ప్రేమ పరిమళం-2

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”ముం[/dropcap]దుగా ఈ సమ్ చేయిరా దీపూ!”

“అక్కా! ఇది నాకొచ్చు. చేయడం చాలా ఈజీ. ఇదిగో ,ఈ నాలుగవ చాప్టర్‌లో ఒకటి… రెండు చెప్పు. మిగితావి నేను చేసేస్తాను.”

దీపక్ చాలా తెలివైన కుర్రాడే. స్కూల్లో కూడా అన్ని సబ్జెక్జె లో క్లాసులో కూడా ఫస్ట్, సెకండ్‌లో వుంటాడు.

“సరే” అంటూ అనిందిత ఆ లెక్కల్ని ఓమారు పరిశీలనంగా నిశితంగా చదివి… ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వేసి వాడికి బాగా అర్థమయ్యేలా చెప్పింది. మిగిలిన లెక్కలన్నీ తనతోనే చేయించింది. మధ్యలో చిన్న చిన్న మిస్టెక్స్ చేస్తుంటే గుర్తించి… సరి చేసి మళ్ళీ ఓమారు విడమర్చి చెప్పిందామె. మిగితా లెక్కలన్నీ వాడే చకచకా చేసేశాడు.

“గుడ్, దీపూ!కీపిటప్” అని నవ్వి వాడి భుజం తట్టి ప్రశంసిస్తూ ఇవతలికకొచ్చింది అనిందిత.

దేవుని గదిలో దీపారాధన చేసి ఇవతలికొస్తున్న తల్లిని చూస్తూ “నాన్న యింకా రాలేదేంటమ్మా?” అంది.

“వస్తారు, రోజూ ఈ టైమ్‌కేగా వచ్చేది. ఇవాళిక్కడ సంత కదే! అందుకని దార్లో ఆగి కూరగాయలు తెస్తారు కాబోలు. అందుకనే లేటైందేమో!ఉదయం సంచీ కూడా పట్టుకెళ్ళారు అనితా!”

“రేపు ఉదయం వంటకి తరిగి పెట్టడానికి కూరలేమీ లేవా అమ్మా?” ఫ్రిజ్ వైపు వెళ్ళుతూ అడిగిందామె.

“పచ్చిమిర్చి, దోసకాయ వుంది. రేపు అవే తరిగి పప్పు చేస్తాను. మీ నాన్న ఏమన్న ఆకు కూరలు తెస్తారేమో చూద్దాం. భోజనాలైయ్యాకైనా తరగొచ్చులే అమ్మాయ్!”

“సరే మరిక” అంటూ హల్లో సోఫాలో కూర్చొని టి.వి ఆన్ చేసింది.

తల్లి ఖాళీగా కూర్చోవడం చూసి “అమ్మా! భక్తి ఛానల్ పెట్టనా? “అడిగింది.

“ఊ, పెట్టు… మీ నాన్న వచ్చే వరకు కాసేపు చూస్తాను.

సోమవారం కాబట్టి సోమనాథ్ స్వామి జ్యోతిర్లింగానికి అభిషేకం చూపిస్తున్నారు.

“ఓ వారం పది రోజులు ఎక్కడికన్నా యాత్రలకెళ్ళుదామన్నా అవ్వడం లేదు. ఎప్పుడూ సంసార లంపటమే… ముందుగా దక్షిణదేశ యాత్ర చేయాలని వుంది. ఈ చిన్న కోరిక నా జీవిత కాలంలో తీరుతుందో లేదో మరి…” నిరాశ నిస్పృహలతో నిట్టూర్చిందావిడ.

“ఎందుకు తీరదమ్మా! ఇదేమంత పెద్ద కోరికా…. తీరకపోవడానికి. నీవు నాన్న వెళ్ళిరండి. దీపుని నేను చూసుకుంటాను.”

“ఆ.. ఏం పోతాంలేవే. అన్నట్లు దీపుది హోమ్ వర్క్.. చదువుకోవడం అయిపోయిందా?”

