ప్రేమించే మనసా… ద్వేషించకే!-19

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]నవసరంగా లేని పోని ప్రశ్నవేసి స్వప్న మనసు బాధపెట్టానే అనుకొని “సారీ స్వప్నా…. నిన్ను అనవసరంగా బాధ పెట్టాను” అన్నాడు బాధగా సుదర్శన్.

“నథింగ్ బావా. మా అత్తగారింట్లో చివరికి మా యింట్లో కూడా ఉచితంగా సర్టిఫికెట్ యిచ్చేశారు… మొండిదానినని బండరాయిని అని…” అని చిన్నగా నవ్వి “భవిష్యత్ మాట అటుంచు బావా, ముందు బి.ఎ పూర్తికానియ్! ఎకనామిక్స్… అసలు బొత్తిగా అర్థం కావటం లేదు… ఇంతకీ నువ్వు సైన్సు స్టూడెంటువి కదా!… నాకు చెప్పగలవా” అంది స్వప్న.

“ఓ… ష్యూర్… నీకు కావలసింది మీనింగ్స్ గదా! డిక్షనరీ దగ్గపెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్పగలను” అన్నాడు.

క్రొత్తలో స్వప్నతో మాట్లాడటానికి బిడియపడేవాడు కాని స్వప్న సుదర్శన్‌తో చనువుగా వుండటంతో ఫ్రీగానే మాట్లాడగల్గుతున్నాడు సుదర్శన్.

వాళ్ల సంభాషణ హద్దూ పద్దూ లేకుండా మాట్లాడుతుంటే, సుజాత మనసు బాధతో నిండిపోసాగింది. సుందరి అన్నది నిజమే! సుదర్శన్!… తన వాడు అనుకున్న సుదర్శన్ మారిపోతున్నాడు… లేదు మారిపోయాడు… తను అనుమానిస్తున్నంతా అయిపోయింది. ఆ ఆలోచనలు భరించలేనిదానిలా గదిలోకి పరుగెత్తి రెండు చేతుల మధ్య ముఖం దాచుకుంది.

భోంచేయటం అయిపోయిన తర్వాత సుదర్శన్ గదిలోకి వచ్చి సుజాత రెండు చేతుల్లో ముఖం దాచుకోవటం చూసి… “సుజీ! ఏంటి తలనొప్పా? ఆరోగ్యం సరిగా లేనపుడు ఆ పత్రికలు చదవటం ఎందుకు? కళ్లకు అలసట ఎక్కువై తలనొప్పి వచ్చింది చూడు. నా మాట అసలు వినవు. అమృతాంజనం వ్రాయమంటావా?” ప్రేమగా, మృదువుగా లాలిస్తున్నట్లు అడుగుతూ, సుజాత తలను ఒడిలో పెట్టుకొని అమృతాంజనం వ్రాయసాగాడు.

నోట మాట రాలేదు సుజాతకు… ఏమిటిది? సుదర్శన్ ద్విపాత్రభినయం చేస్తున్నాడా? ఇప్పటి వరకు స్వప్నతో మాట్లాడిన మాటలన్ని ఏమయ్యాయి? తన పట్ల మునుపటి ప్రేమనే వ్యక్తపరుస్తున్నాడు. ఒక వేళ ఇది నాటకం కాదు కదా? ఏం నిర్ణయించుకోవాలో తెలియనిదానిలా కళ్ళు గట్టిగా ముసుకొని అలానే ఉండిపోయింది. అమృతాంజనం వ్రాసి… తల చిన్నగా నొక్కిన సుదర్సన్ నిద్రలోకి జారిపోయిన సుజాతను దిండు మీద పడుకోబెట్టి ఒక్క క్షణం చూసాడు.

అందంగా, మనోహరంగా కనపడుతున్న సుజాత మోముపై వంగి ముద్దు పెట్టాడు. మరునిముషం నరాలన్నీ కరంటుషాకులా జివ్వమన్నాయి…. అతనికి తెలియకుండానే శరీరం ఏదో కావాలన్నట్లు మారం చేయటంతో సుజాతను పెనవేసుకోవాలన్నట్లు మందుకు వంగాడు.

మరుక్షణం ఏదో గుర్తు వచ్చిన వాడిలా మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు.

ఏం చేయాలో తోచని వాడిలా అటూ ఇటూ పచార్లు చేయటం మొదలు పెట్టాడు. ఏదో గుర్తు వచ్చిన వాడిలా హాలులోకి వచ్చాడు.

పుస్తకం పట్టుకొని దీక్షగా చదువుతుంది స్వప్న. ఏం చేయాలో తోచనివాడిలా, ఏదో వ్యాపకం కల్గించుకోవాలన్నట్లు “నేను చెప్పనా స్వప్నా?” అన్నాడు.

తను అడగకుండానే చెబుతాను అంటున్న సుదర్శన్ వైపు ఆశ్చర్యంగా చూసి “అంత కన్నానా, చెప్పు బావా, రా కుర్చో” అంది.

