[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]“హు!…[/dropcap] ఎన్ని కబుర్లైనా చెబుతావే! ఒకనాడు సుదర్శన్ ఫ్రెండ్సుతో బెట్ కాసాడు, నీ ప్రేమ నిష్కలమైనదని. వాళ్లు దానికి ఋజువు ఏమిటి అన్నారు. గుర్తుందా? సుదర్శన్ తనకు వేరే సంబంధం తన తల్లిదండ్రులు చూసారని అబద్ధం చెబితే మన కాలేజి టెర్రస్ ఎక్కావే క్రిందకు దూకి చచ్చిపోవాలని, సుదర్శన్ చెప్పా చేయకుండా రెండు రోజులు కాలేజీకి రాలేదని క్లాసులో వచ్చి కూర్చోకుండా సీతలా చెట్టు క్రింద కూర్చున్నావే! లెక్చరర్స్ ఎక్కడ చూస్తారోనని ఆనక లైబ్రరీలోకి వెళ్లి పిచ్చిగా పుస్తకాలు తిరగవేసావే! ఒకనాడు సుదర్శన్ నిన్ను ఏప్రిల్ ఫూల్‌ని చేయాలని యాక్సిడెంట్ అయి హాస్పటల్లో ఉన్నడని ఫ్రెండ్స్‌తో చెప్పిస్తే కనీసం లీవైనా అడగకుండా పిచ్చి దానిలా పరుగెట్టావోయ్! ఇంత ప్రేమ నాటకం నిన్ను ఎవరు ఆడమన్నారు. ఈ రోజున నీవు సుదర్శన్ ఎవరో తెలియదంటే ఎవరూ నమ్మరే. ప్రతి స్టూడెంటుకి, లెక్చరర్స్‌కి…. ప్రిన్సిపాల్‌కి చివరికి అటెండెన్సు దగ్గర నుండి మన కాలేజిలో చెట్టు చేమకి తెలుసే మీ ప్రేమ కథ.”
కుడి చేతిని తల పై పెట్టుకొని “ఓ మైగాడ్, మీరంతా ఏమిటి అంటున్నది? సుదర్శన్ కోసం…. నేను… నేను…”. అంతే వున్న ఫణంగా కళ్లు తిరిగి నేల మీద పడిపోయింది సుజాత.
అందరూ గాభరాగా సుజాత చుట్టూ చేరిపోయారు.
***
మంచం మీద దొర్లుతున్న సుజాతకు రేణుక అన్న మాటలు ఒక్కొకటే గుర్తుకు రాసాగాయి.
సుదర్శన్! సుదర్శన్! సుదర్సన్! సుదర్శన్‌కి తనకి మధ్య ప్రేమ! ఈ మాటలే పదే పదే మనసులో ప్రతిధ్వనించసాగాయి.
సుదర్శన్ కోసం కాలేజీ టెర్రస్ మీద నుండి పడబోయిందా?
నో!… నో!… సుదర్శన్ ఎవరు?
సుదర్శన్‌కి యాక్సిడెంట్ అయిందని తెలిసి తను పిచ్చిదానిలా పరిగెట్టబోయిందా?
లేదు… లేదు… అంతా వట్టిదే!… తనని ఏడిపించాలని చూస్తున్నారు వాళ్లంతా. తను సుదర్శన్ కోసం పరుగెత్త లేదు.
లేదు!…
అవును….
లేదు!…
సుదర్శన్‌తో తనకు పరిచయం వుందా? సుదర్శన్ తనకు బాగా తెలుసా?
అవును తెలుసు!
సుదర్శన్‌కు తనంటే యిష్టం!
సుదర్సన్ అంటే తనకు ఇష్టం!
కణతలు బద్దలవుతుంటే పిచ్చిగా నొక్కుకుంది. ఒక్క నిముషం గట్టిగా కళ్లు మూసుకుంది.
లీలగా గతం కళ్లముందు మెదిలింది.
గతంకి వర్తమానంకి మధ్య సంఘర్షణ మొదలైంది. ఒక్క సారి త్రుళ్లిపడినట్లు గతుక్కుమంది సుజాత.
సుదర్శన్! సుదర్శన్! తన ప్రియమైన సుదర్శన్! యిన్నాళ్లు ఎక్కడకు వెళ్లి పోయాడు?
చేష్టలుడికిన దానిలా శిలా ప్రతిమలా అలా వుండిపోయింది.
కళ్ల ముందు సినిమా రీళ్లలా ఒక్కొక్కటి సుదర్శన్‌తో సుజాత గడిపిన సంఘటనలు…. అన్నీ గుర్తు రాసాగాయి.
