[dropcap]ఓ[/dropcap] చల్లని సాయంత్ర వేళ..
ఉదాసీనంగా నడుచుకునెళ్తూ నేను!!
ఉత్తేజంగా నడుస్తూ నువ్వు!!
నిన్ను చూసినప్పుడల్లా.. ఏదో ఉత్తేజం!!
వెలుగులు విరజిమ్ముతూ
వింతగా మెరుస్తూ
రంగులు మారుస్తూ
హంగులు మారుస్తూ
వంట్లో వేడెక్కిస్తూ
పూలని పలకరిస్తూ
వేగంగా వెళ్తూ
వేదన తీరుస్తూ
అందర్నీ పలకరిస్తూ
ఆలస్యమంటే ఎరగవు నువ్వు!!
ఎందరికో ఆదర్శంగా..
ఎందరికో స్ఫూర్తిగా..
ఎవరేమన్నా పలకవు నీవు!!
ఎవరేమైనా ఉలకవు నువ్వు!!
నీ పనేదో నీదంటూ
నిరంతరం నిప్పులు చిమ్ముతూ
వేడిగా వెచ్చగా
ఎర్రగా బుర్రగా
ఎదిగిన కొద్దీ చిక్కిపోతూ
ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావో??
ఎన్నాళ్ళిలా నన్ను తిప్పుకుంటావో??
నా వయసెంతో.. నీకు తెలుసు!!
నీ వయసెంతో.. నాకు తెలిసేదెలా??
రోజూ చూస్తున్నా!!
అయినా తెలుసుకోలేకున్నా!!
మరి నీ జాడలెతుక్కుంటూ సాయంత్రం
నువ్వే ఇంట్లోకెళతావో చూసైనా తెలుసుకోవాలిక!!
మొన్న నిన్నెక్కువ సేపు చూస్తే..
నిన్న నాకేమో జ్వరమొచ్చింది!!
నువ్వు కూడా నన్ను చూస్తూ ఉండిపోయావ్!!
నా నీడ చెప్పింది నాతో!!
అమ్మ నిన్నూ నన్నూ ఇద్దర్నీ తిట్టేస్తుంది!!
ఎంత చెప్పినా వినవంటూ నన్ను!!
నన్ను ఉడికిస్తావంటూ నిన్ను!!
ఎందుకలా వేడెక్కిస్తావు??
ఈ తాపమింక ఓపలేను.
నీకు పచ్చదనమంటే ఇష్టమంట కదా?
అమ్మ చెప్పింది!!
అందుకే ఒక మొక్క నాటేస్తా!!
సూరీడూ.. నన్నింక వేడెక్కించవు కదూ!!