ప్రొద్దుటూరు ఆలయాల సందర్శన-2

0
2

[ప్రొద్దుటూరు సమీపంలోని పుష్పగిరి క్షేత్రం (పీఠం), రామేశ్వరం, కన్యతీర్థం, గండి క్షేత్రం, అమృతేశ్వరం మొదలగు క్షేత్రాలను సందర్శించి ఆ అనుభవాలను పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మ[/dropcap]ర్నాడు మా ప్రయాణం పుష్పగిరి క్షేత్రానికి అది పీఠం కూడా. ఉదయం 5.30 కే పుట్టపర్తి సెంటర్ చేరుకోని, కడప – పల్లెవెలుగు ఎక్కి, ఖాజీపేటలో దిగాము. అక్కడ కారం దోసె, అలసంద వడ తిని, రానుపోను ఆటో మాట్లాడుకుని పుష్పగిరికి వెళ్లాము. శివకేశవ క్షేత్రమది. పెన్నానది దిగువన ప్రవహిస్తూ ఉంది. నదిలో బాగానే నీళ్లున్నాయి. ఖాజీపేట నుండి 8 కిలోమీటర్లు ఉంది పుష్పగిరి. ఆలయ సముదాయం ఎత్తుగా ఉన్న ఒక గుట్టపై ఉంది. అత్యంత పురాతనమైన గోపురాలు దర్శనమిచ్చాయి. ‘Antiquity’ సజీవంగా శోభిల్లుతూ ఉంది అక్కడ.

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు, సంతాన కామేశ్వరస్వామివారు కొలువై ఉన్నారు. ఉత్తర ద్వార గోపురం నుంచి పెన్నా నదిలోకి మెట్లమార్గం, స్నాన ఘాట్ ఉన్నాయి. నదికి ఆవలి ఒడ్డున పచ్చని అడవి.

శ్రీలక్ష్మీ చెన్న కేశవ స్వామివారు 10 అడుగుల దివ్యమంగళ విగ్రహం. శంఖ, చక్ర, కౌమోదకి (గద) హస్తుడై అభయహస్తముతో విరాజిల్లుతున్నారు స్వామివారు. పుష్పగిరి ఇఓ గారికి మేం వస్తున్నట్లు ముంది చెప్పారు శివప్రసాద్. ఆయన అక్కడ ఉన్నారు. స్వామివారికి అర్చన, హారతి ఇచ్చారు అర్చకస్వామి. శివాలయంలో రెండు లింగాలు. ముందుగా కాశీ విశ్వేశ్వరుడు, వెనుక సంతాన కామేశ్వరుడు. ఇద్దరికీ పూజ చేశారు పూజారి.

ముఖమంటపాలు, గుడి కుడ్యాలు అత్యంత అరుదైన అపురూపమైన శిల్పశోభతో, చెక్కడపు నాణ్యతతో విరాజిల్లుతూ ఉన్నాయి

ఈ అలయాన్ని 7వ శతాబ్దం (CE) నిర్మించారు ఒక వైపు వైద్యనాధేశ్వరుడు, ఇంద్రనాధేశ్వరుడు, త్రికోటీశ్వరుడు కొలువై ఉన్నారు. గరుత్మంతుడు సత్యయుగంలో తన తల్లికి దాస్యవిముక్తి కలిగించడానికి తెస్తున్న అమృతం నుండి ఒక చుక్క ఇక్కడి కోనేరులో పడిందని ఐతిహ్యం. త్రేతా యుగంలో శ్రీరాముడు ఇక్కడి శివుని అర్చించాడు. ఆయన అర్చించిన పూలు ఒక పెద్ద గుట్టగా ఏర్పడి, అందుకే ‘పుష్పగిరి’ అని పేరు వచ్చిందంటారు. స్కందపురాణములో దీనిని ‘నివృత్తి సంగమేశ్వరం’ అన్నారు.

