[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]వే[/dropcap]సవి కాలం! సూర్యుడు భగ్గున మండి పోతున్నాడు. గంట నుండి నానా తంటాలు పడి రెండు మంచాలకి గాలి తగిలేలాగ ఎంత ఫ్యానుని సెట్టు చేస్తున్నా ఏదో ఒక మంచానికి గాలి తగులుతుంది గాని రెండు మంచానికి తగలడం లేదు. చివరికి విసుగొచ్చి రెండు మంచాలు ఒకదాని ప్రక్కకు మరొకటి లాగి కలిపి రెండు మంచాలు తలలు పెట్టుకునే చోట గాలి తగిలేటట్లు స్టూలు వేసి ఫ్యాను పెట్టి ధన్‌మని పడుకొని గాలి ఏ మంచానికి తగలుతుందో అన్నట్లు ఒక మంచం మీద నుండి మరో మంచం మీదకు చేపపిల్లలా దొర్లుకుంటూ చూడసాగింది.
మరునాడు ఆఫీసులో సబ్‌మిట్ చేయవలసిన ఫైలు చూస్తున్న సుధీర్, సునీత పడుతున్న అవస్థ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు.
“హమ్మయ్య యిప్పటికి కుదరింది. వెధవ ఫ్యాను వచ్చే నెల జీతం రాగానే క్రొత్తది కొని ఈ ఫ్యాను పెంట మీద పడెయ్యాలి” అనుకొని… “సుధీర్ ఎంత బాగా సెట్ చేసానో చూడు” అని సుధీర్ కూర్చున్న వైపున చూసిన సునీత, సుధీర్ తన వైపే చూస్తుండటం చూసి “ఎలా వుంది ప్లాను” అంది గొప్పగా!
“బ్రహ్మాండంగా వుంది గాని ముందు నా మంచం ఆ చివరికి జరిపేయ్ సునీత… ప్లీజ్ ఏ పరీక్షయినా పెట్టు కాని… ఆ రెండు మంచాలు మాత్రం కలపకు…” అన్నాడు.
సుధీర్ అంత సీరియస్‌గా అనేటప్పటికి సునీత మనస్సు కలుక్కుమంది….
అర్థం పర్థం లేని పరీక్ష పెట్టి తను… సుధీర్ మనసును బాధకు గురి చేస్తుందా? ఏమో! ఛ!… ఛ!… తను ఎంత అవివేకంగా ఆలోచిస్తుంది? మమ్మీ ప్రేమ కథ కన్నా తమది గొప్పదా? ఒకరి కోసం ఒకరి మంచాలు పట్టలేదు. పిచ్చివాళ్ళు కాలేదు… తన మనసుకి తోచిన షరతులు పెట్టింది… అంత వరకు ఎందుకు ఈ మూడు నెలల్లో సుధీర్ తత్వం ఎటువంటిదో… పూర్తిగా కాకపోయినా కొంచెం అయినా తెలుస్తుంది. అదే తనకు కావలసింది అనుకుంది మనసులో!
అంతలో వీధిలో ఎవరో తలుపు తట్టడంతో తలుపుతీసింది.
ఎవరో అపరిచిత వ్యక్తి!
“ఎవరు కావాలండి?” అంది.
“సుధీర్… ఉన్నాడాండీ… నేను… అతను ఒకే ఆఫీసులో పని చేస్తున్నాం” అన్నాడు.
“రండి లోపలకు” అని దారి యిచ్చి లోపలకు నడచింది. ఫైల్సు చూస్తున్న సుధీర్, లేచి వీధి గదిలోకివచ్చి “హల్లో… రా… రా… కూర్చో” అన్నాడు.
“ఓరేయ్ నువ్వు యిన్నాళ్లు బ్యాచిలర్‌వని అనుకున్నాను. పెళ్లి ఎప్పుడయిందిరా? లేక కొంపదీసి ఏ పిట్టయినా…”
“ఓరేయ్ ఏమిటి వెధవ వాగుడు, మంచి చెడు తెలుసుకోకుండానే…. నువ్వనుకున్న రెండు కాదు” అన్నాడు కోపంగా.
