[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]రా[/dropcap]త్రి తండ్రి యింటికొచ్చాక దక్షిణదేశ యాత్రని గురించి అంతా వివరంగా చెప్పింది అనిందిత. “నేను మీ యిద్దరి కోసం టికెట్స్ కూడా బుక్ చేశాను నాన్నా! మీరు అమ్మ తప్పకుండా వెళ్ళాలి. అమ్మకి ఎన్నాళ్ళ నుంచో గుళ్ళు గోపురాలు చూస్తూ యాత్రాలు చేయాలనీ కోరిక. మీరు మాత్రం రాననీ ఒక్క మాట చెప్పి అమ్మ ఆనందోత్సాహాలపై నీళ్ళు చల్లకండి.”
కూతురి మాటలకు నవ్వాడు పాండురంగం. “నీవు యింతగా చెప్పుతున్నావుగా. వెళ్ళదాంలే.. అవునూ, మరి దీపు ఎలా? స్కూల్ నుంచి వచ్చాక వాడెక్కడ వాడెక్కడ వుంటాడు?”
“ఆ విషయాన్ని గురించి మీరేం వర్రీ కాకండి. మా ఆఫీసులో పర్మిషన్ తీసుకొని ఆ వారం పది రోజులు దీపు స్కూల్ నుంచే టైమ్‌కి నేనింటికి చేరుతాను. మరి మీకు సెలవు దొరుకుతుందా?”
“నేనెప్పుడూ ఏ సెలవుల్ని వాడుకోను. మా ఎమ్.డి. సార్ చాలా మంచివారు. నేనడగ్గానే సెలవిస్తారులే అనితా. ఎప్పుడెళ్ళాలో తేదీ తెలిస్తే ఓ రోజు ముందు నుంచి సెలవు తీసుకుంటాను.”
తండ్రి అన్న మాటల్ని వినగానే ‘హమ్మయ్య’ అనుకుంటూ అనిందిత గుండెలనిండా ఊపిరి పీల్చుకొని సంతృప్తిరాలైంది.
***
“రేపు రాత్రికే మీ ప్రయాణం. అన్నీ సర్దుకున్నావా? నాన్నగారివి నీవి బట్టలు, మందులు, రెండు దుప్పట్లు, స్వెట్టర్స్, పేస్ట్, బ్రెష్‌లు, సోప్స్, ఓ చిన్న మగ్‌తో పాటు అన్నీ సర్దుకున్నావా అమ్మా?”
“ఆ, అన్నీ సర్దానే. నేనో పది చీరలు తీసుకున్నాను. ఎక్కడైన సమయం దొరికితే రూమ్‌లో ఒకటి రెండు చీరలు ఉతుక్కుంటాను. మీ నాన్నగారిది విడిగా ఓ సూట్‌కేస్, నాదొకటి, మళ్ళీ ఓ చిన్న హేండ్ బ్యాగ్… అది సరేగానీ అనితా! దీపుని వదిలి పెట్టి మొదటిసారి బయటికెళ్ళుతున్నాం నేనూ మీనాన్న… జాగ్రత్త తల్లీ!” అంటూ కూతురికి ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పసాగింది.
“ఏం ఫర్వాలేదమ్మా. నేను వాడ్ని బాగానే చూసుకుంటాను. నీవేం అనవసరంగా దిగులు పడకు.”
“అది కాదు…అనితా! మనమందరం ఒకేసారి కల్సి యాత్రలకి వెళ్ళుంటే బాగుండేది. ఆ ఆనందమే వేరు కదా?”
“మీతో పాటు నాకు దీపుకు ఎలా వీలవుతుందమ్మా? నాకు ఉద్యోగమాయె! దీపుగాడికి స్కూలాయె! మీరు క్షేమంగా వెళ్ళిరండి. సర్పంచ్ లలితాంబ, దొరస్వామి గారూ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారమ్మా! దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ మీ వెంట వుంటే కొండంత అండ మా ఉపసర్పంచ్ వాళ్ళమ్మ సత్యవతి కూడా వస్తుంది. వీరంతా మీతో కలుపుగోలుగా మసులుకుంటారు. అదీకాక ఈ యాత్రలకి తీసికెళ్ళేతను దొరస్వామిగారి బావమరిది ఫ్రెండేనట. సర్పంచమ్మకు తన తమ్ముడితో పాటు చిన్నప్పటి నుంచీ బాగా తెల్సినవాడేనట. ‘వాడూ నాకు తమ్ముడిలాంటి వాడే. మంచి మనిషి’ అంటుందావిడ.”
