Site icon Sanchika

ప్రేమించే మనసా… ద్వేషించకే!-1

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సం[/dropcap]ధ్యా సుందరి చెక్కిళ్లు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. సంధ్య చెక్కిలి మీద ఘనీభవించిన సౌందర్యపు చుక్కలా వుంది ఆకాశంలో సన్నగా, సుకుమారంగా వున్న తొలిమబ్బు.

కృష్ణా బ్యారేజి మీద నిలబడి సునీత ఎవరి కోసమో ఎదురు చూస్తుంది.

కృష్ణానది అలల మీద నుంచి తేలి వచ్చే గాలి హాయిగా చల్లగా శరీరాన్ని తాకుతూ గిలిగింతలు పెడుతోంది.

లేతాకుపచ్చ షిఫాను చీర, అదే రంగు జాకెట్టు; వదులుగా పొడవుగా వేసుకున్న రెండు జడలు సన్నని నడుముకు రక్షక భటుల్లా వున్నాయి. ఆమె శరీర కాంతిలో స్వర్ణ పుంజాలు మెరిసిపోతున్నాయి. ఆ వంపు సొంపుల్లో ఇంద్రధనస్సులు విరిసి కరుగుతున్నాయి. ఆ సోగకన్నులో కాంతి తళుక్కున మెరుస్తుంది.

అటువైపు వస్తున్న వాళ్లు, వెళుతున్న వాళ్లు కన్నులు మిరమిట్లు కొలిపేటట్లు కనబడుతున్న సునీత అందాన్ని చూడకుండా వుండలేరన్నట్లు చూసి మరీ వెళుతున్నారు. ఇవి ఏవి తనకు పట్టనట్లు రోడ్డు వైపు సునీత కళ్లు చూడసాగాయి.

కొద్ది క్షణాలు అలా చూసిన సునీత చేతి నున్న వాచీ వైపు చూసింది.

టైం 6.45 నిమిషాలు కావటంతో అనుకోకుండా కనుబొమలు ముడి పడ్డాయి.

‘ఇంకా రాలేదేమిటి సుధీర్’ అనుకొంది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ‘అవును కదూ ఈ రోజు సుధీర్ ఆ మధ్యన యింటర్వూకి వెళ్లిన ఉద్యోగం వచ్చిందీ, లేనిదీ ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది అన్నాడు. ఏమయిందో? అబ్బ! ఇప్పటికి ఎన్ని ఇంటర్వూలకి వెళ్లాడో! రెండేళ్ల బట్టి చదువు పూర్తయిన దగ్గర్నుండి ఇంటర్వూలకు వెళుతూనే వున్నాడు. అసలు వాళ్లు ఇంటర్వ్యూలకు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కావటం లేదు. అసలు తన స్నేహమేగాని సుధీర్‌కి లేకపోతే ఈపాటికి నిరుద్యోగ సమస్యతో ఎంత నిరాశ – నిస్పృహలకు లోనయ్యోవాడో?’ అనుకొంది సునీత.

“హల్లో సునీతా! హౌ ఆర్ యూ” అంటూ వచ్చాడు సుధీర్. సుధీర్ ముఖంలో మునుపెన్నడూ చూడని ఉత్సాహం, సంతోషం కొట్టవచ్చినట్లు కనబడసాగింది.

సుధీర్ సంతోషానికి కారణం ఊహించలేనంత అమాయకురాలేం కాదు సునీత.

“అబ్బాయిగారు చాలా హుషారుగా వున్నరే” అంది.

“హుషారు కాదు సునీత, ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు. నీవు నా దానిగా వస్తానంటే ఇన్నాళ్లు వద్దూ అంటూ కొద్ది రోజులు ఆగమని అడ్డు చెబుతూ వచ్చాను. నేను అలా చెబుతున్నందుకు ఎంత బాధ పడ్డానో నా మనసుకే తెలియాలి.”

