ప్రేమించే మనసా… ద్వేషించకే!-12

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]న్నీ ఉండి భర్త త్రాగుబోతైతే, జూదగాడైనా, తిరుగుబోతైనా, కోపిష్టి వాడైనా… పరమ దుర్మార్గుడైనా… ఎన్నిరకాల వెధవ గుణాలున్నా సహనంతో భరించే స్త్రీలు వున్నారు. కాని వాళ్లందరు పొందలేని అపురూపమైన ప్రేమనందిచే భర్త తనకు వున్నాడు. ఇంతకన్నా ఏ స్త్రీ అయినా ఏం కావాలని కోరుకుంటుంది? తెగిన వేలు రక్తం కారుతుంటేనే యింత బాధపడిపోతున్నాడే, తన హృదయంలో తనంటే ఎంత ప్రేమ, అనురాగాలు వున్నాయో స్పష్టంగా తెలిపోతుంది. తనెంత అదృష్టవంతురాలు. ఆ మధురమైన ఊహలతోనే ప్రశాంతంగా కళ్లు మూసుకుంది సుజాత.

కూరకు ఉప్పు కారం ఎంత అవసరమో, మనిషికి ఆత్మాభిమానం అంతే అవసరం. ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా కూర ఎలాగుంటుందో; ఆత్మాభిమానం, వ్యక్తిత్వం లేని మనిషి మనుగడ కూడా అంతే వుంటుంది. కాని మారుతున్న కాలంతో ఉప్పు, కారం శరీరానికి హాని అని వైద్యులు ఎలా తగ్గించమంటున్నారో నేటి సమాజంలో మనుషులు ఆత్మాభిమానంకి, వ్యక్తిత్వానికి దూరంగానే ఉంటున్నారని చెప్పాలి.

ఈ రెండు వున్నవాడు సుదర్శన్! అందుకే వెళ్లిన ఉద్యోగాలకి కొంత డబ్బు పడేస్తే ఉద్యోగం సులువుగా దొరుకుతుందని తెలిసినా ఆవేశంతో ఎదురుతిరుగుతున్నాడే కాని ఆ ఉద్యోగం తన స్వంతం చేసుకోవాలని ప్రయత్నించలేదు. ఫలితంగా నిరుద్యోగులు అనుభవించే నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు.

మీనాక్షి అనే సూటి పోటి మాటలకు, పెట్టే పాట్లకు అంతు లేకుండా పోయింది.

సుదర్శన్ యింట్లో వుండగా మంచిగా సుజాతతో మెలిగేది. సుదర్శన్ బయటకు అడుగుపెట్టగానే సూటి పోటి మాటలకు అంతు వుండేది కాదు.

అత్తగారి ప్రవర్తనతో మనసుకు సూదులు గుచ్చుకుంటున్నట్లు బాధపడేది సుజాత. సుదర్శన్‌తో చెబితేనో? ఏమని చెబుతుంది?…ఆవిడన్న మాటలు చెపితే సుదర్శన్ ఆవేశాన్ని అణుచుకోగలడా? తనంటే పంచప్రాణాలు. అన్ని మాటలంటుంది అంటే కోపంతో ఎదురుతిరగడు? ఫలితం రెండు చేతులు కలిస్తే చప్పట్లులా అవుతుంది. అసలే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న సుదర్శన్ మనసుకి ఇంటి విషయాలు చెప్పి బాధపెట్టడమా? తనని సుఖపెట్టాలని, అపురూపంగా చూసుకోవాలని ఆశపడుతున్న సుదర్శన్‌కి అనవసరంగా మనసు పాడుచేయటం ఎందుకని మనసును సమాధాన పరుచుకొనేది.

***

పురుడు పోసుకోవటానికి పుట్టింటికి వచ్చింది సుందరి. నెలలు నిండి కాదు…. నెలలు దగ్గర పడి కాదు… మూడో నెలే. అయినా ఆవిడ రావాటానికి కారణం పెళ్లయిన పదేళ్లకు గర్భం వచ్చిందని, పల్లెటూరులో వైద్యసదుపాయాలు లేవని.