“సరేగానీ, మరి రేపు నీవు స్టేషన్‌కు రావుకదా?”
“లేదమ్మా! నేను రాలేను. దొరస్వామి వాళ్ళు వెళ్ళే కారు లోనే సత్యవతితో పాటు మీరు వెళ్ళుతారు. అంటే మీ ఐదుగురు ఒకే కార్లో రైల్వే స్టేషన్‌కు వెళ్ళుతారు. ఇదిగో ఈ ఐదువేలు నీదగ్గరుంచు. గుళ్ళలో హుండీలలో వేయడాన్కి… ఏమన్నా కొనడానికి, నీ అవసరాలకీ పనికి వస్తుందమ్మా. జాగ్రత్తగా బ్యాగ్‌లో పెట్టుకో. ఇదిగో మిగిలిన ఈ ఐదువేలు కూడా నాన్నగారికిద్దామనుకున్నాను.. కానీ, నాన్నగారు నా దగ్గర్నించి తీసుకుంటారో లేదో మరి. అందుకని ఈ డబ్బు కూడా నీదగ్గరే పెట్టుకోవమ్మా” అంటూ తన చేతిలో వున్న మిగిలిన డబ్బంతా తల్లి చేతికే యిచ్చింది
తండ్రి ఇంటికి రాగానే ఆయనకు కూడా అన్నీ వివరంగా మళ్ళీ ఓ మారు చెప్పింది. “నాన్నా! మీరిక్కడికి వెళ్ళాక ప్రతిరోజూ రాత్రి పూట ఫోన్ చేసి మీరక్కడ ఆ రోజు చూసిన వివరాలన్నీ చెప్పాలి. దీపు తోనూ, నాతోనూ మాట్లాడాలి. ఇదిగో ఈ నోట్ బుక్ వుంచుకోండి. అక్కడి యాత్ర స్థలాల విశేషాలు రాసుకోండి”
“సరేనమ్మా. నీవు దీపు జాగ్రత్త!” కూతురికి పాండురంగం మరీ మరీ చెప్పాడు.
“మీరు మా గురించి ఏం వర్రీ కాకండి నాన్నా! మీరంతా క్షేమంగా వెళ్ళీ లాభంగా తిరిగి రండి!” అందామె.
ఆ మర్రోజు మధ్యాహ్నంకల్లా కార్లో దొరస్వామి దంపతులతో పాటు సత్యవతి, పాండురంగం దంపతులు కూడా బయలుదేరారు… కాచీగూడ రైల్వేస్టేషన్‌కు ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళడానికి.
అక్కడే దొరస్వామి బావమరిది, యాత్రల యిన్‌చార్జీ అతను అందర్నీ ఒకరితో ఒకరు ప్రేమాభిమానాలతో కూడుకున్న ఆత్మీయ పరిచయాలు పరసర్పం జరగసాగాయి. రైలు బయలుదేరడాన్కి యింకా సమయం వుంది కాబట్టి అందరూ కులాసాగా కబుర్లాడు కుంటున్నారు.
***
తల్లిదండ్రులు వెళ్ళి పోయాక దీపు కాస్త డల్‌గా కన్పించాడు అనిందతకు.
“ఏయ్, మొద్దూ! దిగులు పడుతున్నావా? అమ్మవాళ్ళు మళ్ళీ ఓ వారం పది రోజుల్లో తిరిగొస్తారుగా!” అంటూ తమ్ముడిని దగ్గరికి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకొని వాడి తల ఆప్యాయంగా నిమరసాగింది.
“మరి మనమెందుకు వెళ్ళలేదక్కా? ఎంచక్కా మనం కూడా వెళ్ళింటే అన్నీ చూసి వచ్చే వాళ్ళముగా.”
“ఇప్పుడెలా మనం వెళ్ళుదామురా? నీకేమో స్కూల్ వుందాయె! నాకేమో వుద్యోగమాయె! నెక్ట్ యియర్ నీ ఎగ్జామ్స్ అయిపోయాక వేసవి సెలవుల్లో అమ్మనాన్న నీవు నేను మనమంతా కలిసి ఎటైనా విహార యాత్రకి వెళ్ళుదాం సరేనా దీపూ!”
