ప్రేమ పరిమళం-16

0
2

[dropcap]”న[/dropcap]మస్కారం సార్!” అన్నమాట వినగానే తలెత్తి చూసి

“ఓహో, మీరా! రండి, రండీ! అనిందితగారు కూడా వచ్చారే! ఏమిటి విశేషం?” అని నవ్వుతూ అడిగాడు.

ఆయన వెళ్ళే తొందరలో వున్నారని గ్రహించిన డిపిఓ అనిందిత విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు.

కలెక్టరుగారు అనిందిత వైపే తదేకంగా చూస్తూ, “తీసేసుకోండి. ఎందుకుంటే ఈమారు అనిందితగారు ఎంతో తపనతో విజయం సాధించాలని పట్టుదలగా చదువుతున్నారని మీరే అన్నారుగా! నాలా కలెక్టరై తానూ ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటారు అనిందితగారూ?”క్రీగంటగా చూస్తూ అన్నాడతను.

ఏం మాట్లాడాలలో ఓ క్షణం తోచలేదు అనిందితకు. చిన్నగా నవ్వి వూర్కుంది.

ఇంతలో డిపిఓ గారి సెల్ రింగైంది. “ఎక్స్‌క్యూజ్ మీ సార్ !”అంటూ ఆయన పక్కకెళ్ళాడు మాట్లాడుతూ.

“కూర్చొండి అనిందితగారూ! చదివేడప్పుడు మీకేమన్నా డవుట్స్ వస్తే.. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నన్నడిగితే క్లియర్ చేయగలను. ఏ మాత్రం సందేహించవద్దు. ఫోన్ చేసి మాట్లాడండి. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్”అన్నాడు మనస్ఫూర్తిగా.

ఇంతలో డిపిఓగారు ఫోన్ మాట్లాడ్డం ముగించి వీళ్ళ దగ్గరగా వచ్చాడు.

“సార్! మరిక సెలవ్” అంటూ చేతులు జోడించాడు.

“థాంక్స్ సర్” అంది అనిందిత.

ముగ్గురూ కల్సి బయటికొచ్చారు.

ముఖ్యమంత్రితో కలెక్టర్ల మీటింగ్‌ నిమిత్తమై హైదరాబాద్ వెళ్ళడానికీ కార్లో కూర్చోబోతున్న ప్రేమ్ సాగర్ ఎందుకనో ఓమారు తలతిప్పి అనిందిత వైపు చూసి చిరునవ్వు ముఖంతో చెయ్యూపాడు.

***

సుశీల వంట చేస్తుంది.

ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.

గబాగబా ఇవతలికి వచ్చి గ్రిల్స్‌లో నుంచి వచ్చిన వాళ్ళని చూసి ఓక్షణం ఆశ్చర్యచకితే అయిందామె.

‘ఏమిటీవేళ వీళ్లొచ్చారేమిటి?’ అయోమయంగా అనుకుంటూ, లేని నవ్వు ముఖం మీదికి తెచ్చుకొని సుశీల తలుపులు తెరిచింది.

“రండి, రండీ” లోపలికి సాదరంగా లోపలికి ఆహ్వానిచ్చింది.

తల్లీకొడుకులిద్దరూ లోపలికొచ్చారు.

“కూర్చోండి” దిక్కులు చూస్తున్న వాళ్ళకు సోఫా చూపించింది.

ఇంకా అటు ఇటు చూస్తున్నలలితాంబ “అనిందిత లేదా?”అని అడిగింది

“ఉహు లేదండి”

“ఎక్కడికెళ్ళింది? ఈరోజు ఊరికికూడా రాలేదు”

“జిల్లా ఆఫీస్ కెళ్ళింది”

“ఎందుకు?”

“ఉద్యోగానికి రిజైన్ చేయడానికి”

ఆ మాటతో వచ్చిన వాళ్ళిద్దరూ విస్తుపోయారు.

“ఏమిటీ?! ఉద్యోగం మానుకుంటుందా?”

“అవునండీ. తను సివిల్స్‌కి ప్రిపేరవుతుంది. అందుకని పూర్తిగా చదువుకోవడానికి సమయాన్ని కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకుంది.”

“ఎందుకండి దండగ! అదేమన్నా వస్తుందా? చస్తుందా? చక్కగా వెంటనే పెళ్ళి చేసేయండీ నాకిచ్చి… ఎంచక్కా నాతో పాటు అమెరికా వచ్చి సంతోషంగా వుంటుంది” అంటున్న మాధవ్ మాటలకు సుశీలకు చురుక్కుమంది.

కోపం కూడా వచ్చేసింది వెంటనే.