“అయిపోయిందమ్మా. దీపూ, బుక్స్ బ్యాగ్‌లో పెట్టుకొని కాస్త బయటికెళ్ళి ఆడుకో. నాన్నరాగానే రావాలి.”

“అలాగే అక్కా!” దీపు సంతోషంతో క్షణంలో తుర్రుమన్నాడు.

అంతలోనే అనిందిత సెల్ మోగింది. ఆన్ చేసి “హలో” అంది.

“మేడమ్ ! నేను యాదగిర్ని.”

“ఏంటి యాదగిరీ, ఈవేళ్ళప్పుడు ఫోన్ చేశావ్?”

అడుగుతూన్న అనిందితకు…. ఎవరిదో ఏడ్పు స్వరంతో పెద్దగా వాళ్ళావిడ అరుస్తూ మాట్లాడ్డం ఫోన్‌లో వినిపిస్తుంది. ఆమె మనస్సేదో కీడును శంకించింది.”విషయమేమిటి యాదగిరీ?”ఆదుర్దాగా ప్రశ్నించింది.

“మీరే చెప్పండి మేడమ్! నేను చెత్త రోజూ తీయడం లేదంటూ బషీర్ వాళ్ళావిడ మా యింటికొచ్చి నాతో పెద్ద గొడవ పెట్టుకున్నారు. నాకు జ్వరం బాగా వచ్చి లేవలేని పరిస్ధితిలో మొన్నీ మధ్య రెండు  మూడురోజులే కదా మేడమ్… నేను వెళ్ళంది. తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా పెట్టమని నేనెన్ని మార్లు ఆ అక్కకు చెప్పినా వినదుగానీ , పైగా నాతోనే రగడ.డబ్బులడిగితే పదిసార్లు ఇంటిచుట్టూ తప్పించుకుంటారు.”

“ఏమన్నాడేమిటి?”

“మీరు వెళ్ళిపోయిన కాసేపటికి మొగుడు పెళ్ళం నా ఇంటిమీదికి వచ్చారు పోట్లాటకి; పిచ్చిపిచ్చిగా తిట్లు… మా యింటిదేమో ఈ గొడవకి ఏడ్పు షురు చేసింది. ‘ఎందుకీ సెత్త బతుకు… నీవీ పని సేయకు మావా! చిన్న మేడమ్ రేపు రాగానే చెప్పేసేయ్. ఈ పని, ఈ ఊరు వదిలి యింకెక్కడికైనా వెళ్ళి కూలీ నాలీ చేసుకొని బతుకుదాం’ అంటుందమ్మా!”

“నా మాటగా చుక్కమ్మకు చెప్పు. రేపు వచ్చి అన్ని విషయాలు చక్కదిద్దుతాను. ఇంకోమారు ఇలాంటి సంఘటన నీపట్ల జరగకుండా ప్రయత్నిస్తాను. రేపు అత్యవసర గ్రామ సభ వున్నట్లుగా సర్పంచ్ గార్కి, ఉపసర్పంగార్కి, వార్డ్ మెంబర్స్‌కి మిగిలిన వాళ్ళందరికీ తెలిసెలా చాటింపేయ్ యాదగిరీ! ఏదీ ఓ మారు మీ ఇంటా విడ చుక్కమ్మకు ఫోన్ యివ్వు “

“మేడమ్ …” ఏడ్పు స్వరంతో అస్పష్టంగా …అటువైపు నుంచి వినిపించింది.

