[box type=’note’ fontsize=’16’] “రాయడానికి చాలా విషయాలున్నాయి, రాయలేని చాలా భావాలున్నాయ్. ఎన్నని రాయనూ, ఎన్నని చెప్పను?” అంటున్నారు కవయిత్రి “ప్రేమ లేఖ” అనే ఈ కవితలో. [/box]
[dropcap]ప్రి[/dropcap]యత,
కలం కాగితం మీద పెట్టీ పెట్టగానే నా మోముపై ఒక చిన్ని నవ్వు. కలానికున్న ఆతృత నా తలుపులకి లేదు. ఎందుకంటే కలం వ్యక్తపరచడానికి జంకదు. కలంతో జట్టు కట్టడమంటే సామాన్యం కాదు సుమీ.
రాయాలని చాలా విషయాలున్నాయి, రాయలేని చాలా భావాలున్నాయ్. ఎన్నని రాయనూ, ఎన్నని చెప్పను? దశాబ్దపు మౌనం, మన దూరాల్ని దగ్గిర చేసినట్టే చేసి , ఏడు సముద్రాల భౌతిక ఖాళీ జాగా గా విస్తరించింది. ఒకటి గుర్తించావా, పదేళ్లు దాటినా పయనం మాత్రం ఆగలేదు.
అప్రయత్నంగా వచ్చినా, అవిరళంగా నా తోనే ఉన్నావు. మౌనం అర్ధాంగీకారం అంటారు, మరి అర్థం కాకుండా, ఏ గారం పోకుండా, అసలు అచ్చుల్లో ఆరో అక్షరమైనా వాడకుండా, నా మనస్సెలా దోచావు? నన్ను ఎలా మైమరపించావు?
నీ వైపు అంతా గ్రంథాలయంలోని నిశ్శబ్దం .. నా వైపేమో తెలీని కలవరం. ఇద్దరిలో ఎంత వ్యత్యాసం. చిన్నప్పుడు నీళ్ళల్లో ఆడుకునే కాగితపు పడవలు గుర్తొస్తున్నాయి. నీళ్లు ఎంత వేగంగా వెళ్తున్న, పడవ మాత్రం తన రీతిలోనే పోతుంది.
నువ్వంటే నాకిష్టం అనేది పంచాక్షరీ కన్నా అత్యంత ప్రభావం. కానీ మంత్రాలు చదివే సమయమొచ్చింది, నా దేవిని ప్రసన్నం చేసుకోడానికి.
సూరీడి తొలి సంధ్య వేళ పడే వెచ్చని కిరణాల కాంతి నువ్వు
సంధ్యా సమయాన అలరారే సింధూరపు ఛాయ నువ్వు
అపుడే పెరిగిన పూమొక్క లో ఉండే సహజ ఆకర్షణ నువ్వు
వర్షం వెలసిన తరుణాన ఆకులు నీటి బొట్టుతో చేసే స్నేహానివి నువ్వు
సన్నని గాలి తెమ్మెర సవ్వడిలో తీయని ఒక రాగానివి నువ్వు
నిరీక్షించినా రాలి పడని, నిరసించినా రాలిపడే ఆకుల నీడవు నువ్వు
మెరిసే నీటి తరంగాల తళుకు బెళుకు నువ్వు
ప్రకృతికి కిరీటమద్దే మట్టి వాసన నువ్వు
నా ఈ ఆస్వాదనలు నీకు అర్పితం
ఇప్పటికైనా చేయగలవా నీ హృదయం నాకు అంకితం?