“అయితే… ఈ కొత్త రకం ఏమిట్రా… చెప్పపోతే చచ్చిపోతానురా, సస్పెన్సు భరించలేక… అసలు ఎక్కడ దొరికింది ఈ పిట్ట…”
“నోరు ముయ్యరా. నీ వెధవ ఊహలు… కల్పనలు జోడించి మాట్లాడకు. నిదానంగా విను, మేం ఫ్రెండ్సు! ఛీ!…! ఛీ!… ఇన్నాళ్లు నువ్వు యిలాంటి వాడివని తెలియక నీతో చనువుగా వుండటం పొరపాటయింది” అన్నాడు విసుగ్గా.
ఈసారి చప్పట్లు కొడుతూ నవ్వసాగాడు అతను. “ఒరేయ్! నేను పిచ్చివాడిని అనుకున్నావేమిటిరా నమ్మడానికి… నీక్కావాలంటే ఎంతైనా యిస్తాను… ఒక్క ఛాన్సు నాకు….”
అంతే, ఆ వ్యక్తి దవడలు పగలగొట్టి… రెండు చేతులు వెనక్కి విరగొట్టి… చావబాదాడు సుధీరు.
సునీత కంగారుగా చూసి “పోనీయ్ సుధీర్… ఇక్కడ నుండి ముందు బయటకు పంపు… నువ్వు చేస్తున్న పని ఏమిటి?” అని సుధీరు నుండి బలవంతంగా ఆ వ్యక్తిని విడతీసింది.
“రాస్కెల్, నీలాంటి రోగ్‌తో బుద్ది తెలియక స్నేహం చేసి పొరపాటు చేసాను….” అని బయటకు తోసి తలుపు గడియపెట్టాడు.
సునీతకు ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు… వెధవ ఎంత చెడుగా మాట్లాడాడు… సుధీరు మనసు ఎంత దెబ్బతిందో? సుధీరును ఊరడించాలని “ప్లీజ్ సుధీర్ ఫర్‌గెట్ ఇట్. రా భోం చేద్దాం” అంది.
“నువ్వు భోంచెయ్యి. నాకు అక్కర్లేదు. వాడు అన్న మాటలు విని యింకా భోజనం కూడానా? ఆత్మాభిమానం… ఉన్నవాడు వినలేని మాటలు. ప్రేమ పరీక్షలట… వాటికి షరతులు… అసలు నీకెందుకు వచ్చింది అనుమానం నా ప్రేమ మీద… అసలు అర్థం పర్థం లేని ఈ పిచ్చి షరతులేమిటి? నాలో ఏ లోపం కనిపించింది…. మనం భార్యాభర్తలమని తెలిస్తే అలా మాట్లాడేవాడా?… చేతులెత్తి నమస్కారం చేసేవాడు నీకు… ఇప్పటికైనా….”
అంతే, సునీత ఆవేశంతో ఊగిపోయింది. సుధీర్ మనసు బయటపడింది అనుకున్న మరుక్షణం…“సుధీర్ నీ సలహాకో నమస్కారం! నీకు నా షరతుల మీద చిరాకైతే గుడ్ బై” అని వెనుతిరిగి పోయింది.
“సునీతా!” అని రెండు అంగల్లో సునీత దగ్గరకు వెళ్లి చేయి పట్టుకొని… “నువ్వు… నేను లేకపోయినా బ్రతుకగలవేమో గాని నేను నువ్వు లేకపోతే బ్రతుకలేను. సునీతా, నా తొందరపాటు నీకు తెలుసు గదా! ఆ వెధవ అలా అనడంతో మనసు పాడయి అలా అనేశాను…” బాధగా అన్నాడు సుధీర్.
సునీత వెనుతిరిగి వెళ్లి మంచం మీద పడుకుంది.
***
ఆరోజు ఆదివారం కావడంతో ఇంటి దగ్గరే వున్నాడు సుధీర్! మంచం మీద వెల్లకిలా పడుకొని కళ్లు మూసుకున్నాడు గాని… ఆలోచనలతో బుర్ర వేడెక్కుతుంది.
