ప్రేమికులమన్న కులమున్న లోకంలో…

0
4

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]“ఏ[/dropcap]మండీ! మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా వుందని తెలిసింది…. మాకు అద్దెకిస్తారా?” అన్న మాటలు వినిపించగానే అటు తిరిగి చూశాడు రాఘవరావు.

ఎదురుగా ఒక యువకుడు, ఒక యువతి ఉన్నారు. యువకుడికి సుమారు పాతికేళ్లుంటాయి. ఆ అమ్మయికి ఇరవై రెండు సంవత్సరాలుండచ్చు.

“మీరిద్దరూ…?” అంటూ సందేహంగా ఆగిపోయాడు రాఘవరావు.

“నా పేరు నితిన్… చదువు పూర్తయిపోయి చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఈమె పేరు చంద్రిక. ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తయింది.”

“అది సరే… మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ పల్లెటూర్లో మీకేం పని? మీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు?”

“మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అందుకే ఇంటి నుండి పారిపోయి వచ్చేశాం. ఇక్కడ కొన్నాళ్లు తలదాచుకుందామని…” అన్నాడా యువకుడు ఆయన ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తూ.

అతని ధైర్యానికి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. ఉన్నదున్నట్లు చెప్పిన అతని ఫ్రాంక్‌నెస్‌కి ముచ్చటపడ్డాడు కూడా.

“అయితే మీరిద్దరూ లేచిపోయి వచ్చారన్నమాట…”

ఆయన అంత డైరెక్టుగా అనేసరికి చిన్నబుచ్చుకున్నారు ఆ యువతీ యువకులు.

“ఇంతకీ పెళ్లి చేసుకున్నారా లేదా? అంటే ఏ రిజిష్టర్ మేరేజో…?”

“ఇంకా లేదండీ… అంత సమయం లేదు. ప్రస్తుతం మేమిద్దరం అవివాహితులమే.”

“మరి పెళ్లి చేసుకోకుండానే కాపురం చేయడానికా మా ఇంటిని అద్దెకు అడుగుతున్నారు?” అన్నాడు కొంచెం కోపంగా రాఘవరావు.

“సార్…. క్షమించండి దయచేసి మమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకోకండి. మేం ప్రేమించుకున్నామే గానీ ఇంత వరకూ ఏ తప్పూ చేయలేదు. ఏ ఒక్క పొరపాటు పనీ మేం ఇంత వరకూ చెయ్యలేదంటే నమ్మండి. పెద్దలకు భయపడి పారిపోయి వచ్చేశాం. ఎక్కడ మమ్మల్ని వెంటాడి వేధించి చంపుతారో అని భయంతో ఈ మారుమూల పల్లెకు వచ్చి తల దాచుకోవాలని అనుకున్నాం, అంతే!”

“సరే! ఇంతకూ మీ పెద్దలు మీ పెళ్లికి అంగీకరించక పోవడానికి కారణం?”

“కులం! ఆమెది అగ్రకులం. నేను దళితుణ్ని. అదే అసలు కారణం.”

“మరి ఆమెది అగ్రకులం అని తెలిసీ ప్రేమమించడం తప్పు కాదా!” అడిగేశాడే గాని తన ప్రశ్న తనకే తేడాగా వుందనిపించింది రాఘవరావుకి.

“నేను ప్రేమించేటప్పుటికి ఆమె కులం గానీ, ఆమె పుట్టు పూర్వోత్తరాలు గానీ నాకు తెలియవు సార్… ఆమెను చూసిన వెంటనే ఇష్టపడ్డాను. ఆమె నడక, నడవడిక నాకు నచ్చాయి. తర్వాత తెలిసింది ఆమెది అగ్రకులమని.”

“మరి తెలిశాక నువ్వు నీ నిర్ణయం మార్చుకోలేదా మీ ఇద్దరికీ కుదరదని, పెద్దలు అభ్యతరం పెడతారనీ నీకు తెలీదా!”

“తెలుసు సార్… కానీ అప్పటికే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాం. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు అయిపోయాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికొచ్చేశాం. తీరా పెద్దల దగ్గరికెళ్ళే సరికి వాళ్లు ఒప్పుకోలేదు. నాకైతే ఎవరు లేరు. నేనొక అనాథను. కానీ ఈమె తండ్రి ఒక కోటీశ్వరుడు. ఆమె ఆస్తి కోసం నేను వల పన్నానని అతను అనుకున్నాడు. పైగా నేను దళితుణ్ని. మమ్మల్ని గౌరవించడం లేదు సరికదా నీచంగా చూస్తున్నారు. మాకు దిక్కు తోచలేదు. మరే మార్గం లేక ఒక రోజు మేమిద్దరం కూడబలుక్కుని రైలెక్కాశాం…”

“మీ మధ్య కులం అంతరం అంత ఎక్కువగా వున్నావుడు నువ్వు కాస్త ఆలోచించవలసింది…” సలహ ఇస్తున్నట్లుగా అన్నాడు రాఘరావు.