“ఏడవకు చుక్కమ్మా! మీరు ఎక్కడికీ ఆ వూరొదలి వెళ్ళిపోవడానికి వీల్లేదు సరేనా? బషీర్ వాళ్ళావిడ మాటలతో మీ యిద్దరి మనస్సులు చాలా బాధాగ్నికి గురైనాయని నీ ఏడ్పు ద్వారా తెలుస్తూనే వుంది. ఈ రాత్రి కాస్త ఓపిక పట్టు.రేపు నేనొచ్చాక మీటింగ్ పెడ్తాను. డి.ఎల్.పి.ఓ.( డివిజనల్ లెవల్ పంచాయితీ ఆఫీసర్) మేడానికి కూడా ఫోన్ చేసి రప్పించి రేపు ఉదయం పదింటికి మీటింగ్ పెట్టి అందరి సమక్షంలో మాట్లాడి ఇలాంటి సంఘటనలు మారోమారు జరగకుండా చూస్తాను. సరేనా?”అని అనునయంగా ఓదారుస్తూ ఓఅధికారిగాకాకుండా సాటి మహిళగా ప్రేమగా మాట్లాడి ఫోన్ ఆఫ్ చేసింది.

బాధతో బరువుగా ఓనిట్టూర్పు విడిచిందామె.

కూతురు ఫోన్‌లో మాట్లాడుతున్న మాటల్ని సావధానంగా విన్న సుశీల “ఏమైందే మీ ఊళ్ళో… ఎప్పుడూ ఏదో గొడవ పడుతూనే వుంటారుగా! గ్రూప్ వనో, సివిల్ ఎగ్జామ్ ఐనా రాసి ప్యాసయి వుంటే ఏదో ఓ మంచి వుద్యోగమన్నా వచ్చేది. ఇలాంటి చిన్నచిన్న పల్లెటూర్లలో ఒకరి మీద ఒకరికి కక్ష్యలు, కోపాలు, తాపాలు… నీవా ఊళ్ళో ఎలా పని చేస్తున్నావో నా కర్థం కావడంలేదు. నీ మాటల్లోని ఎంతో మెత్తదనం, మంచితనం కనిపిస్తుంది కాబట్టి, ఆ ఊరివాళ్ళు నీవంటే అంత ఇష్టపడుతారు కదూ అనితా!”

“అవునమ్మ నీవన్నది నిజం. ‘కక్షలు సాధించే పల్లెలో, తీయని ప్రేమలు నింపావు’ అంటూ ఆ వూరివాళ్ళు నన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. నేనీ ఉద్యోగంలో చేరినప్పుడు ‘ఈ ఊర్ని నేనెలా బాగు చేయగలను? నానుంచీ పని అవుతుందా? ‘అన్న సంశయంతో, భయాందోళనలతో ఉద్యోగంలో చేరేందుకు పోస్టింగ్ యిచ్చిన ఆ చిన్న పల్లె టూరిలో కాలు పెట్టాను. నేనెంతో సాధించాను అని అనుకుంటున్న తరుణంలో… ఇదిగో, ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు జరిగినప్పుడు మాత్రం నా ఊహలు తలకిందులైపోతున్నాయమ్మా!” అని బాధపడుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని “ఏం ఫర్వాలేదు అనితా! నీలోని ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని సడలి పోనీయకు. ఊర్నెంత శుభ్రంగా బాగుచేసుకున్నా, వూళ్ళో వుండే కొందరి మనస్సులో వున్న కల్మషాన్ని శుభ్రం చేయలేం కదా! అందుకనే ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే వుంటాయి. మీ నాన్న నీకెప్పుడూ చెప్తూనే వుంటారుగా తల్లీ! ‘మనస్సులో సంకల్ప బలం దృఢంగా వుంటే అది తప్పకుండా తీరుతుంద’ని. నీవు ఆ ఊరిని ‘పల్లెప్రగతి’లో భాగంగా అన్ని విధాలా అభివృద్ధి సాధించావు కదా అనితా! ఎందుకింత బాధ పడుతావు?”

“అవునమ్మా, నన్ను కలెక్టర్‌గా చూడాలన్న నాన్న కోరిక తీరెలా నాలోని ఆ శుభసంకల్పాన్ని మరింత పటిష్టంగా, దృఢంగా నిర్ణయించుకొని ఈమారు బాగా పట్టుదలగా చదివి ఐఏయస్ అవ్వడాన్కి నా శాయశక్తులా కృషి చేస్తానమ్మా!”

