ప్రేమించే మనసా… ద్వేషించకే!-13

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”నా[/dropcap] కథలు రెండు మూడు క్రొత్తగా వస్తున్న వార్తా పత్రికల్లో, మాసపత్రికల్లో కూడా వచ్చాయండి. పాఠకులు అభిప్రాయాలు కూడా వ్రాసారు… నన్నండి… నన్ను ఎంతో పొగుడ్తూ వ్రాసారండి. నా కథలో వర్ణనలు లేకపోయినా పల్లెటూరి వాతావరణం… అక్కడ అదేనండి పల్లెలో మనుషుల తత్వాలు యథావిధిగా వ్రాసానని వ్రాసారండి. నాల్గు నెలల క్రితం రెండు కథలు పట్టుకొని విజయవాడలోనే కదండి పత్రికల ఆఫీసులు, ఒక ఆఫీసుకు వెళ్లానండి. ఎడిటరు గారు నన్ను ఎగాదిగా చూసి… ‘మీ కథలు అసలు ఎన్ని అచ్చయినాయి…. ఏ ఏ కథలు వచ్చినాయి… ఎన్నాళ్ల బట్టి వ్రాస్తున్నారండి’ అని అడిగారండి. సమాధానం చెప్పానండి. ‘మా పత్రికల్లో పేరున్న రచయితలకి తప్ప కొత్త వాళ్లకు స్థానం లేదయ్యా, పాఠకుల అభిరుచులు దృష్టిలో పెట్టుకొని వేస్తాం. క్రొత్త వాళ్ల కథలు వేసే పత్రికలు వేరే వుంటాయి. అక్కడ చూసుకో…. మా పత్రిక స్టాండర్డు దెబ్బతినకూడదు కదయ్యా! సారీ’ అన్నారండి!

నిజం చెప్పాలంటే నాకు ఒళ్లు మండిపోయిందండి. ఆయన వేయను అన్నందుకు కాదండి. అన్ని పత్రికల వాళ్లు అలానే అన్నారనుకోండి. కొత్త వాళ్లవి వేయం అని. మరి ఈ క్రొత్త వాళ్లు పాత పడేదెప్పుడండి. ఆ మాటే అడిగేశానండి. నా కథ మొదలు చివర చదివేసి ‘నీ కథ పేరు బాగుందయ్యా! కథ ఫర్వాలేదు. కాని క్రొత్తవాడు కలం పట్టినట్లు తెలిసిపోతుంది. ఐ మీన్…. అదే … దాన్నే శిల్పం… శైలి అంటారు. అవన్నీ లోపించాయి’ అన్నారండి…. ‘ఇటువంటి కథలు పాఠకులు ఇష్టపడరు’ అంటే నేనపుడు ‘ముందు నేను రాసిన మూడు కథలు పాఠకులకు నచ్చాయండి. ఆ పాఠకులే కదా సార్, వేసి చూడండి’ అంటే ఎడిటరుగారు అంత ఎత్తున లేచారండి” అన్నాడు.

సుజాత ఒక్కనిముషం వరకు సర్వేశ్వరరావు మాటల నుండి తేరుకోలేకపోయింది. ‘అమాయకంగా చెబుతున్న ఆ మాటల్లో ఎంత నిజం దాగి ఉంది… ఇతనే ఒకనాటికి ప్రముఖ రచయిత కావచ్చు’ అని మనుసులోనే అనుకుంది.

“మరి నా కథలు దిద్ది పెడతారండి” అని అడుగుతున్న సర్వేశ్వరరావుని చూసింది సుజాత.

మొఖంలో అదే నవ్వు. ‘ఏ కల్మషం లేని మనిషి’ అనిపించింది.

“అలాగేనండి… కాని యిపుడు కాదు… పని వుంది… తర్వాత అదే… ఆయన వచ్చాక ఖాళీగానే వుంటాను. ఇంకో విషయం కథలు… మార్పులు… చేర్పులు… వర్ణనలు అవేం నా చేత కాదు. నిజం చెప్పాలంటే రచనల విషయంలో నాకు  ‘అఆ’లు కూడా రావు. కాని చదివి నాకు తోచిన అభిప్రాయాలు చెబుతాను” అంది. సంతోషంతో నిండిపోయింది సర్వేస్వరరావు ముఖం.

“అయ్యయ్యో! పొయ్యి మీద కూర మాడిపోతుంటే, ఏమిటీ వెధవ కబుర్లు… కూర చూస్తున్నావనుకున్నాను” అని కొరకొరా సుజాత వంక చూసింది మీనాక్షి.

