Site icon Sanchika

ప్రేమ పరిమళం-15

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]నిందిత యింటికి వచ్చీరావడంతోనే తల్లీ తండ్రి ఎవరితో ఏమీ మాట్లాడకుండా నేరుగా తన గదిలో కెళ్ళిపోయి తలుపేసుకొంది.

విస్తుపోయారు సుశీల పాండురంగం కూతురు చేష్టకి.

‘ఏమైంద’న్నట్లుగా ఒకరిమొఖాలొకరు చూసుకున్నారు.

ఓ అరగంట తర్వాత స్నానం చేసి ఇవతలి వచ్చిందామె. నేరుగా తండ్రి దగ్గరికెళ్ళింది.

“ఏమైందమ్మా? అలా వున్నావ్? టీ తాగుతావా?” తల్లి అడిన ప్రశ్నలకు అనిందిత ఏం మాట్లాడలేదు. మౌనంగానే వుంది.

“ఏమైందమ్మా! అమ్మ అడుగుతుందిగా… చెప్ప వచ్చుగా” అక్కడే వున్న పాండురంగం అడిగాడు కూతుర్ని.

“నాన్నా, నాకు తెలియకుండ ఏం జరుగుతుంది యింట్లో” బిగ్గరగా అడిగింది.

కూతురి వైఖరికి విస్తుపోతున్న సుశీల గబగబా ముందుకు వచ్చింది “ఏమైందే నీకీ వేళ?”

“దొరస్వామి గారు నా గురించి మీతో ఏం మాట్లాడారు నాన్నా?” సూటిగా ప్రశ్నించింది తండ్రిని.

“ఏ విషయంలో తల్లీ?”

సుశీల భర్త వంక కూతురి వంకా మార్చి మార్చి చూడసాగింది.

“అదే, వాళ్ళ అబ్బాయ్ మాధవ్‌కి నాకు పెళ్ళి సంబంధం గురించి మీతో ఎవరు మాట్లాడారు నాన్నా?…”

పాండురంగం ఓక్షణం మౌనంగా వుండిపోయాడు

“దొరస్వామే మాట్లాడాడు అనిందితా!”

“మరి ఆ రోజే మీరు నాకెందుకు చెప్పలేదు. నాన్న?”

“చెప్పాల్సిన అవసరం లేకుండె. ఎందుకంటే, ఆ మాటల్ని నేనారోజే ఖండించాను కాబట్టి. మా అమ్మాయ్ యిప్పుడే పెళ్ళి చేసుకోనన్నది. సివిల్స్ రాశాక తనకు పెళ్ళి చేసుకునే వుద్దేశం వుంటే అప్పడు తన అభిప్రాయం చెప్పుతానని అందనీ, ఈ విషయాన్ని మీరు మళ్ళీ అనిందితతో అనొద్దనీ కూడా చెప్పాను. మరి ఇప్పుడెందుకు అడిగాడు ఆ దొరస్వామీ నిన్నీ విషయం?” కోపంగా అన్నాడు పాండురంగం.

తండ్రి చెప్పిన విషయం విన్నాక కొంచెం శాంతించిందామె.

“ఆయన కాదు నన్నడిగింది వాళ్ళబ్బాయ్….” అంటూ సంగతంతా తల్లిదండ్రులకు చెప్పిందామె.

“తప్పుకదా ఆ అబ్బాయ్ అలా మాట్లాడం? ఆ రోజు మీ నాన్న నా ముందే ఫోన్లో మాట్లాడాడు దొరస్వామితో” అన్న తల్లి మాటలతో అనిందిత మరింత తృప్తి పడింది.

“ఈ విషయం ఎపుడూ మా అమ్మాయి ముందు కూడా మాట్లాడే వద్దన్నాను. అయినా, వాళ్ళు ఓసారి చెప్తే అర్థం చేసుకోవాలి; కొడుక్కి నచ్చ చెప్పుకోవాలంతే గాని, ఆ అబ్బాయి తోటే అలా మాట్లాడించడం తగునా? ఛీ…”ఈసడింపుగా అన్నడాయన.