“అంతకన్నా మీ నాన్నకు ఇంకేం కావాలి తల్లీ! అదే నీవు ఆయనకిచ్చే గొప్పకానుక…”

***

మధ్యాహ్నం టైం ఒకటవుతుంది.

ఆ కంపెనీలో పొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్న పాండురంగం లంచ్ చేయడానికి తన క్యాబిన్ లోకి వచ్చాడు.

ఆయన వెనకాలానే సూపర్ వైజర్ ప్రకాష్ కూడా వచ్చాడు.

“సార్, మీతో కొంచెం మాట్లాడాలి.”

“రండి, ప్రకాష్! ఏంటి సంగతి?”

“మీరామధ్య అంటే పోయిన నెల్లో అనుకుంటా… మీ అమ్మాయ్ పెళ్ళి సంబంధం గురించి, వివరాలిచ్చి చెప్పారుకదా! ఆ విషయమే మాట్లాడుదామని వచ్చాను.”

“అవునవును. మీతో చెప్పిన ఆ సంగతి కూడా నేనెప్పుడో మర్చేపోయాను. నేనెలాంటి మతిమరుపు తండ్రినో చూడండి. ముందు మీరిలా కూర్చోండి.”

ప్రకాష్ ఆయనకి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. “ఊ,ఇకిప్పుడు చెప్పండి పెళ్ళివాళ్ళ విశేషాలు?” సంతోషంగా అడిగాడాయన

“అబ్బాయ్ పేరు నీలేష్. ఎమ్‌సిఏ చేశాడు. మరేవో కంప్యూటర్ కోర్స్‌లు కూడా చేసి హైదరాబాద్‌లో ఓ ఐటికంపెనీలో సాప్టువేరు ఇంజనీరుగా పని చేస్తున్నాడు. అబ్బాయ్ ఒక్కడే, అతనికో చెల్లెలుంది. ఢిగ్రీ చదువుతుంది. తండ్రి లేడు. తల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్స్‌పాల్‌గా పని చేస్తుంది. మీరిచ్చిన వివరాలతో జాతకాలు కూడా ఆవిడ చూపించారట. అన్ని బాగా కలిసాయని అన్నారు. గ్రహమైత్రి కూడా చక్కగా కల్సిందట. పాతిక వరకూ గణాలు కూడా కలిసినాయట. మీరు ఓకె అంటే పిల్లను చూడ్డాన్కి వస్తామన్నారు సార్!”

“ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఎవర్కి కావాలిలెండి. మీరు మా అమ్మాయిని గురించిన అన్ని విషయాలు వాళ్ళకు చెప్పారు కదా!”

“ఏదీ దాచకుండా మీరు చెప్పిన అన్ని విషయాలూ వాళ్ళతో చెప్పాను సార్! పెళ్ళికొడుకు అభ్యుదయ భావాలున్న వాడు కాబట్టి తనకేం అభ్యంతరం లేదన్నాడు సార్!”

“మరి తల్లి విషయమో!? …” పాండురంగం సంశయంగా ప్రశ్నించాడు.

“నేను అమ్మాయ్ వివరాలు చెప్పెప్పుడు తల్లి కొడుకు ముందే కూర్చొని విందండీ. ఆవిడకేమన్న అభ్యంతరం వుంటే అప్పుడే చెప్పేవారు కదా!”

“అవునా? సరే, ప్రకాష్! నేను సాయంత్రం ఇంటికెళ్ళాక మావాళ్ళతో మాట్లాడి… ఏ సంగతి రెండు మూడు రోజుల్లో మీకు చెప్తాను. ధాంక్స్ ప్రకాష్! నాకు చాలా సంతోషంగా వుందిప్పుడు.”