అంతే గొల్లున పిచ్చిదానిలా ఏడ్వసాగింది. అలా ఎంత సేపు ఏడ్చిందో తనకు తెలియదు. ఏదో స్ఫురించిన దానిలా గభాలున మనంచం మీద నుంచి లేచి చెదరిన బొట్టును కారుతున్న కన్నీళ్లను పట్టించుకోకుండానే ఆలస్యం భరించలేని దానిలా టీపాయ్ మీదున్న కారు తాళాలు చేతితో తీసుకుంది. ప్రక్కగదిలోంచి మాటలు విని నడుస్తున్నదల్లా ఒక్క నిముషం కొయ్యబారిపోయింది.
‘డాడీ! ఎంత దర్మార్గానికి తల పెట్టావ్! నీ గుండె ఇంత కరుడు కట్టినదని కలలో కూడా అనుకోలేదు’ అని మనసులోనే బాధపడి తను వెళ్లడం ఎక్కడ వాళ్లు చూస్తారోనని చకచకా అడుగులు వేసింది.
పది నిముషాల్లో కారు ఇంటి ముందు ఆగింది.
చకచకా అడుగులు వేసుకుంటూ, ముందు వున్న గేటు తెరుచుకొని లోపలకు అడుగు పెట్టింది.
వీధి వరండా తలుపు బార్లా తెరిచే వున్నాయి. వరండా ప్రక్కగా టైపు ఇనిస్టిట్యూట్ పెద్ద హాలులో వుంది. వరండా నానుకొని గది వుంది… ఆ వరండాలో నుండి గదిలోకి వెళ్లాలన్నట్లు రెండుడుగులు వేసింది.
తలుపులు దగ్గరగా వేసి వున్నాయి.
“ఎక్కడైనా వుందిరా బాబూ! అది ఎవత్తో దాని కోసం నిద్రాహారాలు మాని చివరికి పరీక్షలు కూడా మాని ఇలా మంచం పడతావురా? నీవెవరో నాకు తెలియదన్న దాని కోసం… నిక్షేపంలా చదివిన చదువు పరీక్షలు వ్రాయడం మానేసి దాని కోసం యిలా మనసు పాడు చేసుకుంటావా? చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం కాదని ఎవత్తో నిన్ను కాదన్న దాని కోసం బాధపడుతావేంట్రా?”
“హవ్వ ఎక్కడైనా వుందా? ఛీ! పో అన్న దాన్ని ముఖం అసలు నువ్వు చూడొచ్చా! అంత డబ్బు వున్న ఆడది అలా అనకపోతే యింకెలా అంటుందిరా? లక్ష రూపాయల వరకు అత్త కట్నం ఇస్తాది. స్వప్న నువ్వంటే పడి చస్తుంది.” అని మీనాక్షి అంటుండగానే….
“అమ్మా ఇంకోసారి ఆ విషయం ఎత్తావంటే నేను కూడా దక్కను” అన్నాడు సుదర్శన్.
అంత వరకు అచేతనంగా నిలబడి వాళ్ల మాటలు వింటున్న సుజాత పరుగున వచ్చి సుదర్శన్ కాళ్ల మీద పడింది.
“సుదర్శన్! నన్ను…. నన్ను… క్షమించవూ! ఏ ఆడది శిక్షంచలేని శిక్ష నీకు విధించాను. కడివెడు పాలల్లో ఒక్క విషబిందువులా అమృత కలశం లాంటి నీ ప్రేమను కలుషితం చేసాను… నా నెత్తి మీద ఏం దెయ్యం ప్రవేశించిందో నేను నా ఊపిరిలో ఊపిరి అనుకున్న నిన్ను మరిచి కూడా యింకా ఎందుకు బ్రతికి వున్నానో అర్థం కావటం లేదు. కాని సుదర్శన్ ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను… నేను… నా మనసుకు తెలిసినంత కాలం నేను మాత్రం నిన్ను, నీ ప్రేమను కాదన లేదు.” అంత వరకు చెప్పకుపోతున్న సుజాత వెక్కిళ్ల మధ్య రెండు చేతుల్లో ముఖం దాచుకుంది.
మీనాక్షి, సుదర్శన్, సుజాత చెబుతున్న దేమిటో అర్థం కాక విస్మయంగా చూసారు.
“సుజీ! నువ్వు చెప్పేదేమిటో అర్థం కావటం లేదు.” అన్నాడు సుదర్శన్ బలవంతంగా గొంతు పెగుల్చుకొని.
“మా డాడీ చాలా పట్టుదల గల మనిషి అనుకున్ననేగాని, ఇంత దారుణమైన పనికి పూనుకుంటాడు అనుకోలేదు.
ఈ రోజు నేను కాలేజి నుంచి వచ్చి అలివేలు, రేణుక మాటలు పదే పదే మననం చేసుకుంటున్నాను. ‘వాళ్లందరు ఎందుకు నన్ను మాటలతో చిత్రహింసలు పెడుతున్నారు’ అని ఆలోచనలతో సతమతమవుతుంటే ఇన్నాళ్లు నిన్ను మరిచిపోయి నువ్వు ఎవరో తెలియదు అన్న అడ్డ తెర తొలగిపోయి గతం తాలుకా జ్ఞాపకాలు నీలినీడల్లా నన్ను వెంటాడటం మొదలు పెట్టాయి.