“ఆ దొరస్వామి మంచివాడే నాన్న, మా సర్పంచమ్మనే కొడుకుపై ప్రేమతో ఇలా అతనితో మాట్లాడిస్తుందేమోనని నా అనుమానం.”

“నిజమేనే అనితా! నీవన్నది కరెక్ట్. ఆ యాత్రలప్పుడు నేనావిడ ధోరణిని నేను బాగా గమనించానులే. భర్త మాట వినదు, తన ధోరణి తనదే”

“రేపటి నుంచీ ఆ ఊరికీ నేనెలా డ్యూటీకీ వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఆ మహానుభావుడు ఏ పనీపాట లేకుండా మా పంచాయితీ ఆఫీసుకు వచ్చి ఇలా అవక తవక మాటలు మాట్లాడితే నేనేం చేయాలా అని నాకు కాస్త కంగారుగా భయంగా వుందమ్మా”.

“నీవేం భయపడకు. విషయం ఏమన్నా వుంటే దొరస్వామితో చెప్పు తల్లి, ఆయన వింటాడు. రేపోసారి నేను కూడా మాట్లాడుతాను…”

“ఒద్దొద్దు నాన్న, నా విషయం నేను చూసుకుంటాను. మీరు ఆయనతో మాట్లాడటం బాగోదు”.

“పోనీ, కొద్ది రోజులు సెలవు పెట్టు.”

“పెడదామనే అనుకున్నాను. కానీ, మూడు రోజుల్లోనే మా ఉప సర్పంచ్ పెళ్ళి వుంది. ఆ పెళ్ళికి తప్పకుండా వెళ్ళాలి కదమ్మా”

“అవును. వెళ్ళాలి నీవెంట నేను వుంటానుగా.”

“ఎల్లుండి ఆ పెళ్ళికెళ్ళాలంటేనే నాకు కొంచెం భయంగా వుందమ్మా. ఈ మహానుభావుడు ఆ పెళ్ళికి కూడా వస్తాడేమోననీ…”

“వస్తే రానీ, మనమెందుకు భయపడాలి? నీవెంట నేనుంటాగా!”తేలిగ్గా తీసి పడేసింది సుశీల.

“అవునమ్మా పెళ్ళికి మీ అమ్మ నీవు కల్సి వెళ్ళండి. నీవు భయపడకు; అధైర్యపడకు” పాండురంగం గూడా కూతురికి నచ్చ చెప్పాడు

‘సరే’ అన్నట్లుగా తలపంకించింది అనిందిత.

“అమ్మా, ఆకలి అవుతుంది” అంటూ దీపు తలుపు తీసుకొని హల్లోకి వచ్చాడు.

***

పెళ్ళి బస్సుకు పూలతోరణాలు మామిడి తోరణాలు కట్టి ‘పాలవెల్లి వారి పెళ్ళి సందడి’ అన్న అక్షరాలు రాసి వున్న తెల్లటి బ్యానర్ కట్టి చక్కగా అలంకరించారు. అందరూ పెళ్ళివారెక్కుతున్నారు. అప్పటికే అనిందిత, వాళ్ళమ్మ సుశీల ఎక్కి యిద్దరూ పక్క పక్కనే కలిసి కూర్చున్నారు.

అల్లంత దూరంలో దొరస్వామి, లలితాంబ కలిసి రావడం గమనించి, కళ్ళతోనే తల్లికి సైగ చేసింది అనిందిత.

సుశీల కూడా అది గమనించినట్లుగా తల పంకించింది.

ఇద్దరూ జంటగా బస్సు లోపలికొచ్చారు. వెనకాలకి వెళ్ళుతూ సుశీలని గమనించి నవ్వుతూ నమస్కారం చేశాడు దొరస్వామి. “సార్ రాలేదామ్మా?” అడిగాడు.