“మీ అబ్బాయ్ పదే పదే పెళ్ళి అని అల్లాడిపోతున్నాడు కదండీ. వెంటనే పెళ్ళి చేసేయకపోయారండీ?”లలితాంబతో ఘాటుగా అంది సుశీల. ఆ మాటతో మాధవ్ అహం దెబ్బతింది. సోఫాలో నుంచి దిగ్గున లేచాడు. సుశీల దగ్గరగా వస్తూ “ఏటండీ, మీ మాటలు? ఓ పెద్ద మహాఅందగతై అనుకుంటున్నారా మీకూతుర్ని. నథింగ్! అలాంటి లక్షణాలేవి లేవు లే మీ బిడ్డకు. నేనిష్టపడుతున్నానన్న ఒకే ఒక ఆశతో మా అమ్మ చివరిసారిగా అడగడానికని వచ్చిందిలా నావెంట.” కోపంగా అన్నాడతను.

“మరి ఆ మహా అందగత్తెని ఎక్కడుందో వెతికి పెళ్ళి చేసుకోలేకపోయారా? ఇప్పట్లో పెళ్ళే చేసుకోనని అంటున్న మా అమ్మాయి వెంట పడుతారేమిటండీ.. మీ అమ్మ కొడుకులు?” అంతకన్నా కోపంగా అంది సుశీల.

విస్తుబోవడం ఈమారు లలితాంబ వంతైంది.

“ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. పదే పదే అడిగిందే అడగడం సభ్యత కాదు. అదే దొరస్వామిగారికి ఒక్కసారి చెప్పేసరికి అర్థం చేసుకొని మళ్ళీ ఎప్పుడూ అడగనే లేదు. మీకు ఆయనకు నక్కకు నాగలోకానికీ వున్నంత తేడా వుంది…” సుశీల ఇంకా ఏదో అనబోతుంటే దిగ్గున లేచింది లలితాంబ.

“పదరా మాధవ్!” అంటూ కొడుకు చేయి పట్టుకొని చరచరా బయటికి నడిచింది.

‘హమ్మయ్య’ అనుకుంటూ సుశీల వాళ్ళు వెళ్ళాక తలుపులేసి గడియ పెట్టింది.

***

“అమ్మగారండీ”

“ఊ…”

“బాబుగారు వస్తున్నారమ్మా”

“ఏ బాబుగారు గౌరీ?” చూస్తున్న ఫైళ్ళ లోనుంచి తలెత్తకుండానే తాపీగా అంది శారదాదేవి.

“అయ్యో! మన కలెక్టర్ బాబుగారమ్మా!”

“అవునా! ఏదీ, ఎక్కడ గౌరీ?” తలెత్తి కళ్ళజోడు సవరించుకుంటూ ఆవిడ అడగడం, ప్రేమ్ సాగర్ లోపలికి రావడం రెండూ ఒకేసారి జరిగాయి.

“అమ్మా! వందనం” అంటూ వంగి ఆవిడ కాళ్ళకు దండం పెట్టాడు చిరునవ్వు ముఖంతో.

“శ్రీఘమేవ కల్యాణ ప్రాప్తిరస్తు!”నవ్వుతూ ఆశీర్వదించిందావిడ

“ఏమిటిలా, చెప్పాపెట్టకుండా వచ్చేశావే?” నవ్వుతూ అడిగిందావిడ.

“ఈరోజు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిగారితో కలెక్టర్ల మీటింగ్ వుండిండె. ఇంత దూరం వచ్చాను కదా! అలాగే మిమ్ముల్నీ, నా వాళ్ళని చూద్దామని ఇలా వచ్చానమ్మా!” చిరునవ్వుతో జవాబు చెప్పాడు.

“సరే మంచి పనిచేశావ్. రా రా… కూర్చో ఇలా” అంటూ నవ్వుతూ కుర్చీ చూపారావిడ.

“టీ కాఫీ ఏమన్న తీసుకుంటావా ప్రేమ్?”

“ఊహు, ఏమీ వద్దమ్మా! ఇంకాసేపు వుండి బయలుదేరుతాను.”

“గౌరీ, గ్లాసెడు నీళ్ళు తీసుకరా.. బాబు కోసం.”

“సరేనమ్మా” అంటూ గౌరి లోనికెళ్ళి వెంటనే నీళ్ళు తెచ్చి ప్రేమ్ సాగర్ కిచ్చింది. నీళ్ళు తాగినాక ప్యాంట్ జేబులోనుంచి కర్చీఫ్ తీసి ఓమారు ముఖం తుడుచుకున్నాడు.

“ఇంకా ఏమిటమ్మా విశేషాలు?”