“సరే, సార్! నేను వెళ్తాను మరి” అంటూ అతనెళ్ళిపోయాడు.

వెంటనే తన సెల్ తీసుకొని భార్యతో ఈవిషయం మాట్లాడుదామని యింటికి ల్యాండ్ లైన్‌కి ఫోన్ కల్పాడు.

***

సభ అంతా నిండుగా కళకళలాడుతుంది.

చాలా మంది మహిళలు వచ్చారు. మగవారు కూడా వచ్చారు కాని, తక్కువే. డి.ఎల్ .పి. ఓ. మేడమ్, గ్రామ కార్యదర్శి అనిందిత, సర్పంచ్ లలితాంబ, ఉపసర్పంచ్ రాయప్ప, వార్డ్ సభ్యులు మున్నగు పెద్దలు గ్రామ పంచాయితీ ఆఫీస్ బయటనున్న వేదికలాంటి పెద్ద అరుగు పైనా మిగతా జనాలంతా కింద చెట్ల నీడల్లో కూర్చున్నారు. ఈ అత్యవసర సభకు కారణ భూతమైన బషీర్,  వాళ్ళావిడ ఓమూల నక్కి కూర్చున్నారు.

ముందుగా అనిందిత మైక్ అందుకొని సభలోని వాళ్ళ అందరికీ వినయంగా నమస్కరించి మాట్లాడ్డం మొదలుపెట్టింది. “ఈరోజు ఈసభ పెట్టడాన్కి ముఖ్య కారణం నిన్న మన ఊరి పారిశుధ్య కార్మికుడైన యాదగిరి పట్ల బషీర్ బాబా వాళ్ళింటికెళ్ళి అతని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి….వాళ్ళ మనస్సుల్ని నొప్పించి బాధపర్చినందుకు. నిజానికి నాల్గుగైదు రోజుల నుంచి యాదగిరికి బాగా జ్వరం వచ్చి, బయటికి రాకుండా తిండి తిప్పలు లేకుండా పడి వుంటే నేనే మనూరి ఆర్.ఎమ్.పి డాక్టర్ని వాళ్ళింటికి తీసికెళ్ళి చూపించి మందులిప్పించాను. మనిషి నీరసంగా వున్నా… ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నాడు. అతనికి జ్వరమోచ్చి ఇంటింటికి చెత్తబండి తోసుకెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళింటికెళ్ళి తిట్లతో గొడవపడే అధికారం ఇక్కడెవ్వరికీ లేదు. మీకేమన్న కష్టమోస్తే సర్పంచ్ గారికో, నాతో చెప్పండంతే గానీ వాళ్ళని సంస్కారహీనులుగా చేసి మాట్లాడకండి. ఒకటిరెండు రోజులు యాదగిరి రాకపోతే మీ యిండ్లలో వుండే తడి, పొడిచెత్తని మీరే తీసికెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గరికెళ్ళి వేయలేరా? ఆ చిన్నపని మీరు చేయలేరా? మనకు సేవ చేసే పారిశుధ్ధ కార్మికుల్ని గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమంటారో మీకందరికీ ఎరుకేకదా!? వాళ్ళని దేవుళ్ళని అంటారు ఆయన. అలాంటి వార్ని మనమీ గ్రామంలో వుంచుకొని, రోజూ ఇల్లిల్లూ తిరిగి చెత్త సేకరిస్తున్న యాదగిరికి ప్రభుత్వ పరంగా వాళ్ళకెలాంటి డబ్బూ రాదు. మనమే ఇంటింటికీ నెలకు ముఫ్పైయో, యాభ్బైయో యివ్వమని చెప్పాం.

