[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]మొ[/dropcap]ట్టమొదటి సారిగా తల్లి అంటే ఏహ్యభావం కలిగింది. గభాలున కుర్చీలోంచి లేచి “సుజీ! నువ్వు హాఫ్, నేను హాఫ్” అని చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగి కూర్చొమన్నాడు.
“అయ్యో! నాకు వద్దండి. బట్టలు ఆర వేసి వస్తాను.” సుదర్శన్ చేయి నుండి విడిపించుకొని లేవబోయింది కుర్చీలోంచి.
“సుజీ, పని మనిషి రాకపోతే చాకలికి వెయ్యి బట్టలు. అంతే కాని యింకోసారి ఉతికావో ఊరుకోనేది లేదు” అన్నాడు.
కొడుకు, కోడలితో అంటున్న మాటలు చాటుగా వింటున్న మీనాక్షి అక్కడకు వచ్చి కయ్ మంది.
“అవును బాబు, చాడీలు బాగున్నాయి. రెండో సారి కాఫీ యివ్వలేదని, పనిమనిషి రాకపోతే నాలుగు గుడ్డలు అత్త ఉతికించిందని! నేను మాత్రం మీ అందరికి చాకిరీ చేసి పెట్టాలా… ఆయన రెక్కలు ముక్కలయ్యేలాగా కష్టపడితే అయ్యో తండ్రి అనే బాధ లేదు గాని అసలు మాకంత అవసరం ఏమొచ్చిందని…. చిన్నప్పటి నుండి అనుకున్న మేనరికం వదలి లక్షాధికారి కూతురు అని చేసుకున్నావు. మీ అత్తగారి తరుపున ఒక క్రొత్త గుడ్డ తల్లికి పెట్టించలేకపోయావు గాని పెళ్లాన్ని చూసి బాధపడుతున్నావా? ఎవరికసలు గొప్పంట? లక్షాధికారి కూతురైతే మాత్రం! నాలుగు రోజులు, పది రోజులు గాని నెల దాటి పోయింది. ఇంకా పట్టింపులే. కట్టుగుడ్డలతో పంపాడు. ఏమైనా మంచి చెడ్డలు చూస్తున్నాడా? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో!” ఏక ధాటిగా ముక్కు చీదుతూ బుడి బుడి దీర్ఘాలు తీస్తూ ఏడ్వసాగింది మీనాక్షి.
అనుకోని హఠాత్ పరిణామానికి…. తల్లి నోటి దురుసుకి ఆశ్చర్యపోయి అసహనంగా… “అమ్మా” అన్నాడు.
“ఏమిట్రా బాబు ఆ అరుపులు? ఏమన్నానని” అని… “ఒక్క అచ్చట ముచ్చట వాళ్లు తీర్చకపోయినా నా కడుపులో దాచుకున్నాను. మీదు మిక్కిలి నా మీద చాడీలా?”
“అత్తయ్యా! మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారత్తయ్యా! నేను మీ అబ్బాయిగారితో ఏమీ అనలేదు.” అని సుజాత అంటుండగానే…
“నువ్వేం చెప్పనక్కర్లేదు తల్లి… మీ గొప్పింటి వాళ్లకో నమస్కారం” అంది.
కళ్ల వెంట కారుతున్న కన్నీళ్లు వాళ్లు చూడటం ఇష్టం లేని దానిలా అక్కడ నుండి వెళ్లిపోయింది సుజాత.
“ఇంట్లో గురువారం ఏడుపులు పెడబొబ్బలు… ఇంటికి శుభం జరగదు. యిప్పటికే ఉద్యోగం సద్యోగం లేకుండా నీ కొంగు పట్టుకు తిరుగతున్నాడా” అని రయ్‌మని అక్కడ నుంచి వచ్చినంత వేగంతో వెళ్లిపోయింది.
