ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-1

0
2

[ప్రొద్దుటూరు సమీపంలోని పుష్పగిరి క్షేత్రం (పీఠం), రామేశ్వరం, కన్యతీర్థం, గండి క్షేత్రం, అమృతేశ్వరం మొదలగు క్షేత్రాలను సందర్శించి ఆ అనుభవాలను పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

ఆగస్టు 13 నుంచి 22 వరకు, దేవదాయ, ధర్మదాయ శాఖవారి ఆహ్వానంపై, కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో 10 రోజుల పాటు ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనాలు, సంగీతసుభగంగా చేశాను. ఏ కార్యక్రమం కోసం వెళ్లినా, ఆ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలను, దర్శనీయ స్థలాలను చూసి రావడం, అనుభూతులను ‘సంచిక’ పాఠకులతో పంచుకోవడం, వాటిని ఒక యాత్రాసాహిత్యంగా, మరీ డాక్యుమెంటరీ లాగా కాకుండా, కొంత ఫిక్షన్‌ను, హ్యూమన్ ఎలిమెంట్‌ను కలిపి వ్రాయడం, దానికి పాఠకుల స్పందన బాగా లభించడం గత కొన్నేళ్లుగా వస్తూఉన్నది. దీనికి ప్రేరణ, ప్రోత్సాహం, నా సోదరుడు, సంచిక ప్రధాన సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ. ట్రావెలాగ్‌ను విభిన్నంగా ప్రెజెంట్ చేయడం వెనుక ఆయనే ఉన్నాడు.

పొద్దుటారుకు బోలెడు బస్సులు, ఎ.సి. స్లీపర్‌తో సహా ఉన్నాయి హైదరాబాదు నుంచి. కానీ మనకు రైలే మేలు! ‘వెంకటాద్రి’ లో కాచిగూడ నుంచి బయలుదేరాను. కొంత కాలం క్రితం ఆ రైలు లేత గోధుమ రంగు పాత కంపార్టుమెంట్లతో, ఆగి కదిలినప్పుడల్లా పెద్ద కుదుపు శబ్దాలనిస్తూ వెళ్ళేది. మూడవ నంబరు ప్లాట్‍ఫారం మీద ఎర్రని, సరికొత్త ఎల్.హెచ్.బి కోచ్‌లతో తళతళ లాడుతూ, మెరుస్తూ ఒక ధూమ రహిత శకటం నిలబడి ఉంది. ‘వెంకటాద్రి’కి అంత సీను లేదులే అని ఒకటవ నంబరు ప్లాట్‍ఫారం మీద, స్తంభానికి చుట్టా వేసిన గ్రానైట్ అరుగు మీద కూచున్నా. అటుగా పోయే పోర్టరు మహాశయుడిని

“తమ్మీ! ‘వెంకటాద్రి’ని ఇంకా పెట్టలేదేమి?” అని అడిగా.

చక్రాల బ్యాగులు వచ్చి వాళ్లు పొట్టమీద కొట్టినందుకు ముందే అసహనంగా ఉన్న ఆ సోదరుడు

“ఎదురుగ్గా కనబడుతూంటే, ‘ఇంకా పెట్టలేదా?’ అని అడుగుతావేమి సారు?” అని విసుక్కున్నాడు.

పరుగుపరుగున వెళ్లి లిఫ్ట్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి చేరాను. 3వ నంబరులోకి దిగడానికి కూడ లిఫ్ట్ ఉంది. రైల్వేవారి మీద నాకు ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మండి! ఈ వయసులో, (68, నాట్ ఔట్, అండీ నేను) మెట్లు ఎక్కాల్సిన, దిగాల్సిన పని లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో మాలాంటి సీనియర్ సిటిజన్లకే తెలుసు.

సరిగ్గా 8.05 కు బయలు దేరింది బండి. బెర్తులు నీలం రంగులో మెరిసిపోతున్నాయి. బాత్ రూంలు నీట్‌గా ఉన్నాయి. స్లీపర్ కోచే ఇలా ఉంటే, థర్డ్ ఎసిలు, సెకండ్ ఎసిలు, ఫస్ట్ ఎసిలు ఎలా ఉంటాయో! అని అనుకున్నా. ఇంటి నుండి అన్నం, చింతకాయ తొక్కు, కందిపాడి తెచ్చుకున్నా. నెయ్యి కూడా తీసుకోని వచ్చాలెండి. తిండి విషయంలో మీ దత్తశర్మ అసలు కాంప్రమైజ్ కాడని మీకు తెలుసు కదా! నవ్వుతున్నారెందుకు?

