Site icon Sanchika

ప్రేమించే మనసా… ద్వేషించకే!-3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“గు[/dropcap]డ్ మార్నింగ్ డాడీ.” అంది సుజాత బెరుగ్గా.

“వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి కాలేజీకి ఇంకా వెళ్లలేదా?” అని గభాలున చేతికున్న వాచ్ వైపు చూసి, “నైన్ థర్టీ, కాలేజీ నైన్‍కి కదూ” అన్నారు. అలా అడుగుతున్నప్పుడు చిరాగ్గా ఆయన కనుబొమలు ముడిపడ్డాయి.

“అవును డాడీ” అని “డ్రైవర్” అంది కంగారుగా సుజాత.

“డ్రైవరు లేడు. ఈ రోజు హైద్రాబాదు నుండి మన బిజినెస్ డీల్ చేయటానికి మనుషులొస్తుంటే నా కారిచ్చి డ్రైవరుని పంపాను స్టేషన్‌కి. ఎనివే సుజాతా, ఎవరైనా సరే కరెక్ట్ పంక్చువాలిటీ మెయిన్‌టెన్ చేయాలి. మన చేతులో వుంది ఏది చేయాలన్నా అన్నట్లు ప్రవర్తించకూడదు. నాకు అలా ప్రవర్తించే వాళ్లంటే ఐ డోంట్ లైక్. ఆ విషయం నీకు తెలుసు కదూ. పోర్టికోలో ఇంకో కారు వుందనుకో. నీకు డ్రైవింగ్ వచ్చునని కాలేజీ టైము దాటినాక వేసుకెళ్లావనుకో, చూసిన వాళ్లకు బాగుండదు” అన్నారు.

“అది కాదు డాడీ. ఈ రోజు ప్రాక్టికల్సు అందుకని…”

“ప్రాక్టికల్స్ అయితే 9.30 కా కాలేజీ?” అని ఎదురు ప్రశ్నవేసారు పరమేశ్వరరావుగారు.

“కాదు డాడీ ఎగ్జామ్స్ అని క్లాసెస్ తీసుకోవటం లేదు లెక్చరర్స్. మేమే రాని కొన్ని ప్రాక్టికల్స్…” అని సుజాత చెబుతుండగానే…. కోపంగా పరమేశ్వరరావుగారన్నారు.

“సుజీ ఇంకేం చెప్పకు. గోటు యువర్ రూం. ఫైనల్ యియర్ కదూ చదువుకో” అన్నారు.

మారు మాట్లాడకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కసాగింది సుజాత. మెట్లు ఎక్కుతున్న సుజాత కళ్లల్లో తను కాలేజీకి వెళ్లనందుకు సుదర్శన్ ముఖం బేలగా పెట్టినట్లు అనిపించింది.

ఏదో తెలియని ఆవేదన చోటుచేసుకోవటంతో పుస్తకాలు టేబుల్ మీద పెట్టి మంచం మీద వాలిపోయింది.

ఫోను గణగణ మ్రోగటంతో నిద్రలోకి జారిపోయిన సుజాత మంచం మీద నుండి చప్పున లేచి ఫోను అందుకుంది.

‘హల్లో’ అన్న పదం వినిపించగానే ప్రొద్దుట్నుండి తను అనుభవంచిన ఆవేదన తాలుకా బాధ హుష్ కాకి అన్నట్లు మాయమయిపోయింది సుజాతకి.

“హల్లో సుదర్శన్, నేను సుజాతను” అంది.

“ఏమిటి సుజీ, ఈ మధ్యన బొత్తిగా నేనంటే లెఖ్ఖ లేకుండాపోయింది నీకు. నాతో మాట వరసకయినా చెప్పావా కాలేజీకి రానని. చెబితే నేను మానేసి వాడిని కదా! అనవసరంగా గంట నిలబడి మూడు సార్లు ఈక్వేషన్సు తప్పు చేసి, తలనొప్పిగా వుందని లెక్చరర్‌తో అబద్దం చెప్పి బయటపడ్డాను.”

