచి టీ గూడా యిచ్చారట…” అంటున్న అతనికి గొంతు పట్టేసినట్లుగా చిన్నగా దగ్గుతూ ఆగిపోయాడు.

“ఏమైంది మీకు? మీ గొంతు అలా వుందేమిటి? జలుబు చేసిందా సార్?”కంగారుగా అడిగింది.

“అవును రాత్రి నుంచి. ఈరోజు సెలవు పెట్టాను. ఇంట్లోనే వున్నాను. డాక్టరిచ్చిన మందులు వాడుతున్నాను. మా వంటమ్మ చేసిచ్చిన కషాయం కూడా తాగాను. మీరెక్కడున్నారిప్పుడు?”

“ఊళ్ళో పంచాయితీ ఆఫీసులో…”

“ఏం చేస్తున్నారు?” అతను అడిగిన ప్రశ్నలో ఏదో ఆసక్తి కనబర్చినట్లుగా అన్పించింది.

“ఇప్పుడే వచ్చాను సార్! మీరు పంపిన మెటీరియల్ అంతా చూశాను. ఎంతో పొందికగా చక్కగా రాశారు. మీ ఆదరాభిమానాలకు థాంక్స్ సార్!”

“థాంక్సా? నాకా… ఎందుకు? కాబోయే కలెక్టర్ గారైన మీకే నేను అభినందనలు తెలపాలి. బాగా చదవండీమారు. కష్టపడండి. ఆ తరువాత పొందే ఫలితం మీకే అద్భుతమనిపిస్తుంది.”

“అవునా సర్! మీరన్నట్లుగా తప్పకుండా గెలుపు కోసమే పోరాడుతానండీ…”

అతనెందుకో చిన్నగా నవ్వాడు. “గెలుపు కోసం మీరు పోరాడ్డం కాదు. ఆ గెలుపనే విజయం మీ వైపుకు రావడానికి తహతహలాడేలా చదవాలి మీరు. సివిల్స్‌కి ప్రిపేరవుతున్న అభ్యర్ధులందరికీ టైమ్ చాలా ఇంపార్టెంట్. ఏ కాస్త సమయాన్ని అయినా సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ చదవడం, వీడియోలు వినడం, క్లాస్‌లు వినడం ఇలా చేస్తే వారి ప్రిపరేషన్ సంపూర్ణం కానట్లే అనిందితగారూ!

మీ ప్రిపరేషన్ అనేది ముఖ్యంగా ఓ నాలుగు అంశాలను బాగా గుర్తుంచుకోవాలి. చదవడం, రాయడం, ఆలోచించడం, చర్చించడం… వీటిల్లో ఏదో ఒకటి చేస్తుంటే మాత్రం వారి ప్రిపరేషన్ పావు వంతు మాత్రమే పూర్తి అయినట్లుగా భావించాలి. అనిందితగారూ వింటున్నారా?”

“ఆ, వింటున్నాను సార్! చెప్పండి…”

“మీ ప్రిపరేషన్ నూటికి నూరుశాంతం వుండాలంటే మిగతా వాటిపై కూడ దృష్టి నిలపాలి. వాటిపైన కూడా మీ సమయాన్ని వెచ్చించాలి. పకడ్బందీ ప్రణాళికతో ప్రిపేర్ అయితే సక్సెస్ మీ సొంతమవుతుంది.. ఎప్పుడూ ఎలాంటి సమయం దొరికినా మీ వ్యూహాన్ని పరిస్ధితులకు అనుగుణంగా మలుచుకొని మీ ప్రిపరేషన్ని మరింత ఉత్సాహంగా కొనసాగగించాలి. ఎలాంటి పరిస్ధితిలోనూ ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండగలిగితే వారికి విజయావకాశాలెక్కువ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి.”