“లేదు. నేనూ, అనిందితనే వచ్చామండీ. లలితాంబగారూ!బాగున్నారా?” అంటూ తనతో మాట్లాడని ఆవిడని కూడా పలుకరించింది సుశీల.

వాళ్ళిద్దరూ అనిందితతో మాట్లాడలేదు. ఆమెకు మనసుకు కొంచెం కష్టమనిపించింది.

‘చిన్నమేడమ్’ అంటూఎప్పుడూ నవ్వుతూ పలుకరించే దొరస్వామి ఈనాడు తన్నిచూసి చూడనట్లుగా వెళ్ళిపోవడం కొంచెం బాధని కల్గించింది. ఇలా కావడాన్కి అసలు కారకుడైన ఆ మహానుభావుడు పెళ్ళికి రానందుకు బతికి పోయానని అనుకుందామె.

బస్సులో అందరూ ఎక్కారు. పట్టుచీరల రెపరెపలతో , మల్లెపూల వాసనలతో సెంట్ పరిమళాలతో బస్సంతా ఘుమ ఘుమలతో నిండి పోయింది. అందరిమాటలతో నవ్వులతో పిల్లల కేరింతలతో బస్సంతా కోలాహలంగా చాలా

సందడిగా వుంది.

ఓ గంట సేపట్లో బస్సు పెళ్ళి వారి ఊరుకి చేరింది. బాజబజంత్రీలతో ఆడపెళ్ళివారి నుంచి మగ పెళ్ళి వారికి ఘనమైన స్వాగతం లభించింది. పసుపు కుంకుమలతో, అత్తరు పన్నీరులతో బస్సులోని మగపెళ్ళివాళ్ళందరినీ ఆహ్వానించారు.

ఎదుర్కోళ్ళ పెళ్ళి వేడుక జరిగే సమయంలో హటాత్తుగా పెళ్ళికొడుకు పక్కన కన్పించాడు మాధవ్. అతన్నలా చూడగానే అనిందిత ఒక్కసారిగా వుల్కిపడింది. ‘ఓహో, బహుశా పెళ్ళికొడుకు వచ్చిన కార్లో వచ్చి వుండొచ్చు’ అనుకుందామె.

పెళ్ళి మండపంలో కుర్చీలో కూర్చుంటుంటే “హలో” అంటూ నవ్వుతూ దగ్గరికొచ్చి తన పక్క కుర్చీలో కూర్చుండబోయాడు మాధవ్.

అనిందిత ఒక్కసారిగా కంగారుగా అతన్నివారిస్తూ “సారీ, ఇక్కడ కూర్చోకండి. మా అమ్మగారు వస్తున్నారు” అంది నెమ్మదిగా.

“ఫర్వాలేదులే… వస్తే ఆ పక్క కూర్చుంటారు. నీతో మాట్లాడాలి ముందుగా” అంటూ చొరవగా ఆమెకు తగిలేలా తన చెయ్యిని కుర్చీపై వేశాడు కూర్చుంటూ.

అతని చర్యకి నిశ్చేష్ట అయింది అనిందిత.

“మా అమ్మ వస్తుందని చెప్తున్నానుగా, ఏమిటండీ మీ యీ చొరవ?” కోపంగా, అసహనంగా అడిగింది.

“కూల్ కూల్… మీకెందుకింత ఆవేశం వస్తుంది?” పెళ్ళి మంటపానికి దగ్గరగా నిల్చున్న దొరస్వామి వీళ్ళిద్దరినే గమనిస్తున్నాడు. వెంటనే కొడుకేసి చూసి చెయ్యి ఊపుతూ “మాధవ్, ఇలారా” అంటూ పిల్చాడు.

“డాడీ పిలుస్తున్నాడెందుకనో, మళ్ళీ వస్తాను మాట్లాడాలి” అంటూ మాధవ్ గబగబా వెళ్ళిపోయాడు.

‘హమ్మయ్య’ అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది అనిందిత.

అప్పుడే సుశీల వచ్చింది. కూతురి పక్కన కూర్చుంది.