పుష్పగిరి శిల్పరీత్యా ఇక్ష్వాకుల, విజయ నగర సామ్రాజ్యాల నాటిది. పల్లవ, చోళ, చాళుక్య, రాష్ట్రకూటుల శైలులు కూడ కనబడతాయి. ఉత్తర ద్వార గోపురం ప్రవేశంలో కామాక్షీదేవి ఆలయంలో చక్రం ఉంది. ఈ ఆలయాలు మహమ్మదీయుల దాడులకు గురికాకుండా నిలిచాయి. అక్కడి శిలా శాసనం 1182 CE లో వైదుంబ వంశరాజు అధవమల్ల దేవుడు చెక్కించాడు. ముఖమంటపం 12 స్తంభాలతో అలరారుతూంది. ‘నంది’కి ప్రత్యేక మంటపం ఉంది. కుడ్యశిల్పాల్లో రామాయణ భారత గాథలున్నాయి

పుష్పగిరి క్షేత్ర దర్శనం నాలో ఒక అలౌకిక ఆనందాన్ని నింపింది.

***

మర్నాడు గండి క్షేత్రానికి బయలుదేరాము. అది ప్రొద్దుటారుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జమీల్‌కు సెలవిచ్చి పల్లె వెలుగు ఎక్కాము. అది వేంపల్లె వరకు వెళుతుంది. అక్కడనుంచి ‘గండి క్షేత్రం’  ఐదారు కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడవునా పచ్చని చేలు! ఎర్రగుంట్ల వచ్చింది. పొద్దుటూరుకు రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. చెన్నై – ముంబయి లైన్ అది. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అక్కడ ఆగుతాయి . ఈ మధ్య నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు మరో లైన్ వేశారు.

తర్వాత వీరపునాయనిపల్లె అది పెద్ద ఊరు. అక్కడ కాసేపు బస్ ఆపారు. అక్కడ టీ తాగాము. వేంపల్లె చేరేసరికి 7.15 ని॥ అయింది. మేము ఐదున్నరకే బయలుదేరాము. అక్కడ నుంచి రానుపోను ఆటో మాట్లాడుకున్నాము. ఆటో డ్రయివర్ చెంగల్రాయుడు కుర్రవాడు. ఇరవై నిమిషాల్లో గండి చేరుకున్నాం. శివప్రసాద్ నన్ను ఇ.ఓ. కార్యాలయానికి తీసుకు వెళ్లాడు. మా శిష్యుడు, కడప ఎ.సి. బాలాజీ వాళ్లకు ముందే ఫోన్ చేశాడుట. ఒక ఉద్యోగి మాతో వచ్చాడు. భక్తుల తాకిడి బాగా ఉంది. శీఘ్ర దర్శనం క్యూనే చేంతాడంత ఉంది.

గండి క్షేత్రంలో ఆంజనీయ స్వామివారు కొలువై ఉన్నారు. స్వామి దర్శనం, అర్చన పూజారిగారు చేసి, నాకు స్వామివారి శేషవస్త్రం, శేషమాల ప్రసాదించారు. పులిహార ప్రసాదం స్వీకరించాము. ఆలయం వెనుక పెద్ద కొండ. క్షేత్రమంతా కిటకిటలాడుతుంది. లడ్డు, మైసూరుపాకు, కారంబూంది, చక్కె ర అచ్చులు అమ్మే దుకాణాలు, పిల్లల బొమ్మలు, స్వామివారి రక్ష ఎర్ర దారాలు, లాకెట్లు, పటాలు అమ్మే దుకాణాలు తామరతంపరగా ఉన్నాయి.

చాలా పెద్ద ఆవరణ. భక్తులకు ఎండ తగలకుండా కళాత్మకమైన సామియానాలు వేశారు. చలువపందిళ్ల కాలం పోయినట్లేనా? ఆవరణ మధ్యలో పంచముఖ అంజనేయ స్వామివారి 150 మీటర్ల ఎత్తున్న విగ్రహం ధవళకాంతులనీనుతూ నిలిచి ఉంది. ఆవరణ అంతా భక్తులు బ్యాగులు పెట్టుకొని, జంపఖానాలు పరుచుకుని విశ్రమిస్తూ ఉన్నారు. వాహనాల పార్కింగ్ ప్లేస్ నిండిపోయి, పోలీసులు వాహనాలను బయట ఆపేస్తున్నారు.

