ప్రేమ పరిమళం-7

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]హో[/dropcap]టల్లో భోజనం చేసి అప్పుడే బసకి చేరుకుంటున్నారు దొరస్వామి, ఆయన బావమరిది, పాండురంగం ఓ జట్టుగానూ, సుశీల… లలితాంబ, సత్యవతి ఇంకో జట్టుగానూ నడుస్తూ తామింతవరకూ చూసిన పరిసరాలను గుర్తు చేసుకుంటూ కులాసగా కబుర్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు.

“మా అనిందిత మీకేమన్నా ఫోన్ చేసిందా లలితాంబగారూ?”వున్నట్లుండి అడిగింది సుశీల.

“లేదు ఏం చేయలేదు… మొన్నోసారి నేనే ఫోన్ చేశాను. ఆ టైమ్‌లో తాను ఊళ్ళోనే వుంది. కాని బిజీగా వుందని ఎక్కువగా ఏం మాట్లాడలేదు. మన యోగక్షేమల్ని మాత్రం అడిగి తెలుసుకుందంతే”

“తనకి పని వుంటే చాలు. తిండితిప్పలు కూడా అక్కరలేదు, పూర్తిగా పని రాక్షసి!”

“మీరన్నీమాట అక్షరాల నిజం. తాను పని చెయ్యడమే కాదు, తన చుట్టూ వున్న కూడా నడుం వంచి పని చేసేలా చేస్తుంది. శ్రమదాన కార్యక్రమంలో ఎంతో మంది ఊళ్ళోని యువతని పని చేసింది. అందరితో కలుపుగోలు తనంతో వుంటూ మంచి మనిషిగా తానేమిటో నిరూపించుకుంటుంది. ప్రతి ఒక్కరి మనస్సులను గెలుచుకుంటుంది మీ అమ్మాయ్. అనిందిత విషయం వచ్చింది కాబట్టి మిమ్ముల్ని ఓమాట అడగాలనీ వుందండీ, అదీ మీరు ఏమీ అనుకోకుంటేనే…”

“ఏమీ అనుకోను అడగండి లలితాంబగారూ!”

“మీ అమ్మాయ్‌కి పెళ్ళి చేయరా? ఏమన్న సంబంధాలు చూస్తున్నారా?”

ఆ మాటలకీ మారు సుశీల బాధగా ఓ నిట్టూర్పు విడిచింది.

“తన పెళ్ళికింకా టైముందని అంటుంది. ఒప్పుకోవడం లేదు. మొన్నీ మధ్య ఓ సంబంధం కుదిరింది. పెళ్ళిచూపుల వరకూ వచ్చింది. కాని తనకిష్టం లేదని వాళ్ళ నాన్నతో ఖరాఖండిగా చెప్పేసింది. మేము ఇంకేం చేస్తాం? పెళ్ళివాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి గమ్మున వుండి పోయాం.”

“పెళ్ళికి విముఖత చూపడానికి కారణమేమిటమ్మా?”

“విముఖత అంటూ ఏమీ లేదు. తాను మళ్ళీ ఓమారు సివిల్స్ రాస్తుందట. దానిలో విజయం సాధించాకనే పెళ్ళి అంటుంది”

“గట్టి పట్టుదల సంకల్ప సాధన వున్న మనిషే మీ అమ్మాయ్ అనుకున్నదీ మారు ఆ భగవంతుని అనుగ్రహం వలన తప్పకుండా సాధిస్తుంది లెండి. ఆ లక్షణాలన్నీ వున్నాయి తనలో. తప్పకుండా కలెక్టర్ అవుతుంది లెండి. అన్ని సుగుణాలను కలబోసుకొని తెల్లటి శరీరఛాయతో చక్కటి కనుముక్కు తీరుతో, ఒత్తైన బారెడు జడతో అందంగా వుంటుంది మీ అమ్మాయ్! తనని చేసుకునే వాడెవ్వడోగాని చాలా అదృష్టవంతుడవుతాడమ్మా” మెచ్చుకోలుగా అంది లలితాంబ.