మరునిముషంలో ఎకనామిక్సు బుక్సు చేతిలోకి తీసుకున్నాడు.

అలా ఎంత సేపయిందో పాఠం మొదలు పెట్టి అని చూడకుండా అర్థంకాని ఫండమెంటల్స్‌కి డిక్షనరీ చూస్తూ చెప్పసాగాడు సుదర్శన్.

“బావా ప్లీజ్, ఒక లెసన్ అయిపోయింది. నువ్వు అలా వరుసగా చెప్పుకు వెళ్ళిపోతే నువ్వు మొదట చెప్పింది మర్చిపోతాను. నువ్వు చెప్పిన లెసన్ రేపు నేను చదువుకున్నాక రేపు మరో లెసన్ చెబుదువుగాని… అంతగా నీకు నిద్ర పట్టకపోతే కార్ట్స్ ఆడదాం బావా” అంది

నిద్ర ముంచుకు వస్తున్నా… కోరిక దొలిచి వేస్తున్నా శరీరం ఏం చేస్తున్నట్లు. “సరే” అన్నాడు.

ఆట జోరుగా సాగుతోంది.

“బావా మావయ్యను రేపే కదూ హాస్పటల్ నుండీ తీసుకురావటం” అంది.

“అవును స్వప్నా రెండోసారి ఎటాక్ రావటం కదూ? చాలా జాగ్రత్తగా వుండాలి అన్నారు. నేను పెట్టిన గడువు ఉద్యోగంకి అయిపోతుంది… ఏం చేయాలో తెలియటం లేదు” అన్నాడు.

సడన్‌గా చేతి కున్న వాచ్‌పై చూసిన స్వప్న“మై గాడ్ ఒంటి గంట అయింది బావా, ప్రొద్దున్న లేవలేం, వెళ్ళి పడుకో” అంది.

ఇక తప్పదన్నట్లు పడుకోడానికి లేచాడు సుదర్శన్.

***

రంగారావుగార్ని ఇంటికి తీసుకు వచ్చారు గాని మంచం మీద నుండి ఆయన లేవడమే లేదు… మనిషి బాగా నీరసించిపోయారు. ఆయన బాధల్లా ఒక్కటే. తనకి ఈ జబ్బు యిప్పుడు వచ్చిందేమిటి ఖర్మ. ఉత్తమురాలు, సంస్కారవంతురాలు అయిన సుజాత మీనాక్షి సూటి పోటి మాటలకు తట్టుకోలేకపోయింది. చక్కగా వాడికి ఉద్యోగం వచ్చిందంటే యిద్దరు చక్కగా వేరే వెళ్ళిపోయి మనశ్శాంతితో చక్కగా బ్రతుకుదురు…. కాని తన అనారోగ్యం సుదర్సన్‌ని వెళ్లకుండా కాళ్లు కట్టేసింది అనుకొని, సుదర్శన్‌ని పిలిచి దగ్గర కూర్చో పెట్టుకుని మీనాక్షి లేకపోవటం చూసి అన్నారు.

“బాబు ఉద్యోగం ఏం చేసావు? మరో పదిహేను రోజులలో మాములుగా అయిపోతాను… అందుకు నువ్వు వారికి టైము…” అని రంగారావుగారు అంటుండగానే…

“నాన్నా మీరు అనవసరంగా ఏ ఆలోచనలు పెట్టుకోకండి. మీరు ఆరోగ్యవంతులయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్లను. వెధవ ఉద్యోగం వుంటే వుంటుంది, లేకపోతే పోతుంది” అని అంటుండగానే ఎవరో వచ్చినట్లు కావడంతో తల త్రిప్పి చూసాడు సుదర్శన్.

ఏదో తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు సుదర్శన్ సుజాతను చూసి.

సుజాత కళ్లల్లో ఏవో చెప్పలేని భావాలు వ్యక్తమయ్యాయి. వెంటనే వెనుదిరిగింది.

ఏమిటి సుదర్శన్ అభిప్రాయం? తండ్రిని ఈ స్థితిలో వదలి రమ్మనటం లేదు తను…. కాని… ఇన్నాళ్లకి మంచి అవకాశం ఏర్పడినప్పుడు వాళ్లని టైము ఇవ్వమని అడగవచ్చును కదా? వెధవ ఉద్యోగం పోతే పోతుందా? అంటే సుదర్శన్ యిక్కడ వుండటానికే యిష్టపడుతున్నడన్నమాట. అసలు తనతో మనసు విప్పి మాట్లాడడేం? అసలు తనను తప్పించుకొని తిరగటానికే చూస్తున్నాడు. ప్రొద్దున్నలేచినప్పటి నుండి స్వప్నతోటిదే లోకం.