“అవును సార్! మీరు మంచి విషయాలనే చెప్తున్నారు. ప్రిలిమ్స్‌లో వచ్చే ప్రశ్నలే కొంచెం కష్టమనిపిస్తాయి నాలాంటి వారికి”

“కొంచెం కాదు అనిందితగారూ చాలా కష్టమే. వాటి గురించి పాటించే పద్ధతులు రెండు. ఒకటి సాధారణ దృష్టికి రాని విషయాలను ఎంచుకొని అడగడం వాటిలో మొదటిది. ఇక రెండవదేమో బాగా వారు వాడేది ఏమిటంటే మూడు నాల్గు వాక్యాలను యిచ్చి వాటిల్లో కరెక్ట్ వాటిని ఎంచుకొని జవాబులిచ్చే పద్ధతి. ఈ రెండవ పద్ధతిని యుక్తితో గెలవాలి. మార్కులు పోగొట్టుకోకుండా ఆ ప్రశ్నలను ఎదుర్కోవాలి… అవి పన్నిన పద్మవ్యూహంలో పడకుండా ఎలా విజయం దక్కించుకోవాలన్న దిశగా ఆలోచించాలి అనిందితగారూ! అయినా ఇంతకు మునుపు మీరో మారు సివిల్స్ రాశారు కాబట్టి మీకా విషయాలన్నీ తెలిసే వుంటాయి. ఇప్పటికే మీ పనిని టైమ్‌ని చాలా వాడేశాను తెగ మాట్లాడి. మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఏమంటారు? బై…”

“ఓకె సార్” అంటూ అనిందిత కూడా ఫోన్ పెట్టేసింది. చేతిలో సెల్ పట్టుకొని ఓ క్షణం చిత్రవిచిత్రమైన భావాలతో అలాగే మైమరుపుగా వుండి పోయింది.

***

అనిందిత మధ్యాహ్నం లంచ్ చేశాక నెమ్మదిగా ఊరంతా తిరిగి చూసి, చివర్న సర్పంచ్ వాళ్ళింటికి వెళ్ళాలని అనుకుంది. ఇప్పటికే శంకరితో రెండు సార్లు కబురు పెట్టింది. ఎందుకనో ఆమెకు వాళ్ళింటికి వెళ్ళడానికి మనస్కరించడం లేదు. ‘వాళ్ళబ్బాయ్ అమెరికా నుంచి వస్తే… తననెందుకు వాళ్ళింటికి పిలవాలి? ఎవరి పిచ్చి వాళ్ళకానందం… వాళ్ళబ్బాయ్‌కి నన్నెందుకు పరిచయం చేయాలను కుంటుందావిడ?’ అలా ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్నామెకు “నమస్తే మేడమ్” అన్న పరిచిత పలుకరింపుకు తలెత్తి చూసింది.

ఎదురుగా భూదేవి కన్పించేసరికి చిన్నగా నవ్వింది.

“ఓ నీవా, భూదేవీ! ఎలా వున్నావ్? ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా వుంది? పిల్లలు బాగున్నారా?” నవ్వు ముఖంతో ప్రసన్నంగా పలుకరించింది.

“బాగున్నానమ్మా! రండి, మా ఇంటి లోపలికి…” భూదేవి సాదరంగా ఆహ్వానించింది.

వాళ్ళింటి ముందు పలు రకాల పూల చెట్లు, కూరగాయల చెట్లతో పచ్చగా కళ కళ లాడుతున్నాయి. అనిందిత చాలా సంతోష పడిపోయింది ఆహ్లాదకరమైన ఆ వాతావరణం చూసి.

“గుడ్, వెరీ గుడ్! మొక్కలు బాగా పెంచావ్ భూదేవీ!” మెచ్చుకుంది.

“మీరు చెప్పిన మాటలు వినే ఈ చెట్లను పెంచానమ్మ. కుర్చోండిలా” అంటూ ఓ కుర్చీ తెచ్చి వేసి మర్యాద చేసింది.

ప్రహారి గోడ పక్కగా వున్న గుబురైన వేపచెట్టుకి సొరచెట్టు తీగలు దట్టంగా పాకి తెల్లటి సొరపూలతో చిన్న చిన్న పిందెలతో పెద్దగైన రెండు మూడు పొడగాటి సొరకాయలు క్రిందికి బరువుగా వేలాడుతున్నాయి. అటువైపే దృష్టి సారించి వున్న అనిందితని గమనించిన భూదేవి “గ్లాసుడు పాలు వేడిచేసి తెస్తానమ్మా…తాగి వెళ్ళుదురుగానీ” అని అభ్యర్థించి లోపలికెళ్ళసాగింది.

“ఒద్దొద్దు, భూదేవీ! నేనిప్పుడే భోజనం చేసి వస్తున్నాను.”

