ప్రేమించే మనసా… ద్వేషించకే!-21

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]అం[/dropcap]తలోనే స్వప్న లోపలికి వచ్చి అందరిని ఒకసారి చూసింది, జరగకూనిదేదో జరిగిందనిపించింది. లోపలికి పరుగెత్తిన స్వప్న మరు నిముషములో పెట్టెతో బయటకు వచ్చింది.

అందరూ ఆశ్చర్యంగా స్వప్న వైపు చూసారు.

“అమ్మా సుజీ! వెళ్లిపోతున్నావా? నిన్ను వెళ్లవద్దని చెప్పటానికి మనసు రావటం లేదు కాని నీవు వెళ్లిపోవటం బాధగా వుందమ్మా. వాడికి కళ్లు మూసుకుపోయాయమ్మా!… దానికి ఎపుడో మూసుకుపోయాయి… ఈ దుష్టులు నీకు అన్యాయం చేసారు తల్లీ… వినాశకాలే విపరీతి బుద్ధి… అన్నట్లు వెధవకి దుర్భుద్ధి పుట్టిందమ్మా!” అని అడుగులో అడుగు వేసుకుంటూ హాలులోకి వచ్చారు రంగారావుగారు.

సమాధానం చెప్పకుండానే కళ్లు ఎత్తి చూసింది సుజాత! ‘క్షమించు మావయ్యా… నేను… ఈ దుర్మార్గుల మధ్య వుండలేను… తనువుకి ఎన్ని గాయాలైనా సహించాను… మనసుకు గాయాలైతే సహించలేకపోయాను… నేను చితిలోకి వెళ్లే వరకు ఈ గాయం మానదు…’ అన్నట్లుందా చూపు.

హాలు దాటి చకచకా నడచిపోతున్న సుజాతను “అక్కా, నన్ను క్షమించక్కా! నా జీవితం బాగు చేసుకోవాలని వచ్చి నీ జీవితం నాశనం చేసానక్కా! నాకు తెలియకుండానే! నువ్వు… నువ్వు… వెళ్లద్దక్కా!” అని బ్రతిమిలాడసాగింది స్వప్న.

“నువ్వు పెట్టె పట్టుకు బయలు దేరావేమిటే, మధ్యన. పోతున్నదానిని పోనివే! నిన్ను చేసుకోవటానికి సుదర్శన్ ఒప్పుకుంటున్నాడు” అని మీనాక్షి అంటుండగనే “అమ్మా” అన్నాడు బాధగా సుదర్శన్.

“అత్తయ్యా!” అంది కోపంగా స్వప్న. “ఛీ… ఛీ… ఆడదానివై యుండి యింత అన్యాయానికి తలపెట్టవచ్చా? నన్ను పెళ్లి చేసుకుంటానికి సిద్దపడ్డాడా? ప్చ్! ఎంత తేలిగ్గా చెప్పావ్? బొమ్మల పెళ్లిళ్లు చేయటం చూసాను గాని నీలా మనుషులతో ఆడుకునే పెళ్లిల్లాట చూడలేదత్తయ్యా! మగ దిక్కు లేని నేను ఆ పల్లెటూరులో అమ్మ కళ్ళెదుట నిత్యం కనబడి ఆ తల్లి మనసు క్షోబించటం చూడలేక… పెళ్లయి, ఒక యింటి వాడయిన బావలో సోదరుడిని చూసుకొని… బావ సహకారంతో నాకాళ్ల మీద నేను నిలబడి జీవించాలనుకొని కొండంత ఆశతో ఇక్కడకు వచ్చాను. కాని… నాకు తెలియకుండానే… నా వలన… తోటి స్త్రీకి…, అయిన వాళ్లందరిని కాదనుకొని ప్రేమను గుండెల్లో నింపుకొని, తన భర్తే సర్వస్వం అనుకున్న అనురాగ దేవతకు ఇంత అన్యాయం జరుగుతుందని నాకు తెలియదు. నాలో ఏం చూసి బావ ఈ నిర్ణయానికి వచ్చాడో అర్థం కావడం లేదు. ఒక్క స్త్రీత్వం తప్ప. బావతో నేను ఏ విధంగాను హద్దులు దాటి ప్రవర్తించలేదు. వరసకు బావ కాబట్టి బావ అని పిలిచాను.”