చిన్నగా నవ్విందీ మారు సుశీల. “మీ నోటి చలువ వలన అలాగే జరగనీ. మేము కోరుకునేది కూడా అదే. మీ ఊరిలో మీ అందరి ప్రేమాభిమానాలను, ప్రశంసాపూరితమైన మన్నలను చూరగొన్నది. ఇంతకీ మీకెందరు సంతానం లలితాంబగారూ?”

“నాకు ఒక్కడే అబ్బాయ్. పేరు మాధవ్. అమెరికాలో వుంటాడు.” అంటూ సెల్‌లో కొడుకు. ఫోటో చూపించిందామె. చూసింది ఫోటోని. మెల్లగా ముందుకెళ్ళింది లలితాంబ వాళ్ళ బస రావడం వలన.

అప్పటికే తమ రూమ్ లోకి వచ్చిన పాండురంగం కూతురికి ఫోన్ కల్పుతున్నాడు.

అటు వైపు సెల్ మోగుతుంది. “హలో, నాన్నా! వినిపిస్తుందా? మీరెలా వున్నారు?”

“బాగున్నాం తల్లీ! దీపు ఎలా వున్నాడు? వాళ్ళమ్మ మీద ఏమన్న బెంగ పెట్టుకున్నాడా?”

“లేదు లేదు.. వాడు బాగానే వున్నాడు. ప్రస్తుతం మీరెక్కడున్నారు?”

“కన్యాకుమారిలో వున్నాం. ఉషోదయాన్ని చూద్దామని ఈరోజు తెల్లారి జాముననే లేచి సముద్రపు ఒడ్డుకెళ్ళి కూర్చున్నాం. మాలాగే ఎంతో మంది అక్కడికొచ్చి రాళ్ళమీద కూర్చుని ఎంతో సేపు నిరీక్షించాం. కాని మేఘాలు అడ్డు రావడంతో సూర్యున్ని చూడలేకపోయాం. మళ్ళీ సాయంత్రం సన్‌సెట్‌కి వెళ్ళి చూశాం. సూర్య భగవానుడు ఎర్రని కుంకుమ రంగు కిరణాలతో దిగంతాలకు వ్యాపిస్తూ సముద్రం లోకి వెళ్ళిపోతుంటే నిజంగా ఆ సుందర దృశ్యం అత్యద్భుతంగా అనిపించింది తల్లీ చూడ్డాన్కి మా రెండు కళ్ళూ చాల్లేదనుకో!”

“అక్కడ ఏం గుడి వుంది నాన్నా, స్థలపురాణం చెప్పండి.”

“ఆదిపరాశక్తి కుమారిగా బాణాసురుడు అనే రాక్షసున్ని సంహరించడానికి ఇక్కడ శివున్ని గురించి తపస్సు చేసినందుకు ఈ పట్టణానికి ‘కన్యాకుమారి’ అనే పేరు వచ్చిందంటారు. ఆ బాణాసురుడు కూడా కఠిన తపస్సు చేసి అమరత్వం పొందెనట. ఆ రాక్షసుడు ఒక కన్య చేత మరణం కలగగూడదనే వరమును మాత్రం పొందలేదు. ఆ రాక్షసుని వలన మునీశ్వరులకు, నరులకు నానా విధాలైన బాధలు, కష్టనష్టాలు అధికమైపోవుట వలన వారంతా శ్రీమహావిష్ణువుని ప్రార్థించుట వలన సంహరించేందుకుగానూ… ఆదిపరాశక్తి చేతనే సాధ్యమని చెప్పగానే వారంతా శ్రీమహావిష్ణువు చెప్పిన ప్రకారంగానే యాగం చేసిరి. అప్పుడు హోమగుండంలో నుంచి పరాశక్తి ఉద్భవించనట. ఆ రాక్షసున్ని సంహరించెనట. ఆ ఆదిపరాశక్తియే గుడిలో మనకు ‘కుమారి’గా దర్శనమిచ్చును.