“ఊ…”అంటూ తలాడించాడు దీపు.
***
ఇంటికి తాళం పెట్టి ముందుగా పక్కింటి పద్మాక్షి గారింటికెళ్ళింది అనిందిత.
“నేను వచ్చేందుకు కాస్తా లేటైనా స్కూల్ నుంచి వచ్చే దీపుని కొంచెం సేపు మీయింట్లో వుంచుకోండి ఆంటీ” అని రిక్వెస్ట్‌గా అడిగింది.
“అయ్యో, దానికేం భాగ్యం. వుంటాడులే… ఎక్కడికీ పంపించను. మావాడితో ఆడుకుంటూ యింట్లోనే వుంటాడులే అమ్మాయ్!”
ఆవిడ మాటలకిక అనిందిత నిశ్చింతై తయారయి వాకిట్లో నిల్చున్న తమ్ముడిని స్కూటీ వెనకాల కూర్చోబెట్టుకొని స్కూల్ దగ్గర దింపి, వాడికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి తాను వుద్యోగానికెళ్ళిపోయింది.
గ్రామ పంచాయితీ ఆఫీసులో ఓ అరగంట కూర్చుంది. ఫైళ్ళు అవీ చూసింది. ఇంతలో ఉపసర్పంచ్ వచ్చాడు.
“అగ్రికల్చర్ ఆఫీసర్ మనూరికి రేపు వస్తారట మేడమ్! ఇందాకనే నాకు ఫోన్ చేశాడు. నర్సరీలో మొక్కలు పెంచడానికి కావల్సిన విత్తనాలు, ఆ సరంజామా అంతా మండలాఫీసు నుంచి రేపు పంపిస్తారట.”
“అవును నిన్ననే ఆయన ఫోన్ చేసి చెప్పారు. ఇకపోతే మనమంతా గ్రామంలో ఏరి పెట్టిన ఐదారు బస్తాల ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్‌కు పంపాలి. మీరీ రోజు ఆ పని చూడండి. ఇకపోతే నేనలా ఓమారు గ్రామమంతా తిరిగొస్తాను” అంటూ సెల్ చేత పట్టుకొని బయటికి కదిలిందామె నెమ్మదిగా నడుస్తూ.
వాడవాడ తిరుగుతున్న అనిందితకు ఎక్కడ కాస్త అపరిశుభ్రంగా కన్పించినా, ఇండ్లముందు నీళ్ళు నిలువ వున్నా వెంటనే ఆగిపోయి వాళ్ళింట్లోకెళ్ళిపోతుంది నేరుగా. అక్కడంతా శుభ్రం చేసుకోమని, వాకిట్లో నీళ్ళు మళ్ళకుండా చూసుకోవాలని తగిన సలహాలు సూచనలు ఆయింట్లో వాళ్ళకిస్తుంది.
“రంగమవ్వా!” అని గుడిసెలాంటి ఆ యింటి యజమానురాల్ని పిలుస్తూ కొంచెం వంగి లోపలికెళ్ళింది.
బాగా చీకటిగా వున్న ఆయింట్లో ఓ మూల కుక్కి మంచంలో ముక్కుతూ, మూలుగుతూ ఓ ఆకారం పండుకొని వుంది. ఓ మూలగా ఓపాము పుట్టలాగా ఏదో ఎత్తుగా అస్పష్టంగా కన్పించింది. ఇల్లంతా కంపు వాసన, రెండు మూడు కుండలు, చిన్నవి రెండు సొట్టలు పడిన సత్తు గిన్నెలు కట్టెలపొయ్యి ప్రక్కన పడి వున్నై. గదంతా అదో రకమైన గలీజ్ వాసన. ముఖానికి కర్ఛీఫ్ ముక్కుకు అడ్డు పెట్టుకొని మంచానికీ దగ్గరగా వెళ్ళింది.
అంతలో మంచంలో వున్న ఆకారం కొంచెం కదిలినట్లు అయింది. దగ్గరగా వెళ్ళింది.
“అమ్మా, నాకు నిన్న పొద్దుగాల నుంచి జొరం..” అంటు రంగమవ్వ మంచంలో పండుకొనే నీరసంగా మూల్గుతూ అనిందితకు చేతులెత్తి దండం పెట్టింది.