వాళ్ళ జీవనానికీ ఆ డబ్బే ఆధారం. నెలకు ఆ కాస్త యివ్వడానికి వాళ్ళని మీ ఇండ్ల చుట్టూ పదిసార్లు తిప్పించు కుంటారట. ఇది మంచి పద్ధతి కాదు, సాధ్యమైనంత వరకు నెలనెలా ఇవ్వండి. మేము ఇంటింటికి తిరిగిచ్చిన బ్లూ, గ్రీన్ బుట్టల్లో పొడిచెత్త.. తడి చెత్త మీరే వేరుచేసి వేయాలి. ఇది తప్పనిసరిగా జరిగి తీరాలి. ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ కవర్లు కాగితాలు చింపి పారేయడం చేయకండి. మీరే మీ పిల్లలకి కూడా మంచి అలవాట్లు నేర్పండి. అంగన్‌వాడీ స్కూల్లో అక్కడి టీచర్లు కూడా పరిశుభ్రతని గురించి అనునిత్యం చెప్తూనే వుంటారు. ఇకపోతే మనకు మతం కులంతో పని లేదు. మనమంతా మనుష్యులమన్న విషయం గుర్తుంచుకొని కలిసి కట్టుగా అన్యోన్యంగా మెలగాలి. ఇక బషీరు బాబా…..” అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతున్న అనిందితకు మధ్యలోనే అడ్డు తగిలి చటుక్కున లేచిన బషీర్ దండం పెడ్తూ “మేడమ్! ఇక ఆపండి. నేను చేసింది తప్పే! క్షమించండి.. మీరెన్నో మార్లు మాకు సుద్దులు చెప్పారు. కాని నిన్న ఎందుకలా చేశానో నాకే తెలియదు….” పశ్చాత్తాపం పడుతున్న స్వరంతో అన్నాడు.

“నీకే తెలియదంటున్నావ్ …తాగినావా? తాగిన మైకంలో యాదగిరింటికి పోట్లాట కెళ్ళావా?…” సభలో వున్న జనాలనుంచి ఎవరో లోగొంతుకతో అని విమర్శించారు.

“ప్చ్! ప్లీజ్ సైలెన్స్….” అనిందిత కోపంతో ఆమాట వినిపించిన వైపుకు కోపంగా చూస్తూ అంది.

“నేనిప్పుడే యాదగిరికి క్షమాపణలు చెప్తాను మేడమ్!” అంటూ ఓ పక్కగా నిల్చుని ఆ అలుమగలు వైపెళ్ళి అతన్ని బిగ్గరగా అలయ్ బలయ్ చేసుకొని “నన్ను మనస్ఫూర్తిగా క్షమించు యాదగిరీ! క్షమించు చెల్లమ్మా.” అంటూ వేడుకున్నాడు.

“ఫర్వాలేదు లే అన్నా”యాదగిరి ఆ మాత్రానికే ఖుషీ అయిపోయాడు. భర్త వెనకాలనే తప్పు చేసిన దానిలా బషీర్ భార్య కూడా తలొంచుకొని నడుస్తూ వచ్చి చుక్కమ్మ చేతులు పట్టుకొని క్షమించమంది.

ఆ దృశ్యం చూసి అక్కడున్న అందరి మనస్సులు సంతోషపడిపోయాయి. వేదిక మీదున్న పెద్దలు బిగ్గరగా చప్పట్లు కొట్టారు… వాళ్ళతో పాటు సభలోని వారంతా కూడా పెద్దపెట్టున చప్పట్లు మారుమోగేలా కొట్టసాగారు.

