Site icon Sanchika

ప్రేమించే మనసా… ద్వేషించకే!-15

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సు[/dropcap]దర్శన్‌లో ఇంత ఆవేశం వుందని నేను ఎపుడు అనుకోలేదు. ఒక వేళ వాళ్ల అమ్మ, అక్క నన్ను ఎలా బాధ పెడుతున్నది చెప్పినా యిలా ఆవేశంతోనే ఒళ్లు మరచిపోతాడేమో? అనిపించింది… నలుగురు నాలుగు విధాలుగా అనుకోవడమే అవుతుంది కాని… అంత కన్నా జరిగేదేముంది? ఈ మాత్రం కూడా తల్లి కూతుళ్లు బ్రతకనివ్వరు… ఉద్యోగం ఉందనా వేరే వెళ్లపోవటానికి… ఇవన్నీ ఆలోచించిన నాకు పరిస్థితి ఊహించి గుండె ఝల్లుమంది… తను ఇక్కడున్నన్నాళ్లు వాళ్లెంత క్రూరంగా ప్రవర్తించినా సుదర్శన్‌తో చెప్పకూడదు అన్న నిర్ణయానికి వచ్చాను. ఆ కలతలు… మనస్పర్ధలు ఎలా వున్నా… నా భర్త ప్రేమ, అనురాగాలు నాకు పదివేలు అనుకొని ఉంటున్న సమయంలో విధికి నా జీవితంతో ఆడుకోవాలని సరదా పుట్టింది కాబోలు, అనుకోని పాత్రను మా మధ్యన ప్రవేశ పెట్టింది.

స్వప్న… అదే మా అత్తగారు ఆయనకు ఇచ్చి చేయాలనుకున్న మేనకోడలు మా యింటి కొచ్చింది. ఆ అమ్మాయి జీవితంతో విధి ఘోరంగా ఆడుకుంది….

పెళ్లయిన నెల తిరకుండానే ఆ అమ్మాయి భర్త స్కూటరును లారీ వచ్చి గుద్దేసిందట… లారీని మత్తుగా త్రాగిన డ్రైవరు నడుపుతున్నాడట…. స్వప్న… ఇంకా కాపురానికి వెళ్లనే లేదు… ఆమె భర్త వాళ్ల ఊరులోనే చనిపోయాడు పాపం. అత్తవారు స్వప్నను ఒకటే తిట్లు దీవెనలట.. బంగారం లాంటి నా కొడుకును మింగేసిందని… నూరేళ్ల జీవితం ఒక్క నెల రోజులకే పూర్తయిపోయిందని తీరని ఆవేదనతో స్వప్న కృంగి కృశించిపోతుంటే మధ్యన ఈ అమ్మాయిని నానా మాటలు అనటం మొదలు పెట్టారట. పోనీ పుట్టింటిలో తల దాచుకుందామని ఆ అమ్మాయి అనుకుంటే మూర్ఖమైన కట్టుబాట్లు… ప్రతి క్షణం మనసును రంపపు కోత కోసే పరామర్శలు. స్వప్న భరించలేక పోయిందట… అందుకే ఇంట్లో వాళ్లకి యిష్టం లేకపోయినా… ఆ వాతావరణాన్ని భరించలేక, ఆ ఊళ్లో కాలం దొర్లడానికి దేనిలో ఒక దానిలో మనసు లగ్నం చేద్దామన్నా అక్కడ సదుపాయాలు లేక టైపు, షార్టుహాండు నేర్చుకుందామని ఇక్కడకు వచ్చింది.

మొదట స్వప్న భర్త పోయాడని తెలిసి పరామర్శకి వెళ్లడానికి వెనక్కి తగ్గారు మా అత్తగారు. కారణం అసలు స్వప్న సుదర్శన్ భార్య కావలసిందని… మీ వలనే యింత అన్యాయం జరిగిందని వాళ్లు ఎక్కడ అంటారో అని భయపడ్డ మా అత్తగారు స్వప్న రాకకు ఎంతో సంతోషించారు. కోడలు అని లేక ఒక్క మనిషి ఎక్కువైనంత మాత్రానా ఇబ్బందులన్న ఆవిడే స్వప్న రాకకు అంత సంతోషించడం ఆశ్చర్యం అనిపించింది.