“ఎక్కడి కెళ్ళావమ్మా? నాతో పాటు వస్తూనే మధ్యలోనే మాయమయినావ్?”

“వస్తూంటే మధ్యన సత్యవతి పిలిచి తలంబ్రాల బియ్యంలో ఓ చేయి వేయమంది.. అందుకని ఆగాను.”

“అంటే?!” అనిందితకి అర్థం కాలేదు.

సుశీల చిన్నగా నవ్వింది. “అంటే వధూవరులు తలలపై పోసే తలంబ్రాలను ఐదుగురు ముత్తెదువులు పసుపువేసి కల్పుతారు.”

“ఓ, అలాగా… మరే అమ్మా! పెళ్ళాయ్యాక వెంటనే భోజనం చేసేసి వెళ్ళి పోదామమ్మా. ఎందుకంటే పెళ్ళాయ్యాక ఇంకా అప్పగింతలు, ఒడి బియ్యాలంటూ ఏవేవో కార్యక్రమాలుంటాయికదా! పెళ్ళి బస్సు చాలా లేట్‌గా బయలుదేరుతుంది. అందుకని మనం వెంటనే బస్ స్టాండ్ కెళ్ళి నేరుగా మనూరెళ్ళి పోదామమ్మా! మా ఉప సర్పంచ్ వాళ్ళ బావమరిదితో మాట్లాడినాడు మనల్ని పంపించడానికి…”

“సరేనే. అలాగే వెళ్ళుదాం” తలూపింది సుశీల.

తన దగ్గరగా వచ్చిన కొడుకును చూస్తూ “ఏమిటిరా మాధవ్! మళ్ళీ ఆ అమ్మాయ్ దగ్గరిగా వెళ్ళి కూర్చున్నావ్” అంటూ మందలించబోయాడు దొరస్వామి.

“కూర్చుంటే ఏం కొంపలు మునిగిపోయాయి డాడీ?” విసుగ్గా ప్రశ్నించాడతను.

“తనస్సలు ఇప్పట్లో పెళ్ళే చేసుకోను మోర్రో అని అంటున్నా, ఆ అమ్మాయ్ పట్ల నీవింతగా వ్యామోహం పెంచుకోవడం అంత మంచిది కాదు రా! మన మంగమ్మవ్వ వాళ్ళు పెళ్ళికొచ్చారు. ఆవిడకు ఓ అందమైన మనమరాలు వుంది. ఆ పిల్ల కూడా వచ్చింది చూడు. బంగారుబొమ్మలా వుంటుంది. నీకు నచ్చితే ఆ అమ్మయ్‌ని ఓకె అను… వెంటనే పెళ్ళి జరిపించి నీతో పాటు అమెరికా పంపిస్తాం” అంటున్న తండ్రి వంక కోపంగా చూస్తూ “ఇందుకేనా నన్ను పిలిచింది? నేనేం బంగారు బొమ్మ, వెండి బొమ్మలను పెళ్ళి చేసుకోను. అమ్మాయ్‌ని చేసుకుంటాను.” అని విసుగ్గా వెళ్ళి పోతున్న కొడుకును చూస్తూ, పళ్ళ బిగువున ‘మూర్ఖుడా! అమెరికాలో నీతోపాటు పని చేసే వారు ఎలా వేగుతారో ఆ భగవంతుడికే తెలియాలీ…’ కోపంగా అనుకున్నాడు దొరస్వామి.

మంగళ వాయిద్యాల మధ్య మంగళ సూత్రధారణ జరిగిపోయింది. జనాలు మాత్రం వెంటనే లేచారు. పెళ్ళిమంటపం దగ్గరికెళ్ళి తాము తెచ్చిన పెళ్ళికానుకలను వధూవరులకు అందజేసి ఆశీర్వాదములతో అక్షింతలు వేయసాగారు. ఆ క్రమంలో సుశీల, అనిందిత కూడా లేచి ఆ కార్యక్రమంలో పాల్గొని నెమ్మదిగా అక్కడి నుంచి భోజనాలకెళ్ళారు.