“ఏమున్నాయ్ ఇక్కడి విశేషాలు? అంతా మామూలే. నీ ఉద్యోగం ఎలా వుంది? ఈమారు మన ఆశ్రమ వార్షికోత్సవానికి నీవు ఒక్కడివే వచ్చినా ఫర్వాలేదు కానీ, రెండేళ్ల తర్వాత అంటే… ఆ పై ఏడాది మాత్రం నీకు కాబోయే భార్యతో పాటు జంటగా రావాలని ఇంతకు ముందే నీకోమారు చెప్పినట్లు గుర్తు. మర్చిపోయావా?”

చిన్నగా నవ్వాడు ప్రేమ్ సాగర్. ‘గుర్తుంది’ అన్నట్లుగా తల పంకించాడు.

“అలాగేనమ్మా మీ దగ్గర దాచే నా పర్సనల్ పనులేవీ చేయనని మీకు తెలుసుకదా! మరిక వస్తానమ్మా!” ప్రేమ్ సాగర్ లేచాడు.

అతన్ని సాగనంపడానికన్నట్లుగా ఆవిడ కూడా కుర్చీలో నుంచి లేచింది.

***

అనిందిత అలసటగా యింట్లోకి వచ్చింది. చేతిలోని బాగ్‍ని కుర్చీలో పెట్టి దగ్గరగా వున్న మరో కుర్చీలో చతికిలబడింది.

లోపలి నుంచి సుశీల గ్లాస్‌తో నీళ్ళు తెచ్చి యిచ్చింది కూతురికీ.

“ఏమైందే అనితా నీవెళ్ళిన పని?”

“అంతా ఓకె అయిందమ్మా! మాసార్ నన్ను కలెక్టర్ గారి దగ్గరికి తీసికెళ్ళి వారితో సహా నా రాజీనామా ఆమోదించేలా జరిగిందమ్మా” సంతోషంగా చెప్పుతున్నామె “అమ్మా, నాకు. ఎవరన్నా ఫోన్ చేశారా?” అని అడిగింది.

 “ఫోన్ నీ దగ్గరే వుంది కదా! ఇంటికెవరు ఫోన్ చేస్తారు?”

“ఓ, అవును కదా! మర్చేపోయానమ్మా” నవ్వుతూ అంటూ అనిందిత గదిలోకెళ్ళింది.

ఊర్నుంచి సర్పంచ్ లలితాంబ, వాళ్ళబ్బాయ్ మాధవ్ వచ్చిన సంగతి కూతురికి అస్సలు తెలియపర్చకూడదని ముందే నిర్ణయించుకోవడం వలన ఆ ఊసే ఎత్తలేదు సుశీల. రాత్రికి భర్తకు మాత్రం రహస్యంగా విషయమంతా వివరించింది.

భార్య చెప్పిందంతా విన్న పాండురంగం సంతృప్తిగా తల పంకించి “మంచి పని చేశావ్ సుశీలా! అనితకు ఏం చెప్పక పోవడమే ఉత్తమం” అన్నాడు.

“నేనూ అలాగే అనుకొని చెప్పలేదండీ … ఈమారన్నా బాగా చదివి పట్టుదలతో మీ కోరిక తీరుస్తుంది లెండి. నాకు మనస్సునిండా నమ్మకముందండి!”

“నీ నోటి చలువ వలన అలాగే జరగనీ సుశీలా! అంతకన్నా మనకు కావల్సిందేముంది చెప్పు” అంటూ ఆయన పండుకునుటకు తలగడ సరిచేసుకోసాగాడు.

“మీతో ఇంకో విషయం. చెప్పాలి”

“ఏంటిది… చెప్పు”

“రేపటినుంచి ఆఫీసు నుంచి రాగానే మీరిక దీపుగాడి చదువు విషయం చూసుకోవాలి”.

“ఓ, సరే. రేపటి నుంచి దీపు బాధ్యత నాదే.” నవ్వాడు పాండురంగం.

***

“వదినెమ్మా! ఓవదినెమ్మా!” అని పిలుస్తూ సత్యవతి నేరుగా ఇంట్లోకి వెళ్ళసాగింది.

“రా, రా! సత్యవతీ, ఎలా వున్నావు?” అని నవ్వుతూ ఎదురొచ్చింది లలితాంబ.

“మా దొరన్న ఇంట్లో లేడా?”

“ఉహు, లేడమ్మా… పొలానికెళ్ళాడు.

“మాధవ్ బాబు లేడా వదినెమ్మా?”

“వాడూ లేడు సత్యవతీ!”

“ఏం, అప్పుడే అమెరికా వెళ్ళిపోయాడా?”

“లేదు… వాడు మా తమ్ముడి వాళ్ళ దగ్గరికి మా పుట్టింటికెళ్ళాడు, చూసి రావడానికి వెళ్ళాడు.”