“కులమేమిటో, మతమేమిటో తెలియనపుడు పుట్టిన ప్రేమ అవి తెలిశాక అంతరించిపోతే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది సార్.”

“ప్రేమ గురించి బాగానే పరిశోధన చేశావుగానీ మీ మధ్య ఇంత పెద్ద అవాంతరం వున్నపుడు దాన్ని సాధించుకునే మార్గం కూడా అలోచించుకోవాలి కదా, ఇలా పారిపోయి వస్తే ప్రయోజనం?”

“మా ప్రయత్నం మేం చేశాం సార్… ఈ అమ్మయి తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి శత విధాలా ప్రయత్నించింది. వాళ్లు చావడానికో, మమ్మల్ని చంపడానికో సిద్ధమయ్యారు కానీ మా పెళ్లికి ససేమిరా అంగీకరించమని చెప్పేశారు.”

“అందుకని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చేశావ్!…. అంతేనా?”

“మరో… మార్గం నాకు కనబడలేదు సార్!”

“చూడు బాబూ ఈమె పుట్టిన దగ్గర నుండీ అల్లారు ముద్దుగా పెంచుకొని ఈమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, చదువు, సంధ్యలు నేర్పించి ఇంతటి దాన్ని చేస్తే, ఎవడో ముక్కు, మొహం తెలియని నీలాంటి వాడు ఎగరేసుకుపోతుంటే ఆమె తల్లిదండ్రులు ఎంత బాదపడతారు చెప్పు. ఆమె భవిష్యత్తు పైన, ఆమె వివాహం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకుని వుంటారు. వాటన్నింటినీ క్షణాల్లో భగ్నం చేసి పరిస్థితిని తారుమారు చేసి వారినీ, వారి కుటుంబాన్ని వీధిలోకి పడేస్తే ఎవరూరుకుంటారు చెప్పు, ఇది న్యాయమే అంటావా?” అనడిగాడు రాఘవరావు కాస్త గట్టిగానే.

“మీరు చెప్పిన వన్నీ నేనూ ఒప్పుకుంటాను సార్… కానీ వీటిన్నింటికీ అతీతంగా మా మధ్య చిగురించిన ప్రేమను వారంగీకరిస్తే వారికీ, మాకు సమస్యే వుండదుగా.”

“నువ్వింత తేలిగ్గా తీసిపోరేస్తున్నావుగానీ మన పూర్వీకులు ఏనాడో ఏర్పరచిన ఈ కులాలు, కట్టుబాట్లని దాటి వివాహాలు జరపడానికి మనం ఇంకా అంత మారలేదు బాబూ. వర్ణసంకరం చెయ్యడానికి ఏ ఒక్కరూ అంత సులభంగా ఒప్పుకోరు తెలుసా? మీరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి వుంటారు. కాబట్టి మీకివన్నీ అర్థం కావు. కానీ మానవుడు సంఘజీవి. సంఘాన్ని ఎదిరించి బ్రతకడానికి ఎవరికీ ఇష్టం వుండదు. వారు కులం, వారి కట్టుబాట్లు ప్రకారమే అన్నీ జరగాలని కోరుకుంటారు. హఠాత్తుగా ఇలా జరిగే సరికి తట్టుకోలేక ఎంతకైనా తెగిస్తారు. ఆఖరుకి ఇలాంటి పని చేసిన మీ ఇద్దరినీ చంపడానిక్కూడా వెనుకాడరు, తెలుసా?”

“నిజమే సార్… మీరు చెప్పిందంతా అక్షరాలా నిజం. మేం మా కోణంలోనే ఆలోచిస్తాం తప్ప వారి కోణంలో ఆలోచించం. ఆలోచిస్తే వాస్తవాలు తెలుస్తాయి. కేవలం మా ప్రేమను బ్రతికించుకోవడం కోసమే మేం ఆలోచిస్తాం. అంతే మీరు చెప్పినట్లు మేమిలా చేసినందుకు ఈమె తల్లిదండ్రులకూ చెప్పలేని ఆగ్రహం కలిగింది. ఇదిగో చూడండి!… ఈమెను వెతికి పట్టుకుని తెచ్చిన వారికి ఐదు లక్షల రూపాయలు బహమతి కూడా ప్రకటించారు!” అంటూ ఓ పేపరు కటింగ్‌ను చూపించాడు యువకుడు రాఘరావుకి.