ఎనిమిదిన్నరకు ఇన్సులిన్ తీసుకోని 9 గంటలకి డిన్నర్ ముగించాను. అద్భుతం ఆ రుచి. మజిగ పాకెట్ ఒకటి కొందామనుకుంటే రాలేదు! ఈ లోపు హాట్ టమోటా సూప్ వాడొచ్చాడు. ‘ప్రత్యామ్నాయము బంపె దేవుడి టులన్ భాగ్యంబది గదా నాకు’ అనుకుంటా దాన్ని కొని, తాగాను. పాయసంలో జీడిపలుకుల్లాగా, దానిలో బ్రెడ్ క్రంబ్స్! కారంగా, మిరియాల ఘాటుతో జిమ్మకు సమ్మగా ఉంది.

ఉదయం 4.40కి కడపలో దిగి, ఆటోలో మా వియ్యంకుల ఇంటికి వెళ్లాను. మా కోడలిది కడపే. మా శ్రీమతిది పొద్దుటూరు. అత్తాకోడళ్లిద్దరూ కడప జిల్లా వారైనందు వల్ల ఏమో, చాలా సఖ్యంగా ఉంటారు. ఒక్కోసారి ‘ఇంత మంచిదగునే అత్తాకోడరికంబు, వీరిర్వురన్ తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా!’ అని పోతన్నగారికి లాగా నాకనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే చూడాలని, నాకూ, నా కొడుక్కు సరదా ! దాని కోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేశాము లెండి! అబ్బే! అవన్నీ వమ్మయ్యాయి.

మా బావగారు జ్ఞానప్రకాష్ గారు. ఇ.పి.ఎఫ్.లో సూపరింటెండ్‌గా చేసి రిటైరయ్యారు. మా చెల్లెలు సుశీల బి.ఎస్.ఎన్.ఎల్.లో చేసి విశ్రాంత అయింది. వారికిద్దరు ఆడపిల్లలు. పెద్దది మా కోడలు ప్రత్యూష. రెండవది వందన. బొంబాయిలోని రెలయన్స్ వారి మెడికల్ కాలేజీలో పి.జి (ఎంఎస్) చేస్తూంది.

మా వియ్యంకులు నన్ను ఆదరంగా రిసీవ్ చేసుకొన్నారు. చక్కటి ఫిల్టర్ కాఫీ, శర్కర రహితంగా ఇచ్చింది మా చెల్లెలు. ఏడు గంటలకు ఎండోమెంట్స్ ఉద్యోగి శివప్రసాద్ గారి ఫోన్.

“స్వామి! నమస్కారం. కడపకు వచ్చేసినారా? ఎ.సి. సారు వాళ్లమ్మగారికి బాగా లేదని వాళ్లు ఊరు శ్రీకాళహస్తికి వెళ్లారు. మీకు అన్ని ఏర్పాట్లు చేయమన్నారు. తమరు మా కమీషనర్ గారికి గురువుగారట కదా! కారు ఎన్ని గంటలకు పంపమంటారు?” అంటూ అడిగారు.

ఎ.సి. అంటే అసిస్టెంట్ కమిషనర్. కడప ఎ.సి. శంకర్ బాలాజీ, నా వద్ద ఇంటర్మీడియట్ బోర్డులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. దానికి రిజైన్ చేసి, గ్రూప్ టు రాసి, ఎండోమెంట్స్‌కి వచ్చాడు. ఎకనామిక్స్ జె.యల్.గా ఉండేవాడు. చిన్నవయసు. మహా అయితే 45 ఉంటాయి. నేను రీడర్‌గా ఉండేవాడిని. ERTW (Educational Research and Training Wing) అని బోర్డులో ఒక కీలక శాఖలో జూనియర్ లెక్చరర్లకు ఓరియంటేషన్, టెక్స్ట్ బుక్స్, సిలబస్ లాంటి వ్యవహారాలు చూసేవాళ్లం. బాలాజీకి నేనంటే చాలా గౌరవాభిమానాలు!

“కారెందుకండీ! కడప నుంచి పొద్దుటూరుకు నాన్-స్టాప్ బస్సులుంటాయి కదా! బ్రేక్‌ఫాస్ట్ చేసి 9 గంటల తర్వాత బయలుదేరుతాను. మీరు బస్ దగ్గరికి ఎవర్నయినా పంపండి, చాలు” అన్నా.

