Site icon Sanchika

ప్రియసఖి

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘ప్రియసఖి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఒం[/dropcap]టరినై
సాగర తీరాల వెంట నడుస్తున్నాను!
మనస్సు మూలల్లో
నీ రూపం అస్పష్టంగా అగుపిస్తున్నా..
నిన్ను కనుగొనలేని నిస్సహాయ స్థితిలో కదులుతున్నాను!
వేవేల వెలుగులు పంచే వెన్నెలలు ఎదురవుతున్నాయి..
కోయిలమ్మల కమ్మని రాగాలు వినిపిస్తున్నాయి..
సెలయేటి సరిగమల చిరు గలగలల సందళ్ళు
హాయిదనాన్ని అందిస్తున్నాయి..
అప్పుడప్పుడు లీలగా అలరిస్తున్న కాలి సిరిమువ్వల సవ్వళ్ళు
యద నిండా పరవశాల అనురాగాల అనుభూతులని పరిచయం చేస్తున్నాయి..
ప్రకృతిలో నువ్వు అంతర్లీనమై ఆహ్లాద పరుస్తున్నా..
నిన్ను చేరలేని ఒంటరి బాటసారిని!
సంద్రమేమో హోరుతో మనసంతా అలజడిని రేపుతుంది..
నువ్వు కానరాక
కనుల నిండా నీ రూపం రూపుదిద్దుకోక..
సతమతమవుతూ
కానరాని దూరాలను సైతం
అలవోకగా చేరుకుంటూ.. నీ కోసం అన్వేషిస్తున్నాను!
అదేంటో..
నాపై అలకేంటో..
దివిలో వెలసిన దేవతవు నువ్వే కదా..
కనీసం కలల వరమై.. కలతలు తీర్చరాదా?
ఈ ప్రాణాన్ని నిలుపరాదా, సఖీ!

 

Exit mobile version