ఆ పేపరు కటింగ్‌ను అందుకుని చూశాడు రాఘరావు.

ఆ అమ్మయి ఫోటో క్రింద ఫోన్ నెంబరు ఇచ్చారు.

“అయితే ఈ అమ్మాయి…” అంటూ సందేహంగా ఆగిపోయాడు.

“ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖరంగారి అమ్మాయి. కోట్లకు వారసురాలు. ఒక్కతే కూతురు. గారాబంగా పెంచుకున్నారు…”

“నువ్వు గాలం వేసి పట్టేశావు అంతేనా?” అన్నాడు రాఘరావు.

దెబ్బతిన్న పాములా బస్సున లేచాడు ఆ యువకుడు.

“సార్… అంతంత మాటలనకండి సార్… నాకు బాధ కలుగుతుంది. నేను ప్రేమించినపుడు ఈ అమ్మాయి గురించి వివరాలేమీ నాకు తెలియవు. నాకామె ఆస్తిగానీ, ఐశ్వర్యం గానీ ఏమీ అక్కర లేదు. నేనీమెను పోషించుకోగలను. నాకా ధైర్యం వుంది…” అన్నాడు.

“సరేలేవయ్యా! పరిస్థితి ఎంత వరకూ వచ్చింది, అది చెప్పు?”

“మమ్మల్ని వెదకమని, పట్టకోమని మనుషుల్ని పంపారట సార్… నా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. నేను దొరికితే చంపేసినా చంపేయవచ్చు. అందుకే ఈ మారుమూల పల్లెటురికి వచ్చా. మీ సహాయం అర్థిస్తున్నాను….”

“బావుంది నీకాశ్రయం ఇచ్చి నన్ను రిస్కులో పడమంటావు? నాకేంటి అవసరం? పైగా పేపర్ కటింగొకటి నా చేతిలో కిచ్చావు. నేనే ఈ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి పట్టించేస్తే ఆ ఐదు లక్షలూ నేనే తీసుకోవచ్చుగా. బేరమాడితే ఓ లక్ష ఎక్కువ కూడా గుంజవచ్చు. ఏమంటావ్?”

ఊహించని ఆతని మాటలకి కంగుతిన్నాడా యివకుడు.

“సార్ మీరు, మీ మంచితనం అన్నీ తెలిసే వచ్చాం సార్ మీ ఇంటికి. అందుకే ఏదీ దాచకుండా మీకు అన్ని వివరించాను. ఉన్నదున్నట్లు మీ ముందుంచాను. పాల ముంచినా నీట ముంచినా మీదే భారం!” అన్నాడు యువకుడు.

తనపై ఆ యువకునికి వున్న నమ్మకానికి అచ్చెరువొందాడు రాఘవరావు. తెలివైనవైడే! వచ్చే ముందరే అన్నీ ఎంక్వయిరీ చేసుకుని మరీ వచ్చాడు.

“నా పై నీకున్న నమ్మకానికి సంతోషిస్తున్నాను. గానీ, ఈ ఊర్లో మరెవరైనా మిమ్మల్ని గుర్తుపడితే?”

“నా ఫోటో ఏదీ పేపర్లో రాలేదు కాబట్టి నన్నెవరూ గుర్తు పట్టరు. కానీ ఈమెను మాత్రం గుర్తించే అవకాశం వుంది. అందుకని మీ ఇంట్లో తనకి ఆశ్రయం ఇస్తే చాలు. నేను ఎక్కడో అక్కడ సర్దుకుంటాను.”

“సరే రండి… లోపలికి….” అంటూ ఇద్దరినీ ఇంట్లోకి తీసికెళ్లి భార్యకు పరిచయం చేశారు. ఆమె కూడా వారిని ఆదరించింది.

నితీష్ ఊర్లో ఏదోక పని చేస్తూ రోజులు గడుపుతున్నాడు. చంద్రిక మాత్రం ఇంట్లోనే వుంటూ ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడుతోంది.

