Site icon Sanchika

ప్రియమైన నీకు

[dropcap]అ[/dropcap]ప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు. డా.శశాంక్ కారు ఆపి.. కారులో నుండి బయటకి చూశాడు… తన హాస్పిటల్ గేట్ దగ్గర వున్న వాచ్‌మన్ వినయంగా నమస్కరిస్తూ గేట్ తీశాడు.

‘ప్రజాహిత’ హాస్పిటల్ పేరు పసిడి వర్ణంలో మెరుస్తూ అతనికి స్వాగతం పలుకుతుంది. మెరుస్తున్న అక్షరాలకి వున్న అందమైన అర్థాన్ని మనస్సులోనే స్ఫురణకు తెచ్చుకుంటూ హాస్పిటల్ లోకి కారుని డ్రైవ్ చేసి, పార్క్ చేసాడు శశాంక్.

వార్డ్స్ అన్నీ గమనిస్తూ తన క్యాబిన్ వైపు నడిచాడు.

ఇరవై నాలుగు గంటలపాటు సేవలందించే ఆ హాస్పిటల్.. నిత్యం ఎందరో రోగులకి సాంత్వన చేకూరుస్తూ, ప్రాణాపాయ స్థితిలో అక్కడికి వచ్చిన ఎందరో పేషెంట్స్‌కి ఆపదల నుండి తప్పించే సంజీవనిలా పనిచేస్తుంటుంది.

జిల్లా కేంద్రంలో వున్న అతి పెద్ద హాస్పిటల్ అది. తక్కువ రేటుకే అత్యుత్తమ వైద్యాన్ని అందించే ఆ హాస్పిటల్ జిల్లా మొత్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది. శశాంక్ తల్లిదండ్రులు డా.పరశురాం, డా.నీరజ.లు ఆ హాస్పిటల్‌ని ఇరవై ఏళ్ళుగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏళ్ళు గడుస్తున్నా ఏమాత్రం వన్నె తగ్గని విధంగా హాస్పిటల్‌ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు.

ఎప్పటికప్పుడు వైద్యరంగంలో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలని అందిపుచ్చుకుంటూ అధునాతన వైద్య పద్ధతులని తెలుసుకుంటూ తమ హాస్పిటల్‌ని అత్యున్నత నాణ్యత, ప్రమాణాలతో నడుపుతున్నారు.

డా.శశాంక్ ఇటీవలే తల్లిదండ్రుల దగ్గర నుంచి వైద్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు.

చదువుల్లో చలాకీగా ఉండే అతను డాక్టర్ కోర్స్ మంచి మార్క్స్‌తో పాస్ అవడమే కాకుండా తల్లిదండ్రుల కోరిక మేరకు హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలను చిన్న వయస్సులోనే స్వీకరించాడు.

తల్లిదండ్రులు యు.ఎస్.ఎ వెళ్ళారు… అక్కడ వున్న కూతురు, అల్లుడితో కొంత కాలం గడపాలని!

***

డా.శశాంక్ తన క్యాబిన్ లోకి రాబోతున్న మేఘన వైపు చూస్తున్నాడు. అందం,తెలివితేటలు కలిగిన అమ్మాయి డా.మేఘన. అందరితో స్నేహంగా ఉంటుంది. రోగులతో ఆదరణగా మాట్లాడుతుంది. పేషంట్స్ చెప్పే మాటలు శ్రద్దగా వినడమే కాకుండా చక్కని ట్రీట్మెంట్ ఇస్తుంది. అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తూ.. రోగి కష్టాన్ని అర్థం చేసుకుని తన మాటలతో, చేతల ద్వారా బాధలకు ఉపశమనం కలిగించే డాక్టర్. డా.మేఘన గురించి అతనికి తొలినాళ్లలోనే కలిగిన అభిప్రాయం అది.

చదువుల్లో తన కంటే ఓ సంవత్సరం మాత్రమే జూనియర్. వైద్యం చేయడంలో మాత్రం సీనియర్స్‌తో సమంగా పనిచేస్తుంది డా.మేఘన.

“May I come in Sir.”

“Yes..please come in..” అతడి ఎదురుగా కూర్చుంది డా.మేఘన .

సన్నగా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడుతున్న డా.మేఘన వైపే చూస్తున్నాడు శశాంక్.

పేషెంట్స్‌కి తను అందిస్తున్న ట్రీట్మెంట్, మెడిసిన్ గురించి చెబుతూ.. ఫైల్స్ చూపిస్తుంది.

“అలాగే..” అన్నాడు శశాంక్ డా.మేఘనతో.

తను చెప్పాల్సిన విషయాలన్ని డా.శశాంక్ గారి కి చెప్పేసాక.. “ఇక వెళతాను సార్..” అంటూ బయటకి దారితీసింది.