“అవునా! మేనమామ దగ్గరికి వెళ్ళాడన్న మాట .”

“మరే, వదినెమ్మా! మన అనిందితా మేడమ్ మనూరెందుకు రావడం లేదు?”

“నీ కొడుకు ఉపసర్పంచే కదా! అతన్నే అడగలేక పోయావా? సమాధానం చెప్పేవాడు కదా!”

“వాడ్నీ అడిగాను. వాడు చెప్పేదేదో వాడు చెప్పాడు. అస్సలు విషయమేమిటో నిన్ను అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాను.”

“తాను కలెక్టర్ కావాలని చదువుకోవడానికని ఉద్యోగానికి రిజైన్ చేసిందట. ఆమె బదులిప్పుడు… మన పక్కూరి కార్యదర్శి కనకమహాలక్ష్మికీ మనూరి పని కూడా తాత్కాలికంగా అప్పగించారట. ఇందాకనే మన డి.పి. ఓ గారు ఫోన్ చేసి చెప్పారు.”

“అవునా? ఏమైనా అనిందితా మేడమ్ వలనే మన ఊరీనాడు ఇంత బాగా అభివృద్ధి చెందింది. శానా మంచి మనస్సుండామెకు…”

“ఆమె ఒక్కత్తి వలన ఈ ఊరు బాగుబడిందా? మనమందరం కలికట్టుగావుండి పని చేస్తెనే మనూరు ఇంత బాగా అభివృధ్ధిలో ముందు వరసలోకి వచ్చింది. ఇంకా ఏమిటి సంగతులు సత్యవతీ? నీకోడలేలా వుంది?”అని అడుగుతూ మాట మార్చింది లలితాంబ.

“నా కోడలికేం? బాగుంగుది వదినె! తాను వచ్చినప్పటి నుంచి నాకు ఎంతో నిశ్చింతగా వుంది. అన్ని పనులూ అన్ని విషయాలు తానే చూసుకుంటుంది. నాకెంతో సుఖంగా హాయిగా వుంది” అంటూ వెళ్ళడానికి లేచింది సత్యవతి.

“మంచిదేగా సత్యవతీ, పద వెళ్ళుదాం పంచాయితీ ఆఫీస్ దగ్గరకెళ్ళాలి పనుంది” అంటూ లలితాంబ కూడా లేచింది.

***

అనిందిత లేచింది మొదలు మళ్ళీ పండుకునే వరకూ నిరంతరం చదువుతూనే వుంది. తల్లే కూతురికి సమయానికి అన్నీ అందిస్తూ ఎక్కువ శ్రమ పడుతుంది. దీపు అస్సలు అక్క దగ్గరికి వెళ్ళడమే పూర్తిగా బందైంది. ఊర్నించి ఎవరన్నా ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఒక్కోసారి ఫోన్‌ని స్విచ్ఛాఫ్ చేసి పెడుతుంది. ఎవరికన్నా ఫోన్ చేయాలనుకున్నప్పుడే ఆన్ చేస్తుంది. తాను పూర్తిగా ఏకాగ్రతతో చదువుపైనే దృష్టి నిలిపింది.

నిమిషాలు గంటలుగానూ, గంటలు రోజులుగానూ, రోజులు వారాల్లాగా, వారాలు నెలలుగానూ కాలచక్రం త్వరిత గతిన తిరుగుతూనే వుంది. ఈ కాల వ్యవధిలో ఓ రెండు సార్లు మాత్రం కలెక్టర్ ప్రేమ్ సాగర్ ఫోన్ చేసి తన చదువెలా సాగుతుందో అడిగి తెలుసుకుంటున్నాడు.

అనిందిత అతను, అలా వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటున్న సమయంలో.. ఏదో ఒక విషయం మీద చర్చించుకునే సమయం పూర్తి అయిన తర్వాత ఆమె తండ్రి పేరుని, ఆయన ఏం వుద్యోగం చేస్తారంటూ ఆరా తీస్తున్నట్లుగా యథాలాపంగా అడిగినట్లుగా అడిగి సెల్ నెంబర్‌తో సహా అన్ని వివరాలు తీసుకున్నాడెందుకనో…

ఎందుకు, ఏమిటి, అని ఏ మాత్రం సందేహం కూడా లేకుండా తండ్రి సెల్ నెంబర్‌తో పాటు అన్ని వివరాలూ అతనితో చెప్పేసింది అనిందిత.

మరి కొన్ని నెలలు త్వరితగతిన కాలచక్రంలో గడిచి పోయాయి.

అనిందిత సివిల్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. బాగా రాశానని మహదానందంతో వుంది. యింటర్యూకి నూతనోత్సాహంతో చదువుతుందామె.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here