“నోరు మూయ్యవే పెద్ద చెప్పొచ్చావు” కస్సుమంది మీనాక్షి.

“మావయ్య అనారోగ్యంతో మంచం ఎక్కాడు. ఇక నీతో, సుందరి వదినతో మాట్లాడాలంటే మనసు అంగీకరించేది గాదు. దేవతలాంటి అక్కనే రాచి రంపాన పెడుతున్నారు. అందులోకి అక్కకి ఆరోగ్యం బాగుండక బావ ఎంత బాధపడుతున్నాడో గ్రహించి నేను బావతో కాలక్షేపం చేస్తే కనీసం కొంచమైనా బావ మనసు కుదుట పడుతుందని బావతో మాట్లాడేదానిని. ఈ గడపలో అడుగుపెట్టాక నిజంగా నా స్వంత వాళ్లలా సుజాత అక్క, బావ కనిపించారు. వాళ్ల సహకారంతో మొదటిసారిగా జీవితంలో ఓడిపోయిన నేను… మరలా గెలుపొందాలనుకోవటం తప్పా! అయినా బావలో… బావ అంతరంగాలలో… ప్రేమకు పవిత్రత వుంది. అక్కను ప్రేమించి అర్థాంగిని చేసుకుని ప్రేమకు నిర్వచనంలా నిలిచాడు అనుకున్నాను. కాని ప్రేమ నిర్వచనం లేకుండా చేస్తాడని మాత్రం నేనను కోలేదు… అది తెలిసే ఈ యింటి నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని వుండటానికి చోటు వెతుక్కుని వచ్చాను. నేను… నేను… వెళుతున్నాను” అని పెట్టి పట్టుకొని బయలుదేరింది స్వప్న.

అప్పటికే గుమ్మం దాటింది సుజాత.

***

గతం తాలూకా జ్ఞాపకాల నుండి తేరుకోలేని దానిలా సుజాత దృష్టి శూన్యంలోకి కేంద్రీకరించబడి వుంది.

ఆమె పడుతున్న బాధను గుండె తట్టుకోలేనట్లు ఎగిరెగిరి పడుతుంది. దుఃఖాన్ని దిగమింగలేనట్లు కళ్ల వెంట కన్నీళ్లు బుగ్గల మీదగా జారుతున్నాయి.

ఒక్క నిముషం తల్లి వేపు తదేకంగా చూసిన సునీత “మమ్మీ” అని తల్లి ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

అలా ఎంత సేపు ఏడ్చినా దుఃఖం తీరని దానిలా వెక్కి వెక్కి ఏడుస్తూనే వుంది.

కూతుర్ని సమాధాన పర్చాలన్నట్లు వీపు మీద చేయి వేసి నిమురుతూనే వుంది సుజాత. కాని నోరు విప్పి కూతురుని ఊరడించాలంటే నోటి వెంట మాట రావటం లేదు దుఃఖంతో సుజాతకు.

మానుతున్న పుండును కెలికినట్లయింది సుజాతకు గతం గుర్తు తెచ్చుకోవడంతో.

వున్నట్లుండి చివ్వున తల ఎత్తి చూసి “మమ్మీ నా మూలంగానే… నేను పుట్టిన మూలంగానే… డాడీని నిన్ను విడదీశాను. నేను…. నేను.. పుట్టి యిద్దరు ప్రేమికులను విడదీశాను… మై గాడ్… నేనెంత పాపిష్టిరాలిని…” అని సునీత అంటుండగానే…

“ప్చ్! ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నావు సునీతా! ఇద్దరు ప్రేమికులను విడదీసావా?” ఆ మాటలంటున్నపుడు సుజాత పెదవులపై నిర్లక్ష్యమైన నవ్వు చోటు చేసుకుంది.

“నేను కలలు కన్నాను.. మాలాంటి ప్రేమికులుండరని ఈ ప్రపంచంలో… నిజం చెప్పాలంటే అది నా తప్పు కాదేమో! వయసులో ఆడపిల్ల ‘ప్రేమ’ అనే రెండు అక్షరాలకి ఎంతో విలువనిస్తుంది… అంతే కాదు ఆ రెండుక్షరాల పదంకి ఆశలతో ఆశాసౌధం నిర్మింస్తుంది… కాని ఒక్కసారి ఆశాసౌధం కూలిపోయి, ఆశలన్నీ యమపాశంగా మారినపుడు ఆ ప్రేమికురాలు అనుభవించే క్షోభ నరకం కన్నా ఎక్కువ. అప్పటికి ఆ ప్రేమ పొర ఒక్కక్కటి కరిగిపోయి ప్రేమ నిజస్వరూపం బయటపడుతుంది.