‘గోప్పదీకృత వారాశిం మశకీ కృత రాక్షసాం

రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజమ్’

అని స్వామిని ధ్యానించాను. మహాబలోపేతుడు, మహాజ్ఞానోపేతుడు, భవిష్యత్ బ్రహ్మ, చిరాయువు, హనూమంతుడు. ఒక వితర్దిక మీద కానీపు కూర్చున్నాము. శివప్రసాద్ “స్వామి, అంజనీయస్వాయ మీద ఏదైనా కీర్తన పాడండి” అని అడిగాడు.

“నమో రమ్య రంభావనీ నిత్యవాసం

నమో బాలభాను ప్రభా చారుహసం”

అన్న హనుమత్ స్తుతిని పాడి వినిపించాను

స్వామివారిని వీరాంజనేయునిగా భక్తులు కొలుస్తారు. మహా మహిమాన్వితుడు. సంతానం, ఆరోగ్యం ప్రసాదించి, గ్రహపిశాచ పీడలు తొలగించే దయామయుడు స్వామి.

త్రేతాయుగం నుండే ఈ క్షేత్రప్రశస్తి ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే, శిలపై హనుమంతుని ఆకృతిని చిత్రీకరించాడని ఐతిహ్యం. వాయుదేవుడు రామునకు ఆతిథ్యమిచ్చాడని ప్రతీతి. రామస్వామి, హనుమంతుని ఎడమ చేతి చిటికెన వేలును తప్ప మిగతా శరీరాన్నంతటినీ చిత్రీకరించారట. తర్వాత వేదవ్యాసులవారు ఆ చిత్రం మీద శిల్పాన్ని చెక్కి, అసంపూర్తిగా ఉన్న ఆ చిటికెన వేలును కూడ చెక్కడానికి ప్రయత్నిస్తే, అది ఊడిపోయి రక్తం కారసాగిందట. రామచంద్రప్రభువు చిత్తరువు మేరకే శిల్పం ఉండాలని వాయునందనుడు సూచిస్తున్నాడని వ్యాసులవారు గ్రహించి, ఆ ప్రయత్నం మానుకున్నారట.

రావణ వధానంతరం, శ్రీరాముని విజయోత్సవం జరపాలని వాయుదేవుడు ఈచోట స్వర్ణ పుష్పాలతో అలంకరించాడట. అభయాంజనేయుడని కూడా స్వామికి పేరు. ఈ క్షేత్రం ‘పాపఘ్ని’ అనే నది ఒడ్డున ఉంది. ‘గండి’ అంటే నీరు బయటికి వెళ్ళే చిన్న మార్గం. చెరువుకు ‘గండి’ పడిందంటారు కదా! తూర్పుకనుమలలోని రెండు కొండల మధ్య పాపఘ్ని నదీ ప్రవహించడం వల్ల ఆ పేరు.

ఆటోలో వేంపల్లె చేరుకొని, ‘శ్రీవాసవి ఆర్య వైశ్య టిఫిన్ సెంటర్’ లో స్పెషల్ కారందోసె, సింగిల్ పూరీ తిని పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపులో ‘నన్నారి’ డ్రింక్ తాగాము. అది కేవలం కడప జిల్లాలోనే ఉంటుంది. ‘నన్నారి’ అనేది సుగంధం గల ఒక చెట్టు వేరు. దాన్ని ఎసెన్స్‌గా మార్చి, సోడాలో కలిపి యిస్తారు. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా, కొంచెం వగరుగా, వెరశి మన జీవితంలాగా చాలా రుచిగా ఉంటుంది ఆ పానీయరాజం.