ఫోనులో సుదర్శన్ కంఠం నిష్ఠూరంగా వినిపిస్తుంది! ఒక్క నిముషం తన ఉనికిని తను మరిచిపోయినదానిలా మాట్లాడలేకపోయింది సుజాత.

“హల్లో సుజీ నా మాటకు సమాధానం చెప్పవేం?” అన్నాడు సుదర్శన్!

“ఏం చెప్పను, నిన్ను, నీ ప్రేమను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను” అంది పారవశ్యంగా సుజాత.

“నా నోటికి తాళం వేయాలని చెబుతున్నావుగాని, నా ప్రేమ గురించి పూర్తిగా తెలిస్తే ఇలా చెప్పా చేయకుండా మానేసే దానివి కాదు. అది సరే గాని తమరు ఈ రోజు రాకపోవటానికి కారణం ఏమిటో చెబుతారా!” అన్నాడు బాధ మిళితమైన స్వరంతో.

“ఏం చెప్పను సుదర్శన్! మా యింటి ఆచార వ్యవహారాలు, డాడీ డిసిప్లిన్ అన్నీ నీకు తెలుసు కదూ! ఈ రోజు లేటుగా లేచాను. అది మా డాడీ దృష్టికి వచ్చింది. ఫలితం ఇంట్లో వుండవలసి వచ్చింది. అసలు నువ్వు ఎక్కడ నుండి మాట్లాడడుతున్నావు?”

“నీలా A.C గదిలో ఫోమ్ బెడ్ మీద పడుకొని మాట్లాడటం లేదు సుజీ…. కాలేజీ గేటు దగ్గర నీ కోసం గంట నిలబడి తీరా లెక్చరర్ కంట పడ్డానని ప్రాక్టికల్స్ చేయటానికి వెళ్లి మూడు సార్లు తప్పు చేసి తర్వాత బయటపడి పబ్లిక్ బూత్ దగ్గర ఎండలో నిలబడి మాట్లాడుతున్నాను.”

“సో… సారీ… సుదర్శన్! ఇంకెప్పుడూ యిలా చేయను సరేనా? నీ కోసం తెల్లారి నాల్గు గంటలకే లేచి కాలేజీకి రావటానికి రెడీ అయిపోతాను సరేనా?”

గది ముందు నుంచి ఎవరో వెళుతున్నట్లు అలికిడి కావడంతో చప్పున ఫోను పెట్టేసి కళ్లు నెమ్మదిగా త్రిప్పి చూసింది. చెల్లెలు సమత బాల్కనీలోంచి ఎవరికో చేయి ఊపుతుంది. ప్రక్కింటి వారమ్మాయి లిల్లీకి కాబోలు. కొంపలంటుకు పోయినట్లు సమత ఇప్పుడే రావాలా అని విసుక్కుంది సుజాత.

***

డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనానికి కూర్చున్నారు. వంటవాడు పరబ్రహ్మం అందరికి వడ్డిస్తున్నాడు.

పరమేశ్వరరావు, పార్వతమ్మగారు ఒకవైపు సుజాత, సమత మరొక వైపు కూర్చొన్నారు.

వంటవాడ్ని అక్కడి నుంచి వెళ్ళమన్నట్టు చేత్తో సైగ చేశారు. ఎపుడు లేనిది భోజనాలు వడ్డించకుడా మధ్యలో ప్రరబ్రహ్మంని వెళ్లిపొమ్మన్నారు. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి అడిగే ధైర్యము లేక ఊరుకున్నారు.

“రేపు సాయంత్రం 6.30కి సుజాతను చూడటానికి పెళ్లికొడుకు వస్తున్నాడు” అన్నారు.

తల మీద పిడుగు పడినట్టు అదిరిపోయింది సుజాత. “నిజానికి ఇవేం పెళ్లి చూపులు కావు. ఎపుడో సంబంధం నేను సెటిల్ చేసాను. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు చూసుకుంటారని జస్టు రమ్మన్నాను. రేపు. ఎందుకంటే రేపు రాత్రికి పైద్రాబాదు వెళ్లి అక్కడ నుండి ఫ్లైట్ ఎక్కుతాడు. ఫారిన్ నుండి రావటం పెళ్లి నాటికే. పరీక్షలు అవగానే ముహుర్తం పెట్టిస్తానని చెప్పాను” అన్నారు పరమేశ్వరరావుగారు.

