ప్రైవసీ

0
2

[శ్రీమతి షేక్ కాశింబి రచించిన ‘ప్రైవసీ’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]సొం[/dropcap]తవారితో సంతోషం పంచుకోలేని అవిటి మనసుతో
సాటి వారి వృద్ధి చుసి ఓర్వలేని అసూయతో
సమష్టి ప్రగతికి పాటుబడలేని సంకుచిత చిత్తంతో
సమాజ ధర్మాలను ప్రతిబంధకాలుగా భావించే మనో దౌర్బల్యంతో..

అమ్మానాన్నల శుభ సూచనల్ని పెడ చెవిన బెట్టి
అన్నదమ్ముల ఆత్మీయతా పాశాల్నా వలికి నెట్టి
అయినవారి అనురాగపు పిలుపు కందనంత దూరపు దారి బట్టి
ఆవాస మేర్పర్చుకున్నావో నిర్జన వనాన నీ ఇష్టానికే పట్టం గట్టి!

స్పందనా అలల వసరం లేని నిశ్చల కాసారంలా
సంతోష విషాదాల వీచికలకు చలించని పాషాణంలా
సంబంధ బాంధవ్యాల తడి అంటని తామరాకులా
సహవాసుల్లేని వాడన జేరావు నీవనుకునే స్వేచ్ఛకు సంకేతంలా..

నీ వికృతానందాన్ని కనబడనివ్వని పట్టు దారాల దుప్పట్లో దూరి
నీ కర్కశత్వపు జాడ పసిగట్టనివ్వని చీకటి ముసుగున చేరి
నీకెవరి అవసరమూ లేదనే దగాకోరు ధీమాని గుండెల్నిండా కూరి
నీతో నువ్వె గడిపావెన్నో యేళ్ళు ధర్మానికి వైరిగా మారి!

నిన్నందరూ మరిచేలా చేసిన కాలం.. ఋతువులెన్నో మార్చాక
నీ తత్వపు అల్పత్వం కురూపియై ఎదుట నిలిచాక
నీ బలిమి అడుగంటి.. జీవిత నిజరూపం దృష్టి గోచరమయ్యాక
నువ్వనుకున్నట్లు.. నువ్వేమీ అద్భుతావని కాదని స్పష్టమయ్యాక.. ఇప్పుడిక

నీ ఓటమి నంగీకరించనివ్వని అహం పులితో పోరాడి గెలిస్తేనే
నిన్ను వెనక్కి తగ్గనివ్వని బింకపు భల్లూకం పట్టుని విడిపించుకుంటేనే
నీ కుశంకల ఆత్మ సంఘర్షణా తుఫాను కెదురొడ్డి నిలిస్తేనే
నీ ద్వేషాగ్ని నిండిన గుండెని ప్రేమామృతంతో నింపితేనే..

నీ చుట్టూ కట్టుకున్న ‘నా’ అనే ఇనుప గోడని స్వయంగా కూలిస్తేనే
నీ అణువణువునా పేర్చుకున్న ‘నేన’నే మోహపు పొరల్ని తొలగిస్తేనే
నీ చుట్టూ ఉన్న అసంఖ్యాక జనంతో మమేకమై మనగలవు
నీ వొక ‘మనసున్న మనిషి’గా మన్నన పొందగలవు!

స్వార్థంతో ఒంటరిగా బ్రతకడమే ‘ప్రైవసీ’ అనుకుంటున్న ఓ నవతరం యువకుడా!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here