మీ డాడీ ప్రేమలో కలుషితం వుందని నీవు కడుపులోకి పడ్డాకగాని తెలిసి రాలేదు. నేను మనసార కోరుకున్న ప్రేమ స్వరూపునితో దాంపత్యం పంచుకోలేదని… నిశ్చలతలేని ఒక కాముకుడితో కలిశానని తెలిసినాక… ఏ ప్రేమికురాలు అటువంటి దర్మార్గుడితో కాపురం సహించదు. ప్రేమలో కామం ఉండకూడదు… ప్రేమలో పవిత్రత వుండాలి. నేను ఎప్పుడి నుంచో నా గుండెల్లో దాచుకున్న కథ నీకు చెప్పింది నా మీద జాలిపడమని కాదమ్మా! నేను యిన్నాళ్లు ఒకే ఆశతో బ్రతుకుతున్నాను. నిన్ను…. నిన్ను ఒక ఉన్నతరాలిగా తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో చూసుకోవాలని… నా చెల్లెలు ప్రేమకు బలయిపోయింది. నా చెల్లెలే కాదు… ఎందరో అమాయకులు అయస్కాతం లాంటి ఈ ప్రేమకు బలైపోతున్నారు. నేను వాళ్లలా కాకుండా… ప్రేమకు అపజయం ఎదురైతే చావు ఒక్కటే పరిష్కారం కాదని నాలా మోసపోయిన కొందరు ప్రేమికులకు అర్థం చెప్పాలని బ్రతికాను. ఇన్నాళ్ళు ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నీవు ప్రేమ అనే మైకంలో పడవద్దమ్మా! నా కథను చెప్పింది… నీవు ప్రేమ అనే కుబుసం లాంటి పాము పొరను… నమ్మవద్దు… నా మాట వినుమని ఆశతో అడుగుతున్నాను” అంది.

“మమ్మీ నా నిర్ణయం విని మొండి దానిని అనుకుంటావో నా నిర్ణయం మారనందుకు కోపగించుకుంటావో, కాని ఒకటి మాత్రం నిజం మమ్మీ! లైలా మజ్ను, అనార్కలి, షాజహాన్, ముంతాజ్ కథలు నేను చదవలేదు గాని డాడీ నీ ప్రేమ కథ వాళ్లను మించినది… కాని మధ్యలో అపశృతి పలకడం… సృష్టిలోనే జవాబు దొరకని ప్రశ్నగా మారిపోయింది. ఏది ఏమైనా డాడీ నీ యందు కనబరిచిన ప్రేమలో సుధీర్‌ది ఏపాటి ప్రేమ అనిపిస్తుంది. ఇది అంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? మమ్మీ! సుధీర్‌ది దుడుకు స్వభావం. తను అనుకున్నది నిముషాల్లో అయిపోవాలంటాడు… తను ఓర్పు… నా విషయంలో ఆగాడంటే ఆశ్చర్యంగానే ఉంది. సుధీర్ ఉద్యోగం కోసం ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు… చివరకు విసిగిపోయి ‘ఉద్యోగం ఇప్పట్లో వచ్చేటట్లు లేదు… మనం గుళ్లో పెళ్లి చేసుకుందాం’ అన్నాడు… నేను… అందుకు ఒప్పుకోలేదు.. మమ్మీ! ఇన్ని చెప్పి మళ్లా ప్రేమలో పడ్డావేమిటి అని హేళన చేయవద్దు… నా కోసం… నా చెంతన వుండటం కోసం సుధీర్ పడే ఆరాటం వలన ఏమో, ఆడపిల్లనయిన నా హృదయంలో స్థానం ఏర్పరచుకున్నాడు… చెప్పడానికే సిగ్గుగా ఉంది మమ్మీ… నీ ప్రేమ… డాడీ ప్రేమకీ… అపజయం ఎదురైంది. అటువంటిది మా ప్రేమలో నిశ్చలత… పవిత్రత వుందో లేదో అనే మనసు.. వెలుపలికి తీసే ధైర్యం నాకుంది గాని ఎందుకు తీయాలి? ప్రేమించి ఒకరికి ఒకరు దగ్గరయిన హృదయాల్లోనే కలుషితం ఏర్పడినపుడు… ఎవరో ముక్కు మొహం తెలియని మనిషితో వివాహం అయినపుడు వాళ్లిద్దరి మనసులు ఒకటిగా కలిసిపోతాయని నమ్మకం ఏమిటి?