అంత వరకు కంచంలో చేయి వుంచి బిగుసుకుపోయిన సుజాత రయ్ మని కుర్చీలోంచి లేచి “డాడీ” అంది.

“నేను… నేను… పెళ్లి చేసుకోను” అంది.

పరమేశ్వరరావుగారి ముఖం ఒక్కసారి ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇంట్లో ఎవరు ఇప్పటి వరకు కాదు, కూడదు, లేదు అన్న పదాలు చెప్పటం జరగలేదు. అటువంటిది ఈ రోజు ఎంత ధైర్యంగా చెబుతుంది?

“డాడీ” అన్న మాట వినగానే పరమేశ్వరరావుగారు ఆలోచనల నుండి తేరుకుని “అసలు పెళ్ళి చేసుకోవా లేక ఈ సంబంధం చేసుకోవా?” అన్నారు కోపంగా. “చెప్పు సుజీ… నాకు సమాధానం కావాలి” అన్నారు మరింత కోపంతో.

సుజాతకు ఉన్న పళంగా ముచ్చెమటలు పోసాయి. గుండె దడదడా కొట్టుకోవటం ప్రారంభించింది. తను ఏం చెప్పాలి…. ప్రస్తుతానికి తప్పించుకోవాలా లేక ధైర్యంగా నిజం చెప్పడమా?

“నేను అడిగిన ప్రశ్నకు ఇంతసేపు ఆలోచించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఇదేం క్రిటికల్ క్వశ్చన్ కాదు. ఇటీ ఈజ్ సింపుల్. ఈ సంబంధం యిష్టం లేదా? అసలు పెళ్లి చేసుకోవా?” కఠినంగా పలికింది పరమేశ్వరరావుగారి కంఠం.

తండ్రి అంత ఖచ్చితంగా అడుగుతుంటే ఇంక నిజం దాచటం అనవసరం అనిపించింది. తనకు తెలియకుండానే మొండి ధైర్యం వచ్చేసింది సుజాతకి.

“నేను…. నేను… మేం ప్రేమించుకున్నాం” అంది.

“ఎవడే వాడు? చెప్పేదేదో సూటిగా చెప్పు” అన్నారు గంభీరంగా పరమేశ్వరరావు గారు.

“మేము…. నేను… సుదర్శన్ అని మా క్లాస్‌మేట్‌ని”

“సుజాతా!” అని సింహం గర్జించినట్లు అరిచారు.

తండ్రి అరుపులకీ భయపడనట్లుగా “అతనిది మన కులం కాదు. కాని చాలా ఉత్తముడు… మీరంగీకరిస్తే మేం వివాహం….”

“నోర్ముయ్ అప్రాచ్యురాలా! సిగ్గు, బిడియం విడిచిపెట్టి చెబుతున్నావ్? చిన్నప్పటి నుండి భయభక్తులతో పెంచినా ఇలా తయారయ్యావా! ఎవరో కులంగాని వాడిని ఎవరో వెధవతో…. ”

“డాడీ అతనేం వెధవ కాదు…. మన కులం కాకపోవచ్చు. వేరే కులం ఆయినంత మాత్రానా వెధవ అయిపోతాడా! అతను అంతస్తులో మనతో సరితూగకపోయినా చదువులో, బుద్ధిలో అతన్ని మించిన….”

