Site icon Sanchika

ప్రేమ పరిమళం-18

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సు[/dropcap]శీల కాస్త తీరిగ్గా మంచంపై నడుం వాల్చింది. కూతురి గత జీవితాన్ని గురించి అలోచించసాగింది. కాన్పు అయిన రెండు గంటల వరకూ అనితకు స్పృహ లేకుండె. ముందుగానే తాము బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన, పుట్టిన ఆ బాబు అనిందిత భవిష్యత్తుకు ప్రతిబంధకం కాకూడదనే ముందుచూపుతో, పుట్టిన ఆ బిడ్డ చనిపోయాడని అక్కడి నర్స్‌తో, డాక్టర్‌తో చెప్పించడం వలన మొదట నమ్మకపోయినా ఆ తరువాత అదే నిజమని తెలుసుకొని ‘అయ్యో, భగవంతుడా! బావ జ్ఞాపకాలేవీ నాకు లేకుండా దూరం చేశావా?’ అంటూ తెగ రోదించింది.

అది చూసి కన్నతల్లైన సుశీల మాతృ హృదయం లోలోన తెగ బాధపడింది. “ఏడవకు అనితా! నీకు ఈ లోటు లేకుండా ఏ అనాథ శరణాలయంలో నుంచన్న ఓ బాబుని తెచ్చుకొని పెంచుకుందాములే! బాధపడకు; దుఃఖించకు” అంటూ కూతురిని ఓదార్చింది.

హాస్పిటల్ నుంచి యింటికి వచ్చాక అనిందిత అనుక్షణం ఏడుస్తూనే గడపసాగింది. ఓ ఆరు నెలలు అలాగే బాధాతప్త హృదయాలతో గడిపారు. ఇక ఇక్కడుంటే కూతురి పరిస్ధితి ఇలాగే వుంటుందని గ్రహించి, అక్కడినుంచి హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. వచ్చే ముందు నమ్మకస్థురాలైన బాగా తెల్సిన ఓ నర్సు దగ్గర డబ్బులిచ్చి వుంచిన, అనిందితకు పుట్టిన ఆ బాబుని అనాథ అని తెచ్చి వాళ్ళే పెంచుకుంటున్నట్లుగా నాటకం ఆడారు… కూతురికి ఏ మాత్రం అనునూనం రాకుండా. భవిష్యత్తులో కూతురుకి మళ్ళీ పెళ్ళి చేసినా బాబు విషయం ఆమె జీవితానికి అడ్డంకిగా రాకుండా చాలా పకడ్బందిగా ప్లాన్ వేసి వాడికి ఓరోజు దీపక్ అని నామకరణం చేసి తమ స్వంత కొడుకులాగానే పెంచసాగారు సుశీలా పాండురంగం. అమ్మమ్మను కన్నతల్లిగానూ, కన్నతల్లిని అక్కగానూ పిలిపిస్తూ వాళ్ళిద్దరి ప్రేమానురాగాల మధ్య అపురూపకంగా పెంచి పెద్ద చేశారు. ఈ రహస్యం ఆ భార్యాభర్తలకు తప్ప అనిందితకు గూడా తెలియదీనాటికి కూడాను.

“అమ్మా! నాన్న వచ్చారు.” అంటూ దీపు పిలుపుకు ఈలోకంలోకి వచ్చింది సుశీల.

***

ఆరోజు అనిందితకు వైవా లాంటి ఇంటర్వ్యూ అయిపోయింది. బాగా జరిగింది. ప్రేమ్ సాగర్ అనిందితకు ఫోన్ చేసి, ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో, తనేం జవాబు చెప్పిందో అన్నీ వివరంగా అడిగి తెలుసుకున్నాడు. అతను కూడా సంతృప్తి పడ్డాడు.

అనిందితకు తన చదువంతా అయిపోయినందుకు ఎంతో సంతోషంగా వుంది. దీపుతో బాగా ఆడుకోసాగింది. వాడు కూడా రెట్టింపు ఉత్సాహాంతో అక్కతో తెగ తిరిగాడు. నచ్చిన పార్కులకు సినిమాలకు వెళ్ళాడు అక్కతో కలిసి. తల్లితో ఇష్టమైన వంటకాలు చేయించుకొని తిన్నారు.

“అక్కా! ఓసారి మెట్రో ట్రైన్ ఎక్కి అలా అలా తిరిగొద్దాం.”

