Site icon Sanchika

మృత్యువు ఛాయని స్పృశిస్తూ చెప్పిన ‘కథ’నం – ప్రియనేస్తమా!

[box type=’note’ fontsize=’16’] ‘ఇటీవల తాను చదివిన ఒక అపూర్వమైన పుస్తకం’ అంటూ యద్దనపూడి సులోచనారాణి గారి కలం నుంచి వెలువడిన ‘ప్రియనేస్తమా!’ పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు కొత్తపల్లి ఉదయబాబు. [/box]

[dropcap]శ్రీ[/dropcap]మతి యద్దనపూడి సులోచనారాణి రచన ఇది. ఆమె తెలుగు సాహిత్యంలో అరవై సంవత్సరాల పాటు తన నవలా సాహిత్యంలో ‘కీర్తి కెరటాలలో’ తేలియాడి, ఆ సాహిత్యాన్ని ఆస్వాదించిన ప్రతీ పాఠకుడి హృదయంలో ‘మీ-నా’ కాదు, ‘మన’ కథే ఈ నవల అని భావనాత్మకంగా భావించేలా తనదైన శైలిలో అభేద్యమైన అభిమానపు కోటను ఏర్పర్చుకున్న మహారాజ్ఞి.

మన దేశానికి పట్టుకొమ్మ లయిన గ్రామాలలో ఒక చిన్న’గ్రామం’లో సాంప్రదాయ కుటుంబాన జన్మించి, దేశానికి రైతు ఎలా వెన్నెముక వంటివాడో, అదే విధంగా నవలా సాహిత్యానికి తానే వెన్నెముకై నిలిచి, తమ కష్టాలను, కన్నీళ్ళను, బాధల్ని, దుఃఖాన్ని అన్నింటినీ తాత్కాలికంగా మరిచిపోయి, తనదైన ఊహాలోకాలలో అద్భుత సన్నివేశాలను ఊహించుకుంటూ తాను చదువుతున్న నవలలోగాని, కథలో గాని తన మనసుకు నచ్చిన పాత్రయై భాసిస్తూ ఓలలాడని, చదువు వచ్చిన స్త్రీ పాఠకురాలు గత నలభై సంవత్సరాలలో లేనే లేరు అని నిర్వివాదంగా చెప్పగలిగిన నవలా సృజనామణి స్వర్గీయ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి.

ఇటీవల నేను చదివిన ఒక అపూర్వమైన పుస్తకం ఆమె కలం నుంచి వెలువడిన ‘ప్రియనేస్తమా!’. ఒక రచయిత్రి అశేష స్త్రీ పాఠకులతో పాటు పురుష పాఠకులను సంపాదించుకున్న ఘనత నవలా సాహిత్యంలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారికే దక్కుతుందేమో.

“నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నవలలు, ఇన్ని కథలు వ్రాసినా, నా మనసు కాస్తంత కూడా అలసిపోలేదు. అదే ఉద్వేగం… అదే చైతన్యం.” వర్ధమాన రచయితలు స్ఫూర్తి పొందడానికి యింత కన్నా అమృత వాక్యాలు ఇంకేమి కావాలి?

‘ప్రియమైన పాఠకులరా!’ అని మృదువుగా సంబోధిస్తూనే ఆమె వ్రాసిన వాక్యాల దండలు అవధరిస్తునే పాఠకునిలో ఒక ఆర్ద్రత నెమ్మదిగా చాప కింద నీరులా, మనసు చెమరింపు ప్రారంభమవుతుంది.

‘ప్రియనేస్తమా!’ అంటూ ఆమె, మృత్యువు ఛాయని స్పృశిస్తూ చెప్పిన ‘కథ’నం గుండె బరువెక్కిస్తుంది. ఈ సృష్టికి ఆధారం స్త్రీ. సకల ప్రాణులకు జన్మనిస్తూ, వారి తల్లిగా కీర్తింపబడుతున్న స్త్రీ ఔన్నత్యం శిశువుకు పాలవంటి చైతన్య అమృతధార అని చెబుతూనే, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందినా, యీనాటి సమాజానికి ఆమె ఒక ప్రేమదాసి – యుగ యుగాల నుంచి, ఇప్పటివరకు ఒక్క స్త్రీ కుడా ఆమె కోరుకున్న ప్రేమ తనకి లభించినట్టు చెప్పలేని అసహాయ స్థితిలో ఆమె వుందన్న నిజాన్ని తెలియజేస్తూ దీనికి మనుషులు కారణమా? కాలం కారణమా? అని ప్రశ్నిస్తారు ఆమె.