“నేనే వస్తాను స్వామి. మీరు పాత బస్టాండులో దిగండి” అన్నాడు ఆయన. ప్రవచనాలు చెప్పడానికి వచ్చాననేమో ‘స్వామి’ అని పిలుస్తున్నాడు. మంచిదే కదా!

మా చెల్లెలు పెట్టిన దోసెలు తిని కడప కొత్త బస్టాండులో ప్రొద్దుటూరు నాన్-స్టాప్ ఎక్కాను. ఒక ట్రాలీ బ్యాగు, కర్రలసంచీలో పుస్తకాలు! అంతే. గంటా పది నిమిషాలలో అల్ట్రా డీలక్స్ బస్సు నన్ను దింపేసింది.

శివప్రసాద్ రెడీగా ఉన్నారు. “స్వామీ! నమస్కారం! మీకు శ్రీకృష్ణ గీతాశ్రమంలో బస ఏర్పాటు చేయమన్నారు మా ఎ.సి. గారు. పదండి” అన్నారు.

రూమ్ బాగుంది. ఎ.సి. ఉంది. ఫ్రిజ్ కూడా ఉండడం చూసి సంతోషించాను. ఇన్సులిన్ పెట్టుకోవచ్చు కదా!

“శివా, నాకు రాసుకోవడానికి ఒక రైటింగ్ టేబుల్ ఏర్పాటు చేయగలరా?” అని అడిగాను.

“తప్పకుండా స్వామి! మీకు అన్నీ చూసుకోవడానికి ‘సంజీవ’ అనే అటెండరును పెట్టాము. ఇక్కడ దగ్గర్లో మంచి మెస్ ఉంది. అక్కడి నుంచి భోజనం తెస్తాడు.”

“రాత్రి మాత్రం టిఫినే శివా” అన్నాను.

“ఈరోజు నుంచి ఆరు రోజులు అగస్త్యేశ్వరస్వామి దేవస్థానంలో.. మీ ప్రవచనాలు మొదలు స్వామి. ఫ్లెక్సీ రాయించి గుడి ముందర కట్టాము. పాంప్లెట్లు తీయించాము. నిన్నంతా ఒక ఆటోలో మైకులో ప్రకటిస్తూ తిప్పించాము. నేను సాయంత్రం 5.30 కి వస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి” అన్నాడాయన. జూనియర్ అసిస్టెంట్ అట. ఇంకా పదేళ్ల పైనే సర్వీస్ ఉంది. ఈలోగా సంజీవ వచ్చాడు. వాడు ‘చిదిమిన పాల్గారు చెక్కుటద్దముల వాడు’. నిండా ఇరవై ఉండవు.

వస్తూనే, “సామీ, వచ్చిన్యావా? నిన్నటి కాడ్నుంచి సూచ్చాండాంలే నీ కోసరము!” అన్నాడు సంతోషంగా! కడప జిల్లా యాస అది! ‘మాండలీకపు సొగసుల మహిత రుచియె’ అన్నట్లు ప్రతి మాండలీకమూ మధురమే.

భోజనం బాగుంది. అరిటాకు కూడా తెచ్చాడు సంజీవ. ఆ రోజు చెప్పవలసిన ప్రవచనానికి కాసేపు ప్రిపేరయినాను. కాసేపు పడుకోని లేచి టీ తాగి నేను వ్రాస్తున్న ‘శ్రీలక్ష్మీనృసింహ పద్య ప్రబంధం’కు కొన్ని పద్యాలు రాసుకొన్నా.

అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానం పట్టణం నడిబొడ్డున, అత్యంత రద్దీ ప్రాంతంలో ఉంది. దాని శివాలయం సెంటర్ అంటారు. కొంచెం దూరంలో శ్రీమాన్, సరస్వతీపుత్ర, పుట్టపర్తి నారాయణాచార్యులవారి నిలువెత్తు కాంస్య విగ్రహం ఉంది.

ప్రవచనం బాగా జరిగింది. ‘సత్కాలక్షేప మంటపం’ అని శ్రీ వై. యస్. రాజశేఖర రెడ్డి హయంలో కళాత్మకంగా నిర్మించారు. అక్కడే శివరాత్రి నాడు స్వామివారి కల్యాణం జరుగుతుందట.