మళ్లీ పొద్దుటారు పల్లెవెలుగు బస్ ఎక్కి 11 గంటలకు గీతాశ్రమము చేరాము.

***

నా ప్రవచనాలు అగస్త్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముగిసి, శ్రీకృష్ణ గీతాశ్రమంలో మొదలయ్యాయి. బస అక్కడే. మర్నాడు శివప్రసాద్ స్కూటరు మీద ఎర్రగుంట్ల రోడ్ లోని అమృతేశ్వర క్షేత్రానికి బయలుదేరాము. అక్కడి వైభవం చూసి తీరవలసిందే. విశాలమైన ఆవరణలో కృత్రిమ కైలాసపర్వతాన్ని నిర్మించారు. దాని ముందు పద్మాసనానుడైన పరమ శివుని విగ్రహన్ని మాడువందల అడుగుల ఎత్తున నెలకొల్పారు. పర్వతానికి ఇరువైపులా, నోరు తెరుచుకుని ఉన్న సింహాల ఆకృతిలో ప్రవేశ ద్వారాలు. అందులో ఉపాలయాలు.

ఒక చోట ఒక కృత్రిమ గుహను నిర్మించారు. దానిలో రామలక్ష్మణులు పడుకొని సేద తీరుతున్నారు. ఎంత సజీవంగా ఉన్నాయంటే విగ్రహాలు, నిజమేనని భ్రమ కల్పించేలా ఉన్నాయి.

గర్భాలయంలో అమృతేశ్వరుని మరకత లింగాన్ని ప్రతిష్ఠించారు. గర్భాలయం ఎడమ వైపునుంచి ప్రారంభమై వెనకనించి వచ్చి, మళ్లీ కుడి వైపున ముగిసే ఒక ఉపాలయాలల శ్రేణి ఉంది. అందులో అష్టాదశ శక్తిపీఠాలని అమ్మవార్లను ప్రతిష్టించారు. నల్లరాతి విగ్రహాలవి. జీవకళ ఉట్టిపడుతుంది. ఆయా శక్తిపీఠాలు, ఆ అమ్మవారి పేర్లను పైన అందంగా వ్రాశారు. ప్రతి ఉపాలయం శిల్పశోభతో అలరారుతూ ఉంది.

ఆలయానికి కోటిపక్కన గోశాల ఉంది. అందమైన గోమాతలు నెమరు వేస్తున్నాయి.

‘సాధుగోమాత భరత భూశ్వాసకోశము’ అన్న, శివభారత కావ్యం లోని, గడియారం వేంకట శేషశాస్త్రిగారి మాటలు నాకు గుర్తుకువచ్చాయి. వారిది ప్రొద్దుటూరే!

ఒక చేత్తో త్రిశూలం, మరొక చేత్తో డమరుకం, శిరసున చంద్రకళను ధరించి, మరో రెండు చేతులను మడిచి ఒడిలో పెట్టుకోని అర్ధ నిమీలిత నేత్రుడై ఉన్న సదాశివుని విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివితీరలేదు.

“మహా దేవ! మహా దేవ! మహాదేవ! దయనిదే

భవానేవ, భవానేవ, భవానేవ గతిర్మమ

శివ శివేతి శివేతి శివేతివా

హరహరేతి హరేతి హరేతివా

భజ మనః శివమేవ నిరంతరమ్”

అన్న శివస్తుతిని పఠించాను.

ఆలయంపై కప్పు ఒక గుండ్రని పద్మం ఆకారంలో ఉండి, దాని మధ్య గోపురం ఉంది. ఒక చోట అత్యంత సుందరమైన మంటపంలో విఘ్నేశ్వరుడున్నాడు. ఇంకా సజీవాలేమో అని భ్రమింపచేసే లైఫ్ సైజ్ ఏనుగు బొమ్మలు, గుర్రాల జోడు కనువిందు చేశాయి.