“సునీతా నా కోసం… నాలాంటి నిరుపేద కోసం… అన్నీ వదులుకోని నా జీవితంలోకి వస్తానంటుంటే సంపాదనాపరుడు కాలేని నేను నిన్ను ఏ వింధంగా సుఖపెట్టగలను? మీ యింట్లోలా నీకు కావలసినవన్నీ సమకూర్చలేకపోయినా కనీస అవసరాలయినా తీర్చలేని నేను నిన్ను ఎలా నా జీవితంలోకి ఆహ్వనించగలను చెప్పు” అన్నాడు.

“హమ్మయ్య ఇక తమరి ప్రసంగం అపుతారా. నీ కోసం గంట నుంచి వెయిట్ చేస్తుంటే వెధవ డైలాగులన్నీ చెబుతున్నావు? ఇంతకీ ఈ ఉద్యోగం నీకు రావటానికి కారణం కొంపదీసి మన ప్రేమ కథ చెప్పలేదు కదా!” అంది సుధీర్‌ని ఏడిపించాలన్నట్లు నవ్వుతూ సునీత.

గలగలా నవ్వాడు సుధీర్. “కరెక్ట్‌గా చెప్పావు సునీతా! ఒక వేళ ఈ ఉద్యోగమే రాలేదనుకో, నువ్వు అన్నట్లే చెబుదాం అనుకున్నాను.”

“అయ్యా! నన్నొక లక్షాధికారి అమ్మాయి నా పర్సనాల్టీ, నా అందం చూసి ప్రేమించేసింది” అని సుధీర్ నవ్వుతూ చెబుతుండగానే…

కోపంగా సుధీర్ వైపు చూసి… “చాల్లే!… పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావ్. ఆరడుగుల హీరోవనీ… అయస్కాంతము లాంటి నీ కళ్లు, నుదురు మీద ఆడుకుంటున్న ముంగురులు చూసి నిన్ను నేనేం ప్రేమించలేదు. పెద్ద గొప్పలు చెప్పకుంటున్నావ్” అంది బుంగమూతి పెట్టి సునీత.

సునీత మాటలకు సుధీర్ నవ్వకుండా వుండలేకపోయాడు.

“సునీతా! తర్వాత ఏం చెప్పానో తెలుసా? ‘సార్ నాకీ ఉద్యోగం ఎంతో అవసరం. నాకీ ఉద్యోగం వస్తే కాని మేమిద్దరం ఒకటి కావటానికి వీల్లేదు. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని, మిఠాయి అమ్మ ఎప్పుడు పెడుతుందా అని చంటి పాప ఆశగా తల్లి కేసి చూస్తున్నట్లు నా స్వీట్ సునీత నా ఉద్యోగం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ఈ ఉద్యోగం కానో నాకివ్వకపోయావో చచ్చి నరకానికి పోతావ్’ అని బెదిరించాను.”

“అలాగా బాబు! ఆ పాపం నాకెందుకులే. అయినా నేను అందరిలా లంచాలు ఆశించను. అయినా పాపం యిన్నాళ్లు ఈ వెధవ ఉద్యోగం కోసం మీరిద్దరు ఎడబాటుగా వున్నారంటే నా మనసు ద్రవించిపోతుంది. ఈ ఉద్యోగం నీకు ఖాయం! వెంటనే పోయి ముహుర్తాలు పెట్టించుకో బాబు అన్నాడు.”

“మరి ముహుర్తం ఎప్పుడు పెట్టించమంటావ్” అన్నాడు నవ్వుతూ సుధీర్.

“అమ్మో అబ్బాయిగారు అమాయకులు. నోట్లో వేలు పెడితే కొరకలేవు అనుకున్నాను. చాలా గడుసుతనం నేర్చుకున్నావే!” అంది నవ్వుతూ.

అందంగా మనోహరంగా నవ్వుతున్న సునీత మొఖంలో అంతలోనే గంభీరత చోటు చేసుకుంది.