“ఏమైంది రంగమవ్వా? ప్రక్కింట్లో నీ కూతురుండాలిగా ఎక్కడికెళ్ళి పోయారు? కన్పించడం లేదు..” అంటూ దగ్గరిగా వెళ్ళి మంచంలో వున్న ఆ ముసలావిడను తేరిపారగా పరికించింది అనిందిత.
నిన్నటినుంచి తిండి తినలేదు కాబోలు ముఖమంతా పీక్కపోయి కళ్ళు బాగా లోతుకుపోయి వున్నాయి.
“ఈ యిల్లేంటి గోడలు, కప్పు,పెచ్చు పెచ్చులుగా వూడి పోయి పడిపోతూ కూలిపోవడాన్కి సిద్ధంగా వున్నట్లుగా వుంది. ఈ వర్షాకాలంలో ఈ ఇల్లుండదు. కూలిపోతే ఇంట్లో వుండే నీవేమవుతావు? కూలిన ఆ గోడల మధ్య సమాధి అయిపోతావ్. కాబట్టి నేనీ యింటిని పూర్తిగా పడగొట్టించ్చి వేస్తాను. ప్రభుత్వం వారు కూడా పల్లెల్లో యిలాంటి పురాతన యిండ్లు వుంటే కూల్చేయని మాకు కలెక్టర్ ఆర్డర్స్ కూడా వున్నాయి. నీవిక్కడ వుండకిక. మీ బిడ్డింట్లో వుండు.”
“ఇల్లు పడగొడ్తే నేను యాడ వుండలా? “
“చెప్తున్నానుగా ప్రస్తుతానికి నీ కూతురింట్ల వుండు. నీకు అంతో ఇంతో డబ్బు యిస్తాం. దానితో ఏదో ఓ చిన్న రూమ్ వేసుకోవాలవ్వా!” అంటూ ఎవరికో ఫోన్ కల్పింది.
“హలో, యాదగిరీ, నీవింట్లో వుంటే చుక్కమ్మతో ఓ డబ్బాలో ఇంత అన్నం కూర వేసి రంగమవ్వ ఇంటికి పంపించు. నేనిక్కడనే వున్నాను…”అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
పావుగంట కల్లా చుక్కమ్మ టిఫిన్ బాక్స్‌లో అన్నం కూర తీసుకొని వచ్చింది.
“చూడు చుక్కమ్మా! తిండి తిప్పల్లేక ఈ రంగమవ్వ ఎలా శుష్కించి పోయిందో! నీవు తెచ్చిన ఆ అన్నం తినిపించవా?” రిక్వెస్ట్‌గా అడిగింది.
“అలాగే మేడమ్” అంటూ రంగమవ్వని లేచి కూర్చోపెట్టి, కుండలో నుంచి ఓ సత్తు గ్లాస్‌తో నీళ్ళు తెచ్చి ఆ ముసలావిడకు ముఖం కడిగి మంచం మీదున్న ఓ పాత బట్టతో తుడిచి తాను తెచ్చిన అన్నం తినిపించసాగింది చుక్కమ్మ.
అనిందిత ఇవతలికొచ్చి ఆర్.ఎమ్.పి. డాక్టర్‌కి ఫోన్ చేయసాగింది.
***
దీపుకి స్నానం చేయించి, నైట్ డ్రెస్ వేసింది అనిందిత. తినడాన్కి కొంచెం కారప్పూస గిన్నెలో వేసిచ్చింది.
“దీపూ! పాలు వేడి చేసి బోర్నవిటా వేసి కలిపి, ఇదిగో టేబుల్ మీద పెట్టాను తాగు. నేను కాస్తా ఫ్రెస్ అయి వస్తాను…” అంటూ బాత్ రూమ్ లోనికెళ్ళింది. స్నానం చేసి నైటీ వేసుకొని వచ్చి నేరుగా పూజగదిలోకెళ్ళి దీపం పెట్టి దేవునికోనమస్కారం పెట్టి ఇవతలికొచ్చింది.
ఉదయం చేసిన కూరలున్నాయి కాబట్టి, రాత్రి భోజనానికి తమిద్దరికి సరిపడ ఓ గ్లాసెడు బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి స్టవ్ వెలిగించింది.
ఈలోగా దీపుతో హోమ్ వర్క్ చేయించడం చదివించడంతో ఓ గంట గడిచిపోయింది. “అక్కా! ఓ మారు నాన్నకు ఫోన్ చేయవా? మాట్లాడుతాను…” అన్నాడు దీపు.