“ఓకె, డన్ దీపూ” అలా వాళ్ళిద్దరూ హుషారుగా తిరుగుతుంటే సుశీలా పాండురంగానికి సంతోషంతో కడుపు నిండిపోసాగింది.

ఎందుకనో ఓమారు పుష్పాల గూడెంకి ఫోన్ చేయాలనిపించింది అనిందితకు.

వెంటనే రాయప్పకి ఫోన్ కలిపింది.

“హలో, నమస్తే మేడమ్! ఎన్నాళ్ళకు మీరు ఫోన్ చేశారు?” అతని గొంతులో నిండా సంతోషం నింపుకున్నట్లుగా మాట్లాడాడు.

“నమస్తే! మీరెలా వున్నారు ఉపసర్పంచ్ గారూ! ఊళ్ళో అందరూ బాగున్నారు కదా?”

“ఆ, అంతా బాగే మేడమ్! ఇప్పటికీ ఈ ఊళ్ళోని జనాలు మిమ్ముల్ని మర్చిపోలేదు. ఊళ్ళో ఏ కార్యక్రమాలు జరిగినా మిమ్ముల్ని తప్పకుండా గుర్తు చేసుకొని తీరాల్సిందే.. మీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఓమారు తప్పకుండా రండి మేడమ్! ఇంకా మీ స్ఫూర్తి తోనే ఈ ఊర్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకపోతున్నాం.”

“గుడ్, వెరీ గుడ్! అభివృధ్ధి అన్నదెప్పుడూ కుంటుపడి ఆగిపోగూడదు ఉపసర్పంచ్ గారూ! నిరంతరం ముందుకు సాగుతూనే వుండాలి. నాకూ ఓమారు అక్కడికి రావాలనే వుంది. తప్పకుండా వస్తాను.”

“తప్పకుండా రండి! మాఊరి వాళ్ళమంతా మీకు వెల్‌కమ్ చెప్పడానికి ఆల్వేజ్ రెడీ మేడమ్!”

“ఓకె, ధాంక్యూ!”

***

“హల్లో అమ్మా, బాగున్నారా?”

“బాగున్నాం ప్రేమ్! ఏమిటి విషయం? ఈవేళప్పుడు ఫోన్ చేశావేం?”

“అదే అనిందిత విషయం మీకు ఇంతకు మునుపే చెప్పాను కదమ్మా!”

“అవును చెప్పావ్. మరి ఏమన్నాడు వాళ్ళ నాన్నగారు?”

“ఆ విషయమే చెప్పడానికని ఫోన్ చేశాను. ఆయన ఓకె అన్నారు. ఇకపోతే మీరోమారు వాళ్ళింటికెళ్ళి అనిందితను ప్రత్యక్షంగా చూసి, వాళ్ళ పేరంట్స్‌ని కలిసి వస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయమమ్మా”

శారదాదేవి చిన్నగా నవ్వింది. “ఓ, మమ్మల్ని పెద్దరికపు బాధ్యత వహించమంటున్నావ్. అంతే కదా?”

“మరి నా తరుపున పెద్దవారు మీరు తప్ప ఎవరున్నారు?”

“సరే ప్రేమ్! శుభకార్యానికి కదా! కొంచెం మంచి రోజు చూసుకుని వెళ్ళితే బాగుంటుందేమో! నేను మీ అంకుల్ యిద్దరమేనా? నీవు వస్తావా మాతో పాటు”

“లేదు నేను రానమ్మా! ప్రస్తుతం మీరెళ్ళితే చాలు”

“పంచాంగం చూసి ఏ రోజైతే బాగుంటుందో రేపు చెప్తాను నీకు ప్రేమ్! వాళ్ళింటికి అమ్మాయిని చూడడానికీ మొదటిసారి వెళ్ళుతున్నాము కదా! ఒట్టి చేతులతో వెళ్ళితే ఏం బాగుంటుంది. ఏమైనా తీసికెళ్ళాలి. ఐతే ఆ ఏర్పాట్లేవో నేను చూసుకుంటానులే”

“ఆహా, మీరేమీ వద్దు. అవన్నీ నేను ముందుగానే తెచ్చివుంచాను. రంగ కార్లో అక్కడి కొస్తాడు. మీరు కార్లో వెళ్ళిరావడమే అమ్మా!”