అలా కొద్ది రోజులు గడిచాక నితీష్ ఇచ్చిన పేపరు కటింగ్ తీసుకుని అందులోని ఫోన్ నెంబరుకు తన సెల్లో నోట్ చేసుకోవడం… ఆ నెంబర్‌కి ఫోన్ చేయ్యడం గమనించింది చంద్రిక. రాఘరావు నోటి వెంట తన తండ్రి పేరు రావడం కూడా గమనించింది కానీ ఏం మాట్లాడిందీ సరిగ్గా వినబడలేదు. అదే విషయాన్ని నితీష్‌కి చెప్పింది భయపడతూ. అతడు మాత్రం “ఏం జరగుదులే నువ్వూరికే భయపడి నన్ను భయపెట్టకు… అంతా ఆయన చూసుకుంటారులే. ఏదైనా జరిగితే అప్పుడు చూసుకుందాం” అన్నాడు చంద్రికతో.

చంద్రిక అప్పటికి వూరుకుంది. మర్నాడు రాఘరావు టౌన్లో చిన్న పని వుంది రాత్రికి వచ్చేస్తాను అని భార్యకు చెప్పి బయలుదేరడం వీళ్లిద్దరూ చూశారు గానీ ఆయన్నేం ప్రశ్నించలేదు. మౌనంగా వుండిపోయారు. రాఘవరావు నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లాడు. చిన్ననాటి స్నేహితుడైన రాఘవరావును గాఢంగా కౌగలించుకుని “ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి” అంటూ ఆహ్వనించాడు ఇంటి లోపలికి.

భార్యకు పరిచయం చేశాడు. ఆమెకు కూడా రాఘరావు తెలుసు. అన్నయ్య అని పిలిచేది. ఇద్దరిదీ ఒకే కులం. చిన్ననాటి నుండీ వీరిద్దరూ చాలా సన్నిహితంగా వుంటూ ‘బావా బావా’ అని పిలుచుకునేవారు. పెళ్లి కాక ముందే వీరిద్దరూ చిన్న అంగీకారానికి కూడా రావడం జరిగింది. ఇద్దరిలో ఒకరికి అబ్బాయి, ఒకరికి అమ్మాయి పుడితే వాళ్లిద్దరికీ వివాహం జరిపించి వియ్యంకులం అవుదామని తీర్మానించుకున్నారు. అప్పటి నుండి వాళ్లిద్దరూ బావా అని ఒకరినొకరు పిలుచుకోవడం ప్రారంభించారు. కానీ పెళ్లళ్లయ్యాక వారి వారి వృత్తుల దృష్ట్యా దూరమయ్యారు. రాఘవరావుకి కొడుకు పుట్టాడు. రాజశేఖరానికి అమ్మాయి పుట్టింది. మొదట్లో వీళ్లద్దరికి పెద్దయ్యాక వివాహం జరిపిద్దాం అనుకన్నారుగానీ రాను, రాను వీరి మధ్య రాకపోకలు తగ్గిపోవడం, అంతరాలు పెరిగిపోవడం, రాజశేఖరం బాగా డబ్బు గడించి పెద్ద పారిశ్రామిక వేత్త, అయిపోవడం, రాఘవరావుతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడం జరిగింది. ఇదిగో మళ్లీ ఇప్పుడు ఇలా కలుసుకున్నారు.

“చెప్పరా బావా! ఏంటి సంగతులు ఏదీ నా కోడలు పిల్ల?” అనడిగాడు రాఘవరావు. రాఘవరావు మొదట్లో చాల హుషారుగా వుండేవాడు. ఎందుకో అంత హుషారు కనబడ్డంలేదు అనుకున్నాడు రాజశేఖరం. రాఘవరావు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు రాజశేఖరం.

“ఏంటాలోచిస్తున్నావ్? ఒక్కగానొక్క కూతురు కులం తక్కువ వాడితో లేచిపోయిందని చెప్పడానికి సంకోచిస్తున్నావా?” అన్నాడు అదిరిపడ్డాడు రాజశేఖరం. వీడికెలా తెలిసిందా అని మథనపడిపోతూ “దాని పేరెత్తకు…. ఒళ్లంతా కంపరమెత్తి పోతోంది. నీ కొడుక్కు చేసుకున్నా నాకీ కడుపుకోత తప్పేది!” అన్నాడు.

“ఇప్పుడు మాత్రం మించిపోయిందేముది? మనం ఎలాగూ మన ప్రామిస్‌ని నిలబెట్టుకోకలేకపోయాం. నీ కూతురికైనా ఆమె ప్రేమంచిన వాడితో వివాహం జరిపించరా!”

