ప్రేయసీ మునుపటిలా ప్రేమించమని మాత్రం అడగకు!

2
1

[ఫైజ్ అహ్మద్ ఫైజ్ రచించిన ‘ముఝ్ సే పహలీ జీ మొహబ్బత్ మేరీ మహబూబ్ నా మాంగ్’ అన్న కవితని తెలుగులో అందిస్తున్నారు డా. గీతాంజలి. Telugu Translation of Faiz Ahmad Faiz’s poem ‘Mujh Se Pehli Si Mohabbat Mere Mehboob Na Maang’ by Mrs. Geetanjali.]

 

~

[dropcap]ప్రే[/dropcap]యసీ.. గతంలో ప్రేమించినట్లు మళ్ళీ
నిన్ను ప్రేమించమని మాత్రం నన్ను అడగకు!
ప్రేమంటే నాకు నిత్యం
కాంతులీనుతూ.. వెలిగిపోతూ ఉండాలి!
ఎందుకంటే.. ఆ ప్రేమలో నువ్వు కదా ఉండేది?
నీ తోడుంటే జీవితమంతా
శాంతి నిలయంగా మారిపోతుందనే కదా అనుకుందోనాడు?
నీ జ్ఞాపకాలు.. నీ రూపం నాలో వసంతాల్ని నింపేసేవి.
మేఘాలు, నక్షత్రాలు నా పక్కనే ఉన్నట్లుండేది.
ఈ దునియాని ఏమంత లెక్క చేసే వాన్నని చెప్పు నీ మోహంలో పడి?
***
కానీ ఈ లోకమంతా నిండిన విషాదాల, దుఃఖాలలో
నిత్యం తేలియాడే నాకు.. నీ ప్రేమలో ఆనందం కూడా
అచ్చు అలాగే గుచ్చుతూ గాయపరుస్తున్నట్లుగానే ఉంటుంది.
నన్నూ.. నా యవ్వన కాలాన్నీ నీ
అద్భుత సౌందర్యమే కదా కట్టిపడేసింది?
ప్రియా.. నీ విశాలమైన కళ్ళల్లో..
ఆ చూపుల్లో మునకలైపోవడం తప్ప
ఈ లోకంలో చూడదగ్గవి ఇంకేమీ
లేవనే అనుకునే వాణ్ణి కదా ఒకప్పుడు!
నువ్వు నాదానివైతే చాలు..
ఈ లోకాన్నే జయిస్తాననీ కూడా!
ఏమో.. ఇలా అవ్వాలని ఆకాంక్షించా మన గురించి!
ప్రియా.. ఇదంతా నా చపలత్వపు ఊహలు మాత్రమే!
***
దునియాలో ప్రేమను మించిన
వేదనలు, బాధలు చాలానే ఉన్నాయి..
ఒక్క ప్రేమికుల కలయికలను మించిన
చిన్న చిన్న సంతోషాలు చాలానే ఉన్నాయి.
***
కానైతే ప్రియా.. నీకు తెలీ నిదేంటంటే.,
సున్నితమైన ధగ ధగా మెరిసిపోయే జరీ పట్టు ముసుగుల్లో
భయపెడుతూ మనుషుల బదులు
దెయ్యాలు తిరుగుతున్నాయి ఇక్కడ.
చరిత్రలో వందల ఏళ్ల నుంచీ అంతేలేని
అంధకారంలో కదలాడే బీదల అణిచివేతల నీడలు
ఐశ్వర్యవంతుల కష్టాల కథలుగా
మాత్రమే ప్రపంచానికి చెప్పబడ్డాయి!
కానీ ఇక్కడ అందమైన శరీరాలతో
మాంస వ్యాపారాలు జరిగిపోతూనే ఉంటాయి.
నిస్సిగ్గుగా., రహస్యంగా రక్తంలో నానుతూ..
దుమ్ములో దొర్లుతూ.. రోగాలతో కుళ్లిన దేహాలు
పుండ్లు.. పుండ్లై, చీము కారుతున్నాయి.
అవును! ఆ దౌర్భాగ్యుల శరీరాలతో
మాంస వ్యాపారాలు జరిగి పోతూనే ఉంటాయి.
ఇప్పుడు నువ్వే చెప్పు! ఇంత బీభత్స జీవితాలు
నా కనులముందు ఉన్నప్పుడు..
ప్రియా నా చూపులు అటుగా పోక ఇంకెటు పోతాయని?
ఇక నేనెలా ఆ బీభత్సమైన మానవ
విషాదాల వైపుకి చూడకుండా ఉండగలను?
సమ్మోహకమైన నీ సౌందర్యం.. నీ ప్రేమ వైపుకి ఇప్పటికీ
నా మనసు లాగుతూనే ఉంటుంది..
నీ మీద ప్రేమ లేదనుకోకు!
కానీ నిస్సహాయుడ్ని, ఏం చేయను చెప్పు?
అటు.. ఆ పీడితుల వైపుకి కూడా
మనసు గుంజుతూనే ఉంటుంది !
ప్రియా.. ఈ దునియాలో ప్రేమలో విరహాన్న పడిపోవడం కంటే
మించిన దుర్భరమైన వెతల కథలు
లెక్కకు మించి ఉన్నాయి..
వాటి గురించి కూడా నేను ఆలోచించాలి కదా మరి!
నువ్వు తెలుసు కోవాల్సిందేంటంటే.,
ఈ లోకాన్న ప్రేమికుల సంయోగాన్ని
మించిన వేదనలు ఎన్నో ఉన్నాయి!
నన్ను వాటి వైపు కూడా కాస్త చూడనీ!
అందుకే ప్రియా.. మునుపటిలా ప్రేమించినట్లు
మళ్ళీ ప్రేమించమని మాత్రం నన్ను అడగకేం!
నాకంత సమయం ఉందని అనుకోను!

మూలం: ఫైజ్ అహ్మద్ ఫైజ్

అనుసృజన: గీతాంజలి


ఫైజ్ అహ్మద్ ఫైజ్ (13 ఫిబ్రవరి 1911 – 20 నవంబర్ 1984) ఉర్దూ కవి, రచయిత. బ్రిటీష్ ఇండియాలోని సియాల్‍కోట్‌లో జన్మించారు. దేశవిభజన అనంతరం పాకిస్తాన్‌కు వెళ్ళిపోయారు. దక్షిణాసియాలో ఉర్దూ భాషలో అత్యంత ప్రసిద్ధ రచయితలలో ఒకరు. ఆయన ఉపాధ్యాయుడిగా, సైనిక అధికారిగా, పాత్రికేయుడిగా, ట్రేడ్ యూనియన్ నేతగా, ప్రసారకర్తగా విస్తృత అనుభవం ఉన్న వ్యక్తి. 1962లో లెనిన్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఫైజ్ 1984లో సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రగతిశీల భావాలు, నూతన దృక్పథాలకు పేరుగాంచారు.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here