స్వప్న స్థానాన్ని నేను ఆక్రమించానని నా మీద ద్వేషం పెట్టకుందేమో! అనుకున్నాను మొదట్లో. కాని స్వప్నలో ఆ ఆలోచనలేవి కన్పించకపోవటంతో నేను ఆ అమ్మాయికి దగ్గరయి ఆ అమ్మాయి బాధను పోగట్టాలని నిర్ణయించుకున్నాను. స్వప్నలో చెప్పకోదగ్గ విషయం ఒకటుంది… ఏమిటనుకున్నావు? తన నూరేళ్ల జీవితం బూడిదలో కలిసిపోయినా బాధను దూరం చేసుకుని సాధ్యమయినంత వరకు మనుష్యులలో కలిసిపోవాలని ఆరాటపడేది… ఒక్కర్తే కూర్చుందా… ఆ విషాదవదనం చూస్తే ఎటువంటి వాళ్లకైనా కళ్ల వెంట నీరు రాక మానదు. ఆ ముఖంలో నిరాశ… నిస్పృహ… ఆవేదన… దుఃఖంతో… మనిషి నరకయాతన అనుభవించేది… అందుకేనేమో వున్న పరిసరాల నుండి తప్పించుకొని… తన కాళ్ల మీద తను నిలబడి…. క్రొత్త జీవితం ప్రారంభించాలని వచ్చింది.

ఒక రోజు వున్నట్లుండి మా మావగారు గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతూ చెమటలు పట్టిపోతూ చాలా బాధపడుతుంటే ఆయన వెళ్లి డాక్టరుగార్ని వెంట పెట్టుకొచ్చారు. డాక్టరు హార్ట్ ఎటాక్ అని చెప్పారు. మావగారు బ్రతకడమే కష్టమయింది. నిజం చెప్పాలంటే ఆ యింట్లో సుదర్శన్ తర్వాత ఆయనే నాకు ఆత్మీయుడు. ఆయనను అలా చూస్తుంటే నా మనసు చాలా బాధపడేది… నేను ఆయన బ్రతికి బట్టకట్టాలని వేయి దేముళ్లకు మ్రొక్కుకునేదాన్ని. కాని మా అత్తగారి ఆలోచనలు వేరే విధంగా వున్నాయి. మావగారిని చూడటానికి వచ్చిన వాళ్లను చాటుగా తీసుకెళ్లిపోయి “ఆయ్యో రామ, ఆయనకు జబ్బు ఏమిటి? సుష్టిగా తిని దుక్కలా వుండి తిరిగేవారు… గొప్పింటి బిడ్డ అయితే ఎవరికి కావాలండి? ఇంట్లో అడుగు పెట్టి సంవత్సరమైనా కాకముందే ఆయన మంచం ఎక్కారు… ఆవిడ కాలు మోపాకెలెండి.” అని సుదర్శన్ లేనప్పుడు… ముక్కు చీదుతూ ఒక కంట నన్ను చూస్తూ ఏడ్చేదావిడ.

