[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]టీ[/dropcap]వీలో ఒక సినిమా వస్తోంది.
అనగనగా ఒక అబ్బాయి. ఒక అమ్మాయిని ప్రేమించేడు. ఎంతగా అంటే ప్రాణం కన్నా మిన్నగా అనుకున్నాడు. ఆ అమ్మాయి వెనకాల పడడం మొదలెట్టేడు.
ఆ అమ్మాయి సాంప్రదాయంకల ఇంట్లో పుట్టిన పిల్ల. ఎంత కాలేజీలో చదువుతున్నా ఆడపిల్ల స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదనే పెంపకంలో పెరిగిన పిల్ల. అందుకే ఆ అబ్బాయివైపు కన్నెత్తి చూడలేదు.
ఆ అబ్బాయి వూరుకోలేదు. ఆ అమ్మాయిని బెదిరించేడు. భయపెట్టేడు. చంపుతానన్నాడు. ఆఖరికి ఛస్తానని కూడా అన్నాడు. ఆ అమ్మాయి భయపడింది. కానీ బయట పడలేదు. ఎప్పట్లాగే తలొంచుకుని వెళ్ళిపోయింది.
మర్నాడు కాలేజీనుంచి వస్తుంటే ఈ అమ్మాయి ఎదురుగా వచ్చి బ్లేడుతో చెయ్యి కోసుకున్నాడు. ఎర్రని రక్తం చివ్వున చిందింది. హడిలిపోయి పరుగెత్తిందా అమ్మాయి, పాపం.
ఆ మర్నాడు మళ్ళీ దారికాచి బ్లేడు పుచ్చుకుని ఆ అమ్మాయి దగ్గరికే వచ్చేసేడు. కెవ్వున రాబోయిన కేకని గొంతులోనే నొక్కుకుని ఒక్క దూకులో అక్కణ్ణించి పారిపోయిందా అమ్మాయి.
మూడోనాడు మళ్ళీ ఎదురయ్యాడు. ఈసారి చేతిలో యాసిడ్ బాటిల్‌తో..
ఠక్కున టీవీ కట్టేసేను. ఏమిటిదీ!
ప్రేమంటే ఇంత భయంకరంగా వుంటుందా! ప్రేమని ఇంత నీచస్థితికి దిగజార్చేసారా!
మరి ప్రేమికులరోజంటూ తియ్యటి చాకొలెట్లూ, తాజా రోజాపూలూ ఇచ్చుకుంటారెందుకు!
ఒకప్పుడు ప్రేమికులు ఎలా వుండేవారు! వాళ్ళ భాష, హావభావాలు ఎంత పరిణతి కలిగి వుండేవి! వాళ్ల ప్రవర్తన ఎంత బాధ్యతగా వుండేది!
అసలు ప్రేమికులరోజంటే యేమిటా అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ప్రబంథాల వరకూ వెళ్ళిపోయాను.
కాళిదాసు యక్షుని చేత తన భార్యకి తన ప్రేమని తెలియచేస్తూ మేఘసందేశం పంపించాడు.
నల, దమయంతుల మధ్య హంస రాయబారం నడిపింది.
మరింక రుక్మిణీదేవి కృష్ణునికి తనని ఎలా చేపట్టాలో దిశానిర్దేశమే చేసింది.
అక్కడినుంచీ చూస్తే ప్రాచీనకావ్యాల్లోనే కాదు ఆధునిక రచయితలలో కూడా రచనకి ప్రేమ మాత్రమే గొప్ప ఆలంబన అయింది.
ఆ రచనలలో ప్రేమికులు ఎప్పుడూ బాధ్యతారహితంగా ప్రవర్తించలేదు.
ఆ తర్వాత రోజుల్లో నాటకాలలో కూడా ప్రేమ ఒక కథావస్తువయింది. నాటకాలలోని నాయికా, నాయకులను అనుకరించేవారు ప్రేమికులు.
తర్వాత రోజుల్లో ప్రేమ ఆధారంగా నిర్మించబడిన సినిమాలు చలనచిత్ర పరిశ్రమను యేలేసాయి. సినిమాల ప్రభావం ప్రజలలో చాలా వుంటుంది.
అందులో త్యాగంతో కూడిన ప్రేమకథలు మరీ ఆకట్టుకున్నాయి.
రోజులు గడిచేకొద్దీ ఆ సినిమాలలో కూడా ప్రేమికులిద్దరూ ఒకరి నొకరు ఇష్టపడితే చాలు పెద్దల నెదిరించి పెళ్ళి చేసేసుకునే వరకూ వచ్చారు.
ఒకందుకు వాటిని కూడా అంగీకరించవచ్చు, ఎందుకంటే వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించారు కనక.
కానీ, ప్రస్తుతం వస్తున్న సినిమాలలో ఈ ప్రేమ అనేది మరీ వన్‌వే ట్రాఫిక్ వ్యవహారంలాగా అయినట్టు కనిపిస్తోంది. ఏ అమ్మాయినైనా హీరో ఇష్టపడితే చాలు, మరింక ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలు కానీ, పెద్దవాళ్ళ అనుమతికానీ అవసరం అని ఆ అబ్బాయిలు అనుకోవడం లేదు.
ముఖ్యంగా యాసిడ్ బాటిల్స్ పట్టుకుని తిరుగుతున్నట్టు చూపిస్తున్న హీరోలను చూపిస్తున్న సినిమాలను చూస్తున్న యువతపై వాటి ప్రభావం బాగానే పడుతోంది.
యువత అంతా అలా లేకపోవచ్చు కానీ కొంతమంది యువకులు మటుకు అలాగే కనిపిస్తున్నారు. కుండెడుపాలు కూడా ఒక్క ఉప్పుకల్లుకి విరిగిపోయినట్టు సంఖ్య తక్కువగా వున్నా ఇలాంటి యువతవల్ల నేడు సమాజం చిన్నబోతోంది. దీనిని మార్చాలంటే అది కూడా యువతకే సాధ్యం.
అందుకే భయంకరంగా ప్రేమించామంటున్న ఓ యువకులారా, కాస్తంత బాధ్యత తెలుసుకోండి. దయచేసి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించకండి..