[dropcap]మ[/dropcap]నసు హోరుగా ఉంది.
కడుపులో అరగని ఓ ఆలోచనకు
కాళ్లు వెనక్కి వాలుతుంటే
తల ముందుకు తూలుతుంది.
కాగితంపైకి ఎగబాకిన ముఖం
పాకుతూ, పొర్లాడుతూ
కిందకు రానని మొరాయిస్తుంటే..
కలం చాటుకు చేరిన కళ్ళ
చెమరిన తేమను సిరాగా
రాసిన బాధను సందేశంగా దారం కట్టి
మనసాకాశంలో రెపరెపలాడిస్తుంది.
తను దూరానున్న
తనకు దగ్గరగా చదివించాలని
ఆశ అంత ఎత్తుకు కనిపించాలని
అల్లుకుపోతుంది ఆ ‘ప్రేమగాలి’పటం.