[dropcap]మం[/dropcap]త్రమేదో వేస్తున్నట్లుగా.. మాట్లాడేస్తుంటావు!
కమ్మని రాగమేదే తీస్తున్నట్లుగా.. రాగాలేవో ఆలపిస్తుంటావు!
ఓ చల్లని మలయమారుతం తాకి వెళుతున్నట్లుగా అనిపించేలా..
తగులుతూ వెళుతుంటావు!
సిరిమువ్వలు కదలాడుతున్నట్లుగా
సవ్వళ్ళేవో గుండెల్లో మ్రోగేలా..
చిరునవ్వుల సరాగాల సంబరాల్ని ఎప్పటికప్పుడు
సరికొత్తగా పరిచయం చేస్తున్నట్లుగా..
సన్నగా నవ్వుతుంటావు!
వెన్నెల్లెన్నో నయనాల ముందు ప్రత్యక్షమైనట్లుగా..
కలువల్లాంటి కాటుక కన్నులతో చూస్తూ..
హృదయం నిండా ఆనంద పారవశ్యాల జాతరలు చూపుతుంటావు!
ఇష్టమంతా నాపైనే ఆల్లుకునేలా పలుకుతూ
నేనంటే నువ్వనుకునేలా చేస్తుంటావు..!
కదిలే కాలం కాసేపైనా ఆగిపోతే బాగుంటుంది కదా
అనుకునేలా ఆటపట్టిస్తూంటావు..
అలసిన నా మనస్సు వైపు ప్రేమగా చూస్తూ
..ప్రేమంటే ఇదే అంటుంటావు!