“అది ప్రేమంచిన దెవర్నో తెలుసా? ఒక దళితుణ్ని. మన కులం ఏమిటి? వాడి కులం ఏమిటి? ఎంత పరువు తక్కువ? అదిలాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు…” అన్నాడు కోపంగా.

“మనం ఊహించనివి జరగడమే జీవితం రా! అన్నీ మనం అనుకున్నట్లే జరిగిపోతే ప్రపంచంలో ఇన్ని విషాదాలూ, వైరుధ్యాలు ఎందుకుంటాయి? జీవితమంటే కష్ట సుఖాల, మంచి చెడుల కలయికేరా! నాకెలా తెలిసిందీ అనుకుంటున్నావా” అంటూ పేపర్ కటింగ్ తీశాడు.

అప్పుడర్థమైంది అతడికెలా తెలిసిందో ఈ విషయం.

“ఇలాంటి ప్రకటనలిస్తే, నీ కూతురికెంత ప్రమాదమో తెలుసా? ఇద్దరూ దొరికితే డబ్బు మీది ఆశతో వాణ్ని చంపైనా మీ అమ్మాయిని తీసికొస్తారు. లేదా ఇద్దరికీ డెంజర్.”

“వాడు దొరికితే నేనే చంపేస్తాను” అన్నాడు ఆవేశంగా.

“ఎందుకంత ఆవేశం? ఏం చేశాడని?”

“ఏం చేశాడని మెల్లగా అడుగుతున్నావా? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుతుర్ని నాకు దూరం చేశాడు. మాయమాటలు చెప్పి దాన్ని లేపుకుపోయి నా పరువు తీశాడు. రేపు వాడి మోజు తీరిపోయి వదిలేస్తే దాన్ని ఎవడు చేసుకుంటాడు?”

“అందరూ ఒకలాగే ఉంటారని ఎందుకనుకుంటావ్, మంచివాళ్లు వుంటారుగా…”

“అయినా ఆ కులం తక్కువ వాడి దగ్గిర అదేం సుఖపడుతుంది. మహారాణిలా పెరిగింది. ఇప్పుడు నా పరువూ, కుటుంబం పరువూ మంట గలిపింది.”

“పరువు… పరువు అంటున్నావు! కన్న కూతురి సుఖం కన్న ఈ పరువే నీకు ముఖ్యమా? కూతురికి నచ్చిన వాణ్ని ఇచ్చి పెళ్లి చేయలేనపుడు నువ్వు పోగేసిన ఈ డబ్బు ఎందుకు? ఇకనైనా నువ్వు నీ ఆవేశం మాని నిదానంగా ఆలోచించు. ఈ కులాలూ, మతాలూ మనం ఏర్పరుచుకున్నవే. సరే! మన కులంలో వాడినే ఇచ్చి వివాహం జరిపించామనుకో, వాడు పరమ దుర్మార్గుడైతే అప్పుడు మన అమ్మాయి సుఖపుడుతుందా? అప్పుడైనా అమ్మాయి ప్రాణానికి హాని కాదా? మనం ఏదీ చెప్పలేం. ఒక్క క్షణం కులాన్ని ప్రక్కన పెట్టి మనిషిగా ఆలోచించు. వాళ్లిద్దరినీ నువ్వు అంగీకరించావనుకో వాళ్లు ఆనందిస్తారు. నువ్వు హాయిగా వుంటావు. నీ ఆస్తికి వారసులూ వుంటారు. ఆలాకాక వాళ్లను విడదీసి వాణ్ని చంపి నువ్వు జైలు కెళ్లావనుకో. నీ కూతురి గతేంటి?”

రాజశేఖరం ఏం మాట్లాడలేదు. రాఘవరావు చెప్పిందాంట్లో నిజమెంతో బేరిజు వేసుకుంటున్నడు.