వెళ్ళేప్పుడు సత్యవతిని కల్సి వెళ్ళొస్తామని చెప్పారు “మీరూ మాతో పాటు వస్తే బాగుండు.. అంతతొందరేముంది వెళ్ళడాన్కి చిన్నమేడమ్” అంటూ నవ్వి అంత పెళ్ళి హడావుడిలోనూ తన వాళ్ళనెవరినో పిలిచి పసుపు కుంకుమలతో పాటు చీర పెట్టించింది సుశీలకు. అనిందితకు మాత్రం ప్రత్యేకంగా ఏదో ప్యాక్ చేసిన గిప్టు అందించింది.

ఆ పరిసరాలలో దొరస్వామి వాళ్ళ ఫ్యామిలికి కనబడకుండా పెళ్ళికొడుకు బావమరిది ఏర్పాటు చేసిన కారులో ఆ ఊరి బస్ స్టాండ్ కెళ్ళి… నేరుగా వాళ్ళూరు వెళ్ళే బస్సెక్కాక, ‘హమ్మయ్య’ అనుకొని గుండెలనిండా ఊపిరి పీల్చుకొంది అనిందిత.

ఐదారు నిమిషాల తర్వాత వాళ్ళెక్కిన బస్సు బయలుదేరింది.

***

ఉదయం టైమ్ ఏడు దాటి పోయింది.

“మీ అక్క లేచిందిరా దీపూ?” తండ్రి అడుగుతున్న ప్రశ్నకు “లేదింకా, లేవలేదు నాన్నా” అన్నాడు దీపు.

“ఏం, ఈరోజు డ్యూటికి వెళ్ళదా?”

“ఈరోజు నుంచి వెళ్ళదదటండీ. రాత్రే చెప్పింది నాతో.”

“జాబ్‌కు రిజైన్ చేస్తుందటనా?”

“ఆ, అవునండీ. చదువుకోవడానికి తీరిక దొరకడం లేదట. ఈ రోజు జిల్లా హెడ్డాఫీసుకు వెళ్ళాలని అందండి.”

“సరే, ఇదీ మంచిదే. అటు వుద్యోగం, ఇటు చదువు రెండూ సక్రమంగా జరగాలంటే వీలు కాదుకదా! మంచి నిర్ణయమే తీసుకొంది” తమ కూతురి అభిప్రాయంతో ఓ తండ్రిగా ఏకకీభవించాడు పాండురంగం.

తొమ్మిదింటికల్లా నిద్ర లేచిన అనిందిత త్వరత్వరగా తయారయింది. టీఫిన్ చేసింది. అప్పటికే పాండురంగం, దీపు వెళ్ళి పోయారు. “అమ్మా, నాన్నకు పెందరాళే నిద్ర లేచాక ఈ విషయం చెప్దామనుకున్నాను…” అని అంది.

“ఈ విషయం నేను చెప్పానులేవే”

“మరి ఏమన్నాడు నాన్న?”

“మంచి నిర్ణయమే తీసుకుందన్నారు”

“హమ్మయ్య. నాన్నకు నేను ముందుగా చెప్పలేదే అని అనుకుంటున్నానిప్పుడే..” అంటూ హ్యాండ్ బ్యాగ్‌లో రాజీనామా లెటర్‌తో పాటూ అవసరం పడే మిగతా పేపర్స్ అన్నీ పెట్టుకొని బయలుదేరింది బస్ స్టాండ్‍కు.

బస్సు రెడీగా వుంది. వెంటనే ఎక్కేసింది. సీట్‌లో కూర్చుంది. ఓ ఐదు నిముషాలలో బస్సు ముందుకు కదిలింది. హ్యాండ్ బాగులో నుంచి సెల్ తీసి తల్లికి ఫోన్ చేసింది. “అమ్మా, బస్సెక్కాను…” అంటూ చెప్పింది.

