[box type=’note’ fontsize=’16’] మధురమైన బాల్యం నుంచీ భావోద్వేగాల నిలయమైన కౌమారంలోకి ప్రవేశించిన బాలబాలికలను సన్మార్గంలోకి నడిపించటానికి చేసే చిన్న ప్రయత్నమే మా ఈ “ప్రేమ వద్దు – చదువే ముద్దు” నాటిక. రచన యలమర్తి అనురాధ. [/box]
***
పాత్రలు:
తరుణ్ : పదవ తరగతి విద్యార్థి
స్వాతి : పదవ తరగతి విద్యార్థిని
రామారావు : స్వాతి తండ్రి
రాజ్యలక్ష్మి : స్వాతి తల్లి
రంగి : పని అమ్మాయి
***
స్వాతి, తరుణ్ స్కూల్లో మాట్లాడుకుంటూ ఉంటారు.
స్వాతి : హాయ్! తరుణ్! క్లాసు ఫస్ట్ నీకే వచ్చిందిగా. కంగ్రాచ్యులేషన్స్.
తరుణ్ : స్వాతీ! నీకు సెకండ్ రాంక్ వచ్చిందిగా. కంగ్రాచ్యులేషన్స్.
స్వాతీ : ఫస్ట్, సెకండూ ఎప్పుడూ మనవేగా ప్రతి క్లాసులో, ప్రతి ఎగ్జామ్‍లో.
తరుణ్ & స్వాతి (నవ్వుకుంటూ) : హఁ! హఁ! హఁ!
***
ఒక నెల తర్వాత
తరుణ్ : స్వాతీ! నీతో ఒక విషయం చెప్పాలని ఉంది. చెప్పనా?
స్వాతి : చెప్పు తరుణ్! నా పర్మిషన్ అడుగుతున్నావేంటి అలా కొత్తగా.
తరుణ్ : మరి విషయం అలాంటిది. నువ్వేమంటావో అని కాస్త భయంగా కూడా ఉంది.
స్వాతి : ఏం ఫరవాలేదు. చెప్పు తరుణ్. ఏం అననులే.
తరుణ్ : నాకీ మధ్య ఎందుకనో చదువు మీద ధ్యాస తగ్గిపోయింది స్వాతీ. నిన్నే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. నీతో మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది. ప్రతిక్షణం నీ గురించే ఆలోచనలు. నిన్ను తాకాలని… ఇంకా…ఇంకా…ఏదో…ఏదో…
స్వాతీ : నువ్వు మనసులో మాట చెప్పావు. నేను చెప్పలేకపోయాను. నా పరిస్థితి అంతే తరుణ్. ఇదేనేమో ప్రేమంటే. మనం కూడా ప్రేమలో పడ్డామన్నమాట.
తరుణ్ : మనిద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి మనం సరదాగా అలా… అలా… ఎక్కడికైనా వెళదామా?
స్వాతి : ఎక్కడికి?
తరుణ్ : పార్కులకి, సినిమాలకి, బీచ్‍కి వెళ్ళి హాపీగా ఎంజాయ్ చేద్దాం.
స్వాతి : అమ్మో! నాకు భయం.
తరుణ్ : భయమెందుకు? నేనంటే ఇష్టమే కదా!
స్వాతి : ఇష్టమే కానీ…
తరుణ్ : ఏమిటో చెప్పు.
స్వాతి (అనుమానంగా) : ఇంట్లో తెలిస్తే…?
తరుణ్ : తెలియనిస్తామా ఏమిటి? అంతా గప్‍చుప్‍గా! లెటర్స్ రాసుకుని నోట్‍బుక్‍లో పెట్టి ఒకళ్ళకొకళ్ళం ఇచ్చుకుందాం.
స్వాతి : (ఉత్సాహంగా) అయితే సరే తరుణ్.
తరుణ్ : ఇకనుంచీ టైమ్ పాస్ అయిపోతుంది. మజాగా కూడా ఉంటుంది. నువ్వే చూస్తావ్‍గా.
స్వాతి : మన విషయం మాస్టర్లకి కూడా తెలియకూడదు. తెలిస్తే అమ్మవాళ్ళకు చేరిపోతుంది.
తరుణ్ : ఆ విషయం నాకు వదిలేయ్. రేపు ప్రైవేటు క్లాసు ఎగ్గొట్టి పార్కుకు వెళదాం.
స్వాతి : (అంగీకారంగా తలూపుతూ) అలాగే.
(ఇద్దరూ నిష్ర్కమిస్తారు)
***
(రామారావు ఇంట్లో పద్దులు రాసుకుంటూ ఉంటాడు. రాజ్యలక్ష్మి చీరకు వర్క్ చేసుకుంటూ ఉంటుంది.)
రాజ్యలక్ష్మి : ఏమండీఁ!