“నాకో కొడకుండే వాడు నీకు తెలుసుగా. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిది ఫాక్షనిస్టుల కుటుంబం. ఆ అమ్మాయికి అది వరకే పెళ్లి నిశ్చయం అయిపోయింది. అటువంటి అమ్మయిని తీసికెళ్లి పోయాడని నా కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అసలు నా ప్రమేయమే లేకుండా జరిగిపోయింది. నాకీ కులాల మీద, మతాల మీద పట్టింపులు లేవు. ఇప్పు నేను ఒంటరిని. నువ్వు నాలాగా ఒంటరిగా మిగలకు. నీ కూతుర్ని అల్లుణ్నీ నేను వెతుకుతాను. వాళ్ల ప్రేమను నువ్వు అంగీకరించు. వాళ్లను మనసారా ఆశీర్వదించు. పరువు హత్యలు చేసి వారి జీవితాన్ని నాశనం చెయ్యకు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఇష్టముంటే నీ దగ్గర పెట్టుకో. లేకుంటే వారి మానాన వాళ్లను వదివెయ్. ఎలాగోలా బ్రతుకుతారు. ఎవరేమన్నా లెక్క చెయ్యకు. సమాజానికి నువ్వు భయపడనక్కరలేదు. ఇది నీ కుటుంబ సమస్య, నువ్వే పరిష్కరించుకోవాలి. కులాల పట్టింపుల వలన మనకు జరిగేదేం లేదు. మానవత్వమే అసలైన కులం. ఎవరూ ఏమి అనకపోతే నీకు అంగీకారమేగా. నువ్వేం ఆలోచించకు. అంతా నేను చూసుకుంటాను” అన్నాడు రాఘవరావు.

రాజశేఖరం ఆలోచనలో పడ్డాడు. “వీడు చెప్పింది నిజమే కదా! ఈ సంపాదనంతా కూతురి కోసమే కదా! ఆమె ప్రేమలో పడకపోతే అంతా తన ఇష్టప్రకారమే జరిగేది., కానీ ప్రేమించడం వలన తండ్రినీ, ఆస్తినీ వదిలేసి వెళ్లిపోయింది. వాడిపై ఎంత నమ్మకం లేకపోతే ఈ పని చేస్తుంది? అంటే వాడు కులానికి తక్కువ గుణానికి కాదన్న మాట. ఆమె దూరమయ్యాక తనకి ఈ డబ్బెందుకు? పరువెందుకు? ఎంతో చలాకీగా వుండే రాఘవ ఎలా అయిపోయాడు? తనూ అంతేనా? లేదు… మరాలి. కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి మనుషులూ మారాలి అనుకున్నాడు.

“సరేరా! నీ ఇష్టం! నువ్వేం చేసినా నాకు అంగీకారమే” అన్నాడు.

వెంటనే నితిన్‌కి ఫోన్ చేశాడు. చంద్రికను వెంట బెట్టుకుని ఆమె ఇంటికి రమ్మని. ఫోన్లో విషయమంతా వివరించి రాజశేఖరం ఒప్పుకున్న విషయమూ చెప్పాడు.

కొన్ని గంటల్లోనే కూతురు, అల్లుడు కళ్లముందు నిలబడే సరికి రాజశేఖరం ఆశ్చర్యపోయాడు.

“ఔనురా! అదృష్టం ఏమిటంటే వీళ్లద్దరూ తలదాచుకోవడానికి నేరుగా నా ఇంటికే వచ్చారు. అమ్మయిని గుర్తుపట్టాను కూడా. వీరికి నేనే ఆశ్రయం ఇచ్చాను. లేకుంటే ప్రమాదంలో చిక్కుకునే వారు. అల్లుణ్ని నేను పరిశీలించాను. చాల మంచివాడు. తెలివైనవాడు. నీ బాధ్యతల్ని నిర్భయంగా అతడి చేతుల్లో పెట్టువచ్చు. నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. వీళ్లిద్దరినీ ఆశీర్వదించు….” అన్నాడు.

“నన్ను క్షమించండి నాన్నా!… మిమ్మల్ని బాధ పెట్టాను…” అంది చంద్రిక కళ్లనీళ్లతో తండ్రి పాదాల పై పడి.

“చల్లగా వుండండి!….” అంటూ వారిద్దరినీ ఆశీర్వదించాడు.

రాఘవరావు ఆశీర్వచనం కూడా తీసుకన్నారు వారిద్దరూ.

“చూశావా! వీళ్లద్దరూ ఎంత సంతోషంగా వున్నారో? ఎన్ని కోట్లు ఖర్చుపెడితే ఇంతటి ఆనందం మనకు సొంతమవుతుంది చెప్పు?”

“నిజమేరా! నువ్వు నా కళ్లు తెరిపించావు. నా కూతుర్ని నా వద్దకు చేర్చావు. ఇక నా బాధ్యతలు నా అల్లుడికే అప్పగించి మనిద్దరం శేష జీవితాన్ని హాయిగా గడిపేద్దాం!… ఏమంటావు? అన్నాడు రాజశేఖరం రాఘవరావు చెయ్యి పట్టుకుని.

“నేనింకేమంటాను? నీ ఇష్టప్రకారమే కానిద్దాం… శుభం!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here