‘ఆ రోగ్!… వాడిని మెడపెట్టి గెంటాడని… తన మీద పగబట్టి వున్నవీ లేనివీ కలిపి ఆఫీసులో అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి కలిపి చెప్పాడు… వాడి నోరు యింకో నెలలో మూతపడుతుంది… అపుడు ఏమంటాడో…’ అని ఆలోచిస్తున్న సుధీర్ దగ్గర కొచ్చి కూర్చుంది సునీత!
అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుంది, సునీత ఫ్రెష్‌గా కనబడుతోంది. ఆకాశం రంగు చేనేత చీర… అదే రంగు జాకెట్. మెడలోకి ఒంటిపోట గొలుసు సింపులుగా, నాజూగ్గా, అందంగా కనబడుతున్న సునీత వైపు నుండి దృష్టి మరల్చుకోలేకపోయాడు.
అదేం గమనించనిదానిలా… తలచిక్కులు తీసుకుంటూ “సుధీర్, బోరుకొడుతుంది. ఏదైనా పిక్చరు కెళదామా?” అంది.
“ఒ.కే. టైం ఎంత అయింది?” అని ఒకసారి ఆవులించి, ఒళ్లు విరుచుకొని బద్దకం తీర్చుకొని మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు.
“ఐదు కావస్తుంది… వంట చేయటానికి టైము వుంటుందో లేదో పోనీ ఈ రోజుకి హోటల్లో భోంచేద్దాం సరేనా” అంది.
“అమ్మో వద్దు సునీతా! నాకేం నేను హోటల్లో బ్రహ్మాండంగా లాగించేస్తాను… నువ్వు మాత్రం దిక్కులు చూస్తూ కూర్చుంటావ్! నేను హెల్ప్ చేస్తాను. నువ్వు చేసేయ్ ఓ.కే” అన్నాడు.
“ఓ.కే.” అంది సంతోషంగా.
కాయకూరలు సునీత కోస్తుంటే, చకచకా బియ్యంలో రాళ్లు ఏరి కడిగేసి కుక్కరులో పెట్టేశాడు.
“సునీతా! కూరను నేను చూస్తాను. నువ్వు తయారవ్వు! నువ్వు తయారయ్యాక నేను స్నానానికి వెళతాను. టైం ఎంతో లేదు” అన్నాడు.
సునీత ఒక్క నిముషం సుధీర్ విశాల హృదయంకి పొంగిపోయింది… తను… తను… ఏం తెచ్చిందని, కేవలం గొప్పింటి బిడ్డననే గదా! వంట చేయటం చేతకాదని హెల్ప్ చేస్తానంటూ తయారవుతాడు. పెళ్లాం రోగంతో మంచానపడి లేవలేకపోయినా – కాళ్లకు బూట్లు తగిలించుకునే దగ్గర్నుంచి తలకు నూనె వ్రాయించుకునే వరకు – ఉచితంగా పెళ్లాం దొరకిందని సేవలు చేయించుకున్న మహానుభావులున్నారు. వాళ్లతో పోలిస్తే సుధీర్‌ది ఎంత మంచి మనసు?
***
సినిమా హాలు నుండి బయటకు వచ్చి రిక్షా కోసం నిలబడి చూస్తున్నారు.
“అయ్యా! ఘుమఘుమ పరిమళం… మత్తెక్కించే మల్లెపూలు మూర 75 పైసలు, కొనండయ్యా!” అని మల్లెపూలమ్మేవాడు వెంటపడ్డాడు. వాణ్ణి వదలించుకోవటానికి సుధీరు డబ్బులిచ్చి పూలు కొని సునీత చేతికిచ్చాడు.
ఇంటికి చేరుకుని భోజనాలు ముగించి మంచాల మీదకు చేరారు.
సునీత తలలో మల్లెపూల వాసన గది అంతా వ్యాపించి వింత అనుభూతిని కల్గిస్తుంది సుధీరుకి. మంచం మీద పడుకున్న సుధీర్ అటూ నుండి ఇటు తిరిగి సునీత వైపు చూసాడు.