ఎపుడు తీసికొని వెళ్లి వండిందో, కోసిన కూరగాయలు, తనకు తెలియనే తెలియదు. పోని మాట వరసకైన చూడమని చెప్పలేదు. కాని… సుజాతకు ఎంత బాధ పడకూడదనుకున్నా సుజాత మనసు ఆవేదనకు గురయింది.

“కూర చూస్తావుగదా! కోడలు వుంది కదా అని వెళ్లి నడుం వాల్చాను, నాకంత అదృష్టం ఎక్కడుంది” గొణుక్కోసాగింది మీనాక్షి.

కాయకూరలు మళ్లీ తీసుకొని వచ్చి కత్తి పీట ముందు పెట్టుకొని కోయటానికి కూర్చుంది సుజాత…. ఏవో ఆలోచనలు… ఏమిటో తెలియని బాధ…. ఎంత ఆలోచనలను మనసులోనికి రానివ్వకూడదనుకున్నా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లు ఆలోచనలు వాటంతటవే చోటు చోసుకుంటున్నాయి. అసలు మనిషికి భగవంతుడు గుప్పెడు మనసు ఎందుకిచ్చాడు… ఆలోచనలతో సతమతం కావటానికా… మనసే లేకపోతే… ప్చ్…. విరక్తిగా నవ్వుకుంది సుజాత… ఈ ప్రేమ లేకపోను…. అసలు తను గుమ్మం దాటకపోను! …. భగవాన్ మనసిచ్చి మనిషిని ఎందుకు ఆవేదనకు గురిచేసావ్? మూగగా బాధపడింది సుజాత.

***

“ఏవమ్మా సుందరి ఇక్కడున్నావా? మరదలుతో బాతాఖానీ వేసుకొన్నావా? ఇందండి తీసుకోండి ఇద్దరు కాఫీ” అని రెండు కప్పులతో కాఫీ మీనాక్షి తీసుకువరావటం చూసి, ఎప్పుడు లేనిది అత్తగారు తీసుకురావటమేమిటి? అని కంగారుగా “మీరెందుకు తెచ్చారు అత్తయ్యా, వదినగారు మాట్లాడుతుంటేను…” అంది సుజాత.

“అయ్యో! ఈ మాత్రం దానికే అంత కంగారుపడతావు దేనికమ్మా, మా సుందరి ఎంతో నువ్వు అంతే నాకు” అని ఆప్యాయంగా మాట్లాడుతున్న అత్తగార్ని చూస్తుంటే ఈవిడ మునుపటి మనిషేనా అన్న అనుమానం కలిగింది సుజాతకు.

ఏది ఏమైనా ఒకటి మాత్రం గ్రహించింది సుజాత… అత్తగారిలో పరివర్తన ఎలాగొచ్చిందో తెలియదు గాని…. నాల్గురోజుల నుండి అత్తగారిలో మార్పు వచ్చింది. అంతే కాదు తనంటే ఆప్యాయత కనబరుస్తుంది. ఒక వేళ కూతురు వచ్చినాక ఆవిడలో కనువిప్పు కలిగిందేమో! కూతురెంతో కోడలు అంతే అనుకుందేమో!

మనసులోనే ధన్యవాదాలు భగవంతునికి అర్పించుకొంది సుజాత, అత్తగారి ప్రవర్తన మారినందుకు.

***

నిండు పౌర్ణమి.

వెన్నెల వెలుగులో అక్కడక్కడ పక్షులు ఆకాశంలో ఎగరడం కనిపించసాగాయి.

వెన్నెల చల్లదనానికి పరవశిస్తున్నట్లు ఉంటుంది. గులాబీలు ఠీవిగా ఊగుతున్నాయి ముందుకూ, వెనక్కూ. స్నన్నజాజులు మెల్లగా విచ్చుకుంటున్నాయి.

కిటికీ దగ్గర నిలబడి రాగ రంజితమైన ప్రకృతి సౌందర్యానికి మైమరచి చూస్తున్నాడు. చందమామ తొంగి తొంగి కిటికిలో నుండి తన వైపు చూస్తున్నట్లనిపించింది సుదర్శన్‌కి.

నిండు చందమామని చూస్తుంటే ముగ్ధమధుర మందహాసం చేసే సుజాత మోము గుర్తు వచ్చింది.