కాశీ తీసుకెళ్లన డాడీ నన్ను లాడ్జీలో వుంచారు. ఎవరో వ్యక్తి రావడం, నేను ఆ వ్యక్తి చెప్పింది చెయ్యడానికి సిద్ధం కాకపోతే డాడీ నన్ను మందలించి దగ్గర నిలబడి ఆ వ్యక్తి చెప్పినట్లు వినాలని నన్ను మందలించడం అంత వరకే నాకు గుర్తు వుంది. తరువాత ఏం జరిగిందో ఏమిటో అంతా అగమ్యగోచరం! నాకేం తెలియదు. కాని ఈ రోజు డాడీ, నేను ఇక్కడకు వచ్చే ముందు మమ్మీతో – ఫారిన్ నుంచి బిజినెస్‌కి సంబంధించిన వాళ్లు రావటం వలన గత్యంతరం లేక కాశీ వెళ్లటం ఆగిపోయింది. సుజాతను ఈ రోజే అక్కడకు తీసుకురమ్మన్నారు హిప్నాటిస్ట్. ఈ రోజు మరలా హిప్నాటైజ్ చైయకపోతే యథాప్రకారం గతం గుర్తు వచ్చే అవకాశం వుందని అందుకనే నేను హిప్నాటిస్టుని అతను కోరినంత డబ్బు యిస్తాను, వెంటనే రమ్మని ఫోను చేసాను.”
“ఈ రోజు హిప్నాటిస్టు వస్తాడు. నువ్వేం తెలియనట్లు వుండు. అమ్మాయికి ఈ విషయంలో అనుమానం రాకూడదు. అమ్మాయి యిలా వుండగానే వివాహం చేసేద్దాం. ఫారిన్ నుండి అబ్బాయి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాను.” అనడం విన్నాను.”
“అప్పటికి గాని నాకు జరిగిన అన్యాయం తెలిసి రాలేదు. నాకు తెలియని తప్పుకు నన్ను శిక్షించకు సుదర్శన్!” అంది.
అప్పటికి వరకు మూగవాడిలా వింటున్న సుదర్శన్ కంటి నుండి ఏక ధాటిగా కన్నీళ్లు కారుతున్నాయ్.
‘ఎంత మోసం! ఎంత ఘోరం’. పరమేశ్వరరావు ఎంత తెలివైనవాడు. అలాంటి ప్లాను వేయకపోతే ఎంతమంది పరమేశ్వరరావు లాంటి వాళ్లు వచ్చి చెప్పినా సుజాత ప్రేమను తెంచుకోమంటే తెంచుకోనేదా? తను ముందు ఎందుకు ఊహించలేకపోయాడు.
‘ఎలా ఊహించగలడు? ఇలాంటివి తను నిజజీవితాలల్లో చూస్తే గదా!’ ఆలోచించిన కొలదీ సుదర్శన్‌కి పరమేశ్వరరావుగారి మీద ఎక్కడ లేని కోపంతో అసహ్యం కూడా వేసింది.
“ఇద్దరు ప్రేమికులను విడదీయాలని చూసిన అతను నిజంగా మనిషి కాదు.”
వెక్కిళ్ల మధ్యన కన్నీరు కారుస్తున్న సుజాతను చూసిన సుదర్శన్‌కి హృదయంలో ఉవ్వెత్తున ప్రేమతరంగాలు లేచాయి.
“సుజీ!…. సుజీ!… నువ్వు… నువ్వు…. ఇంకా కన్నీరు కార్చకు. ఇంక మనని ఎవరు వేరు చేయలేరు.” అన్నాడు ధృడమైన స్వరంతో!
అంత వరకు అగమ్యగోచరంగా సుజాత మాటలు వింటున్న మీనాక్షి సుజాత వంక విస్మయంగా చూసింది.
దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా అందంతో కళ్లు జిగేల్ మంటున్న సుజాత – మెడలో తళుక్ తళుకుమని మెరుస్తున్న పొడవైన గొలుసుతో, చేతులకు గొప్పింటితనాన్ని చాటుతున్న గాజులతో, చెవులకు రవ్వల దుద్దులతో హుందాగా ఠీవిగా యువరాణిలా కనపడుతున్న సుజాతను ఒక్క నిముషం కళ్ల రెప్పలు వాల్చడం మరచి మరీ చూసింది.
అప్పటికి గాని తెలిసి రాలేదు కొడుకు ఎందుకంత పిచ్చిగా ప్రేమించాడో!
సుదర్శన్ రెండు చేతులు ముద్దులతో ముంచెత్తి ఆ చేతుల మధ్యనే ముఖం దాచుకుంది సుజాత.
(సశేషం)