తను వెళుతున్న దిశగా చూస్తుండి పోయాడు శశాంక్. అతడి మనస్సులో.. ఏదో మూల చిన్న కదలిక. డా.మేఘన తన అర్ధాంగి అయితే బాగుంటుంది కదా అనుకున్నాడు మనసులో!

ఒకరు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో ఎన్నో కారణాలు చెప్పవచ్చు! కాని నచ్చారనడానికి కేవలం ఒకే కారణం చెప్పలేరు..!

ఎలా చూసినా, వాళ్ళేం చేసినా నచ్చుతుంది. అదే ప్రేమకున్న ప్రత్యేకతేమో!

***

డా.మేఘనకి తన మనస్సులోని మాట చెప్పాలనుకున్నాడు శశాంక్.

తన ఎదురుగా కూర్చున్న డా.మేఘనకి “ఐ లవ్ యూ మేఘన!” అంటూ నేరుగా ప్రపోజ్ చేశాడు.

అంతే ఒక్కసారిగా డా.మేఘన కళ్ళు ఎరుపెక్కాయి.

“సార్! మీరంటే గౌరవం. ఒక సీనియర్‌గా మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. డా.శశాంక్ గారంటే నాకే కాదు మన హాస్పిటల్ లోని వారందరూ అభిమానిస్తారు. వారిలో నేను ఒకరిని. మీ తెలివితేటలు మీ కుటుంబ నేపథ్యం గొప్పది. కానీ నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో నుండి వచ్చాను. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. అయినా మీకో సంగతి చెప్పాలి మా నాన్నగారు నాకు ఒక సంబంధం చూశారు. రెండు మూడు రోజుల్లో నేను వెళ్ళాలి . సారీ సార్! మీ ప్రేమని అంగీకరించలేక పోతున్నాను.” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.. అతడి స్పందనని గమనించకుండా!

ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడతను.

గుండెల్లో అగ్ని పర్వతాలు అయితే బద్దలవలేదు కానీ.. సున్నితమైన అతడి మనసుకు గాయమయింది.

ప్రేమ.. నీకు నేను తోడున్నాను నేస్తం అని పలికే మృధు భావం!

ప్రేమ.. రెండు హృదయాలని ఒక్కటి చేసే పవిత్ర బంధం!

ప్రేమ.. సృష్టిని నడిపించే చైతన్యం!

‘ప్రేమ’ లేని జీవితం .. బ్రతుకంతా భారం !

‘ప్రేమ’ లేని జీవితం.. వెంటాడే ఒంటరితనమే నేస్తం!

డా.మేఘన తన టేబుల్‌పై పెట్టిన లీవ్ లెటర్‌ని చూసాడు. శశాంక్ గాయమైన హృదయంతో ..నిశ్శబ్దంగా సాయంత్రం ఇంటికి పయనమయ్యాడు.

రాత్రికి తన పేరెంట్స్ ఇంటికి వస్తారు.

కారణం మరుసటి రోజు అతడి పుట్టిన రోజు.

రాత్రి పది గంటలకి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడు కాస్త దిగులుగా ఉండటం గమనించారు. పని ఒత్తిడిలో అలసిపోయి వుంటాడేమోనని అట్టే ప్రశ్నలేసి అతనిని ఇబ్బంది పెట్టలేదు.

“ఎలా వున్నావు రా?” అడిగారు.

“I am fine Dad and Mom..” అన్నాడు మొహంలోకి లేని చిరునవ్వును వెతికి తెచ్చుకుంటూ..

మిన్నకుండిపోయారు వారిద్దరు.

***

ఉదయం తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు.

“డియర్ శశాంక్! మేము ‘ప్రజాహిత’ని ప్రారంభించినప్పుడు తొలినాళ్ళలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మీ అమ్మ నేను రాత్రింబవళ్ళు హాస్పిటల్ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించాము. మేము వేరే ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి హాస్పిటల్ ప్రారంభించిన కొత్తల్లో మాకు ఈ ఊరిలోని ఎంతో మంది సాయం చేశారు. కానీ ఓ నాయకుడు మమ్మల్ని ఆర్థికంగా,సామాజికంగా దెబ్బతీయాలని ప్రయత్నించాడు. తను తన దగ్గర వున్న డబ్బులతో హాస్పిటల్‌ని నిర్మించాలని.. మమ్మల్ని ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టాలని చూశాడు.

ఆ రోజుల్లో విప్లవ భావాలు కలిగిన నరసింహం గారనే ఓ పెద్దాయన మాకు సహాయంగా వుంటూ.. మా ప్రతి కార్యక్రమంలో మాకు వెన్నుదన్నుగా నిలబడి ఆ అవినీతి నాయకుడి కుయుక్తులను తిప్పికొట్టాడు. నేడు మనం ఇక్కడ హాస్పిటల్ విజయవంతంగా నడపగలుగుతున్నామంటే.. ఆ రోజుల్లో నరసింహం గారు అందించిన ప్రోత్సాహమే కారణం!”