8 గంటలకు ప్రవచనం ముగించాను. మధ్యలో త్యాగరాజు, అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్ర, నారాయణతీర్థ, స్వాతి పెరుమాళ్ గారల కీర్తనలు, పద్యాలు పాడాను. కీబోర్డు మీద శ్రీకృష్ణమూర్తి గారు, తబలా మీద శ్రీ భాస్కర్ గారు నా సంగీతానికి సహకరించారు.

రూంకి చేరుకొన్న తర్వాత శివపుసాద్ అన్నారు, “స్వామీ! ఈ ప్రొద్దటూరు చుట్టుపక్కల ఎన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ మీకు చూపించమని మా ఎ.సి. గారు చెప్పారు. రేపటి నుండి ఉదయం 7 గంటలకు నేను వస్తాను. రోజూ ఒకటి చూపిస్తాను. కారు మాట్లాడతాను.”

“వద్దు శివా! కారు వద్దు, ఆటో గాని, దూరం ఐతే బస్! చాలు!”

“అయితే రేపు ‘కన్యతీర్థం’ క్షేత్రానికి వెళదాము. 20 కి.మీ. ఉంటుంది. ఆటో అతను జమీల్ అని ఉన్నాడు లెండి.”

“అలాగే”

***

మర్నాడు ఉదయం 7 గంటలకు ‘కన్యతీర్థం’ క్షేత్రానికి బయలుదేరాము. ‘జమీల్’ ఆటో డ్రయివర్. నాకు నమస్కారం చేశాడు. జమ్మలమడుగు వెళ్లే దారిలో ఒక 12 కి.మీ. వెళ్లి ఎడమ వైపుకు తిరిగాము. అక్కడ నుంచి సింగిల్ రోడ్డు. అంత బాగోలేదు. 7.45కు ‘కన్యతీర్థం’ చేరుకున్నాము. ఆకుపచ్చని అడవి మధ్యన ఉన్నదా శివ క్షేత్రం. చుట్టూ కొండలు, క్షేత్రమంతా మహావృక్షాలు.

ప్రొద్దుటూరు నుండి కన్యతీర్ధం వెళ్లే ‘పల్లె వెలుగు’ ఎ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సు మమ్మల్ని దాటిపోయింది. క్షేత్రం పెద్దనంద్లూరు గ్రామం దగ్గర ఉంది.

శివుడు శ్రీ సుందరేశ్వరునిగాను, అమ్మవారు బాలాత్రిపురసుందరిగాను ఇక్కడ వెలిశారు. అత్యంత పురాతనమైన, దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర గలిగినది ఈ క్షేత్రం. అమ్మవారు చిన్ని బాలిక రూపంలో రాత్రి పూట తిరుగతూ ఉంటుందని, గజ్జెల శబ్దం వినబడుతుందని భక్తులు విశ్వసిస్తారు. దేవకన్యలు ఇక్కడి కోనేరులో జలకములాడి పరమేశ్వరుని పూజించుకొనేవారని, అందుకే దీనికి ‘కన్యతీర్థం’ అని పేరు వచ్చిందని ఐతిహ్యం. శివరాత్రి అత్యంత వైభవంగా జరుగతుంది. కార్తీకమాసం భక్తులు వేల సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు.

ఈ చుట్టు పక్కలే గండికోట, గురప్పస్వామి కోన, మైలవరం డ్యాం వంటి దర్శనీయ స్థలాలు ఉన్నాయని, జమీల్ నాకు చెప్పాడు.

ప్రధాన ఆలయ గోపురాలను, ముఖ మంటపాలను ఆధునీకరించారు. కాని, క్షేత్రం పురాతనత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. మంటపంలోని స్తంభాలు, నల్లరాతితో చేసినవి. పురాతన శిల్పరీతులే. పైకప్పులపై అష్టదళపద్మాలు చెక్కారు

వచ్చే దారి పొడవునా, మామిడితోటలు, అరటితోటలు, పత్తి చేలు, ప్రకృతి శోభను ఇనుమడింప చేస్తున్నాయి. రెండు మూడు చోట్ల ఏపుగా పెరిగిన ఒక పంటను చూశాను. నేను పూర్వాశ్రమంలో 8 సంవత్సరాలు వ్యవసాయం చేసిన వాడినే. కాని ఆ పంటను గుర్తించలేక జమీల్‍ని అడిగాను. “సామి! దీన్ని జీలుగ అంటారు. ఇది ధాన్యం పంట కాదు. బాగా పెరిగిన తర్వాత కోసి, పొలంలో తొక్కించి, దున్ని కలుపుతారు. చేన్లను అట్టాంటిట్టాంటి సత్తవ (ఎరువు) కాదు సామీ ఇది” అన్నాడు.