గుడి చాలా పెద్దది తల్లీ. సముద్రములో పెద్ద పెద్ద బోట్స్ నడుస్తాయి. అవి ఎక్కి ఒక దీవి లాగుండే కొండపైన స్వామి వివేకానంద స్వామి రాక్ మందిరంకు వెళ్ళాం. ఆ మందిరం ఎంత బాగుంది. అంతా రాతితోనే కట్టారు. స్వామి వివేకానందుడు ఆ సముద్రంలో ఈదుకుంటూ గుట్ట మీదికెళ్ళి యోగ, ధ్యానం చేసుకునేవాడట. ఆయనకి గుర్తుగా అక్కడా మందిరం కట్టారట. విశాలమయిన హాల్లో స్వామి వివేకానందుని నిలవెత్తు విగ్రహం ప్రతిష్ఠించారు. ద్వారబంధం గుండా లోపలి కెళ్ళాక అటు ఇటు రామకృష్ణ పరమహంస, వారి సతీమణి శారదాదేవి నిలువెత్తు ఫోటోలున్నాయి. అక్కడంతా ఆ పరిసరాలు ఎంతో శుభ్రంగా వున్నాయి అనితా! దీపు ఏం చేస్తున్నాడు?”

“ఇందాకనే పండుకున్నాడు నాన్నా!”

“అక్కడ నీకు ఊళ్ళో పనులు, ఇటు యింట్లో పనితో పాటు దీపుని చూసుకోవడం, వంట చేసుకోవడం కష్టంగా లేదా?”

“ఏం లేదు నాన్నా! అన్నీ చకచకా చేసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పనా?”

“చెప్పు, ఏంటది?”

“నా రూమ్‌లో పై షెల్ఫ్‌లో వున్న సివిల్స్‌వి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న ఆ మెటిరియల్ వున్న సూట్‌కేస్‌ను దించి మొన్నటి నుంచే శ్రద్ధాసక్తులతో రోజూ కొంత కొంత చదువుకుంటున్నాను నాన్నా!”

“అవునా!? సంతోషం తల్లీ! మీ అమ్మతో ఏమన్న మాట్లాడుతావా?”

“ఊ, ఇవ్వండి మాట్లాడుతాను”.

“అనితా! ఎలాగున్నావే? దీపుగాడు నిన్నేం సతాయించడం లేదుకదా?”

“ఏం లేదమ్మా. బాగున్నాడు. నేను చెప్పినట్లుగానే బుద్ధిగా వింటున్నాడు.”

“భోజనం చేశావా? చాలా పొద్దు పోయింది.”

“లేదింకా.. ఇప్పుడు చేస్తాను. గుడ్ నైట్ అమ్మా”

***

టక్ టక్ మని డోర్ కొట్టిన శబ్దం వినవచ్చింది.

టీపాయ్ మీదున్న రెండు మూడు ఆవాల్టి న్యూస్ పేపర్స్‌ని తిరగేస్తున్న ప్రేమ్ సాగర్ “కమిన్” అన్నాడు.

మెల్లిగా తలుపు తెర్చుకొని డ్రైవర్ రంగ లోపలికొచ్చిండు.

“ఓ, నీవా రంగా! ఈరోజు తొందరగా వచ్చావే? అవునూ నేను నిన్న నీకు చెప్పిన విషయం ఏం చేశావ్?”

“అదే… తీసుకొచ్చాను సార్!”

“ఏదీ, ఎక్కడ?”

“బయటుంది సార్! అమ్మా, లోపలికి రా. సార్ మాట్లాడుతారట” వాకిట్లో నిల్చున్నావిడని గట్టిగా పిల్చాడు.

ఆ ఆడమనిషి లోపలికొచ్చింది. ప్రేమ్ సాగర్‌ని చూడగానే “నమస్కారం సార్!”అంది వినమ్రంగా.