“జాగ్రత్తగా తిరిగి రా తల్లీ!” అటువైపు నుంచి సుశీల ఫోన్ పెట్టేసింది.

బస్సు దిగినాక తన హెడ్ ఆఫీస్ అక్కడి నుంచి దగ్గరే కాబట్టి నేరుగా నడుచుకుంటూ అక్కడికే వెళ్ళింది అనిందిత.

డిపిఓ ఆఫీస్ లోకెళ్ళింది.

“నమస్కారం సార్!” అన్న మాట వినబడగానే ఆయన తల ఎత్తి అనిందితను చూడగానే ఓక్షణం ఆశ్చర్యపోయాడు.

“బహు కాలానికి వచ్చారు మన ఆఫీస్‌కి. రండీ కూర్చోండిలా” అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ కుర్చీ చూపాడు.

మర్యాద పూర్వకంగా తన ఆఫీసర్‌కి “నమస్కారం సార్!” అంటూ వినయంగా నమస్కరించింది. బ్యాగ్ లోనుంచి తన రాజీనామా లెటర్ తీసి ఆయన ముందుంచిందామె.

ఆశ్చర్యంగా ఆ కాగితం వైపు, అనిందిత వైపు మార్చి మార్చి చూడసాగాడాయన.

“ఏంటమ్మా ఇది?”

“నా రిజగ్నేషన్ లెటర్ సార్?”

“అదే… ఎందుకమ్మా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్?”

“తప్పనిసరిగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్!”

“అలా అంటే ఎలామ్మా? నిన్నే నమ్ముకున్న ఆ ఊరి ప్రజలు ఏం కావాలి?”

“ఏమీ కారు సార్! ఆనందోత్సహాలతో కలిసికట్టుగా అందరూ ఐక్యతతో ముందుకెళ్ళుతారు. నాకు కూడా ఆ ఊర్నివదిలి వెళ్ళుతున్నందుకు ఎంతో బాధగా వుంది కానీ, నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నానని మీకూ తెలుసుకదా! బాగా చదివి అనుకున్నదీ మారు సాధించి, మా నాన్నగారి కోరిక కూడా తీర్చాలన్న దృఢ సంకల్పంతో వున్నాను సార్! దయచేసి నా అభ్యర్ధను మన్నించి మీరు నా యీ రిజగ్నేషన్ లెటర్ స్వీకరించండి సర్!”

“నేను తీసుకోవడం తీసుకోకపోవడం అది వేరే విషయం. మీరు అనుకున్నదీమారు తప్పకుండా సాధించాలని కోరుకునే వారి ముందు వరసలో నాతో పాటు కలెక్టర్ గారు కూడా వుంటారు. సార్ ఎప్పుడూ మీగురించి ఏమంటారో తెలుసా? ‘అనిందిత లాంటి వారే ఈనాడు సమాజానికి కావాలి. మిగతా గ్రామ కార్యదర్శులు కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల’ని అంటుంటారు. అందుకని మనమిప్పుడు వారి అనుమతి, అభిప్రాయం కూడా తెల్సుకొన్నాకనే నేను మీ రాజీనామా లెటర్ తీసుకుంటాను. పదండీ, మనమక్కడికే వెళ్ళుదాం” అంటూ లేచి కలెక్టర్ గారి ప్రాంగణం వైపు వెళ్ళసాగాడు.

తప్పనిసరి పరిస్ధితిలో డిపిఓ గారి వెంటే అనిందిత వెళ్ళసాగింది. బయటే కలెక్టర్ గారి పిఎ కన్పించాడు.

“సార్ వున్నారా?” డిపిఓ గారడిగిన ప్రశ్నకు సమాధానంగా “ఆ, ప్రస్తుతం వున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్స్‌తో ముఖ్యమంత్రిగారితో హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకి జరగబోయే సమావేశానికి హాజరు కావడాన్కి ఇంకాసేపట్లో బయలుదేరబోతున్నారు.” అన్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version