***

అక్కడి నుంచి, మోడంపల్లె అనే గ్రామంలో (ఎర్రగుంట్ల బైపాస్) వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లాము. ఎంతమంది దేవతలను దర్శించినా, మా నరసింహుని చూడకపోతే నాకు వెలితి. అక్కడ స్వామి వారు అభయనరసింహస్వామిగా వెలిశారు.

ధ్వజస్తంభానికే స్వామి నల్లరాతి విగ్రహం, స్వామివారి పాదాలను ధ్వజ స్తంభంముందు తాపడం చేశారు. అర్చకస్వామి చిన్నవాడు. ఆయనకు నరసింహాష్టోత్తరం రాదు అంటే నేనే స్వామివారి నామాలు చదవగా ఆ పిల్లవాడు పూజ చేశాడు.

ఉపాలయాల్లో వినాయకుడు, చెంచులక్ష్మీ అమ్మవారు వేంచేసి ఉన్నారు. విశేషం ఏమిటంటే ఆలయానికి కుడివైపున నవనారసింహుల విగ్రహలను ఉపాలయాల్లో ప్రతిష్ఠించారు. “ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యు మృత్యుం నమామ్యహం” అన్న నృసింహ మూల మంత్రాన్ని జపిస్తూ ఉద్వేగ భరితుడినయ్యాను.

***

శ్రీకృష్ణగీతాశ్రమాన్ని శ్రీ నామా ఎరుకలయ్య ఆశ్రమం అని కూడా అంటారు. చాలా పెద్ద ఆవరణ, మహావృక్షాలతో చల్లగా ఉంటుంది. పదడుగుల మురళీమోహనుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఇక కృష్ణాలయంలో మూల విరాట్టు, పాలరాతి విగ్రహం. మూడడుగుల ఎత్తు. వ్యత్యస్త పాదారవిందుడై మురళి ధరించి జగన్మోహనంగా ఉన్నాడు.

దాని పక్కనే విశాలమైన భజన మందిరం. దాని ఎదుట ప్రవచన మండపం. దానికి ‘శ్రీ నామా ఎరుకలయ్య కళాక్షేత్రము’ అని పేరు పెట్టారు.

ఆశ్రమం ఆవరణలో మూడు నాలుగు కళాశాలలున్నాయి. వారు లీజుకు తీసుకుని, పక్కా భవనాలు నిర్మించుకున్నారు. బయట మెయిన్ రోడ్డు మీద పాపులన్నీ ఆశ్రమానివే. ఆశ్రమం దేవదాయ ధర్మదాయశాఖ ఆధీనంలో ఉంది. దానికి ఇన్‌ఛార్జ్ ఇ.ఓ. కూడా మా బాలాజీనే.

శ్రీ నామా ఎరుకలయ్య గారు సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీ ఏకరసానంద స్వాములయ్యారు. మొత్తం 44.76 ఎకరాల తమ వ్యవసాయ భూమిని 1946 లోనే ఆశ్రమానికి ధారాదత్తం చేశారు. గీతాప్రచారం, పేదపిల్లలకు ఉచిత విద్య, గోసంరక్షణ, హిందూ సనాతన ధర్మ రక్షణ లక్ష్యాలుగా ఆ సర్వసంగపరిత్యాగి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1980లో ఈ సంస్థను ఎండోమెంట్స్ వారు తమ పరిపాలన లోకి తీసుకొన్నారు.

***

ఇక అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం పట్టణం నడిబొడ్డున ఉన్నది. నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, గోపురాలు శిల్పకళాశోభతో వెలుగుతున్నాయి. దక్షిణామూర్తి, ఆదిశంకరులు, గణేశుడు మొదలగు దేవతల ఉపాలయాలున్నాయి. నాగ దేవతల మండపం ఉంది. నవగ్రహాలకు అత్యంత కళాత్మకమైన ఆలయాన్ని నిర్మించారు.