స్వప్న ‘నేను ఇన్‌స్టిట్యూటికి బయలుదేతున్నాను’ అంటే వెనకే బయలుదేరుతుంది. ఇద్దరు ఒకేసారి కలసి భోంచేయటం. తర్వాత సుదర్శన్ చదువు చెప్పటం…. తర్వాత కబుర్లు… ఆలోచిస్తున్నకొలది సుజాత మనసు గందరగోళం అయింది. అసలు తనవాడు… మంచివాడు అనుకుంటున్న సుదర్శన్… ఇలా మారిపోవటానికి కారణం? సుందరి… సుందరి అన్నది నిజమే! స్వప్న అంటే యిష్టపడుతున్నాడు. అసలు తన చెంత వుండటానికే సుదర్శన్ ఇష్టపడటం లేదు. శరీరాలు రెండు ఒకటై పశుపక్ష్యాదులు తీర్చుకొనే కోరిక తీరితేనా భార్యాభర్తలు… తనతో కాలం గడపటానికే భయపడుతున్నాడు. ప్చ్… తన శరీరం సుదర్శన్‌కి కావాలి… కాని మనసుతో పని లేదు. తన దగ్గర సుఖం అందుకోలేనపుడు ఇక తనతో అవసరం ఏమిటి అనుకంటున్నాడా?… ఆలోచించిన కొలది పిచ్చిదాన్ని అవుతానో ఏమో అన్నంత భయంగా కళ్లు గట్టిగా మూసుకుంది. ఎంత మనసును సమాధాన పర్చుకుందామన్నా సుజాత మనసు సమాధాన పడలేదు.

భగవంతుడు తనను ఘోరంగా శపించాడు. క్రూరంగా నిర్ధాక్షిణ్యంగా తన జీవిత కుసుమాన్ని నలిపివేసాడు… తనని ఓదార్చే హస్త స్పర్శ… తనను ఓదార్చే సుదర్శన్ వున్నాడనుకుంటే ఎడారిలో ఒయాసిస్సులా అయింది. అనురాగం గగన కుసుమమైపోయింది. ఆశలు ఆకాశదీపాలై తనలో మరింత వేదనకు గురి చేసాయి. పిచ్చి దానిలా రెండు చేతుల మధ్య తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్వసాగింది సుజాత…

దుర్భరమైన మానసిక వేదనతో సుజాత ఆరోగ్యం క్షీణించసాగింది.

***

కలతగా నిద్రలోకి జారుకుంటున్న సుజాతను తమకంగా రెండు చేతులు పెనవేసుకొని ముద్దులతో ముంచెత్తి… సుజాతను పూర్తిగా ఆక్రమించుకోవాలన్నట్లు పైకి వచ్చాడు…

“ఛీ… నన్ను వదలండి… నేను పశువును కాను… మనిషిని” ఒక్క తోపు తోసింది సుజాత.

అవమానంతో ముఖం చిన్న బోయి చివ్వున మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు సుదర్శన్.

సుజాతకు ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది… “నువ్వు… నువ్వు కోరికను అంత అణుచుకోలేని కాముకుడవన్నమాట” చమత్కారంగా అన్నది సుజాత.

“సుజీ! అన్నాడు కోపంగా… “ఒక్కసారికి ఏం అయిపోదులే!… ప్లీజ్!” అని మళ్లీ దగ్గరకొస్తున్న సుదర్శన్ ముఖంలోకి చూసింది.

కళ్లల్లో కామం తప్ప మరేం కన్పించలేదు సుజాతకు. తను ఎంతో మంచివాడు… ఉత్తముడు.. అనుకున్న సుదర్శన్ సెక్స్‌కి యింత బలహీనుడా?… ఆలోచనలతో వుండగానే మరల రెండు చేతులతో సుజాతను పెనవేసుకోబోయాడు.

“సుదర్శన్ నన్ను వదలు” అని పిచ్చిదాని లాగా గట్టిగా అరచింది. అప్పటికి సుజాతను వదలకుండా… కౌగిట్లో బంధించసాగాడు. బలాన్నంతా కూడ దీసుకొని… ఒక్క తోపు తోసి “ప్లీజ్ సుదర్శన్ ఐసే గెట్ అవుట్” అని పిచ్చిగా గట్టిగా అరచింది… “నువ్వు… నువ్వు… మునుపటి సదర్శన్‌వి కావు. నువ్వు… మంచితనాన్ని మరచి… ప్రేమను కాలరాసి శరీరంలో కామం నింపుకున్న కామాంధుడివి” అంది.

అంతే! “సుజీ!” అని చెయ్యి ఎత్తబోయిన వాడు “ఛీ!… చీ!… నువ్వు… నువ్వు నన్ను యింతలేసి మాట్లాడుతావా…” అంటూ రయమని గదిలోంచి వెళ్లిపోయాడు.

“మన బంగారు కలలపంట కోసం మనం ఎదురు చూద్దాం సుజీ” అన్న సుదర్శన్ ఎంతకి దిగజారాడు… ఆలోచించిన కొలది… మనసు బాధతో… తునాతునకలవుతునట్లు అనిపించింది సుజాతకు. ఇక ఆలోచించలేని దానిలా మంచం మీద వాలిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here