రామారావు : (పలకడు)
రాజ్యలక్ష్మి : (గట్టిగా) ఏమండీ
రామారావు : ఏమిటే పని చేసుకోనివ్వకుండా
రాజ్యలక్ష్మి : పని ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు కాస్త నా మాట వినండి.
రామారావు : (పెన్నుమూసి పక్కన పెడుతూ) సరే చెప్పు.
రాజ్యలక్ష్మి : రోజులు బాగా లేవండీ. సినిమాల్లో పదవతరగతి నుంచీ, ఇంటర్ నుంచీ ప్రేమలు చూపిస్తుంటే పిల్లలంతా ప్రేమించుకోవడమే గొప్ప అనుకుంటున్నారు. స్వాతీ విషయంలో నాకు భయంగా ఉంది.
రామారావు : మనమ్మాయి అలాంటిది కాదులే. మనకా భయం అక్కర్లేదు.
రంగి : అమ్మగారూ! అమ్మగారూ! (అంటూ లోపలికి వస్తుంది)
రాజ్యలక్ష్మి : ఏమిటే రంగీ! అంతలా అరుస్తూ వస్తున్నావ్? ఏం జరిగిందేమిటి?
రంగి : అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటమ్మగారూ. విషయం తెలిస్తే మీరూ నాలాగే కంగారు పడతారు.
రాజ్యలక్ష్మి : అసలేం జరిగిందో చెప్పవే.
రంగి : మన అమ్మాయిగారిని ఓ అబ్బాయితో పార్కులో చూశానండమ్మగోరూ
రామారావు : అబ్బాయి బాగున్నాడా రంగీ!
రాజ్యలక్ష్మి : అబ్బా మీరుండండి. మీకంతా హాస్యమే. సరిగ్గా చూశావా రంగీ? మన అమ్మాయేనా?
రంగీ : నిజం అమ్మగారూ. నా కళ్ళతో నేను చూశాను.
రాజ్యలక్ష్మి : భయపడినదంతా అయిందన్నమాట.
రామారావు : స్వాతి… మన స్వాతి ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అంతా సినిమాలు, మీడియా ప్రభావం. రంగీ! ఎక్కడా ఈ మాట నోరు జారకు. మనకు తెలిసిందని తెలిస్తే లేచిపోదాం అని పిల్లలు పారిపోయే ప్రమాదం ఉంది.
రంగి : అలాగే బాబుగారూ! నాకు తెల్దా?
రాజ్యలక్ష్మి : ఏమో! నాకు చాలా భయంగా ఉందండీ?
రామారావు : ఏమైనా మనం జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు ఏవిధమైన చెడు మార్గంలోకి వెళ్ళకుండా కాపాడుకోవాలి. నువ్వేం బాధపడకు రాజ్యం నేను చూసుకుంటాగా.
రాజ్యలక్ష్మి : ఏమైనా రంగీ ఈ విషయంలో నీ సహాయం కావాలే రంగీ.
రంగి : అలాగే అమ్మగోరూ!
***
స్వాతి : క్లాసు ఎగ్గొట్టి పార్కుకు వచ్చాం తరుణ్! ఎవరైనా చూస్తారేమో? నాకెందుకో భయంగా ఉంది.
తరుణ్ : ఏం భయం లేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం?
స్వాతి : మనం ఇలా క్లాసులు ఎగ్గొడితే చదువులో వెనకబడిపోతాంగా. ఇప్పుడు ఎలా?
తరుణ్ : ఎప్పుడూ చదువేనా? ఏమన్నా జరుగకూడనిది జరిగితే మనం ఇద్దరం కలిసి పారిపోదాం. ఇక్కడ తెలిసినవారు ఎవరూ ఉండరుగా. ఇక సమస్యే ఉండదు.
స్వాతి : అలా అయితే ఓకే. అమ్మో! చీకటిపడుతుంది. నేను వెళ్ళిపోతాను బాబూ!
***
(స్వాతి చదువుకుంటూ ఉంటుంది. రాజ్యలక్ష్మి, రంగి ప్రవేశిస్తారు)
రాజ్యలక్ష్మి పేపరు చదువుతూ ఉంటుంది. రంగి గది ఊడుస్తూ ఉంటుంది.
రంగి : అమ్మగోరూ! మీకో విషయం తెలుసా?
రాజ్యలక్ష్మి : ఏ విషయమే?
రంగి : పంతులుగారి కూతురు ఎవరితోనో లేచిపోయిందట.
రాజ్యలక్ష్మి : నిజమాఁ! ఏ రోజు పేపరు చూసినా ఈ వార్తలే. ఆడపిల్ల గుమ్మం దాటితే రక్షణ ఉండదని తెలియక.
రంగి : అది పిల్లకాకులకు ఏం అర్థం అవుతుందమ్మా!
రాజ్యలక్ష్మి : అయ్యో! ఆ పిల్ల బతుకు నాశమయినట్లే!
రంగి : అంతేనా! ఆ అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నీ తీసేశారంట. పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళు.