“ఓకె ప్రేమ్, గుడ్ నైట్”

***

అనిందిత, దీపు యిద్దరూ కలిసి బయట బాల్ ఆడుతున్నారు. అప్పుడే ప్రేమ్ సాగర్ ఫోన్ చేశాడు. ఏదో పనిలో వున్న సుశీల “అమ్మాయ్, అనితా! ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు” అని బిగ్గరగా కేకేసింది.

“తర్వాత ఆడుదాం దీపూ” అంటూ లోపలికొచ్చి సెల్ ఎత్తింది.

“హలో, ఎవరు?”

“నేను, ప్రేమ్ సాగర్‌ని అనిందితా!”

“ఓ, మీరా సారా? చెప్పండి” వినమ్రంగా అడిగింది.

“ఏం చేస్తున్నావ్?” మొదటి సారిగా ఆమెని ఏకవచన సంబోధన చేస్తూ అడిగాడు.

“మా తమ్ముడితో బయట బాల్ ఆడుతున్నాను సార్!” నవ్వుతూ చెప్పింది.

“అవునా! నీకో తమ్ముడున్నాడా? నాతో ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పనే లేదే?!” ఆశ్చర్యంగా అడిగాడతను.

“అవును సార్! మీతో ఇలా చెప్పే సందర్భం, సమయం నాకెప్పడూ రాలేదు మరి”

“ఓకె, ఓకె… ఫర్వాలేదు. రేపు సాయంత్రం టైమ్ ఐదు ఆరు మధ్యలో మా అమ్మగారు శారదాదేవిగారు వస్తారు మీయింటికి. మాములుగా నిన్ను మీ అమ్మగారి వాళ్ళను కలవడానికి మాత్రమే. పెద్ద హడావుడి ఏమీ వద్దు. మీ నాన్నగారికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. అందుకని నీకు ఫోన్ చేసి చెప్తున్నాను అనిందితా!”

“సరే, మరి మీరు రావడం లేదా మా యింటికి సార్?”

“ఐతే నన్ను రమ్మంటావా?” కవ్వింపుగా అడిగాడతను.

“తప్పకుండా రండి సార్”

“లేదులే… నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను అనిందితా! రేపు నాకు అర్జంట్ పని వుంది.” అంటూ ఫోన్ పెట్టేశాడతను.

“అమ్మా!” అంటూ అనిందిత తల్లితో విషయమంతా వివరించింది.

“అవునా! ఐతే రేపు మీ నాన్నను సెలవు పెట్టమను. ఫోన్ చేసి విషయం చెప్పు అనితా!”

“అక్కరలేదు. వాళ్ళొచ్చేది సాయంత్రం ఐదు తర్వాతే. నాన్నని నాల్గింటికి రెండు గంటలు పర్మిషన్ తీసుకొని రమ్మంటే చాలమ్మా. నీవేం అనవసరంగా కంగారుతో హడావుడి పడొద్దని సారే మరీ చెప్పారు”

“ఇంతకీ రేపు మనింటికి ఎవరొస్తున్నారు అక్కా?” దీపు అక్క వంక, తల్లి వంక మార్చి మార్చి చూడసాగాడు. అనిందితేమో నవ్వసాగింది.

“చెప్పవేం అక్కా? నేనడుగుతుంటే. పైగా నవ్వుతావేంటి?” దబాయింపుగా అడగసాగాడు.

అనిందిత ఇంకా అలాగే నవ్వుతూ “అమ్మనే అడుగు రా!” అంది.

“అమ్మా, నీవు చెప్పమ్మా? రేపు సాయంత్రం ఐదు గంటలకి మనింటికి ఎవరొస్తున్నారు?”

“మన అనిందితని చూసుకోవడానికి పెళ్ళి వారొస్తున్నారు దీపూ!”

“ఆ, అక్కకి పెళ్ళిచూపులా! నాకు ఎవరూ చెప్పనే లేదు” ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.

“ఇప్పుడు చెప్పుతుందిగా అమ్మ, విను” అని అంది అనిందిత.

“అమ్మా, ప్లీజ్ చెప్పవా? బావ ఎవరు?”

“మీ బావ.. అంటే మీ అక్కకు కాబోయే భర్త నీకు తెల్సిన, నీవు మెచ్చిన ఆ కలెక్టర్ బాబే రా దీపూ!”