“ఫోన్ కలవడం లేదురా దీపూ! నేనీ రోజు చాలా సార్లు ట్రై చేశాను. వాళ్ళెక్కడో గుళ్ళల్లో వున్నారు కాబోలు! గుళ్ళల్లోకి ఫోన్స్ తీసికెళ్ళనీయరుగా” తమ్ముడితో అంటూ మళ్ళీ ఓమారు తండ్రి సెల్‌కి ఫోన్ కల్పింది. ఫోన్ రింగవుతుంది.
“హలో, అనితా!” అవతలి వైపు నుంచి తండ్రి గొంతు వినిపించింది.
“హాయ్, నాన్న! నేను మాట్లాడుతానక్కా” హుషారుగా ముందుకొచ్చాడు.
“నాన్నా, దీపు మాట్లాడుతాడట మీతో…” అంటూ ఫోన్ తమ్ముడికిచ్చింది.
“ఏరా, దీపూ! ఎలాగున్నావ్? స్కూల్ కెళ్ళుతున్నావా? అక్కని సతాయించడం లేదుకదా?”
“ఉహు, లేదు నాన్నా! అక్క చెప్పినట్లుగా బుద్ధిగా వుంటున్నాను. చక్కగా స్కూల్‌కి వెళ్ళుతున్నాను. మీరెలా వున్నారు నాన్నా? అమ్మకివ్వండి… అమ్మతో మాట్లాడుతాను.”
“అమ్మ బాత్ రూమ్‌లో వుందిరా దీపూ! అక్కను ఏమాత్రం విసిగించకు. సరేనా? అమ్మ ఇవతలికొచ్చాక నీతో మాట్లాడిస్తాను. అక్కకివ్వు ఫోన్”
“సరే నాన్నా!” అంటూ దీపు అక్కకిచ్చాడు ఫోన్.
“నాన్నా, ఎలా వున్నారు? అమ్మ బాగుందా? నేను దీపు మిమ్ముల్ని మిస్ అవుతున్నాము.”
“అందరం బాగున్నాం తల్లీ ! “
“మీరిప్పుడు ఎక్కడున్నారు నాన్నా? చెన్నైకి చేరుకున్నాక అక్కడి నుంచి ఎక్కడికి బయలు దేరారు? ఏమేమి చూశారో చెప్పండి?”
“మొన్ననే మేము కాచిగుడా రైల్వే స్టేషన్‌లో ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి మర్రోజు ఉదయానికల్లా చెన్నైకి చేరుకున్నాం. లాడ్జింగ్‌లో స్నానాలు చేసి కాఫీ, టిఫిన్ కానిచ్చుకొని, అక్కడే ట్రావెల్స్ నుంచి ఓ బస్సు మాట్లాడుకొని అదెక్కి అందరం కల్సి ముందుగా చిదంబరం చేరుకున్నాం. అక్కడ నటరాజస్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఈ గుళ్ళో ఏదో ‘చిదంబర రహస్యం’ వుందంటారు. చిదంబరంలోని అత్యద్భుత అపురూప దేవాలయమిది. ఈ వైభవమూర్తిని, ఈ దేవాలయాన్ని వర్ణించడాన్కి మాటలు చాలవనుకో. ఈ గుడిని చూడగానే ముందుగా మనకేమనిపిస్తుందో తెలుసా అనితా! ఈ గుడి నిజంగా ఏ దేవతామూర్తి నిర్మాణమో అయివుంటుంది గాని, సాధారణ మానవ నిర్మాణం కానే కాదనిపిస్తుంది. ఈ నటరాజస్వామి ఆలయం పరమపవిత్రమైనదనీ, గొప్పగొప్ప మహనీయులు, విజ్ఞులు కీర్తించారు. ఈ స్ధలం చాలా మహిమలుగల పుణ్యప్రదమైనది కాబట్టి, ఎంతో మంది భక్తులు దీన్ని దర్శించి తరిస్తుంటారు. ఆ తర్వాత వైదీశ్వరస్వామి దర్శనం చేసుకొని ఆ రాత్రికే రామేశ్వరం చేరుకున్నాం.”
“అక్కడ ఏమేమి చూశారు నాన్నా?”
స్పీకర్ ఆన్ చేయడం వలన దీపు కూడా తండ్రి చెప్పేదంతా శ్రద్ధా భక్తులతో వింటున్నాడు.
(ఇంకా ఉంది)