“నమస్కారం! పెద్దదానివి… నాకెందుకమ్మా దండం పెడ్తావు. రంగా, మీ అమ్మగారిని లోపలికి తీసుకెళ్ళి వంట యిల్లు; నిన్న నీవు తెచ్చిన సామాను ఎక్కడెక్కడ ఏమేమి పెట్ఙావో చూపించు. లంచ్‌కు ఓ కూర, సాంబర్ వుంటే చాలు. డిన్నర్‌కి రెండు చపాతీలు ఏదైన కాయకూర, సలాడ్ వుంటే చాలు. నిన్న నీకు చెప్పిన ఈ విషయాన్ని మీ అమ్మగారికి వివరంగా చెప్పు. ప్రస్తుతమిప్పుడు ఏదైన టిఫిన్ చేయమను.”

“రాత్రి యింట్లోనే అంతా వివరంగా చెప్పాను సార్! శుచీ శుభ్రతతో రుచిగా వండాలని చెప్పాను సార్! ‘కలెక్టర్ గారింట్లో వంట చేయడమంటే కొంచెం భయంగా వుందిరా’ అందండి.”

ప్రేమ్ సాగర్ చిన్నగా నవ్వాడు. “భయమా?! భయమెందుకు రంగా! నేనూ మనిషినే. మీ అమ్మగారికి భయపడాల్సిన పనేమీ లేదని చెప్పు” నవ్వుతూ అంటూ టవల్ తీసుకొని బాత్ రూమ్ లోకెళ్ళాడతను.

స్నానం చేసి డ్రెస్సేసుకొని తయారయి వచ్చేసరికి టేబుల్ పైన రంగ తల్లి చేసిన టిఫిన్ రెడీగా వుంచాడు.

టిఫిన్ తింటూ ప్రేమ్ సాగర్ “బాగుంది. మీ అమ్మగారితో చెప్పు” అనేసరికి ‘ఎలా చేశానో ఏమో’ అని భయపడుతున్న రంగ వాళ్ళమ్మ ఆ మాట వినగానే ‘హమ్మయ్య’ అనుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొంది. అతను టీ తాగేంతలోనే ఏవో కొన్ని ఫైళ్ళు పట్టుకొని పి.ఏ వచ్చాడు.

మరో పావుగంటలో విధి నిర్వహణలో కార్లో తన ఆఫీసు కార్యాలయంలోని ఆవరణంలో దిగాడు. ప్రేమ్ సాగర్ కారు దిగి ఓమారు చుట్టూ చూశాడు. ఎంతో మంది ఎన్నెన్నో పనుల మీద ఆ కార్యాలయానికి వచ్చినవారు చాలా మంది కన్పించారు. ఓ చెట్టు దగ్గర తెల్లటి జుత్తుతో… శుష్కించిన శరీరంతో, పూర్తిగా నడుం వంగి కర్ర పట్టుకొని ఒంటరిగా నిల్చున ఆ వృద్ధ స్త్రీ వద్దకి అప్రయత్నంగా వచ్చాడు.

తన దగ్గరగా వచ్చిన ప్రేమ్ సాగర్‌ని ఆశ్చర్యంతో కళ్ళకి చేయి అడ్డుపెట్టుకొని ఎగాదిగా చూసింది ఆ వృద్ధురాలు.

“ఏమైందవ్వా! ఇక్కడికి ఏం పనిమీదొచ్చినావ్?” ఆప్యాయంగా పలుకరిస్తూ అడిగాడు.

“నాకు ఫించన్ రావడం లేదు బాబూ! ఈ ఆఫీసు చుట్టూ ఎన్నిమార్లు తిరిగానో లెక్కలేదు. ఈ మధ్య ఇక్కడికి కొత్త కలెక్టర్ దొర వచ్చాడనీ, అతను నాలాంటి పేదోల్ల గోడు ఓపిగ్గా వింటాడనీ బేగిరం పనవుతుందనీ  మా గూడెంలో చెప్తే గిట్లొచ్చాను దొరా! తిననీక తిండి లేక ఆకలిదప్పులతో నానా బాధలు పడ్తున్నాను. వున్న ఒకానొక కొడుకుని ఆ బగవంతుడు నాకు దూరం సేసి యాడికో తీసికెళ్ళి పోయాడు. సావలేక బతుకుతున్నాను బిడ్డా!” అని ఏడుస్తూ అతని చేతుల్ని బిగ్గరగా పట్టుకొని ఏడవసాగింది.