‘సుజీ! ఇంకా రావేం!’ అనుకుని, ‘ఈ మధ్యన సుందరి వచ్చిన దగ్గర నుండి బొత్తిగా తనను పట్టించుకోవటం మానివేసింది. ఎంత సేపు సుందరితో కబుర్లు. రానీ చెప్తాను.’ అనుకుంటూ కోపంగా వచ్చి మంచం మీద పడుకున్నాడు…

కిటికీలో నుండి వెన్నెల వచ్చి మంచం మీద పడి తమాషాగా వుంది. మంచం మీద బోర్లాపడుకుని పిడిగిలి బిగించి దిండు మీద గుద్దాడు కోపంగా…

తలుపులు తోసుకుంటూ లోపలికి వచ్చి నెమ్మదిగా గడియ పెట్టి సుదర్శన్ మొఖంలోకి తొంగి చూసింది ‘సుదర్శన్ పడుకున్నాడా? లేదా?’ అన్నట్లు సుజాత.

సుజాత రావటం అడుగుల చప్పుడు విని నిద్రపోతునట్లు కళ్లు మూసుకున్నాడు సుదర్శన్.

“సారీ అండి, నా కోసం చూసి చూసి పడుకున్నారు కదూ!” అని వంగి నుదుటి మీద తగిలి తగలనట్లు ముద్దాడి పడుకోడానికి వెనక్కి వాలిపోయింది.

“సారీ లేదు… నిన్ను క్షమించను” అని రెండు చేతుల మధ్య బంధించి ఊపిరి సలపనట్లు ముద్దులతో ముంచెత్తసాగాడు.

“అబ్బబ్బ వదలండి… ఏమిటండి ఈ పని” అని గుంజుకోసాగింది.

అలా అంటున్న కొలది ముఖం మీద, కంఠం మీద… ముద్దులతో ముంచెత్తుతున్న సుదర్శన్ వైపు కోపంగా చూస్తూ “ఏమిటండీ పిచ్చి పట్టినట్లు… అబ్బబ్బ నాకు ఊపిరి సలపటం లేదు” అని ఆయాసపడసాగింది.

“పిచ్చోడిలా ఏమిటి సుజీ! పిచ్చోడినే!…. నువ్వు నాకు ఒక్క నిముషం కనిపిచకపోతే పవర్‌పుల్ పిచ్చోడిని అయిపోతాను, అర్థమయిందా? ఇంకెపుడు ఆలస్యంగా రాకు” అన్నాడు.

సుజాత కళ్లల్లో వెన్నెల కాసింది. తను…. తను… తనంటే ఎంత ప్రేమ… సుదర్శన్ చెప్పింది నిజమే. తను ఒక్క నిముషం కనిపించకపోతే ఇల్లంతా తన కోసం గాలిస్తాడు. సుదర్శన్ సంగతి తెలిసే అత్తగారు సుదర్శన్ ఉండగా ఒక్క పని లోకి రానివ్వదు… కొడుకు బయటకు అడుగుపెట్టగానే ఊపిరి సలపని పని చెబుతుంది. పాపం పిచ్చి సుదర్శన్,అమ్మ మారిపోయింది, తనకు పని చెప్పటం లేదు అనుకుంటాడు.

“ఓహో… అమ్మాయిగార్కి ఆలోచనలు ఎక్కువవయ్యాయి… ఎదురుగుండా నన్ను పెట్టుకొని….” అని మరోకసారి సుజాతను ఆక్రమించుకోవాలని ముందుకు వంగాడు.

“ఏమిటండీ… సారీ చెబుతున్నానుగా… వదలండి… వదినగారు కబుర్లల్లో పెట్టారు. నా రవ్వల దుద్దులు ఒకసారి పెట్టుకోడానికి అడిగారు…. వదినగారు పెట్టుకుంటే చాలా బాగున్నాయండి. అత్తయ్యగారు మరీ ముచ్చట పడిపోతున్నారు.” చెప్పుకుపోతుంది సుజాత.

ఒక్క నిముషం షాక్ తిన్నవాడిలా అయ్యాడు సుదర్శన్. “ఓహ్! అసలు సంగతి యిదా? ఇంకా నేను ఏమిటో అనుకున్నాను. అయితే గోవిందా నీ రవ్వలదుద్దులు… నీకేమైనా పిచ్చి పట్టిందా సుజాతా. అసలు ఎందుకిచ్చావ్? వాళ్లు వాటి కోసమే అంత ప్రేమగా వున్నారు. రేపటి నుండి మామూలే! ముందు వెళ్లి అవి తెచ్చుకో” అన్నాడు కోపంగా.