స్వామివారు, అమ్మవార్ల దేవాలయాలు విడివిడిగా విశాలంగా ఉన్నాయి. వాటి ముందు ముఖమంటపాలు పురాతన స్తంభాలతో అరుగులతో శోభిల్లుతున్నాయి. సత్కాలక్షేప మంటపం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. దానిని చక్కని శిల్పరీతితో నిర్మించారు. అక్కడే ప్రవచనాలు, హరికధలు మొదలగునవి జరుగుతాయి. నా ప్రవచనాలు కూడా అక్కడే జరిగాయి. శివరాత్రి నాడు శివపార్వతుల కల్యాణం అక్కడే జరుగుతుంది. ఒక ప్రతిష్ఠాత్మకమైన కళావేదిక అది. హరికథా సప్తాహాలు నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని హరికథా విద్యాంసులు ఎంతోమంది అక్కడ తమ ప్రదర్శన లిచ్చారు.

దక్షిణ గోపుర ద్వారం వెలుపల వేదపాఠశాల (శైవాగమం) ఉంది. దాదాపు 30  మంది వేద విద్యను, స్మార్తమును, పూజావిధానాలను అభ్యసిస్తున్నారు. వారంతా నా ప్రవచనాలకు హాజరై శ్రద్ధగా విన్నారు. వేద పాఠశాలకు పక్కా భవనం ఉంది. దాని పూర్వ విద్యార్థులెందరో వివిధ ఆలయాల్లో ఆర్చకులుగా, శాస్త్ర పండితులుగా రాణిస్తున్నారు. వేద పాఠశాలకు పక్కా భవనాన్ని  సమకూర్చి వేద విద్య పట్ల తన కమిట్‌మ్ంట్‌ను చాటుకున్నాడు, నా శిష్యుడు, కడప జిల్లా అసిస్టెంట్ కమీషనర్, అగస్త్యేశ్వరస్వామి దేవస్థానం ఇ.వో. ఇన్ఛార్జి, మా శంకర్ బాలాజీ!

నాకు పుణ్యక్షేత్రాలు చూపిన ఎండోమెంట్స్ ఉద్యోగి శివప్రసాద్ ఆస్తికోత్తముడు. గీతాశ్రమంలో నాకు అన్ని ఏర్పాట్లు చేసి నా ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించిన చి. విజయ్ యువకుడు. వీరంతా ‘ఏదో జీతం తీసుకుంటున్నాం, ఉద్యోగం చేస్తున్నాం’ అన్న భావనతో కాక, దైవసేవగా తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈశ్వర చైతన్యం ఎటు చూసినా వెల్లివిరిసే చోటు శ్రీ అగస్త్యేశ్వరాలయం.

దీనిని అగస్త్యమహర్షి ప్రతిష్ఠించారని ఐతిహ్యం. 8వ శతాబ్దంలోని చోళులు ఈ ఆలయ నిర్మాణం చేశారు. క్రీ.శ 1493లో శ్రీకృష్ణదేవరాయల సైన్యాధిపతి నరసనాయకుడు దీనిని పునరుద్ధరించాడు. ఇక్కడ స్వామి వారు ప్రణవ లింగ స్వరూపుడు. 3 అడుగుల ఎత్తులో, రససిద్ధిని ప్రతిఫలించే చిన్నచిన్న రంధ్రాలు శివలింగం ఉపరి భాగాన కనపడతాయి. శివరాత్రి ఉత్సవాల్లో స్వామి వారి రథోత్సవం ఒక గొప్ప వేడుక. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి. ఒక చేత పుష్పాన్ని ధరించి అభయ ముద్రతో అనుగ్రహిస్తుంది. గర్భగుడి ప్రధాన ద్వారం మీద ఆమె నవ విధరూపాలు, దశవిధ అలంకారాలు తాపడం చేశారు.

“వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే।

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥” (- కాళిదాస మహాకవి)

అటువంటి దివ్యక్షేత్రాలలో నా ప్రవచనాలు చేసేలా అనుగ్రహించిన శివయ్యకు, కృష్ణయ్యకు నా జోతలు! స్వస్తి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here