ప్రేమ్ సాగర్ హృదయం బాధతో కరుణతో ద్రవించింది.

“నీవు ఎక్కడుంటావు అవ్వా?”

“ఈడికి దగ్గరనే వున్న ఊరు మాది. అక్కడినుంచి రానీక పోనీక పైసలేక పొద్దగాలనే లేచి నడుస్తూ వచ్చానిడికి.”

“లోపలికి నాతో రా అవ్వా!” అంటూ అక్కడి నుంచి కదలి తన వెనకాలే వున్న పి.ఏ.కి ఏదో సైగ చేశాడు. ఆ అవ్వ దగ్గరున్న చిన్న చేతిసంచీలోవున్న కాగితాలన్నీ తీసుకున్నాడు.

ఓ అరగంట లోగ ఆ అవ్వకు వృద్ధాప్య ఫించన్ ఇచ్చేలా దానికి సంబంధించిన అధికారుల వద్దకు పి.ఏ.తో పంపించి అవసరమైన కాగితాలపై వేలిముద్రలు పెట్టించి అన్ని పనులూ చకచకా పూర్తిచేసి ఆ నెల ఫించన్ వెంటనే ఇప్పించేలా ఆ ముసలవ్వకు ఏర్పాటు చేశాడు.

అధికారులు తల్చుకుంటే కాని పనులంటూ వుంటాయా ?

ఆ అవ్వ సంభ్రమాశ్చర్యానందాలతో ప్రేమ్ సాగర్ దగ్గరిగా వచ్చి “బిడ్డా! ఇది నిజమో కలో నాకు సమజైతలేదు. మా లాంటి పేదల్ని బతికించడానికి నీ బోటోడ్లని దేవుడు చల్లగా సూడాలి” నీళ్ళు నిండిన కళ్ళతో నిండు మనస్సుతో ఆశీర్వదించింది.

“ఫర్వాలేదవ్వా! నీవు జాగ్రత్తగా మీ ఊరెళ్ళు. ఇక నుంచి నీవిక్కడికి రావల్సిన పని లేదు. మీ ఊళ్ళోనే నెలనెలా ఫించన్ యిస్తారు” కుర్చీలో నుంచి లేచి ఆవిడ దగ్గరగా వచ్చి ఆప్యాయంగా అభయమిస్తున్నట్లుగా భుజం తడ్తూ “నీకింకా ఏం దిగులులేదు అవ్వా! ఫించనొస్తుంది…” అంటూ ఓ రెండువందల నోటు తీసి ఆవిడకిస్తూ “అవ్వకి హోటల్లో కడుపునిండా టిఫిన్ పెట్టించి జాగ్రత్తగా ఆటో ఎక్కించి వాళ్ళూరికి పంపమని రంగకు నామాటగా చెప్పండి” అని పి.ఏ. కు చెప్పి “వెళ్ళిరా అవ్వా” అన్నాడు నవ్వుతూ.

ఆ అవ్వ దండాలు పెడ్తూనే పదే పదే వెనక్కి తిరిగి చూస్తూనే వెళ్ళసాగింది.

కొత్తగా ఆ జిల్లాకి పోస్టింగ్‌లో వచ్చిన యువ కలెక్టర్ ప్రేమ్ సాగర్‌కి మంచి పేరు ప్రతిష్ఠలు వున్నాయి. వచ్చిన మొదట్లోనే వాటినీ పుష్కలంగా సంపాదించుకున్నాడు.

మీడియాలో పత్రికల్లో అతన్ని గురించి చాలా ప్రచారం జరిగింది. మంచివాడు… అందగాడేగాక అందమైన సుగుణాలు గలవాడు. మృదు స్వభావుడు. పేదలపాటి దేవుడన్న ముద్ర వేయించుకున్నాడు… పలువురి ప్రశంసలతో. కలెక్టర్ ఆఫీస్‌లో ఏ పనీ ఆగకుండా చకచకా ఫైళ్ళు కదులుతున్నాయి. అలసత్వానికి ఆమడ దూరంలో వుండాలంటాడు. తన మంచిమనస్సుతో అందరితో మమేకమై మెలుగుతాడు.