తల్లిని ఏమి అనలేక…. తిరిగి ఒక మాట అన్నా గోరంత కొండంత చేస్తుంది అని… ఆవేశాన్ని బలవంతంగా అణుచుకొన్నాడు. ఏం చేయలేని నిస్సహాయుడిలా కుడి చేయి పిడికిలి నుదుటి మీద బలంగా గుద్దుకున్నాడు.
“మీనాక్షీ, కాస్త నోరు తగ్గించవే. నోరు వుంది కదా అని నాలుక ఎలా వెళ్లనిస్తే అలా వెళ్లటమేనా? కాస్త నిదానించు. మనసు చాలా సున్నితం. శరీరం మీద దెబ్బ తగిలిన కాసేపటిలో తగ్గిపోతుందిగాని మనసు మీద పడిన మాట అలా మనసునే అంటి పెట్టుకొని వుంటుంది.” అని మీనాక్షిని వంటగదిలో మందలించబోయారు రంగారావుగారు.
“చాల్లేండి చెప్పొచ్చారు. వెధవ సన్నాసుల మఠంకి రోజు వెళుతున్నందుకు బాగానే తయారయ్యారు” అంది కోపంగా.
“ప్చ్! నీతో వాదిచడం అనవసరమే! మొక్కై వంగనిది మానై వంగుతుందా” అని కొడుకు దగ్గర కొచ్చారు.
సుదర్శన్ తండ్రి వచ్చిన ఉనికిని గమనించకుండా మంచం మీద వెల్లకిలా పడుకుని కళ్లు మూసుకొని ఉండటం చూసి కొడుకు మనసు ఎంత ఆవేదనకు గురి అయిందో గ్రహించారు రంగారావుగారు. తను మాట్లాడినా ఆవేదన పెరుగుతుందేగాని తరగదని ఆయన అనుకోవటంతో టైపు ఇనిస్టిట్యూట్ వైపు నడిచారు.
***
“అత్తయ్యా! చీరలు ఎలా వున్నాయి? నాకు మాత్రం మీరు రంగుగా వుంటారని ఈ అరడజను ముదురు రంగు చీరలు తీసాను.” ఒక్కసారి మీనాక్షికి గుండె ఆగినంతపనయింది.
ముదురు రంగులో చీరంతా దిట్టంగా, జరీ పువ్వులతో పెద్ద పెద్ద బోర్డరుతో ఉన్న అరడజను చీరలు చూసి నోటి వెంట మాట రాలేదు. తను జన్మలో ఒక్కసారిగా యింత ఖరీదైన చీరలు కొన్నదా! కొందాం అని షాపుకి వెళ్లినా ఖరీదు చూడగానే ప్రాణం పోయి చిన్న జరీ బోర్డర్సు వున్న చీరలే కొంటుంది.
“ఏం అత్తయ్యా! చీరలు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి, రిటన్ చేసి మీకు కావలసిన రంగుల్లో తీసుకుంటాను. మాకు తెలిసిన షాపే” అంది.
చీరలు బాగున్నాయంటే కోడలు ఎక్కడ మురిసిపోతుందో అని “బాగానే వున్నాయి గాని అసలైన జరీయేనా? నకిలీవా? ఎందుకంటే ఒకసారి నేను కొన్నాను. నీళ్లలో మంచితే జరీ చక్కా ఊడొచ్చింది. అదీగాక స్టీలు సామానువాడికేస్తే గరిట కూడా ఇవ్వలేదు” అంది.
“ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు
చూడచూడ రుచులు జాడ వేరు
భర్త పద్యం చదువుతూ అక్కడకు రావటం చూసి మీనాక్షికి తల కొట్టేసినట్లయింది కోడలి ముందు.
“చాల్లెండీ వెధవ పద్యాలు మీరు. ఏమో! ఆవిడలా గొప్పింటి దానిని కాదు అని ఏ నకిలీ చీరలు నా మొఖానికి సరిపోతాయని తెచ్చిందేమో అని అడిగానంతేగాని జరీ చీరల మొఖం తెలియక గాదు” అని వంటింట్లోకి దారితీసింది.