ఆమాట వినగానే దీపు “నిజమా, అమ్మా?” అంటూ పట్టలేని ఆనందంతో ఎగిరి గంతులేయసాగాడు ఇల్లంతాను. వాడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

“ఓరేయ్ దీపూ, నీవు మీ అక్క కలిసి ఇల్లంతా నీట్‌గా సర్దేసేయండీ. మీ నాన్నకు ఓమారు ఫోన్ చేయి అనితా! వాళ్ళు వస్తున్నందుకు రేపుటికి కావాల్సిన వస్తువులు చెప్పుతాను. వచ్చేప్పుడు తీసుకొస్తారు.” సుశీల అప్పుడే హడావుడి పడిపోతుంది.

అనిందిత తన సెల్ నుంచి తండ్రికి ఫోన్ కలుపసాగింది

***

వాకిట్లో కారు ఆగింది. ఆ శబ్దానికి ఎదురు చూస్తున్న సుశీలా పాండురంగం ఒక్కసారిగా గబగబా బయటికొచ్చారు.

ముందుగా రంగ దిగి వెనక డోరు తెర్చి పట్టుకున్నాడు. శారదా దేవి క్రిందికి దిగగానే భార్యాభర్తలిద్దరూ చిరునవ్వు ముఖాలతో చూస్తు ఏక కంఠంతో నమస్కరించి మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించారు ఆవిడను.

శారదాదేవి కూడా ఆ దంపతులకు ప్రతినమస్కారం చేస్తూ వాళ్ళతో పాటు లోపలికి నడిచారు.

వాళ్ళ వెనకాలే రంగ ఓ పెద్ద పళ్ళ బుట్ట, స్వీట్స్, పూలు బట్టల పాకెట్ వున్నమరోబ్యాగ్ తెచ్చి ఆవిడ పక్కనే పెట్టి వెళ్ళిపోయాడు.

నిండు ముతైదువతనంతో ఆకుపచ్చ పెద్ద జరీ బార్డరున్న గద్వాల చీర కట్టుకొని సిగచుట్టూ మల్లెపూల దండపెట్టుకుంది. నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని… చేతులనిండా ఆకుపచ్చ మట్టి గాజులేసుకొంది. పెద్దరికంతో హుందాగా వుంది.

“అమ్మా! మీవారు కూడా వస్తారని కలెక్టర్ గారన్నారు. వారు రాలేదెందుకమ్మా?” పాండురంగం సౌమ్యంగా అడిగాడావిడను.

“అవునండీ. యిద్దరం కలిసే వద్దామనుకున్నాం కానీ, చివరి క్షణంలో రాలేకపోయారు మావారు. ఆయనకి రాత్రినుంచి కొంచెం ఒంట్లో బాగుండడం లేదనీ, నేను ఒక్కత్తినే వెళ్ళుతున్నాననీ ప్రేమ్‌కు ఫోన్ చేసి చెప్పాను లెండి.”

“ఓహో, అలాగా” అని తల పంకించాడు పాండురంగం.

సుశీల ట్రేలో వాటర్ గ్లాసులు పెట్టుకొని తెచ్చి ఆవిడకందించింది.

దీపుని ఆవిడ అదే పనిగా చూస్తూ “ఎవరి బుడతడు?” అడిగింది.

“మా అబ్బాయేనమ్మా. అనిందితకు తమ్ముడు. పేరు దీపక్. వారికి నమస్కారం చేయ్ దీపూ” అన్నాడు నెమ్మదిగా.

ఆ వెంటనే దీపు ఆవిడ దగ్గరగా వెళ్ళి వంగి పాదాలకు నమస్కరిస్తూ “నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మా!” అన్నాడు.

ఆవిడ నవ్వుతూ “సకలవిద్యా ప్రాప్తిరస్తు” అంటూ వాడి తలమీద చేయిపెట్టి దీవించి, కాస్త వంగి వాడిని పైకి లేపింది. “ముద్దుగున్నడు ఈ బాబు. అనిందిత తర్వాత మీకు చాలా ఏళ్ళకి సంతానం కల్గిందన్నమాట.” నవ్వుతూ అంటూ సుశీల వంక చూసింది శారదాదేవి.

“అవునండీ. యించుమించు యిరువై ఏళ్ళ తేడా వుంది యిద్దరి మధ్య” కొంచెం సిగ్గుతో చిన్నగా నవ్వింది సుశీల.