వచ్చి రావడంతోనే మరదలు సూజాతను చూసి మూతి మూడు వంకరలు త్రిప్పుకొంది.

సుందరి అలా త్రప్పుకోవటానికి కారణం – మరదలు చెవులకు రవ్వల దుద్దులతో, మెడలో దుక్కలాంటి బంగారు గొలుసుతో, చేతుల నిండా గాజులతో జమీందారి కుటుంబంలో నుండి ఊడిపడ్డ అమ్మడులా కనబడుతున్నా – ఆడపడుచుకి ఆడపడుచు కట్నం లేకుంటే లేదు కనీసం ఒక పట్టుచీరైన తీసుకురాలేదని మహా కోపంగా ఉంది సుందరికి.

***

సుదర్శన్ బైటకు వెళ్లి తిరిగి రాలేదు.

సుజాత డైనింగ్ రూంలో కూర్చుని కాయకూరలు కోస్తోంది. సుందరి కడుపుతో వుందని అర్దశేరు పాలలో బోర్నవీటా కలిపి వంటింటిలో వుండే కేకవేసింది మీనాక్షి.

సుందరి వంటింటిలోకి వెళ్లింది.

“నువ్వొక పిచ్చిదానివే ఏది పెట్టినా, ఏది ఇచ్చినా దాని ముందు తింటావేమిటి? అసలే వట్టి మనిషివి కావు. మాయదారి కళ్లు దిష్టి తగిలితే యింకేమైనా వుందా? పొద్దున పూట టిఫిన్‌కి దాంతో కూర్చోకు. నువ్వు అందరికన్నా ఎక్కువ తినాలి, అర్థం అయిందా?” అంది గుసగుసగా మీనాక్షి.

“అలాగే అమ్మా, ముందే ఎందుకు చెప్పలేదు?” అని బోర్నవీటా పట్టుకొని చెంగు చాట వేసుకొని సుజాత ముందు నుంచి బెడ్ రూంలోకి గబగబా నడిచి వెళ్లిపోయింది.

వాళ్ల మాటలు వింటున్న సుజాతకు గుండెకోస్తున్నటని పించింది. ‘కాలేజీలో అందరూ నవ్వుతారు, ప్రొద్దున తాగి వెళుతున్నాను గదా మమ్మీ, మళ్లీ ఎందుకు పంపిస్తావు మమ్మీ’ అంటే డాడీ కోపంగా వచ్చి ‘నలుగురు నవ్వే పని చేయకూడదు గాని బోర్నవిటా పంపితే ఎవ్వరు నవ్వుతారు సుజీ! ఏది నాకు వాళ్లను చూపెట్టు’ అనేవారు.

ప్రొద్దునే టిఫిన్, కాఫీ తీసుకొని మరల ఇంటర్‌వెల్‌లో డ్రైవరు బోర్నవిటా తెస్తే తాగలేక ఫ్రెండ్స్‌కిచ్చేది. వాళ్లు నాక్కావాలంటే నాక్కావాలని వంతులాడుకునేవారు. అటు వంటిది తన కళ్లు దిష్టి పెడతాయా! ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. కళ్ల నుంచి కన్నీళ్లు జలజల రాసాగాయ్! ఛీ!… వెధవ మనసుకి బొత్తిగా ధైర్యం లేకుండా పోయింది. ఏమిటి వెధవ కన్నీళ్లు, నాకు తెలియకుండానే కళ్ల నుంచి వస్తున్నాయ్ ఎందుకు? ఎవరి సానుభూతి పొందాలని? మరింత వాళ్ల దృష్టిలో తను చులకన అయిపోవటంగాని… నిర్భయంగా…. దేనికి తను చలించనట్లు వుండాలి. ఇంకా ఎన్నాళ్లు? కొద్ది రోజుల్లో…. కొన్ని నెలలో నయినా సుదర్శన్‌కి ఉద్యోగం వస్తే… తను ఇక్కడ వుంటానన్నా అయిదు నిముషాలు వుంచడు. తన నోటితో సుదర్శన్‌కి ఒక్క మాట చెప్పక పోయినా తను ఏదో దాస్తున్నాను అని ఎప్పటికప్పుడు చెప్పమని అడుగుతాడు. తను రోజు రోజుకి నీరసించిపోతున్నానని… మనసులో ఏదో పెట్టుకొన్నానేమో అని…. “కొద్ది రోజులు ఆగు సుజీ! నిన్ను కాలు క్రింద పెట్టనీయకుండా చూసుకుంటాను” అని అంటే తను “కొంప తీసి వేరే కాపురం పెట్టినాక వంట పని కూడా మీరే చేస్తారేమిటి?” అంటుంది ఏడిపించాలని.