మంచం మీద వెల్లకిల్లా పడుకునివుంది సునీత! ఒక్క క్షణం అలా చూసిన సుధీరుకు కోరికతో శరీరం వేడెక్కింది. తటాలున మంచం మీద లేచి సునీత మంచం దగ్గర కొచ్చి కోరికను అణుచుకోలేని వాడిలా గభాలున క్రిందకు వంగి నుదిటి మీద ముద్దు పెట్టుకొన్నాడు, రెండు చేతులతో బంధించి, కౌగిలించుకోవాలన్నట్లు క్రిందకు వంగి చేతులు చాచి సునీతను పట్టుకోబోయాడు… గభాలున ఏదో గుర్తు వచ్చినవాడిలా చివ్వున తల త్రిప్పి మరోసారి సునీతను చూస్తే ఏమవుతానో అన్నట్లు రయ్‌మని వెనుతిరిగాడు.
సుధీర్ నుదటి మీద పెట్టిన ముద్దుకే మెలుకువ వచ్చింది సునీతకు.
జరగబోయేది ఊహించి… ఓడిపోయాడు… తను ఏ షరతు అయితే పెట్టిందో ఆ షరతు దాటిపోతున్నాడు అనుకొనే లోగా సుధీర్ గబాబాగ అడుగులు వేసి టేబుల్ దగ్గరకు పోయి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద చేతులు ఆన్చి వాటి మీద తల ఉంచాడు. అంతలో ఏదో గుర్తువచ్చినవాడిలా – టేబుల్ మీద పత్రికలో పజిల్ పూర్తి చేస్తానంటే సునీత ‘అది కష్టం నీ తరం కాదు’ అనడం గుర్తు వచ్చి- సుధీర్ ఫజిల్ పూర్తి చేయటం మొదలు పెట్టాడు.
మంచం మీద నుండి చూస్తున్న సునీత – వేళ కాని వేళ సుధీర్ పత్రికల్లో ఏదో వ్రాస్తున్నడేమిటి? అని ఆలోచించగా… పజిల్ గుర్తు వచ్చింది. ‘ఆ పజిల్ చాలా కష్టం పూర్తి చేయటం సుధీర్, తల బ్రద్దలైపోతుంది ఈ పజిల్ చూస్తుంటే’ అంది. ఆ పజిల్‌తో తంటాలు పడుతున్నాడా? అంటే మనసును దేని మీద ఒక దాని మీద లగ్నం చేయటం కోసమే కదూ?
‘సుధీర్ నన్ను క్షమించవూ? అనవసరంగా నీ మనసును బాధ పెడుతున్నాను ఏమో అనిపిస్తుంది’ బాధగా మనసులోనే అనుకంది.
***
ప్రొద్దున సమయం ఏడు గంటలయింది. అప్పటికే స్నానం అన్నీ కానించి, కాఫీ కలిపి తను త్రాగి తక్కినది ఫ్లాస్కులో పోసాడు. సునీత ఇంకా లేవలేదు. ‘ఏమిటా ఈ పాటికే రోజు నిద్ర లేచి పోయేది’ అనుకుని మంచం దగ్గరకు వెళ్లాడు లేపాలన్నట్లు సుధీర్!
సునీత ఏడ్వటం చూసి కంగారు పడిపోయాడు సుధీర్. “సునీతా! ఎందుకు ఏడుస్తున్నావ్? చెప్పవూ” అన్నాడు.
సమాధానం చెప్పలేని దానిలా రెండు చేతుల మధ్య నుండి ముఖం ఎత్తకుండానే ఏడ్వసాగింది సునీత.
అసలు విషయం ఏమిటో అర్థం కాక కంగారు పడిపోయాడు సుధీర్. ఒక వేళ తను రాత్రి వంగి ముద్దు పెట్టుకోవటం… తను పడిన ఆరాటం… ఇవన్నీ సునీత చూడలేదు కదా! అని అనుకున్న మరుక్షణం…
“సునీతా… సారీ….” అంటుండగా…
(సశేషం)