ఒక వేళ ఇద్దరి మనసులు కలిసి కొన్నాళ్లు కాపురం చేసినా, మధ్యలో ఏ పొరపొచ్చాలు లేకుండా చివరిదాకా కాపురం చేయగలరా అన్నదే నన్ను పీడిస్తున్న ప్రశ్న!

ఇది అంతా ఆలోచిస్తుంటే అసలు వివాహ వ్యవస్థలోనే పెద్దలోపం ఉంది అనిపిస్తుంది. భార్య… భర్త… యిరువురిలో ఏ వొక్కరు… ముందు వెనకా అయినా… సంఘం కోసం నలుగురు నాల్గురకాల చెప్పకోవటం ఇష్టం లేక.. జీవిత రథాన్ని లాక్కొస్తున్నారు అనిపిస్తుంది… అలా అని అందరు ఒక లాగే వుంటారనుకోవడం భ్రమే అవుతుంది. కాని నిజానికి ఈ వివాహవ్యవస్థలో… ఎందరు… ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంపూర్ణమైన ప్రేమ అనురాగాలతో కాపురం చేస్తున్నారు. రోజుకి పేపర్లో ఒక వార్త విద్యావంతుడైన భర్త భార్యను చంపినట్లు; భర్త ఆగడాలు భరించలేక నూతిలోకి దూకిన స్త్రీ ఉదంతం; త్రాగుబోతు, వ్యసనాల పరుడైన భర్తతో వేగలేక పుట్టింటికి పారిపోయిన స్త్రీ.

ఎంతో పవిత్రం… జన్మజన్మల బంధం అన్న వివాహ వ్యవస్థలో ఇన్ని ఉదంతాలు దాగి వున్నపుడు… అసలు వివాహం అంటేనే ఏహ్య భావం కలుగుతుంది. అందుకేనేమో మనదేశంలో అన్నిటిలోను వెనకబడి ఉన్నట్లు ఈ వివాహ వ్యవస్థలో కూడా ఎవరో ముక్కు మొహం తెలియని ఇద్దరికి వారి అభిప్రాయాలు, మనసులు ఒకరితో ఒకరికి సరిపోయాయో అని తెలుసుకోకుండా వివాహం చేసి పెద్ద తప్పు చేస్తున్నారనిపిస్తుంది మమ్మీ… మనం విదేశీయుల్లా అంత మందుకు అడుగు వేయకపోయినా నువ్వు నాకొక్క అవకాశం ఇవ్వు మమ్మీ! నేను ప్రేమించిన వాడు, నన్ను ప్రేమించాడు అనుకుంటున్న సుధీర్‌ని కొద్ది రోజులు కాదు… కనీసం మూడు నెలలు… ఇద్దరం ఓన్లీ ఫ్రెండ్స్‌లా కలసి మెలసి తిరిగి మమ్ములను మేం అర్థం చేసుకొని… మా అభిప్రాయాలు ఒకరితో ఒకరికి సరిపోయాయనుకుంటే వివాహం చేసుకోవడానికి అనుమతి యివ్వు… ఒక వేళ ఈ ప్రయత్నంలో మేము ఓడిపోయాం అనుకో… అసలు నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే… ఏదో తెలియని ఏవగింపు కలిగింది… అలాగని జీవితాతం వివాహం చేసుకోకుండా… ఒంటరిగా వుండిపోతాను అని అనటం లేదు. ఏమో ఎప్పటికైనా నా అభిప్రాయాలతో అతని అభిప్రాయాలతో నావి సరిపోయే వ్యక్తి ఎదురైతే వివాహం చేసుకుంటాను. ఒక వేళ నేననుకున్న లాంటి వ్యక్తి ఎదురు పడకపోతే… హాయిగా… నీ అడుగుజాడల్లో సంతోషంగా నడిచి నాకు చేతనయినంత సహాయం క్రింద వర్గాల వారికి, సేవా సదనాలకి చేస్తాను.” చెప్పింది సునీత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here