మావగారు మంచం మీద వుండటంతో తప్పని సరై ఆయన టైపు ఇన్‌స్టిట్యూట్ చూసుకోవటం మొదలు పెట్టారు. షిప్టులు ప్రకారం టైపు నేర్చుకోవటానికి పిల్లలు వచ్చేవారు… అంతకు ముందు నాతో గడపటానకి కొంతైనా టైం ఉండేదాయనకు. కాని యిపుడు ఇద్దరం మాట్లాడుకోవాలంటే సమయం చిక్కేది కాదు. ఇక నాకు చెప్పని పనుంటూ లేదు. నాలుగు రోజులకో పనిమనిషి మారేది… వాళ్లని ఎక్కడైనా తల్లి కూతుళ్లు బ్రతకనిస్తేనా? ఇల్లు సరిగా తుడవలేదని, బట్టలకి ఎక్కుడ మురికి అక్కడే వుందని పనిమనిషితో పోట్లాటకు దిగేవారు… అంతే అ పని మనిషి మానేసేది. ఇక యింటి బట్టలన్నీ నన్ను ఉతకమని పడేసేవారు… ఒక పనేమిటి? వాళ్లు అసలు నేను ఖాళీగా ఒక్క నిముషం కూర్చుంటే చూడలేకపోయేవారు. ఇంత నికృష్టపు బ్రతుకు నేను బ్రతుకుతున్నా నాలో వున్న ఆశ అదే – ఆయనకు ఉద్యోగం రాగానే ఈ నరకంలోంచి బయటపడవచ్చు అని అనుకునేదానిని. ఒక్కక్కసారి వారు అనే మాటలు ఆయనతో చెప్పాలని ఆవేశం వచ్చేది! కాని చెప్పి ప్రయోజనం? సినిమాల్లో, కథల్లో హీరోకి ఉద్యోగం లేకపోయినా ఒక అద్దె యిల్లు తీసుకొని ప్రియురాలుని అందులో వుంచటం, ఎలాగో ఒకలాగ హీరో డబ్బు సంపాదించి ‘నా మొదటి సంపాదనతో నీకు చీర తెచ్చాన’నటం ఇవన్నీ నిజ జీవితంలో కుదరవని తెలిసి నోరు మెదపలేకపోయేదానిని. అంతేకాదు, మావగారు మంచం మీద నుంచే “నా కోసం అన్నీ భరించమ్మా! అరిచే కుక్కలు కరవవు” అని వాళ్లు లేకపోవటం చూసి నా చేయి నిమురుతూ ఆప్యాయంగా అనేవాళ్లు. అయినా ఒకవేళ వాళ్లు నన్ను ఏవిధంగా చూస్తుందీ అన్నీ చెప్పినా సంపాదన లేని ఆయన వాళ్లని ఏం ఎదిరించగలరు? చివరకు మిగిలేది యిల్లు రణరంగంగా మారడం… ఇలా అన్నీ ఊహించుకొని సుదర్శన్‌తో ఏం చెప్పేదానిని కాదు. కాని నేను అలా నోరు మూసుకోవటంతో వాళ్లు యింకా రెచ్చిపోయేవాళ్లు.

నాకు అపుడు మూడో నెల! ఎపుడూ మమ్మికి డాడీకి దూరం అయ్యానని బాధ పడలేదు. కానీ, నేను తల్లిని అవుతున్నానని తెలిసిన దగ్గర్నుండి ఈ విషయం డాడీకి మమ్మీకి తెలిస్తేనో? డాడీ మనసు ఎలాగైనా మార్చుకుంటారు, తప్పక యింటికి తీసుకెళతారని కళ్లలో ఆశ నింపుకుని వున్నాను. ఇక సుదర్శన్ సంతోషం అంతులేదని చెప్పాలి. తను వుండగా నన్ను చిన్న మెత్తు పనైనా చేయనిచ్చేవాడు గాదు. మీదు మిక్కిలి తల్లితో, అక్కతో మొహమాటం లేకుండా “సుజీ చేత పనులు చేయించకండి” అని చెప్పారు. ఆయన అడుగు ఇన్‌స్టిట్యూట్‍లో పెట్టగానే నాకు చెప్పని పనంటూ వుండేది కాదు. మంచి నీళ్లు పట్టమని, బాత్‌రూంలో నీళ్లు పెట్టమని ఒకటేమిటి ఎన్నో…. నేను చేయలేని పనులు చెప్పేవారు… ఎప్పుడైనా ఆ పనులు చేయలేక బాధ పడేదానినేమో గాని గర్భం వచ్చినాక పని కష్టం అయినా సంతోషంగానే చేసేదానిని. కారణం గర్భిణీ స్త్రీ ఎంత పని చేస్తే అంత మంచిదని ఎవరో అనుకోవడం విన్న నేను పని చేయటం మంచిదే ఆరోగ్యానికి అనుకునే దానిని. మా అత్తగారు స్టౌ మీద పెద్ద బిందెతో వేడి నీళ్లు పెట్టారు. అంత బిందె నేను దించగలనో లేదో చూడాలనే ఆవిడ ఉద్దేశం అయివుంటుంది. స్టౌ మీద నుంచి నీళ్లు దించబోయి నా మీద పడేసుకున్నాను. కయ్ మని అరిచాను. అంతే మరునిముషం నాకు స్పృహలేదు. కళ్లు తెరచి చూసేటప్పటికి హాస్పిటల్‌లో వున్నాను. చేతి నరంలోకి, ముక్కులోకి ఏవో ట్యూబులు బిగించి వున్నాయి. వళ్లు అంతా నొప్పిగా… జర్వం వచ్చినట్లుగా వుంది.