“ఏం చేయకూడదా నా ప్రాణేశ్వరి కోసం?” అని చిలిపిగా అంటాడు. అటువంటి అనురాగ మూర్తి తనకు తోడు వుండగా వీళ్లందరి మాటలను పట్టించుకోవటమేమిటి? మనసుని సమాధానపరచుకొని కోయసాగింది సుజాత.

ఎవరో కుర్చీ తెచ్చి తన దగ్గరగా కూర్చున్నట్లయి తల దించుకొని కూరగాయలు కోస్తున్న సుజాత ‘ఎవరా?’ అన్నట్లు తల ఎత్తి చూసింది.

ఆడపడుచు భర్త సర్వేశ్వరరావు పళ్లు ఇకిలిస్తూ చూస్తున్నాడు… ఆ ముఖంలో అమాయకత కొట్ట వచ్చినట్లు కనబడింది సుజాతకు.

“అరే మీరెందుకండి ఇక్కడ వచ్చి కూర్చున్నారు? సుదరిగారు రూంలో వున్నారుగా” అంది ఒక వేళ సుందరి కోసం వచ్చి కూర్చున్నాడేమో అని.

“అబ్బే దాని కోసం కాదండి…. మీ… మీ… మీ కోసమే నండి” అన్నాడు నవ్వుతూ.

అతను అంత ధైర్యంగా అలా అనేటప్పటికి కంగారుగా “నా గురించా” అంది.

“అవునండి, సుదర్శన్ చెప్పాడు మీ గురించి. మీరు…. మీరు… మీరు క్లాసులో తనకన్నా బాగా చదివేవారట కదూ… ”

“అయితే?” అంది ఆశ్చర్యంగా!

“ఏం లేదండి నేను… నేను… మా నాన్నకి ఒక్కడినే కొడుకుని. ముద్దు చేసి… ఆ ఊరి చదువు అదేలెండి SSLC వరకే చదివించారు. పట్నం పోయి చదువుదామన్న ఆశ వున్నా మా నాన్న పడనీయలేదు. ‘ఈ ఆస్తికి నువ్వే వారసుడివి. ఎంత చదివినా ఉద్యోగం కోసమే కదా! నువ్వొకరి చేతి క్రింద ఉద్యోగం చేయనక్కర్లేదు. నువ్వే చూచుకుందువు పొలం అన్నీను’ అని… నాన్న మాటకు ఎదురు చెప్పలేక చదువు అంతటితో ఆగిపోయింది కాని….”

సర్వేశ్వరరావు ఏం చెబుతున్నాడో…. ఎందుకు చెబుతున్నాడో, తలా తోకా లేకుండా – అర్థం కాలేదు సుజాతకు. అయినా తనతో చెప్పటం ఎందుకు? ఈయన ఎందుకు చెప్పారు – తను బాగా చదివేదని… ఏమిటో అంతా అగమ్యగోచరంగా తయారయింది సుజాతకు.

“ఏమండీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే… నాకు పొలం పనులు అయినాక… అక్కడ చేలో కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి. అవి కాగితం మీద పెట్టాలన్న కోరిక కూడా పెరుగుతుంది. తీరా పెట్టినాక ఆ ఆలోచనలన్నీ పాత్రల రూపంలో బయలుదేరుతాయి. ఆ పాత్రలన్నీ కలసి ఒక కథా వస్తువు క్రింద తయారవుతుంది… ఆ కథ… చదివాక ఇలా కాదు, ఆ పాత్ర యిలా వ్రాస్తే బాగుండేదేమో అని తర్జనభర్జన అవుతుంటాను. పోనీ ఎవరికైనా చూపెట్టి నేను వ్రాసింది బాగుందో లేదో తెలుసుకుందామంటే ఎవరు స్నేహితులు లేరు… అంటే అసలు స్నేహితులు లేరనుకోకండి… ఉన్నారు… కాని వాళ్లకి యిటువంటివి అర్థం కావు… కొంత మందికి అర్థం అయినా యింట్రస్టు చూపెట్టరు. పోనీ సుందరి చదివి ఎలాగుందో చెబుతుంది అనుకుంటే దానికి ఇరవై నాలుగు గంటలు ప్రక్క వాళ్ళతో కబుర్లు… లేకపోతే సినిమాలు… ఇంకా తోయకపోతే మత్తుగా నిద్రపోతుంది….”

సర్వేశ్వరరావు చెబుతున్నది ఏమిటో అప్పటికి గాని అర్థం కాలేదు… అతనిలో…. రచయిత దాగొని వున్నాడున్నమాట…. లేకపోతే అతని మనసు ఆలోచనలకు ఎందుకు లోనవుతుంది. ఆలోచనలకులోనైతే అయ్యింది కాగితం మీద ఎందుకు పెడతాడు? అంత ఆలోచన శక్తి వున్న ఇతనిలో అమాయకపు పొర ఎందుకు వీడిపోలేదు. మనుష్యులతో కనీసం ఎలా మాట్లాడాలో తెలియదు… మాట్లాడటానికి ముందు వెనుక కూడా పళ్లు ఇకిలిస్తూనే వుంటాడు. ఆ పల్లెటూరు వాతావరణంలో చదివిన చదువు… అంతే కాదు, వాళ్ల మధ్య మసలడం… యింట్లో సరైన వాళ్లు లేకపోవటం… అతను అలా వుండటానికి కారణం అయివుంటుంది. అంత వరకు ఎందుకు రాతియుగం నాటి మనుష్యులు క్రమంగా వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది నేటితో ఎంతో నాగరికత గల మనుష్యులుగా వన్నెకెక్కలేదు అనుకుంది సుజాత.

కాయగూరలు కోయటం పూర్తి చేసి చేతులు కడుక్కోవడానికి బేసిన్ దగ్గరకు వెళ్లింది. చేతులు కడుక్కొని వెనుతిరిగిన సుజాత దగ్గరకు రెండు పుస్తకాలు పట్టుకొని వచ్చేశాడు సర్వేశ్వరరావు.

“మీరు… మీరు… మీరు చదివి అభిప్రాయం చెప్పండి…. ‘సుదర్శన్‌ని చదవమంటే మీ చెల్లెలు ఖాళీయే చదవమను… అందులోకి నాకన్నా బాగా చదివేది కాలేజిలో. ఆవిడ చేత మార్పులు అవి వుంటే చేయించుకో’ అన్నాడండి.  పుస్తకాల్లో నా పేరు చూసుకోవాలని లేదు కాని ఏంటో అదోరకం బాధ అండి. అది ఏమిటో తెలియటం లేదు. నేను వ్రాసినవి అందరూ చదివి వాళ్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని… అంతే కాదు… నేను వ్రాసిన వాటి వలన అసలు ప్రయోజనం ఉందో లేదో…” అని… “హి… హి… ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయండి” అని చెబుతున్న సర్వేశ్వరరావు కళ్లలో చటుకున్న నీళ్లు నిండుకున్నాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here