సేంద్రియ ఎరువుకోసం ఆ పంట సాగు చేస్తారని నాకర్థమైంది.

సుందరేశ్వరుని ఆలయం ముఖమంటపంలో నల్లరాతి నందీశ్వరుడున్నాడు. స్వామివారు పేరుకు సుందరేశ్వరుడైనా నిరాడంబర నిర్వికార నిశ్చల శోభతో వెలుగుతున్నారు. అమ్మవారి ఆలయం ముఖమంటపంలో తల్లి ఉత్సవమూర్తికి ముందు భాగాన చక్రాన్ని ప్రతిష్ఠించారు.

శివ వెళ్లి పూజారిని పిలుచుకొనివచ్చాడు. ఆమె పూజారిణి. పూజారిగారు లేకపోతే ఆమే ఆలయంలో పూజలు చేస్తుందట. ఆమె కూడా చాలా త్రిపురసుందరిలాగే ఉంది. శివుడికి లఘున్యాస అష్టోత్తరాలతో, అమ్మవారికి శ్రీసూక్తంతో అర్చన చేసింది, సుస్వరంగా. స్త్రీలకు వేదాధికారం లేదని ఎవరు చెప్పారని, వారు కూడా వేదపఠనానికి అర్హులే అని ఆదిశంకరాచార్యులన్న మాట నాకు గుర్తుకు వచ్చింది. ఆమె వాక్శుద్ది, మంత్రం పలికే తీరు చక్కగా ఉంది.

శివ నన్ను గురించి చెప్పబోతే ఆమె నవ్వుతూ “రఘన్న మా వారికి మీరు వస్తారని ఫోన్ చేసినాడులే అన్నా! ఈ సామి ప్రొద్దుటూరులో ప్రవచనాలు చెపుతున్నాడంట కదా!” అన్నది. రఘున్న అంటే కొత్తమిద్దె రఘురామిరెడ్డిగారు. అగస్త్యేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్.

“అమ్మాయీ, నీవు పూజ చేయించడం నాకు చాలా నచ్చింది. నీ పేరేమిటి తల్లీ?”అని అడిగాను.

“శ్రీ గిరిజ స్వామి” అన్నది. వాళ్లాయిన పేరు విశ్వేశ్వర శర్మ అట. సరిపోయింది.

గుడి ప్రాంగణమంతా అందమైన రంగవల్లులు పెయింట్ చేశారు. ఆవరణ లోనే పెద్దకోనేరు ఉంది. దానిని ‘సప్తమాతృకల కోనేరు’ అంటారని శ్రీగిరిజ చెప్పింది. చాలా లోతైన మెట్ల నిర్మాణం. అడుగున కొద్దిగా నీళ్లున్నాయి. మెట్ల మీద అక్కడక్కడ సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ప్రతి సోమవారం అన్నదానం చేస్తారట. భక్తలు ఉండడానికి వసతిగృహాలు కూడా ఉన్నాయి.

 

సప్తమాతృకల కోనేరు

 

9.45కు ప్రొద్దుటూరు చేరుకున్నాము.

***

మరునాడు ప్రొద్దుటూరు పట్టణం లోనే ఉన్న రామేశ్వర క్షేత్రాన్ని దర్శించాము. శ్రీ రాజ రాజేశ్వరీ సమేత శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామివారు. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిష్ఠించిన సైకత (ఇసుక) లింగము.

రాముడు రావణ వధానంతరము అయోధ్యకు వెళుతూ సంధ్యానుష్ఠానాల కోసం, పెన్నానది ఒడ్డున ఆగాడని; అక్కడే ఇసుకతో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. శివలింగాన్ని రెండువైపులా ఒత్తిన బొటన వ్రేలి ముద్రలు కూడా మనకు కనబడతాయి.

శివలింగం క్రింద నిరంతరం పెన్న నీరు ఊరుతూ ఉంటుంది. దానిని సేవిస్తే సకలపాపములు, వ్యాధులు నశిస్తాయని భక్తలు నమ్ముతారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. ప్రధాన గోపురం అతి పురాతనమయినది. లోపలి ముఖమంటపాలను ఆధునీకరించారు.