“చాల్లెండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇంట్లో వాళ్లకిస్తే పరాయి వాళ్లకిచ్చినట్లు భయపడుతారేంటి?” అంది తేలికగా నవ్వేస్తూ. “అయ్యో! నీకు తెలియదు సుజీ! అమ్మకి సుందరక్క అంటే ప్రాణం. మరి అవి నీకు దక్కనట్లే” అన్నాడు. “ఈ మధ్యన అత్తగారు మారిపోయారు అని తెగ మురిసిపోయావు గదూ! ఇందుకే” అన్నాడు.

“పోన్లెండి… అంతగా వాళ్లకి రవ్వల దుద్దుల మీద వుంటే ఇచ్చేస్తాను… ఆడపడుచే గదా… అంతే గాని మీరు నన్ను అనవసరంగా నన్ను భయపట్టకండి. అత్తగారు మళ్లీ మాములుగా మారిపోతారని” అంటూ భయంగా గుండెల మీద చేయి వేసుకుంది.

సుజాత భయం చూసి సుదర్శన్‌కి చెప్పలేని జాలి కలిగింది. “సుజీ! నీ బాధ నాకు తెలిసింది. మా అమ్మ సంగతి నాకు తెలుసు. ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు… నిన్ను ఒక్క నిముషం ఇక్కడ వుంచను సుజీ!” అన్నాడు బాధగా.

‘అయ్యో అనవసరంగా చెప్పాను’ అని మనసులోనే నొచ్చుకుంది సుజాత.

“సుజీ!… ఇంకెప్పుడు నీ వంటి మీదవి ఏం అడిగినా ఇవ్వకు… మా సుందరి అక్క మా అమ్మను మించిపోతుంది” అని “మరి నీకు పనిష్మెంటు ఇవ్వనేలేదు గదు” అంటూ హృదయానికి గాఢంగా హత్తుకొని కౌగిలిలో బంధించి “సుజీ! అటు చూడు ఆ చందమామ… నువ్వు నా ప్రక్కలో లేక ఎంత అల్లరి పెట్టిందో తెలుసా?” అని చిలిపిగా నవ్వసాగాడు.

“బాగుందండీ? ఇదేం పనిష్మెంటు? నా ఒక్కదానికేనా? కొంపదీసి ఎవరికైనా పనిష్మెంటు ఇవ్వాలంటే ఇలాగే యిస్తారా?” అంది నవ్వుతూ.

గభాలున సుజాత పెదాల పై చేయి అడ్డంగా వుంచాడు.

“సుజీ! నీకు ఈ డౌట్ ఎందుకొచ్చింది… అసలు నేను… చేసిన పనే పొరపాటు అని ఎప్పటికపుడు ఆనుకుంటున్నాను. గుడిసెలో పిల్లాడిని బొమ్మల కొట్టు దగ్గర వదిలితే తాహతు మరచి పాలరాతి బొమ్మ కావాలని అల్లరి పెట్టి బొమ్మ కొనుక్కున్నట్లు నా స్థితి మరచి నిన్ను నాదానిగా చేసుకున్నాను. తీరా ఇక్కడకు తీసుకొని వచ్చినాక, గుడిసెలో పిల్లాడు పాలరాతి బొమ్మను మట్టిలో ఆడుకొని రంగు పోగొట్టి విరగ్గొట్టి అందం పోగొట్టినట్లు ఈ యింటికి నీ సౌందర్యం అంతా ఆహుతి చేస్తున్నాను అని నేను దుఃఖిస్తున్న సమయంలో నీకింకా అన్యాయం చేస్తానా…” అలా అడుగుతున్న సుదర్శన్ కళ్లల్లో కన్నీటి పొరలు.

“ఏమండీ” అంది కంగారుగా సుజాత. “ఏమిటండీ మీ ఆవేదన. నాకిపుడేమయిదండి మీరంతగా బాధ పడిపోతున్నారు? మీరు నా అంతస్తు ఇంకా మరచిపోలేదు కాని నేను ఎపుడో మర్చిపోయానండి.” అంది సుజాత.

గతం గుర్తు వచ్చిన సుజాత కళ్లల్లో కన్నీళ్లు కాలవలై ప్రవహిస్తున్నట్లు జలజల రాలుతున్నాయి.

చేతుల్లో ముఖాన్ని దాచుకొని వలవలా ఏడ్వసాగింది. మరునిముషంలో పైట కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని దుఃఖం దిగమింగాలని ప్రయత్నించింది. కాని ఆనకట్ట లేని నదిలా కన్నీళ్లు కళ్ల వెంట కారుతూనే వున్నాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here