“పోనీ, ఓ లేత సొరకాయ తెంపిస్తానమ్మా… యింటికి పట్టుకెళ్ళండి.” ఉత్సాహాంగా అంటూ సోరకాయని కోయడానికి వెళ్తూన్నామెను వారిస్తూ,

“ఆగు భూదేవీ! నీవన్న ఆ మాటతోనే నా మనస్సు సంతోషంతో నిండి పోయింది. నేనలా ఓమారు అంతా తిరిగి వద్దామని బయలుదేరాను…” నవ్వుతూ అంటూ అటు ప్రక్కగా వున్న పొట్ల చెట్టు పాదుకేసి ఓమారు దృష్టి సారించింది. జంట పొట్లకాయ విత్తనంలా వుందా చెట్టు. ఎటు చూసినా రెండేసి పొట్లకాయల చొప్పున ఏపుగా పెరిగి పొడుగ్గా జంట సర్పాల్లా కిందికి వ్రేలాడుతున్నాయి. తన సెల్‌తో ఆచెట్టుని ఓ ఫోటో తీసుకొని “ఈ ఫోటో మా అమ్మకి చూపిస్తాను భూదేవీ!” అని నవ్వుతూ ముందుకు కదిలింది.

భూదేవి ఇల్లు చూశాక ఆ పక్క సందుల్లో మరో రెండు మూడిండ్లు పరికించి చూసింది. ఎవరింటి ముందు ఎలా వుందోనని, ఎక్కడ నీళ్ళు ఆగాయో పరికిస్తూ నడుస్తుంది. ఒకటి రెండు చోట్ల అలాంటి దృశ్యాలు కనబడగానే ఆ ఇంటి యజమాన్ని బయటికి పిలిచి కొంచెం మట్టి పోసి నీళ్ళు నిలువకుండా ఆ గుంత లేకుండా చదును చేయమని ఆజ్ఞాపించి ముందు కెళ్ళి ఎడంవైపు తిరిగి సర్పంచమ్మ వాళ్ళింటి కెళ్ళే రోడ్డు మీదికి వచ్చింది.

బయట ఎవరూ లేరు. మెల్లగా తలుపు కొట్టింది అనిందిత.

“ఎవరూ…” అంటూ దొరస్వామి బయటికొచ్చాడు.

“ఓ, మీరా! రండి… రండి లోపలికి. ఒసేవ్ అంబా! చిన్న మేడంగారొచ్చారు” అంటూ లోపలికో కేక వేశాడు.

వంటింట్లో నుంచి బయటికొచ్చిన లలితాంబ భర్త వంక ఓమారు కొర కొరా చూసింది ‘ఏమిటా పిలుపు’ అన్నట్లుగా. ఆ తర్వాత ప్రసన్నంగా నవ్వుతూ “మా అబ్బాయ్ అమెరికా నుంచి వచ్చాడు కదా అనిందితా! నిన్నోమారు చూస్తానంటే రమ్మని శంకరితో కబురు పెట్టాను. నీవు మాతో పాటే ఇక్కడే భోజనం చేస్తావని… కూర్చో, ఒరేయ్ మాధవ్, ఓమారిలా రారా! అనిందిత వచ్చింది” అని ముందుగదిలోకి విబడేలా ఓ కేక వేసింది.

“ఆ, వస్తున్నానమ్మ” అంటూ గదిలోనుంచి బయటికొచ్చాడు మాధవ్.

“హలో, అనిందితా! హౌ ఆర్ యూ? నన్ను మీరిప్పుడే చూస్తున్నారు గానీ, నాకు మాత్రం మీరెప్పటి నుంచో పరిచయమే” అని అదో మాదిరిగా నవ్వుతూ దగ్గరగా వచ్చి కరచాలనం చేయడానికి చేయి ముందుకు చాచాడతను.

ముందుగా అతన్ని చూసి విస్తుపోయిందామె. దట్టమైన కనుబొమ్మలతో అచ్చం తండ్రి దొరస్వామిలా ఆజానుబాహుడే. తాను మాత్రం చేయి కల్పలేదు. వినయంగా రెండు చేతులూ జోడించి “నమస్కారం!” అంది మర్యాదగా.

మాధవ్ ముఖం కొంచెం వివర్ణమైంది. చొరవగా వచ్చి ఆమె కూర్చున్న సోఫాలో పక్కగా కూర్చున్నాడు. ఆ పరిస్ధితి ఆమెకు కాస్త ఇబ్బందికరంగా అన్పించింది.