స్త్రీయే కాదు పురుషుడే గాదు, కాళ్లు కాటికి చాపుకున్న వృద్ధుడైనా కష్ట సమయంలో ‘అమ్మా’ అంటారు. కాని… కాని…. నా మనసు నిండా సుదర్శన్ ఎంత ఆక్రమించుకున్నాడో చూడు – ఏమండీ… ఏమండీ… అన్నానట… అంతే ఆయన నా మీదకు ఒక్కసారి వంగి “సూజీ ఎంత పని అయింది…?” అతని ముఖానికి చేర్చుకుంటూ బాధపడసాగారు.

అబార్షన్ కాలేదు కాని పొట్ట కాళ్లు చేతులు బొబ్బలు కట్టాయట. తర్వగా హాస్పిటల్‌కి తీసుకురాకపోతే బ్రతికేదానను కాదుట. నా శరీరంలో రక్తం చుక్క లేదుట. బాగా రెస్టు తీసుకోవాలట… ఒక ఆర్నెల్లు దాంపత్య జీవితానికి దూరంగా వుండాలట అని డాక్టరుగారు చెప్పారట.

ఈ విషయం హాస్పిటల్లో కాదు. యింట్లో చెప్పి చిన్న పిల్లాడిలా కౌగలించుకొని…. మొఖం అంతా ముద్దులతో నింపి… ఏడుస్తూ చెప్పారు… “నువ్వు తొందరగా కోలుకొని ఎప్పటి సుజాతలా అవ్వకపోతే నేను పిచ్చివాడినైపోతాను సుజీ!” అని చిన్న పిల్లను లాలిస్తున్నట్లు అతని హృదయానికి చేర్చుకొని – “నువ్వు కోలుకున్న వెంటనే బయటకు వెళ్లిపోదాం. నిన్ను ఒక్క నిముషం వుంచను. పూరి గుడిసెలో వుండి కలో గంజో అయినా త్రాగుదాం… ఈ రాక్షసులకు దూరంగా వుందాం” అన్నారు. ఆయన అంటున్న మాటలు వెయ్యి ఏనుగుల బలాన్ని యిచ్చాయి. కలో గంజో అయినా ఆయన సాన్నిధ్యంలో పరమాన్నంలా వుంటుంది… నేను త్వరగా కొలుకోవాలని వేయి దేవుళ్లకు మ్రొక్కకున్నాను… అంతే కాదు సునీతా… ఇద్దరం చెరో నూటయైభై వచ్చినా ఉద్యోగం చేసుకుంటూ బ్రతకవచ్చుగాని ఆ యింట్లో ఉండకూడదు అన్న నిర్ణయానికి వచ్చాను. పిచ్చిదానిని, ఈ నిర్ణయం మందుగా తీసుకున్నా నా కథ మరోలా వుండేదేమో! కాని…. కాని…. యిలా జరగాలని ఉంటే మరో విధంగా ఎలాగ జరుగుతుంది?

స్వప్న అంటే కాదు, స్వప్న వెనుక వున్న లక్షల ఆస్తి అంటే మా అత్తగారికి, ఆడపడుచులకు అంతులేని ప్రేమ… ఒక్క రోజు కూడా స్వప్నను చూసినట్లు నన్ను చూడలేదు. ఎంతో ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించేవారు. అంతే కాదు ఆ అమ్మాయి విడిచిన బట్టలు కూడా నన్ను ఉతకమని పడేసేవారు” అని చెబుతున్న సుజాత కళ్లు వర్షించడానికి సిద్ధంగా వున్న శ్రావణ మేఘాల్లా వున్నాయి. వస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టలేవన్నట్లు పంటితో పెదవిని బిగించి సోఫాలో వెనక్కి వాలింది.

(సశేషం)

Exit mobile version