తల్లిదండ్రులు ఇదంతా తనకు ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు అతనికి. తన తల్లిదండ్రులు తమ జీవితాలను పూర్తిగా వైద్యవృత్తికి అంకితం చేశారు. నిత్యం హాస్పిటల్ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారు. అలాంటి వారి వద్ద నుండి అందుకున్న వారసత్వాన్ని గౌరవించేలా.. తను హాస్పిటల్‌ని మరింత అభివృద్ధి చేయడం.. కర్తవ్యంగా భావించి మసలుకోవాలి.

తను డా.మేఘనతో ప్రవర్తించిన విధానం తనకే నచ్చలేదు. ఆ అమ్మాయి మనసులో ఎలాంటి భావం తన పట్ల వుందో గ్రహించలేక పోయాడు. కాస్త గిల్టీగా అనిపించింది అతనికి. ఇప్పుడు డా.మేఘన.. తను ప్రేమించిన అమ్మాయి లేకుండా హాస్పిటల్‌కి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోవడం లేదు.

ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఉత్సాహంగా బయటకి బయలుదేరాడు.

‘మానవ సేవే మాధవ సేవ’ తన తల్లిదండ్రులు నమ్మి పని చేస్తున్న సిద్ధాంతం అది. తల్లిదండ్రుల బాటలో నడవాలని నిర్ణయించుకున్నాక.. అతడి మనస్సు తేలిక పడింది.

డాక్టర్‌గా తన లక్ష్యం.. రోగులకు సేవ చేయడం. తన వృత్తి ధర్మనికంటే గొప్పదేమీ లేదు లోకంలో! ఒక మనిషికి ప్రాణదానం చేయడం.. ఆపదలో ఉన్న వారికి వైద్యం చేయడం.. దైవకార్యం!

మనస్సుకి సమాధాన పరుచుకున్నాడు.

“చిన్నా! మనం ఈ రోజు నరసింహం గారిని కలవబోతున్నాం” అంటున్న పెద్ద వాళ్ళ మాటలకి “సరే” అన్నాడు శశాంక్.

పచ్చని పంట పొలాల మధ్య నుండి వెళుతుంది కారు. రోడ్డుకి ఇరువైపులా వున్న పంట చేల నుండి వీస్తున్న చల్లని గాలులు అతడి మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఊరి దగ్గరలో వున్న చెరువును దాటుతుంది కారు. చెరువు దగ్గరలో వున్న కోవెలలో నుండి గుడిగంటలు మ్రోగుతున్నాయి శుభసూచకంగా!

నరసింహం గారిది పెంకుటిల్లు. చుట్టూ పలు రకాల పూల మొక్కలు. మామిడి, బత్తాయి, నిమ్మ చెట్లు కలిగిన పెరటి తోట ముచ్చటగా వుంది. కారు ఓ పక్కగా ఆపి లోపలికి వెళ్ళారు శశాంక్, పరాంకుశం గారు,నీరజ ,శశాంక్ వాళ్ళ మేనమామ. ఇంట్లో నుండి హడావుడిగా బయటకి వచ్చిన అమ్మాయిని చూస్తూనే.. సంబరంగా అలాగే ఆగిపోయాడు శశాంక్.

“రండి లోపలికి..” తననే పిలుస్తున్న డా.మేఘన వాళ్ళ అమ్మ నాన్నలు!

“అమ్మా” అంటూ మాట్లాడబోతున్న శశాంక్ వైపు.. చిరునవ్వుల వదనంతో చూస్తుంది నీరజ.

తమకు నమస్కరిస్తున్న మేఘన వైపు చిరునవ్వుతో చూశారు ఆ దంపతులు. తమకు కాబోయే కోడలు తెలివైనదే అనే భావం వాళ్ళ మదిలో మెదులుతుంటే.. సంతోషంగా తన అభిమాన మేఘన వైపు ఆరాధనగా చూస్తున్నాడు శశాంక్.

ప్రేమ.. భగవంతుడి సృష్టి! ఇరు హృదయాల మధ్య ప్రేమనే బంధం ఏర్పడిందంటే అది బ్రహ్మ లిఖితం! ప్రేమ.. భగవంతుడు వ్రాసిన మరణం లేని శాసనం!

శశాంక్ మేఘనల నయనాలు కలుసుకున్నాయి.

కొమ్మల మాటున దాగిన కోయిలమ్మ కమ్మని రాగాలు ఆలపిస్తుండగా.. డా.మేఘన నయనాలు రేపటి అందమైన భవిష్యత్‌ని చూపిస్తుంటే.. సన్నగా నవ్వాడు డా.శశాంక్…!

Exit mobile version