మీనాక్షి నోట వెంట ‘ఒక్క చీరైనా ఎరుగను కొడుకు పెళ్లయినా’ అన్న మాట విని సుజాతకు నిజంగానే బాధ వేసింది. కొడుకుని కన్న తల్లి మనసుకి కోరికలు ఎలా వుంటాయో సుజాతకు తెలుసు. తన తరుపున అత్తగారికి ఏం జరగలేదు. అందుకు ఆవిడ ఎంత బాధపడుతుందో? తనకు ఎందుకో ‘ఆవిడకు కనీసం కొన్ని చీరలయినా కొని ఇస్తేనో’ అనిపించింది. అందుకనే చేతికున్న గాజుల్లో రెండు తీసి అమ్మింది.
“ఏమ్మా అలా నిలుచుండిపోయావు? ఓహో బట్టలు ఇంకా తెచ్చినట్టున్నావే! ఆహా! నాకు కూడా తెచ్చినట్టున్నావే! అందరి బట్టల సంగతీ నాకు తెలియదు గాని నాకు మాత్రం బ్రహ్మాండమైన సెలక్షన్ చేసావ్! ఇంకేం అమ్మా! బజారుకెళ్లే శ్రమ తప్పింది. అది సరే గాని నువ్విలా బట్టలు తీసుకురావటం నాకేం బాగాలేదమ్మా. అబ్బాయి ఉద్యోగం చేసినపుడుగాని లేకపోతే ఇంటి బాధ్యత నీ చేతికొచ్చినపుడుగాని నీవు యిలాటిం పని చేయ్యాలి. అంతేగాని నువ్వు యిలాంటివి మొదలు పెట్టావో, ఇంట్లో అనర్థాలకు దారితీస్తుందే తప్ప ఇంకే కాదమ్మా! ఏ మనిషికైనా కోరికలు గుఱ్ఱాలు తల్లీ… ఒకటి తీరితే మరొకటి. ఎపుడు యిటువంటి పిచ్చి పని చేయకు తల్లీ” అని సుజాత తల మీద చేయి వేసి నిమురుతూ అంటున్న రంగారావుగారు ఆ నిముషం మామగారిలా కాకుండా కన్న తండ్రిలా కనిపించారు.
“సుజీ! ఎంత పని చేసావు? చేతి గాజులు అమ్మి బట్టలు కొన్నావా? ఐయాం సారీ. నీ మనసు ఎంత గాయపడితే ఇలా చేస్తావు! అసమర్థుడిని సుజీ! ఇక్కడ వాతావరణంలో ఒక్క నిముషం నిన్ను ఉంచటం ఇష్టం లేదు కాని బయటకు తీసుకెళితే నిరుద్యోగి అయిన నేను ఈ పాటి అయినా చూడలేను… నిన్ను… నిన్ను ఇంటికి చాకిరి చేయించటానికి, సూటిపోటీ మాటలనిపించడానికి వివాహం చేసుకున్నానేమో అనిపిస్తుంది. నీ అంతస్తుకి తగిన వాడైతే నీ కాలు క్రింద పెట్టనిచ్చేవాడా!” అన్నాడు సుదర్శన్.
“ఏమండీ” అని బాధగా చూసింది. “ఏమండీ మీరు… మీరు అనవలసిన మాటేనా? ఇంకోసారి మీరిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు” అంది.
సుజాతని తల్లి అన్ని మాటలు అంటున్నా…. మనసులో ఏం పెట్టుకోకుండా మామూలుగానే ఉండటం చూసి ఒక్కనిముషం సుజాత వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు… అసలు ఎన్ని అన్నా… తల్లి ఎలా ప్రవర్తించినా మనసును తన కోసమే కదూ సమాధానపర్చుకుంటున్నది. ‘సుజీ! నీ ప్రేమ అమోఘం! ఎపుడూ ఇలానే వుండాలి. నువ్వు లేకుండా బ్రతకలేను సుజీ!’ అని మనసులో అనుకున్నాడు సుదర్శన్.