రుద్రహోమం

లోపల రుద్రహోమం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద కలశాలతో ఒక వేదిక. ఒక వైపు నవగ్రహ మంటపము, దాని కవతల నాగ ప్రతిమలు. ముఖమంటపం లోని స్తంభాలు అత్యంత కళాత్మకంగా ఉన్నాయి. ఆవరణలో ఒక పురాతన కోనేరు ఉంది. మెట్ల బావి.

దిగుడు బావి

ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అని కూడా అంటారు. కుడ్యములపై శాసనాలను బట్టి ఈ దేవాలయాన్ని క్రీ.శ. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు. రాజగోపురం ఐదంతస్తుల శిఖరం. దాని నిండా చెక్కడపు అక్కజములే! బ్రహ్మహత్యా దోషము నుండి నివృత్తి చెందడానికి రాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడట.

ఎండోమెంట్స్ ఉద్యోగి శివ నా వెంట ఉండడం వల్ల, మాకు అర్చనలు, అభిషేకాలు అన్నీ చక్కగా కుదిరాయి.

***

రామేశ్వరం నుండి, పట్టణం లోనే ఉన్న, చారిత్రాత్మక వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయానికి వెళ్లాము. దానిని స్థానికులు ‘అమ్మవారి శాల’ అంటారు. మైసూరు తర్వాత దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగిది ఇక్కడే!

అమ్మవారిశాల పైన దాదాపు వెయ్యిడుగుల ఎత్తున ఒక శిఖరం ఉంది. దానినే ప్రొద్దుటూరు ఆర్.టి.సి. డిపో వారు తమ ‘లోగో’గా ఉంచుకున్నారు. లోపల ముఖమంటపంలో చాలా పెద్ద పెద్ద, కళాత్మకమైన స్తంభాలు శోభనిస్తాయి. వాసవీదేవి విగ్రహం ప్రధాన మందిరంలో కాంతులీనుతూ ఉంది. ఉపాలయాల్లో, గణేశ, ఈశ్వర, అయ్యప్ప స్వాములు కొలువై ఉన్నారు. 102 గోత్రముల ఆర్యవైశ్యులకు కులదేవత వాసవీదేవి. ఆమె సాక్షాత్ ఆదిశక్తి అవతారం. పర్లపాడు వాస్తవ్యులు, పడిగసాల గోత్రులు శ్రీమాన్ కామిశెట్టి గారిచే ఈ అద్భుత దేవాలయం నిర్మించబడింది.

ప్రొద్దుటూరు లోని వైశ్య ప్రముఖులందరూ ఆర్షధర్మావలంబకులు, మానవతావాదులు, కవి పండితులను ఆదరిస్తారు. వస్త్ర, బంగారు వ్యాపారాలు మొదలగు వాటిలో నిష్ణాతులు. తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలకు కోట్లు కొద్దీ డబ్బును అప్పుగా ఇవ్వగలిగిన ఫైనాన్సర్లు ప్రొద్దుటూరు వణిక్ప్రముఖులు. 1929 మే 19న మహాత్మా గాంధీ ‘అమ్మవారిశాల’ కు వచ్చారు. వైశ్యవర్గం ఆయనను ఘనంగా సత్కరించింది. 116 బంగారు కాసులను (230 గ్రా) గాంధీజీకి స్వాతంత్ర్య సమరంలో సమర్పించింది.

వాసవి అమ్మవారికి బంగారు రథం ఉంది.

ప్రొద్దుటూరు పండితుల వైశిష్ట్యాన్ని కొనియాడుతూ ఒక కవి గారు రాసిన పద్యం:

సీ:
దుర్భాక జవ్వాది ధూపమాఘ్రాణింప
పృథివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
గడియారమను పేర కస్తూరి వాసనల్
పృథివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
పుట్టపర్తి పేర పునుగు తావుల నెల్ల
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు
సుబ్బన్న యత్తరు సౌగంధ బీచికల్
పృధివి నింపిన యట్టి ప్రొద్దుటూరు

తే.గీ.:
చంద్రశేఖర చందన చర్చితంబు
వణిజ ప్రముఖాగ్రణీ సంఘ వర్ధితంబు
రామరెడ్డియు రాజన్న రంజితంబు
బరగ పేటగ జగతిన పరిచితంబు

శివుడు, గణేశుడి విగ్రహాలు – అమ్మవారిశాల

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here