చెంప చెళ్లుమంది సుజాతకు. పరమేశ్వరరావుగారు ఆవేశంతో ఊగిపోసాగారు. “నాకే ఎదురు చెబుతావే? మన కులం కాని వాడిని ప్రేమించానని చెప్పటానికి నీకెంత ధైర్యమే. ఇంకెపుడైనా యిలాంటి పిచ్చి వాగుడు వాగావో తొక్క తీసేస్తాను. జాగ్రత్త ! నీ తరువాత దాని గతి ఏమవుతుందో ఆలోచించావా? అప్రాచ్యురాలా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని రేపు సాయంకాలము పెళ్లి వారు వస్తారు. బుద్ధిగా వచ్చి కనబడు. నా కంఠంలో ప్రాణం వుండగా ఈ పెళ్లి మాత్రం జరుగదు” అన్నారు.

తెల్లబోయి ఆశ్చర్యంగా కూతురు వంకా, భర్త వంకా చూస్తున్నారు పార్వతమ్మగారు.

“డాడీ” అంది సమత.

“ఏమిటమ్మా” అన్నారు పరమేశ్వరరావుగారు. ఆయన కంఠంలో ప్రేమ కొట్టవచ్చినట్లు కనబడుతుంది. మొదటి నుండి పరమేశ్వరరావు గారికి పెద్ద కూతురు సుజాత కంటే సమత అంటే ప్రేమ, ఆప్యాయత ఎక్కువనే చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు. చిన్నతనం నుండి సుజాత మొండిగా ధైర్యంగా వుండేది. అంతే కాదు తను చేయాలనుకున్న పనులు దెబ్బలు తినైనా సరే చేసేది. నలుగురిలోకి హుషారుగా చెలాకీగా తిరుగుతూ మాట్లాడేది.

సమత మాత్రం తండ్రి నోట వెంట మాట రావటం భయం, చేస్తున్నది ఠక్కున మానేసేది. తండ్రి చెప్పినట్లు వినేది. కాలచక్రం దొర్లుతూ ఇద్దరి వయసుల్లో మార్పులు వచ్చినా, సుజాతకు తండ్రి అంటే భయం ఏర్పడినా తను చేయాలనుకున్న పని చెయ్యాలన్న పట్టుదల మాత్రం సుజాతలో పోలేదు. సమత మాత్రం చిన్నపుడెలా వుండేదో ఇపుడు అలాగే వుండటం చూసి పరమేశ్వరరావుగారికి అతనికి తెలియకుండానే సమత అంటే ప్రత్యేకమైన అప్యాయత ఏర్పడింది.

సుజాత ఒక్కొక్క మెట్టెక్కి చదవసాగింది. సమత మాత్రం ఇంటర్మీడియట్ ప్యాస్ కావటం భగీరథుని తపస్సులా కావడంతో చదువు మానేసి ఇంట్లో కూర్చుంది.

ఇంట్లో వున్న సమత తండ్రికి కావలసినవి చూడటం, పడుకునే ముందు స్వయంగా తండ్రికి పాలు తీసుకొని వెళ్లి ఇవ్వటం చేసేది. సభ్యతగా, సంస్కారంగా నలుగురిలోనికి వెళ్లటానికి బిడియపడే కూతురు సమత అంటే సుజాత కన్నా కొంచెం ప్రేమ ఎక్కువ ఏర్పడిందనే చెప్పాలి పరమేశ్వరరావుగారికి.

“డాడీ” అంది మరొకసారి సమత.

ఉలిక్కిపడినట్లు భుజాలు రెండు ఎగురవేసి “ఏమిటమ్మా సమతా” అన్నారు.

“డాడీ నా కోసం అక్క జీవితం బలి చేయకండి” అంది.

“సమతా” అన్నారు కోపంతో గట్టిగా.

“అవును డాడీ మీరు… అనవసరంగా అక్కని చేయి చేసుకున్నారు. మనసు గాయపరిచారు. అక్కకన్నా నేను ఇంకా ముందుకే నడిచాను డాడీ.”

“సుజాతా ఏమిటి నువ్వుంటున్నది” అయోమయంగా అన్నారు.

“నేను…. నేను… మన ప్రక్క… బిల్డింగ్ అవుట్‌హౌస్‌లో ఉంటున్న సతీష్‌ని…”

మాట పూర్తి చేయనే లేదు చెంప చెళ్లుమనిపించారు.

(సశేషం)

Exit mobile version