“మరే, యిక పెళ్ళికూతుర్ని ఓమారు పిలుస్తారా! బట్టలివ్వాలి… వర్జ్యం వస్తుంది.” ఎదుటి గోడకు కనిపిస్తున్న గడియారం వంక చూస్తూ అంది శారదాదేవి.

పాండురంగం గదిలోకెళ్ళాడు కూతురి కోసం. సుశీలనేమో వంటింట్లో కెళ్ళి ఓ పెద్ద ట్రే తెచ్చి ఆవిడకు సమీపంలో పెట్టింది.

అనిందిత తండ్రి వెంట యివతలికొచ్చి శారదాదేవికి రెండు చేతులు జోడించి వినయంగా నమస్కారం చేసింది.

ఓమారు ఆవిడ ప్రసన్న వదనంతో అనిందితను నిలువెల్లా పరికించి ‘ప్రేమ్‌ది సూపర్ సెలక్షన్’ అని మనస్సులో అనుకోకుండా వుండలేకపోయింది.

“అనిందితా! ఇలా వచ్చి కూర్చో అమ్మాయ్!” అంటూ తన పక్కగా వున్న కుర్చీలో కూర్చోమని పిలిచింది శారదాదేవి. నవ్వు ముఖంతో ఆమె వచ్చి కూర్చుంది.

“మా ప్రేమ్ హృదయమంతా పేరుకు తగినట్లుగానే సాగరమంతా ప్రేముంది. ఆ ప్రేమ పరిమళాలన్నీ ఆర్తులకు, అనాథలకు పంచుతూనే వుంటాడు. చిన్నప్పటి నుంచీ ప్రేమ్ వ్యక్తిత్వం అదే. నీదీ అలాంటి వ్యక్తిత్వమేనని ప్రేమ్ చెప్పాడు. మీ యిద్దరికీ మంచి మనస్సులతో పాటూ, ఈడుజోడు కూడా చక్కగా బాగా కుదిరింది. కాబోయే కలెక్టరివైన నీకు శుభాశ్శీసులు, అభినందనలు…” అంటూ బ్యాగ్ లోని వస్తువులన్నీ తీసి ట్రేలో పెట్టసాగింది. పూలు పండ్లు పెద్ద స్వీట్ బాక్స్ ఓ పక్క, మరో పక్క చీర బ్లౌజ్ పైన తాంబులం పెట్టి సుశీల తెచ్చి యిచ్చిన భరిణె నుంచి ఎర్రటి కుంకుమ తీసి అనిందిత నుదుటిపై బొట్టుపెట్టి ఆ ట్రేతో పాటు అందించింది. సుశీల అందించిన అక్షింతలు తీసుకొని వంగి తన పాదాలకు నమస్కరిస్తున్న అనిందితని మనసారా ఆశీర్వదించింది శారదాదేవి.

ఈ దృశ్యాలన్నీ దీపు అక్క సెల్‌తో చక్కగా ఫోటోలు తీస్తున్నాడు.

“తొందరగా చీర కట్టుకొనిరా అమ్మాయ్” మృదువుగా చెప్పిందావిడ.

తన వంక చూస్తున్న కూతురితో “వెళ్ళు అనితా! చీర కట్టుకొనిరా” అంటూ పూలదండ మాత్రం తల్లో పెడుతుంటే, అనిందిత జడని అప్పుడు చూసిన శారదాదేవి ఆశ్చర్యపోతూ “మీ అమ్మాయ్ జుత్తుకి రోజూ ఏం నూనె రాస్తారమ్మా!” నవ్వుతూ సుశీలనడిగింది.

“మామూలు కొబ్బరి నూనేనమ్మా”

“ఈ రోజుల్లో ఇంత జుత్తున్న ఆడపిల్లలు కన్పించడమే అరుదు.” అంటూ, “మరిక పెళ్ళి ఎప్పుడు చేద్దామనుకుంటున్నారండీ” ఈమారు పాండురంగం వైపు తిరిగి అడిగింది.

“మీ యిష్టమమ్మా. ప్రేమ్ బాబుగారు ఎప్పుడంటే అప్పుడు వివాహం చేయడానికి మేము రెడీయే!”

“ఓమారు అమ్మాయ్ అభిప్రాయం, అబ్బాయ్‌ని అడిగి కనుక్కొని మీరా ప్రయత్నంలో వుండండి.”

“తప్పకుండా” అంటూ తల పంకించాడాయన.