ఆ చప్పట్ల మధ్యనే డి.ఎల్.పి.ఓ. మేడమ్ లేచి నవ్వుతూ “అనిందిత మేడమ్ నాకు నిన్న రాత్రి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మన్నారు నన్ను కూడా. ‘ఇది చిన్న విషయమే. వాళ్ళిద్దర్ని పిలిపించి మీరే సర్ది చెప్పండి.,ఇంతోటిదానికి సభ ఎందుకు?’ అన్నాను. కాని ఆవిడ వినలేదు. ఎందుకంటే అంతా పధ్ధతి ప్రకారమే జరగాలంటారామె. రేపొద్దున ఇంకెవ్వరన్నా ఇలా చేయగూడదన్న విషయం అందరి మనస్సులోకి వెళ్ళాలన్న ఆమె సంకల్పమే ఈసభ పెట్టడానికి కారణమైంది. అనిందితగారు వచ్చినప్పటినుంచి మీ ఊర్ని, మిమ్ముల్ని ఎన్నెన్నో విధాలుగా సంస్కరించి… ఈ పల్లె రూపురూఖల్నే మార్చి వేసింది. ఇలాంటి చిన్నాచితక పోట్లాటలు ప్రతి ఊళ్ళోనూ వుండనే వుంటాయి. వాటికి కారణాలు కూడా చాలా చిన్నవే! ఓమాటకి మరో మాట పెరిగి చినికి చినికి గాలి వానల్లా తయారవుతాయి. ఇక మరెప్పుడూ ఇలాంటి సన్నివేశాలు జరగకుండా మీ ఈ ఊరి పేరు ‘పుష్పాలగూడెం’ కదా! కాబట్టి రంగు రంగుల పుష్పాల్లా మీరంతా మనస్సునిండా రకరకాల పరిమళాలను నింపుకొని సమాజానికి ఉపయోగ పడేలా మంచి మంచి పనులు చేస్తూ ఈ పల్లెనంతా సుగంధాలతో నింపండి… అప్పుడీ పుష్పాలగూడెం సువాసనల భరితమై పోతుంది…” నవ్వు ముఖంతో ఉల్లాసంగా ముగించింది

“ధ్యాంక్స్ మేడమ్!” అంటూ చూసింది ఆవిడ వంక అనిందిత. వెంటనే జనాలందరూ మళ్ళీ ఓమారు చప్పళ్ళు కొట్టారు ఉత్సాహంగా. లేచి నిలబడిన వారు ఎవరిండ్లకు వాళ్ళు గుంపులుగా వెళ్ళిపోసాగారు.

“ఇక వెళ్ళుదామా?” అంటున్న సర్పంచ్ లలితాంబ మాటలకు “ఎక్కడికీ?” ఎదురుప్రశ్న వేసింది అనిందిత.

“మరే మా యింట్లో అందరికీ భోజనాలు ఏర్పాటు అయినై మేడమ్! తినేసి వెళ్ళుదురుగాని.”

“నేనిక్కడినుంచి ఇంకో ఊరికెళ్ళాలి కూడా” అంటూ చేతి వాచీ కేసి చూసుకుంది నీరజా మేడమ్.

“మీరిక్కడే వున్నారు. మీరు లేకుండా యింటి దగ్గర ఎవరు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు?” అనిందిత అప్రయత్నంగా అడిగేసింది.

“ఇంకెవ్వరు?… వాళ్ళాయన దొరస్వామి గారు చేస్తుండవచ్చు”అంది నీరజా మేడమ్

“అవును అనిందితా! ఈ రోజు ఆయన పొలానికెళ్ళలేదు. ఇంట్లోనే వుండి శంకరి సాయంతో వంటలొండుతున్నారు…” నవ్వింది సర్పంచ్ లలితాంబ.

 “ఐతే పదండి. ఏం శాఖపాకాలు లలితాంబగారూ?”అడిగింది నీరజా మేడమ్.

 “ఏమున్నాయి మేడమ్. మామూలు వంటే. పుంటి కూరపప్పు, టమాటతొక్కు, మునగకాడలు, ఆనపకాయ ముక్కలేసి సంబార్, అప్పడాలు, కమ్మటి గడ్డ పెరుగు యింతే!”

“అమ్మో! ఇవేమన్న తక్కువా? బ్రహ్మాండంగా వుంటాయి. అందున దొరస్వామి గారి వంటాలాయె!… నలభీమపాకం” అంటూ అందరూ నవ్వుతూ సర్పంచ్ యింటి వైపు ఉత్సాహాంగా వెళ్ళసాగారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here