“నీవెలా నాకు పరిచయమో నీకు తెలీదుకదా! ఈ ఊళ్ళో జరిగే ప్రతి కార్యక్రమంలోని ఫోటోలన్నీ అమ్మ నాకు వాట్సప్‌లో పంపేది. అలా పరిచయం నీవు నాకు. నీవు నాకు ఫోటోలకన్నా ప్రత్యక్షంగానే యింకా బాగున్నావ్ అందంగా అనిందితా!” ఆమె అందాన్ని ప్రశింసించాడు.

తనని తగులుతున్నట్లుగా కూర్చున్న అతని వైఖరీ, ఆ మాటలు చాలా ఎబ్బెట్టుగా అన్పించింది. ఏం మాట్లాడాలో అనిందితకు తోచలేదు. పైగా ఒళ్ళంతా కంపర మెత్తినట్లుగా వుంది. ఎప్పుడు లేచి వెళ్ళి పోదామా అన్నట్లుగా ముళ్ళ మీద కూర్చున్నట్లుగా వుందామె పరిస్ధితి.

“మా అబ్బాయ్ బహు మాటకారి అనిందితా! ఎంత సేపైనా విసుగు లేకుండా మాట్లాడగలడు. కాబట్టి మీరిద్దరూ మాట్లాడుతూ వుండండీ. నేను టీ పెట్టుకొని వస్తాను” అంటూ లలితాంబ వంటింట్లోకెళ్ళింది.

ఎవరి నుంచో ఫోన్ వస్తే దొరస్వామి మాట్లాడుతున్నాడు పక్కగదిలో కెళ్ళి… హాల్ లో తామిద్దరే వున్నారు.

“మాట్లాడవేమిటి అనిందితా! నీకీ పల్లెటూరిలో ఏం తోస్తుంది? చక్కగా నాతో పాటు అమెరికా వచ్చేసేయ్!” నవ్వుతూ అంటున్న అతన్ని పక్కకు తిరిగి కొంచెం కోపంగా చూసింది.

“ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీవెంట అమెరికా రావడమేమిటి?” గంభీరంగా ప్రశ్నించింది.

“అదే, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాననీ మా అమ్మ ద్వారా ప్రపోజల్ పెట్టాను కదా! మీ పేరెంట్స్‌ని అడిగారు. నీకీ విషయమే తెలీదా ఇంతవరకూ?”

కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచింది అనిందిత. ఎర్రబడిన ముఖంతో ముక్కు పుటలదురుతుంటే “ఏంటీ? ఏం మాట్లాడుతున్నారు?” హుంకరించినట్లుగా అంది.

“అరే, ఎందుకంత కోపం! కూల్, కూల్.. కూర్చో ఇలా…” అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బలపంతంగా ఆమెను కూర్చో బెట్టడాన్కి ప్రయత్నించాడు మాధవ్.

“హు, వదలండి!… మర్యాదగా నా చెయ్యి వదలండి” కోపంగా అంటూ గట్టిగా చేయి వదిలించుకొని విసవిసా వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోయింది అనిందిత. అప్పుడే ఫోన్ మాట్లాడ్డం పూర్తై దొరస్వామి పక్కగదిలో నుంచీ, టీ చేసి తీసుకొని లలితాంబ వంటింట్లో నుంచీ ఇద్దరూ ఒకేసారి హాల్లోకి వచ్చారు.

ఒంటరిగా కూల్‌గా కూర్చున్న కొడుకును చూసి భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు.

“అనిందిత ఏదిరా మాధవ్?” తల్లీదండ్రులిద్దరూ ఏక కంఠంతో అడిగే సరికి “లేదు.. వెళ్ళిపోయింది” కళ్ళెగరేస్తూ తాపీగా అన్నాడు మాధవ్.

“ఏం, ఏమైందిరా? ఎందుకెళ్ళిపోయింది? నీవేమన్నావ్?”

“నేనేమీ అనలేదు. కాని చాలా పొగరా పిల్లకి… నాకు భార్యైనాక అణుస్తా! ఆ అహం, ఆ పొగుర్ని అంతా అణుస్తా!” అంటూ వెకిలిగా నవ్వుతున్న కొడుకు వంక విస్తుబోయి చూడసాగారా దంపతులు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here