***

స్కూల్ బయటే గోడవారగా స్కూటీని ఆపి గేట్ దాటు కొని ఆవరణంలోకి నడుస్తూ ఓమారు అంతా కలియ చూసింది అనిందిత.

ఎటు చూసినా జంటలు జంటలుగా పేరంట్స్ నిల్చోని రణగొణ ధ్వనులతో మాట్లాడుకుంటున్నారు. కొంతమంది టీచర్స్ కూడా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళలో దీపు క్లాసు టీచర్ కనబడింది. గబగబా ఆమె దగ్గరగా వెళ్ళి విష్ చేసి “మేడమ్! మా తమ్ముడు దీపక్ ఎలా చదువుతున్నాడు? క్లాసులో ఎలా మసులుకుంటాడు?” అని అడిగింది.

దీపు క్లాసు టీచర్ చిన్నగా నవ్వి “మీ తమ్ముడు ఎక్సలెంటండీ… అల్లరి చేయడు. క్లాసులో డిసిప్లిన్డ్‌గా వుంటాడు. చక్కగా చదువుతాడు. అన్నింట్లోనూ ఫస్ట్ సెకండ్‌లో వుంటాడు…” చిరునవ్వుతో ఉల్లాసంగా చెప్పింది.

అంతలోనే అనిందిత హేండ్ బ్యాగ్ లోని సెల్ మోగింది.

“ఎక్స్‌క్యూజిమీ” అంటూ ఆమె కొంచెం దూరంగా వెళ్ళి సెల్ ఆన్ చేసింది. నెంబర్ చూసింది. తండ్రి చేశాడు.

“నాన్నా! నేనిప్పుడు దీపు స్కూల్‌కి పేరంట్స్ మీటింగ్ కోసం వచ్చాను. ఇంటికి వచ్చాక నేనే మీకు కాల్ చేసి మాట్లాడుతాను. మీరంతా కులాసే కదా?”

“మేము కులాసే తల్లీ. ఈ రోజు ఆదివారం కదా! ఇంట్లోనే వుంటావు కదాయని ఫోన్ చేశాను. మరిక వుంటాను…” ఆయన ఫోన్ పెట్టేయగానే తాను కూడా సెల్ ఆఫ్ చేసి బ్యాగ్‌లో వేసుకుని పేరంట్స్ కోసం వేసిన చేర్స్ వైపు నడిచింది.

హెడ్ మిసెస్ రాగానే అందరూ నిశ్శబ్దం అయ్యారు.

ఆవిడ రాగానే రెండు చేతులూ జోడించి అందరికీ వినమ్రంగా నమస్కారం చేసింది. మైక్ సరి చేసి మాట్లాడ్డం మొదలు పెట్టింది.

“డియర్ పేరంట్స్! మీతో ఈ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఓ బలమైన కారణముంది. ప్రస్తుతం ఇక్కడున్న మీకందరికీ తెలుసో తెలియదో గానీ ఈవారంలో మా స్కూల్లో నైంత్ క్లాసులో చదువుతూన్న యిద్దరి అబ్బాయిల మధ్య బాగా పోట్లాట జరిగింది. ఒకర్నినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ క్రిందమీద పడి బాగా కొట్టుకున్నారు. ఇద్దరికీ బలంగా దెబ్బలు తగిలాయి. వెంటనే వాళ్ళ వాళ్ళ పేరంట్స్‌కి ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్‌కి పంపించాము. వాళ్ళిద్దరి మధ్య పోట్లాటకి దారి తీసిన కారణం కూడా చాలా చిన్నది, అతి స్వల్పం. పెన్ను రాసుకోవడానికడిగితే పక్కనున్న అబ్బాయ్‌ని యివ్వలేదట. దానితో వాళ్ళిద్దరి మధ్య కోపావేశాలతో వాగ్వివాదం పెరిగి తీవ్రమైన పోట్లాటకి దారితీసింది.

