Site icon Sanchika

ప్రేమంటే మజాకా!

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ప్రేమంటే మజాకా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప[/dropcap]రిచయం
పలుకరిస్తుంటుంది
వీథిలోంచి వెళుతూ వెళుతూ
కాలక్షేపం చేస్తుంటుంది
వీథి అరుగుల మీద కూచుని
అప్పుడప్పుడు ఓ గ్లాసుడు నీళ్ళు
ఎప్పుడో ఒకప్పుడు
ఓ కప్పు కాఫీయో టీయో తాగుతూ

స్నేహం
చొరవగా
ముందు గదిలోకే వచ్చేస్తుంది
ఓ అడుగు ముందుకేసి
భోజనాల గదిలోకీ వేంచేస్తుంటుంది
టిఫినీలు, భోజనాలు లాగిస్తుంటుంది
పెరట్లోకీ ప్రయాణమంటుంది
అవసరమైన పనులు చేసిస్తుంటుంది
తన అవసరాలనూ తీర్చేసుకుంటుంది

ప్రేమ
బిరబిరా
ఇళ్ళంతా తిరిగేస్తుంటుంది
ఆ గదీ ఈ గదీ నాదే అంటుంది
నేరుగా వంటింట్లోకి దారితీస్తుంటుంది
చొరవగా వడ్డన చేస్తుంది
తనకుతానే వడ్డించుకుంటుంది
ఆనక పడగ్గదిలోకి
ఆపైన స్నానాలగదిలోకి
అటుపైన పూజగదిలోకి
అడుగులు వడివిడిగా వేస్తుంది
స్వతంత్రానికి హద్దులు లేవంటుంది
పద్దుల లెక్క చూసుకుంటుంది
పొద్దస్తమానం పరుగులు తీస్తుంటుంది
వద్దన్నా పనులన్నీ మీదేసుకుంటుంది
మరీ అభ్యంతరం పెడితే
మనలనే బయటకు నెట్టేస్తుంటుంది

అవును..
బంధాలన్నింటిలో అదే బలమైనది
ప్రేమ.. ప్రేమంటే మజాకా!

Exit mobile version