రామారావు : (లోపలికి వస్తూ) ఒక్కరోజులోనే అంతా సర్వనాశనం. వాళ్ళిద్దరూ అలా చేశారని నలుగురూ అనే మాటలు తట్టుకోలేక తల్లీ తండ్రి ఉరేసుకున్నారు.
రంగి : అంత ఘోరం జరిగిపోయిందా బాబుగోరూ! అయినా ఈ వయసులో పిల్లలు చాలామంది ఇలా ఎందుకు చేస్తున్నారమ్మగోరూ?
రాజ్యలక్ష్మి : పది నుంచి పదిహేడేళ్ళ వయస్సుని కౌమారదశ అంటారు. శరీరంలో హార్మోనులు విడుదల అవటం వల్ల వారిలో ఆకర్షణలు మొదలవుతాయి. అది ప్రేమ అని భ్రమపడి ఇలా అవుతున్నదే.
రంగి : మరి అలాంటప్పుడు వాళ్ళేం చేయాలి అమ్మాగారూ!
రాజ్యలక్ష్మి : మనస్సు వాళ్ళకిష్టమైన వాటిమీదకు మళ్ళించుకోవాలి. పెయింటింగ్, పాటలు, డాన్సులు, పుస్తకాలు చదవడం, మొక్కలు పెంచడం, యోగా చేయడం అలాంటివన్నమాట. (స్వాతి నెమ్మదిగా ఆ గదిలోంచి వెళ్ళిపోతుంది)
రంగి, రామారావు, రాజ్యలక్ష్మి : మన పథకం తప్పక నెరవేరుతుంది. (విక్టరీ గుర్తుగా వేలు చూపించుకుంటారు)
***
పార్కులో తరుణ్ స్వాతి కోసం ఎదురుచూస్తూంటాడు.
స్వాతి : ఏంటి తరుణ్! అలా డల్‍గా ఉన్నావు?
తరుణ్ : విషయం తెలిస్తే నీకూ అలాగే ఉంటుంది.
స్వాతి : ఏమైంది తరుణ్?
తరుణ్ : నాకిప్పుడే తెలిసింది. మన ప్రక్క స్కూల్లో చదివే టెన్త్ క్లాస్ రాజా, నైన్త్ క్లాసు దుర్గ ప్రేమించుకుంటున్నారు కదా. దుర్గ వాడిని విసిగించి విసిగించి ప్రేమలో దింపింది. ఇప్పుడూ రాజా ఉరేసుకుని చనిపోయాడంట.
స్వాతి : అమ్మో! అలా జరిగిందా? మరి దుర్గ సంగతేమిటి?
తరుణ్ : ఇద్దరూ ఈ రోజు ఉదయం పదిగంటలకు ఉరివేసుకోవాలని అనుకున్నారట. వాడేమో దానిమాట విని ఉరేసుకున్నాడు. అదేమో వేసుకోలేదు. పాపం డాక్టరు అవుతాను… డాక్టరు అవుతాను… అనేవాడు. చచ్చి శవం అయ్యాడు. అమ్మో! ప్రేమ అంటేనే భయం వేస్తుంది.
స్వాతి : ఉదయం మా అమ్మ, మా పనమ్మాయి మాటలు విని నాకూ చాలా బాధగా, భయంగా ఉంది. అమ్మానాన్నలను బాధపెట్టి, మన భవిష్యత్తును పాడుచేసే ఈ ప్రేమలు మనకొద్దు తరుణ్.
తరుణ్ : నాకూ అలాగే అనిపిస్తోంది.
స్వాతి : బాగా చదువుకోవాలి. ఈ వయసులో మనకదే ముఖ్యం. నువ్వా నేనో స్కూలు ఫస్టు అని పోటీ పడదాం. ఓకేనా?
తరుణ్ : మరి మన ప్రేమ?
స్వాతి : ఇద్దరం బాగా చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నాక ఇంట్లో వాళ్ళకి చెప్పి చక్కగా పెళ్ళి చేసుకుందాం. మనం మంచిమార్గంలో నడిచి మరెందరికో మార్గదర్శకం అవుదాం.
తరుణ్ : పద స్వాతీ! ఇక మన ధ్యాసంతా చదువుమీదే పెడదాం.
స్వాతీ : సరే.
(ఇద్దరూ వెళ్ళిపోయారు)
(బ్యాక్ గ్రౌండ్‍లో వినిపించాలి)
ప్రతి విద్యార్థి మనసును ప్రక్కదారిన పడనివ్వకుండా చదువుమీదే లగ్నం చేయాలి. అదే భవిష్యత్తుకి పూలబాట.
*సమాప్తం*
(K.B.C.Z.P.H School, పటమట వారు మచిలీపట్నంలో ఈ నాటిక ప్రదర్శన ఇచ్చి ప్రథమ బహుమతిని ప్రభుత్వం ద్వారా అందుకున్నారు.)