చిన్నపాటి విషయాలకే పిల్లలు సహనం కోల్పోయి, ఆగ్రహావేశాలతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. వెనకా ముందూ ఆలోచించకుండా పిల్లలు విచక్షణా జ్ఞానం కోల్పోతున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం వరకూ వెళ్ళుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఈ మధ్య సిటీలో ఇలాంటి సంఘటనలు కొన్ని స్కూల్లో జరిగాయి కూడాను.

పిల్లలో నిర్మలమైన మనస్సుండాలి. ఒకరిపట్ల ఒకరికి ఆత్మీయతతో కూడిన స్నేహపూర్వకమైన పోటీతత్వం వాళ్ళలో అలవాటు చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాల్లో ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఇక్కడున్నంత వరకూ మా పర్యవేక్షణలో వుంటారు పిల్లలు. అయినా కూడా ఎప్పుడో ఓమారు ఊహించని ఇలాంటి దుర్ఝటనలు జరుగుతాయి. వాటికి పూర్తిగా స్కూల్ సిబ్బందే బాధ్యత అని మీరంటారు. కానీ సెలవు రోజుల్లో పిల్లల పూర్తిగా ఎక్కువ భాగం మీదగ్గరే గడుపుతారు, పిల్లలలో క్రమశిక్షణ వినయ విధేతలు తప్పుతున్నారని అనడాన్కి కారణం… సామాజిక పరిస్ధితులు, తల్లిదండ్రులు కూడా ఓ కారణమే. కొన్ని కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల ముందే గొడవలు పడ్డం వాళ్ళ మాటలు చేతలు చూసి మానసిక ఒత్తిళ్ళకు గురికావడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. అలాంటి సమయాలలో తమ పిల్లల్ని దగ్గరికి తీసుకొని మంచి చెడులను గురించి చెప్పక ఏమాత్రం వాళ్ళని పట్టించుకోక పోవడం కూడా మరో కారణం, కొంతమంది మంచి విద్యార్థులు చదువే లక్ష్యంగా పెట్టుకొని చురుగ్గా ముందుకు పోతుంటే, మరి కొంతమంది ఏదో స్కూల్‌కు వెళ్ళుతున్నారు, చదువుకుంటున్నారు అన్న భావనతో వుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. కనీసం ఎప్పుడైన స్కూల్‌కి వెళ్ళుతున్న తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అని అడిగి తెల్సుకోరు. మేం ఎన్నడైనా ఇలాంటి మీటింగ్‌లు పెడ్తే, ఆ రోజే వాళ్ళకు ఎక్కడలేని అర్జంట్ కార్యక్రమాలు ముంచుకొచ్చి మీటింగ్‌లకు అసలే రారు. కొంతమంది పేరంట్స్, వాళ్ళ పిల్లలమీదే ఓ అవగాహన చదువు పట్ల శ్రద్ధాసక్తులు లేకపోవడం కూడా మరో కారణం. వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఇంటర్‌నెట్ ప్రభావం కూడా పిల్లలపై పడి వార్ని పెడదారి పట్టిస్తుంది.

నేటి పిల్లలే రేపటి పౌరులన్న విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. యాంత్రికంగా మారిన జీవనంలో ఇంట్లో పేరంట్స్, స్కూల్లో ఉపాధ్యాయులు సక్రమైన రీతిలో పిల్లలోని కదలికలను గమనిస్తూ, వారిలో నైతిక ప్రవర్తన… చదువులోనూ ఆటలలోనూ స్నేహపూర్వకమైన పోటీతత్వం అలవాటు చేయడాన్కి సర్వవిధాలా మనమంతా కల్సి ప్రయత్నించాలని నేను మిమ్ములందరినీ వేడుకుంటున్నాను…” అంటూ ఆవిడ తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించింది.

ఆ తర్వాత కొంత మంది పేరంట్స్ కూడా మాట్లాడారు.

పేరంట్స్ కూడా పిల్లల గురించి కొన్ని సూచనల్ని, సలహా లనిచ్చిన్రు.

హెడ్ మిసెస్ చెప్పడం వలన అవన్నీ పి.ఏ. శ్రద్ధగా రాసుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here