ఆమె మొట్టమొదటి రచనకే ఎంతో పరిణతి చెందిన రచయిత్రి. ‘చిత్ర నళినీయం’ కథ చదివినప్పుడు అర్థమవుతుంది. ఒక కథను చదవడం కన్నా ఆ కథ వెనుక కథను చదవడం పాఠకుడికి  మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ కథ వెనుక కథ ‘చిత్ర నళినీయం’ కన్నా ఆసక్తిగా సాగింది. తన కుమార్తె సాధించిన మొదటి చిరు విజయం ఒక తండ్రిలో ఆమె పట్ల దాగున్న వాత్సల్యాన్ని ప్రేమతో తల మీద నిమురుతూ చూపించిన విధానం ‘నాన్నం’టే గౌరవం ఉన్న ప్రతీ ఆడపిల్లానూ ఏదో లోకాల్లో విహరింపజేస్తుంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వింత పోకడలు తొక్కుతున్న యీనాటి సమాజంలో స్త్రీ పేరుతో ‘ఫేక్’ ఎకౌంట్లు తెరుచుకుని, అమ్మాయిలకు దగ్గరై వారి జీవితాలతో ఆడుకుంటున్న పురుష పుంగవులను మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిజ్ఞానం రాని రోజుల్లో ‘కలం స్నేహం’ పేరిట ఇదే పంథా కొనసాగింది. ఆ నేపథ్యంలో ఎన్నెన్నో కథలు వెలువడ్డాయి. దాదాపు అటువంటి కథనే కలం నేపథ్యంలో రాసిన కథ ‘చిత్ర నళినీయం’. పధ్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆ వయసులో అటువంటి కథ రాసిందంటే కుటుంబ నేపథ్యం పట్ల, స్నేహ సంబంధాల పట్ల, భార్యాభర్తల ప్రేమానురాగల పట్ల ఆమె ఆకళింపు చేసుకున్న భావాలన్నింటి ప్రతిరూపమే ఆ కథ అని చెప్పవచ్చు.

యద్దనపూడి వారి రచనలలో పాత్రలతో పాటు కథాకథనాన్ని నడిపించే మరొక అద్భుత వస్తువు ‘ఉత్తరం!’. ఉత్తరం ప్రాముఖ్యత మనకందరకూ తెలిసిందే. మనిషి జీవితంలో ఈనాడు దాదాపు కనుమరుగయిందనే చెప్పాలి. రెండు హృదయాల మధ్య భావ ప్రవాహం సాగుతున్నప్పుడు వారిద్దరి మధ్య గల బంధాన్ని మరింత దృఢతరం చేసే సాధనాలుగా ఆనాడు లేఖలు ఎంతగానో ఉపయోగపడేవి. యింకెన్నో బహుళ ప్రయోజనాలు గల ‘ఉత్తరం’ యద్దనపూడి వారి కథలలో, నవలలలో కథను మలుపు తిప్పే సాధనంగా వాడారామె. బహుశ ‘ఉత్తర’ పాత్రను ఆమె ఉపయోగించుకున్నట్టుగా మరే నవలా రచయిత ఉపయోగించలేఉ అనేది అతిశయోక్తి కాదనే చెప్పాలి.

‘రాధ పడిన బాధ’, ‘అర్ధాంగి అలుక’, ‘హార్ట్ ఎట్ టాక్’ కథలలో పాత్రలతో పాటు, ఉత్తరాలు కథనాన్ని అద్భుతంగా నడుపుతాయి. ఎన్నాళ్ళయిందో ఆమె కథలు చదివి. మరీ ముఖ్యంగా పాఠకులను ఉద్దేశిస్తూ ఆమె రాసిన ఉత్తరాలు, చివరలో ఆమె మహిళ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం అన్నీ చదువుతుంటే ముఖ్యంగా స్త్రీ పాఠకులకు జీవితాశ కలుగుతుంది. యిక మిగిలిన జీవితమైనా ఆనందంగా గడపాలన్న చైతన్యం మొదలవుతుంది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన ప్రసంగపాఠం యథాతథంగా ఇందులో ప్రచురించారు. ఆ ప్రసంగంలో ఆమె తన వంతుగా చెప్పిన మాటలు రాబోయే తరాల్లో ఏ వృద్ధ మహిళకైనా వర్తిస్తాయి అన్నంత బాగా సందేశమిచ్చారామె. ఆ వాక్యాలు యథాతథంగా యిక్కడ యిస్తున్నాను.

“పిల్లలు పెద్దవాళ్ళు అయాక మీకు మిగిలిన ఈ ఒంటరి జీవితం మీ అదృష్టంగా భావించండి. బాధ్యతలు, పరుగులు, ఉరుకులు లేకుండా దేని కోసమో ఎదురుచూసి తికమక పడకుండా, నిశ్చింతగా, ప్రశాంతంగా, బ్రతుకుతున్న స్పృహతో ఆనందంగా జీవించండి. మీ ఖాళీ అయిన మనసును లలిత కళలను ఆస్వాదించడంలోనో – ఊళ్ళు తిరిగి ప్రకృతిని ఆస్వాదించడంలోనో నింపుకోండి. ముందు మనసులో ఆనందం నింపుకుంటే జీవితం అదే ఆనంద మయమవుతుంది.”

వృద్ధాప్యం అంటే మనసు+జీవితం వృద్ధి చెందినవాళ్ళు అంటు ఓ అద్భుత నిర్వచనం యిచ్చిన ఆ సాహితీ రాజనీతిజ్ఞురాలు భౌతికంగా తన అధ్యాయం ముగించినా; నవలా సాహిత్యానికి మాత్రం ధృవతారలా వెలుగొందుతూనే ఉంటారన్నది ఆమె రాసిన అక్షరాలుగా నిత్యసత్యం!

***

ప్రియనేస్తమా!
రచన: యద్దనపూడి సులోచనారాణి
ప్రచురణ: ఎమెస్కో బుక్ హౌస్,
పుటలు: 120,
వెల: రూ. 75/-
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్,
1-2-7, బానూ కాలనీ,
గగన్‌మహల్ రోడ్, దోమలగుడ, హైదరాబాద్ 500 029. ఫోన్: 040-23264028.
సాహితీ ప్రచురణలు,
#33-22-2, చంద్ర బిల్డింగ్స్,
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ. 520 004. ఫోన్: 0866-2436643

Exit mobile version