కిలకిలా నవ్వింది సుజాత.
ఆ నవ్వుకి ఆలోచనల నుండి తేరుకున్నాడు.
“ఏమిటండీ! మీలో మీరే ఆలోచనల్లో మునిగితేలుతున్నారు, అది సరే గాని మీకో సంగతి చెప్పనా” అంది నవ్వుతూ.
ఎపుడు లేనిదీ…. ఆ కళ్లు వింత కాంతితో మెరుస్తున్నాయి.
“చెప్పు సుజీ! నీ సంతోషంలో పాలు పంచుకోవాలనే నా ఆరాటం! కాని నిన్ను సంతోష పెట్టలేకపోతున్నాను” అన్నాడు బాధగా.
“అబ్బబ్బ! ఏమిటండీ అనవసరంగా బాధపడిపోతున్నారు. ఇన్నేళ్ళు టేబుల్ మీదకు భోజనం వస్తే తినటం, బీరువాలో బట్టలు తీసి కట్టుకోవటం, బ్యాగ్‌లో డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోవటం తప్ప వేరేం తెలియదు. ఇప్పుడువన్నీ తెలుస్తున్నాయి. సుదర్శన్, ఒకటి మాత్రం నిజం చెబుతున్నాను, నువ్వు నవ్వుకున్నా సరే! నీవు నా ప్రక్కనే వుంటే గంజి త్రాగమన్నా త్రాగుతాను… నాలో శక్తి వున్నంత వరకు ఏ పనైనా చేస్తాను” అంది.
అలా చెబుతున్న సుజాత కళ్లల్లో వెలుగుతున్న నిశ్చల కాంతి చూసి గర్వంతో సుదర్శన్ కళ్లు మెరిశాయి.
“సుజీ!” అని ఆర్ధ్రంగా హృదయానికి హత్తుకొని “ఎన్నాళ్లో లేదు సుజీ! మనకు మంచి రోజులు… ఏదో ఒక ఉద్యోగం రాకపోదు. నిన్ను కాలు క్రింద పెట్టకుండా చూడలేకపోయినా నీ మనసుకి మాత్రం గాయం తగలనివ్వను…. వచ్చే ఏడాది పరీక్షలకి వెళతాను.” అని చెబుతున్న కళ్లల్లో భవిష్యత్ పట్ల ఆశ కనబడుతుంది.
“ఏమండి, మీ కోసంగతి చెబుతాను అన్నాను. ఏమిటనుకున్నారు. నేను చీరలు తెచ్చాక ఎదురింటి ప్లీడరుగారి భార్య వస్తే అత్తయ్యగారు చీరలు చూపించారు. ఆవిడ ‘సెలక్షన్ చాలా బాగుంది’ అన్నారు. అపుడు ఆత్తయ్యగారు ఎంత సంతోషించారో తెలుసాండీ? ‘మా కోడలు చేత చీరలు సెలెక్ట్ చేయిచుకోవాలి! ఇన్నాళ్లు నాకు చీరలు కొనడం తెలిసి చావడం లేదు. చదువుకున్న పిల్ల! పెద్దింటి అమ్మాయి. తనకు తెలియకపోతే నాకు తెలుస్తాయా!’ అని నన్ను ఒకటే పొగిడేయటం అండి!” అని అంది విప్పారిన నేత్రాలతో సుజాత.
“చంపేశావ్, ఓహ్ ఇదా నీ సంతోషానికి కారణం” అని నవ్వి “పిచ్చి సుజీ! మా అమ్మ సంగతి తెలియదు. ఒక్కసారి పైకెత్తి ధభాలున పడేస్తుంది జాగ్రత్త” అని రెండు చేతులు చాచి గుండెల మీద పడుకోమన్నట్లు కళ్లతోనే రమ్మన్నాడు.
గువ్వలా రెండు చేతుల మధ్యగా గుండెల మీద వాలిపోయింది సుజాత.
(సశేషం)