ఈలోగా సుశీల రెండు ప్లేట్లలో స్వీట్ హాట్ పెట్టుకొని తెచ్చి శారదా దేవికి అందించింది. ఇంకో ప్లేట్ పాండురంగం బయటికెళ్ళి డ్రైవర్ రంగకు ఇచ్చివచ్చాడు మంచినీళ్ళతోపాటు.

“ఇవన్నీ నేను తినలేనమ్మా” అంటూ ఓ చిన్న స్వీట్ ముక్క మాత్రమే తీసుకుందావిడ. ఈలోగా ఆవిడ కాఫీయో, టీయో ఏది తాగుతారని అడిగి తెల్సుకొని చక్కెర తక్కువ వేసి కాఫీ కల్పుకొని తెచ్చి యిచ్చింది

ఖాళీ కాఫీ కప్పు కింద పెడుతుంటే గది తలుపులు తెర్చుకొని అప్పుడొచ్చిది… కొత్తచీర కట్టుకొని తయారయిన అనిందిత.

ఆ చీరలో ఎంతో అందంగా కనిపిస్తున్న అనిందితని చూపు మరల్చకుండా చూడసాగింది శారదాదేవి. ప్రేమ్ తెచ్చిన ఆ ఖరీదైన చీర అనిందితకు బాగా సూటైంది. ఆవిడ ముఖం చిరునవ్వుతో వెలిగి పోసాగింది.

“వావ్, అక్కా! ఈ చీరలో సూపర్‌గా వున్నావ్!” అంటూ దీపు పదే పదే ఫోటోలు ఉత్సాహాంగా తీయసాగాడు.

లైట్ బ్లూ కలర్‌లో జరీ బార్డరున్న ఆ చీరకి, సింపుల్‌గా వర్క్ చేసిన కొంచెం డార్క్ బ్లూ కలర్ లోనే వున్నా బ్లౌజ్ అనిందితకు అతికినట్లుగా చక్కగా సరిగ్గా సరిపోయింది.

ట్యూబ్ లెైట్ వెలుగులో మెరిసిపోతున్నట్లుగా కనిపిస్తుంది అనిందిత.

“చీర చాలా చాలా బాగుందమ్మా! మీరే సెలక్ట్ చేశారా?” అంటూ సుశీల మెచ్చుకోకుండా వుండలేకపోయింది.

‘లేదన్నట్లు’గా తల అడ్డంగా ఊపారావిడ. “ఈ చీర, బ్లౌజ్ అంతా ప్రేమ్ సెలక్షనే! బ్లౌజ్ కొలతలేమన్న నిన్ను అడిగాడా అమ్మాయ్?” అన్నారు.

ఆ మాటకు అనిందిత సిగ్గు పడుతూ “లేదండీ” అంది కళ్ళు కింది వాల్చుకొని. కొత్తచీరతో మళ్ళీ ఓమారు శారదాదేవితోపాటు తల్లి తండ్రులకు కూడా నమస్కరించింది. అందరూ కలిసి ఫోటోలు దిగారు. అనిందితని ఒక్కత్తిని చాలా ఫోటోలు తీశాడు దీపు.

వెళ్ళొస్తానని అందరితో చెప్తూ, అనిందిత దగ్గరగా వెళ్ళి రెండు భుజాలపై చేతులేసి ఆమెని దగ్గరికి తీసుకుంది శారదాదేవి. “నీలాంటి అమ్మాయ్‌ని తను ఇష్టపడ్డం నిజంగా ప్రేమ్ చేసుకున్న అదృష్టం. మీరిద్దరూ ఒకర్ని ఒకరు అంగీకరించడం బ్రహ్మలిఖితం. నీవు ప్రేమ్ కలిసి ఈమారు మా ఆశ్రమ వార్షికోత్సవానికి రండి” నవ్వుతూ ఆహ్వానిస్తున్న ఆవిడ కళ్ళెందుకో చెమ్మగిల్లాయి. బహుశా, ఆనందంతో కాబోలు!

“నేను రావద్దా అమ్మమ్మగారూ!” దీపు అడిగిన ఆ ప్రశ్నకు ఆవిడ నవ్వి “తప్పకుండా రావోయ్” అంటూ చేయూపింది.

శారదాదేవిని సాగనంపుతూ అందరూ వాకిట్లో ఆగిన కారు దగ్గరికి వెళ్ళారు.

(ఇంకా ఉంది)

Exit mobile version