[4-4-22 వతేదీన బాపట్ల జిల్లాగా అవతరించాక తొలి వార్షికోత్సవ సందర్భంగా 4-4-23 తేదీన రాసిన గేయం]
[dropcap]జ[/dropcap]య జయ ప్రియ భావపురీ
జయము జయము ఘనశిఖరీ
తరతరాల విమల చరిత
తనియించును తలచినంత
ఆది ఋషుల తపోభూమి
అవనిలోన ఆర్షభూమి
ఆంధ్రమహా భారత కవి
అద్దంకి ఎర్రనకు నమామి
తొలి తెలుగు శాసన పద్యం
పండరంగడి నామ ప్రఖ్యాతం
శ్రీనాథుడు నడయాడిన
సీమకదా ఈ నగరం
చోళరాజ చిరయశస్సు
గురుతు నిలుపు దేవళం
భావన్నారాయణస్వామి
కరుణ వెలుగు నందనం
కొండపాటూరు బిడ్డ
రాజ్యలక్ష్మమ్మ చేరింది
నారాయణు సన్నిథికి
వైకుంఠమ్మిట వెలసింది
ఎందరెందరో రాజులు
ఏలిన నీ కేతనం
గుడి వాకిట నిలిచిన
రాజగోపుర ద్వారం
అదుగో ఆ నూపురశృతి
అది లకుమాదేవి జతి
రాజ్యప్రజా శ్రేయస్సుకు
అంకితం ఆ త్యాగమతి
కవి గాయక నటరాజులు
ఖ్యాతిగన్న కాంతి ఇది
పరపాలన పారిపోవ
నినదించిన నేల ఇది
మొదటి ఆంధ్ర మహాసభగ
గళమెత్తిన తెలుగుల బరి
తెలుగుతల్లిని నిలిపిన
రాయప్రోలు రాగఝరి
విద్యాలయాలకు నిలయం
సయోధ్యకు స్నేహసుమం
వీథి వీథి వినిపించును
మహనీయుల స్మృతిగీతం
రమణీయం రథోత్సవం
చూపరుల నయనోత్సవం
పులకింతల తరంగ విన్యాసం
జలతరంగిణీ స్వరార్చనం
రక్షణాసూచి సూర్యలంక
మా ఊరికి మరో వెన్నెముక
పర్యాటక పదాల అలజడి
సముద్రాన వింత సందడి
కోన ప్రభాకరుని కోరిక
తనయుడు ఇచ్చిన కానుక
జిల్లాగా రూపెత్తిన బాపట్లకు
తొలి పుట్టినరోజు వేడుక
వర్థిల్లాలి భావపురి
వైభవదారుల మరీమరీ
చేయిచేయి కలిపే కృషిలో
మట్టిబంధమే తొలకరి
వెల్లివిరిసిన మరుమల్లెలతో
తల్లికి జల్లులు కురిపిద్దాం
రేపటి కలలకు రంగులు వేస్తూ
ఆశల హారతులందిద్దాం