“సుధీర్, నిజం చెప్పాలంటే మా మమ్మీ నా కోసమే బ్రతుకుతుంది. మా అమ్మ వెనక ఏదో పెద్ద గాథ వుండే వుంటుంది. నా అన్న వాళ్లందరికి దూరమైనా నాకోసమే బ్రతుకుతుంది. నా ఊహ తెలిసినప్పటి నుండి నా నోటినుండి మాట రావటం తరువాయి క్షణాల మీద జరిపేది. అటువంటి అమ్మ నా మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటానేంటే కాదంటుందా. అసలు యిన్నాళ్లు చాలా పొరపాటు చేసానేమో? అనిపిస్తుంది. అంత ప్రేమ, అనురాగాలు యిచ్చే తల్లికి మన ప్రేమ గురించి చెప్పకపోవడం అని బాధగా వుంది.”

“లేదు సునీతా! నీకు తెలీదు. అంత ప్రేమ అనురాగాలు పంచే తల్లి కాబట్టే, తన కూతురు ఒక సామాన్యుడిని, అందులోకి నిరుద్యోగిని ప్రేమించిందంటే ఆ తల్లి మనసు ఆ ప్రేమను అంగీకరించదు. అందుకే ఇన్నాళ్లు మన ప్రేమ గురించి చెప్పవద్దు అన్నాను. నిన్ను పోషించుకునే శక్తి నాకు ఏర్పడింది కాబట్టి ఈ రోజు మన గూర్చి చెప్పమంటున్నాను.” అన్నాడు సుధీర్.

“పిచ్చి సుధీర్! మా అమ్మను నీవు తక్కువగా అంచనా వేసావు. ఈ వివాహానికి మా అమ్మ తప్పకుండా అంగీకరిస్తుంది” అంది.

ఇద్దరు సంతోషాలు నిండిన ముఖాలతో బయలుదేరారు.

***

“సునీతా! ఇంత ఆలస్యం అయింది ఏమమ్మా! అసలే రాష్ డ్రైవింగ్, హడలిపోయాను” అంది సుజాత.

కిలకిలా నవ్వింది సునీత.

“మమ్మీ నాది రాష్ డ్రైవింగా? 60 కి.మీ. స్పీడు” అంది నవ్వుతూ!

“నీకంతా ఎగతాళి అమ్మా. ఎక్కడ చూసినా వెధవ ట్రాఫిక్. నువ్వు ఇంటికి వచ్చేవరకూ నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాను. అది సరే గాని హైద్రాబాదు నుంచి సంబంధం వచ్చింది. అబ్బాయి I.A.S. ఆఫీసరు. అన్ని విధాల బాగుంది. వాళ్ల దగ్గర్నంచి ఈ రోజే వుత్తరం వచ్చింది నిన్ను చూసుకోవటానికి వస్తున్నాం అని” అంది సుజాత.

“మమ్మీ” అంది కంగారుగా సునీత. “ఇన్నాళ్లు నీకు ఒక విషయం చెప్పకుండా దాచాను. అయాం సారీ మమ్మీ” అంది.

సుజాత ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యరేఖలు అలుముకున్నాయి. ‘కొంపతీసి…. తనలా… తన కూతురు కూడా ఎవరిని ప్రేమించలేదు గదా! హే భగవాన్! అలా ఎన్నటికి చేయదు. నేను నిన్ను కోరుతున్న కోరిక అదొక్కటే.’

ఎప్పుడు లేనిది తల్లి ముఖంలో ఆశ్చర్యంతోపాటు గంభీరత చోటు చేసుకునేటప్పటికి సునీతకు చెప్పటానికి భయం వేసింది.

“మమ్మీ” అంది.

కూతురు ఏదో చెప్పటానికి సంశయిస్తుందని గ్రహించిన సుజాత “నా దగ్గర సంశయమెందుకమ్మా?” అంది, మనసులో తను పడుతున్న బాధ పైకి తెలియజేయటం ఇష్టం లేనట్లు.

“నేను… నేను… నాతో పాటు చదువుకున్న సుధీర్‌ని ప్రేమించాను మమ్మీ” అంది.

“సునీతా!” అని ఏదో వినకూడనిది విన్నట్లు పెద్ద కేక వేసింది సుజాత.

(సశేషం)

Exit mobile version